50 వసంతాల “తాసిల్ధార్ గారి అమ్మాయి”
వై.వి. రమణాజీ
“శోభన్ బాబు -ఫ్యూచర్ హోప్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ”-అక్కినేని
తాసిల్దార్ గారి అమ్మాయి చిత్రం 1971 లో విడుదలై 2021 ఈ నవంబర్ 12వ తేదీ నాటికి 50 వసంతాలు అయ్యింది. సత్య చిత్ర బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని విషయాలు వి డ్రీమ్స్ మీ ముందుంచుతుంది. సత్య చిత్ర బ్యానర్ పై సత్యనారాయణ, సూర్య నారాయణ లు ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.ఎస్.ప్రకాశరావు, దర్శకులుగా ఉన్న ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అసోసియేట్ డైరెక్టర్ గా చేశారు. కె వి మహదేవన్ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి నటభూషన్ శోభన్ బాబు కథానాయకుడిగా వున్నారు. అప్పటికి ఆయన వయస్సు 35 సంవత్సరాలు. ఆ వయస్సులోనే ఈ చిత్రంలో తండ్రిగా, కొడుకుగా ద్విపాత్రాభినయం చేయడం ఈ చిత్రానికి ఒక పెద్ద ఆకర్షణ .
ఈ చిత్రంలో కథానాయికగా జమున నటించడం అప్పటికే ఆమె విశేష ప్రజాదరణ పొందిన కథానాయకిగా ఉండటం విశేషం. మరో కథానాయికగా చంద్రకళ నటించారు. నటదిగ్గజాలు నాగభూషణం, రాజబాబు, సాక్షిరంగారావు, రావికొండలరావు ప్రధాన పాత్రలు ధరించారు. ఒక కండక్టర్ కొడుకు కలెక్టర్ కావడం ఈ చిత్ర ఇతివృత్తం. ప్రముఖ నవలా రచయిత్రి కావలి పాటి విజయలక్ష్మి వ్రాసిన నవల ‘విధి విన్యాసం’ ఆధారంగా ఈ చిత్రం నిర్మించబడింది. ఈ నవల నచ్చిన నిర్మాతలు ఇద్దరు ఈ కథను సినిమాగా తియ్యాలని చిత్ర రంగంలో అడుగుపెట్టారు. దర్శకులు ప్రకాష్ రావు కు ఈ నవల నచ్చడంతో ఆయన అసమాన ప్రతిభతో చిత్రాన్ని మరింత చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ చిత్రానికి మాటల రచయిత ఎన్.ఆర్ నంది అయినప్పటికీ, ఎక్కువభాగం సంభాషణలు ప్రకాష్ రావే రాసారు.
ఆచార్య ఆత్రేయ కలం నుండి జాలువారిన పాటలలో కే. బి. కే మోహన్ రాజు, సుశీల పాడిన యువళ గీతం ‘అల్లరి చేసే వయసుండాలి- ఆశలు రేపే మనసుండాలి’ అనే పాట ఘంటసాల సుశీల పాడిన ‘నీకున్నది నేనని-నాకున్నది నీవని’ అనే మరో యువళగీతం ఈ రెండు పాటలు ఇప్పటికీ ఆదరించేవే. ఈ చిత్ర సమయంలోనే దర్శకుడు ప్రకాష్ రావు ప్రేమనగర్ చిత్రాన్ని కూడా సమాంతరంగా రూపొందించి విజయభేరీ మ్రోగించారు. అప్పటికే రంగులు సినిమాల తెరమీద ఊపందుకున్న చిత్రసీమలో బ్లాక్ అండ్ వైట్ లో నిర్మించిన ఈ చిత్రం విజయఢంకా మోగించడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ చిత్రం విడుదలైన 1971 సంవత్సరంలోనే శోభన్ బాబు నటించిన 16 చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సంవత్సరంలోనే ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు.
ఆ సభలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు శోభన్ బాబు ని ఉద్దేశించి మాట్లాడుతూ ‘ఫ్యూచర్ హోప్ అఫ్ ఇండస్ట్రీ’ అని ప్రశంసించారు. శోభన్ బాబు నటించిన ఈ తహసీల్దార్ గారి అమ్మాయి చిత్రం ఆరు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. కేవలం హైదరాబాద్ శాంతి థియేటర్ లో నే 75 రోజులు, సాగర్ థియేటర్లో 25 రోజులు సింగిల్ షిఫ్ట్ మీద 100 రోజులు ఆడిన చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్ర నిర్మాతలు తర్వాత శోభన్ బాబు హీరోగా ప్రేమ బంధం అనే చిత్రం నిర్మించారు. అది కూడా ఘన విజయం సాధించింది. ఆ ఉత్సాహంతో నిర్మాతలు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు కథానాయకునిగా అడవి రాముడు చిత్రం నుంచి తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప నిర్మాతలుగా ప్రశంసలు పొందారు. శోభన్ బాబు నట జీవితాన్ని ఒక పెద్ద మలుపు తిప్పి మరో 15 ఏళ్ళపాటు టాప్3 హీరోల సరసన నిలబడే టట్లు చేసిన ‘తాసిల్దారుగారి అమ్మాయి’ చిత్రం విడుదలై నేటికి యాభై వసంతాలు.