స్వరమాధుర్యాన్ని పంచిన ఆనంద్
(16న ప్రముఖ గాయకుడు, సినీ సంగీత దర్శకుడు జి.ఆనంద్ జన్మదినం సందర్భంగా)
ఎవ్వరి గాత్రాన్ని అనుకరించకుండా తన గొంతుతో తెలుగు ప్రజలను మెప్పించి తన స్వరమాధుర్యాన్ని పంచిన మధురగాయకుడు జి.ఆనంద్.1944 ఫిబ్రవరి 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా తులగాంలో జన్మించారు. తల్లి అమ్మణ్ణమ్మ, తండ్రి చంద్రశేఖరరావు నాయుడు. ఆనంద్‌కు ఇద్దరు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. తండ్రి రంగస్థల కళాకారుడు. నాటకాలు వేసేవారు. తండ్రి శ్రీరాముని వేషంవేస్తే ఆనంద్ తన సోదరునితో కలసి కుశలవులుగా నటించి అందరినీ మెప్పించేవారు. ఆనంద్ చిన్నవయస్సులో తండ్రి వద్ద సంగీతం అభ్యసించారు. రాగాలు, మెళకువలను నేర్చుకున్నారు. పాటలపిచ్చి సినిమా పిచ్చిగా మారింది.సినీరంగంలోకి ప్రవేశించకముందు కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలోను, తరువాత శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణాభివృద్ధి అధికారిగా పనిచేసారు.అప్పట్లో బండారు చిట్టిబాబుగారి ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో ఉన్న సుకుమార్ ఆర్కెస్ట్రాలో పాడే అవకాశం లభించింది.
నంద్యాలలో నందినీ కళానికేతన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయస్థాయి పాటలపోటీలో సుమారు 80 మంది పాల్గొన్నారు. ఆ పోటీకి న్యాయనిర్ణేతలుగా ప్రముఖ సంగీత దర్శకులు కెవి మహాదేవన్, బాలగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంలు వ్యవహరించారు. ఆ పోటీలో ఏకవీర చిత్రంలోని డాక్టర్ సి నారాయణరెడ్డి రాయగా బాలు పాడిన ఏ పారిజాతములీయగలనో సఖీ అనే పాటను ఆనంద్ పాడారు. అఖిలభారత స్థాయిలో జరిగిన సంగీత పోటీలలో ఆనంద్ ప్రతిభను ప్రముఖ సంగీత దర్శకులు కెవి మహాదేవన్, బాలగంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గుర్తించారు.ఈ పోటీలో జి ఆనంద్ ప్రథమస్థానాన్ని సంపాదించడమే గాక మహాదేవన్ గారి నుండి మద్రాసు వస్తే సినిమాలోకి అవకాశమిస్తాననే వరాన్ని కూడా పొందారు. కెవి మహాదేవన్ ఆహ్వానం మేరకు శ్రీకాకుళం నుండి చెన్నపట్టణానికి ఆనంద్ తరలివెళ్లారు. ఆయన మద్రాసులో లీలారాణి గారి ఇంట్లోను, మరికొంత కాలం మేడిశెట్టి అప్పారావు గారితోను కలసి ఉన్నారు. 1972లో విడుదలైన ఇల్లు ఇల్లాలు చిత్రంలో పాడేందుకు అవకాశం వచ్చింది. అందులో రాజబాబు కోసం పాటపాడాలని అనుకున్నా పాటను కామెడీగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆ పాటను ఆనంద్‌కు బదులుగా ఎస్పి బాలుతో పాడించారు.ప్రభాకరరెడ్డి గారి సహకారంతో పండంటికాపురం చిత్రంలో ఒక పాట పాడే అవకాశం లభించింది. ఆనంద్ పాడిన తొలిపాట ఇదే. ఈ సినిమాలో రాజబాబు కోసం ఆడిపాడే కాలంలోనే అనుభవించాలి అనే పాట పాడారు.
