అనకాపల్లి రిజిస్ట్రార్ కార్యాలయం అందుబాటులో ఉండాలి : కాండ్రేగుల వెంకట రమణ
అనకాపల్లి :
అనకాపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని
ఎన్.హెచ్.-16కు తరలింపు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కాండ్రేగుల వెంకట రమణ ఒక ప్రకటనలో డిమాండ్ చేసారు.
నిరుపయోగంగా రూ. 30 కోట్ల విలువైన పాత కార్యాలయ స్థలం
ఏటా రూ. 40 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూర్చుతూ 167 ఏళ్లుగా పట్టణంలో ఉన్న అనకాపల్లి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వినియోగదారులకు దూరంగా తరలించేస్తున్నారు. ఈ మేరకు చురుగ్గా నన్నాహాలు జరుగుతున్నాయి. కార్యాలయం తరలింపునకు 2023 డిసెంబర్ 21న జిల్లా రిజిస్ట్రార్ దినపత్రికల్లో వాణిజ్య ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనలో భవన కొలతలు, విస్తీర్ణం, దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు లేదు. ఈ వ్యవహారంలో ముందుగా ‘ఆర్ధిక’ లావాదేవీలు చోటుచేసుకున్నాయని ప్రచారం జరుగుతోంది. పరిపాలన సౌలభ్యం కోసం కార్యాలయాన్ని మార్చవచ్చు. ఆ మార్పు ప్రజలకు అనుకూలంగా సహజ న్యాయసూత్రాలకు అనుగుణంగా ఉండాలి తప్ప ఇబ్బందులకు దారితీయరాదు. తాజా చర్యల వల్ల అదే పరిస్థితి నెలకొంటుంది.
1856 సంవత్సరం నుంచి 2019 వరకు శాశ్వత భవనంలో ఉన్నపుడు, 2019లో అద్దె భవనంలోకి మారినపుడు 167 ఏళ్లుగా జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పట్టణ ప్రాంతంలో ఉంది. కారణాలేమైనప్పటికీ … తాజాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని పట్టణానికి శివారు ఎ.ఎం.ఎ.ఎల్.కళాశాల కొత్తూరు జంక్షన్ ఎన్.హెచ్.`16 ఏరియాకు తరలింపు జరగనున్నదని సమాచారం. ఈ ప్రాంతం భారీ వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చు వినియోగదారులకు రవాణా (బస్సు, రైలు, ఆటోలు) సౌకర్యం ఉండదు. చలానాల చెల్లింపులకు అందుబాటులో బ్యాంకులు అదే విధంగా హోటల్స్, ఇంటర్నెట్, జిరాక్స్ కనీస సదుపాయాలుండవు. ఒక ఆస్తి రిజిస్ట్రేషన్ క్రయవిక్రయాల సమయంలో కనీసం 6 నుంచి 10 మంది హాజరవుతారు. వీలునామా, గిఫ్ట్ డీడ్‌లు, ఇతర రిజిస్ట్రేషన్ విభాగం సేవలు పొందడానికి ఎక్కువగా వృద్దులు వస్తుంటారు. రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వచ్చు కక్షిదారులు ఎన్.హెచ్.-16లో రోడ్డుకు అటు … ఇటు ప్రయాణం చేసినపుడు వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించే వీలుంది. కాలం, ధనం వృధా అవుతుంది. రోజుకు 70 నుంచి 100 లావాదేవీలు జరుగుతున్నాయి. కనీసం 400 నుంచి 500 మంది ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు.
బ్రిటిష్ కాలంలో సర్వే నెంబర్ 15/4లో 2,032.8 చ.గ. (ఎ..0-42 సెంట్లు ) విస్తీర్ణంలో 1856లో పట్టణ నడిబొడ్డున శాశ్వత భవనంలో ఏర్పాటైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం శిధిలావస్ధకు చేరుకుందని, కొత్త భవనం నిర్మించనున్నామని సాకుగా చూపించి 2019లో ప్రైవేటు భవనంలోకి అక్కడ నుంచి తరలించేశారు. పక్కనే ఉన్న ఈ భవనం కన్నా పురాతనమైన తహశీల్ధార్ కార్యాలయం నేటికీ అక్కడే సేవలందిస్తుంది. రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రైవేటు భవనంలోకి తరలించడంలో ఆర్ధిక లావాదేవీలు చోటు చేసుకున్నాయని అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి. రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మార్కెట్ ధర ప్రకారం పాత కార్యాలయం,
స్ధలం విలువ రూ. 7.72 కోట్లు కాగా బహిరంగ మార్కెట్ విలువ రూ. 30 కోట్లు. శాశ్వత స్థలం, భవనం ఉండి కూడా నెలకు రూ. 48,600 చొప్పున 2019 ఆగస్టు నుంచి 2023 ఫిబ్రవరి నాటికి 43 నెలలకు ‘అధికారిక’ ఒప్పందం ప్రకారం భవన యజమానికి రూ. 20.90 లక్షలు అద్దె చెల్లించినట్టు భోగట్టా ! దీనికి ఇంకా అనధికారికంగా అధిక మొత్తం చెల్లిస్తున్నట్టు సమాచారం !! ఆఫీసు నిర్వహణ ఖర్చులు అదనం. శాశ్వత స్థలం, భవనం ఉండి కూడా నాలుగేళ్లుగా కొత్త భవన నిర్మాణానికి చర్యలు చేపట్టకపోవడంతో అద్దె రూపంలో రూ. 20 లక్షలకు పైగా ప్రజాధనం దుర్వినియోగమైంది. ఈ కార్యాలయం ద్వారా ఏటా రూ. 40 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వస్తుండగా అధిక మొత్తం అనకాపల్లి పట్టణం నుంచి సమకూరుతుంది.
ఫైళ్లు బయటపెట్టడంలో గోప్యత ఎందుకు ? : ఆర్టీఐ, వినియోగదారుల రక్షణ చట్టాల ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరలింపు సమాచారాన్ని ఆర్టీఐ చట్టం ప్రకారం జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కోరగా స్పందించలేదు. గోప్యత పాటించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజిస్ట్రార్ కార్యాలయం 167 ఏళ్లుగా పట్టణ ప్రాంతంలోనే ఉన్న విషయాన్ని గుర్తించి కక్షిదారులు, రికార్డులు సురక్షితను ధృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పట్టణ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దె కన్నా తక్కువ ధరకు, రికార్డుల భద్రతకు, ప్రమాదాల నిరోధానికి, సౌకర్యాల కల్పనకు పట్టణంలోనే భవనాలు లభ్యమవుతాయి. తక్షణం ఎన్.హెచ్.-16కు తరలింపు ప్రక్రియను ఉపసంహరించుకోవాలి. అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిన పాత రిజిస్ట్రార్ కార్యాలయం స్థలం, భవనాలను వినియోగంలోకి తీసుకురావాలి. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కమిషనర్, ఇనస్పెక్టర్ జనరల్, డీఐజీ, జిల్లా కలక్టర్‌లకు ఫిర్యాదు చేశాం.