తొలిపాట బాలు,సుశీల, పుష్పవల్లిలతో కలసి ఆనంద్పాడారు. మెగాస్టార్ చిరంజీవికి మొట్టమొదటి యుగళగీతం పాడిన గాయకుడిగా జి ఆనంద్‌కు చరిత్రలో సుస్థిర స్థానం దక్కింది. ఒకానొక సందర్భంలో రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో స్వయంగా చిరంజీవి మాట్లాడుతూ తనకు మొట్ట మొదటి పాటను పాడింది ఆనంద్ అనేనని చెప్పారు.ప్రాణం ఖరీదు చిత్రం కోసం ఎస్పి శైలజతో కలసి ఆనంద్ ఒక యుగళగీతాన్ని ఎనియల్లో ఎనియల్లో ఎందాకా అనే పాట పాడారు. అదే చిరంజీవికి తొలి డ్యూయెట్. జి.ఆనంద్‌కు చక్రవర్తి ఎన్నో అవకాశాలు ఇచ్చి పాటలును పాడించారు. చక్రవర్తి లేకుంటే జి.ఆనంద్ లేడనే చెప్పవచ్చు. ఇక్కడ ఇంకో సందర్భాన్ని కూడా చెప్పాలి. అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒక వేణువు అనే పాట జి ఆనంద్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఆయనకు గొప్ప గాయకుడిగా పేరుప్రఖ్యాతులు సంపాదించిపెట్టింది. బంగారుకానుక చిత్రంలో ఇళయరాజా స్వరకల్పనలో ప్ర్రేమబృందావనం పలికెలే స్వాగతం ఆ రాముడు నా వరునిగా చేరగా అనేసాటను ఆనంద్ పాడారు.
ప్రముఖ గేయ రచయిత సాహితి రాసిన తొలి పాట ఇదే. నాగేశ్వరరావు నటించిన చక్రధారి సినిమాకోసం విఠలా విఠలా పాండురంగ విఠలా అనే పాటను ఆనంద్ పాడారు.పాట రికార్డులో ఉన్నప్పటికీ సినిమాలో లేకుండా పోయిందట? ఈ సినిమాకు కూడా జికె వెంకటేష్ సంగీతాన్ని అందించారు. అమెరికా అమ్మాయి చిత్రంలో ఆనంద్, సుజాత తొలిసారిగా కలుసుకున్నారు.ఆ సినిమాలో హీరోయిన్‌కు సుజాత డబ్బింగ్ చెప్పారు. ఒకరికి మరొకరు అప్పుడే పరిచయమయ్యారు. ఆ చిత్రం తరువాత సుజాత, ఆనంద్ కలసి కచేరీలు కూడా చేసారు. తరువాత వారిరువురూ ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకుఅరవింద్, అరుణ్ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆయన 2500 ప్రయివేట్ భక్తిగీతాలు కంపోజ్ చేసారు.ఆయన విడుదలచేసిన ప్రయివేట్ ఆల్బమ్‌లలో సాయినామ సంకీర్తనం జన్మతరియించు సాధనం అనే పాట అంటే ఆనంద్‌కు చాలా ఇష్టం. ఆనంద్‌కు చక్రవర్తిగారంటే ఎంతో ఇష్టం. స్వరచక్రవర్తికి స్వరాభిషేకం అనే పేరుతో తిరుపతిలో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన శిష్యులందరినీ ఆ వేదికకు ఆహ్వానించారు. తరువాత అదే స్థాయిలో స్వరబ్రహ్మ అనే పేరుతో మహాదేవన్‌కు ఘనంగా సత్కరించారు.
ఆ కార్యక్రమంలో గాయని ఉపద్రష్ట సునీత కూడా కీలకపాత్రను పోషించారు. ఒక పక్క సినీరంగంలో తన గాత్రంతో అలరించిన ఆనంద్ 1971లో స్వరమాధురి అనే ఆర్కెస్ట్రాను స్థాపించి 7049 కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. 1972 జూలై 21వ తేదీన జయప్రద పిక్చర్స్ పతాకంపై సూపర్‌స్టార్ కృష్ణ సమర్పణలో జి.హనుమంతరావు నిర్మించగా లక్ష్మీదీపక్ దర్శకత్వం వహించిన పండంటి కాపురం చిత్రంతో సినీరంగంలోకి గాయకునిగా ఆనంద్ అడుగుపెట్టారు. ఆయన తొలిసారిగా ఎస్ పి కోదండపాణి స్వరకల్పనలో పాడారు. 1976 నవంబర్ 19న నవతా కృష్ణంరాజు నిర్మించగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రం ఆనంద్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాకు జికె వెంకటేష్ మధురమైన సంగీతాన్ని అంచారు. ఈ సినిమాలో మైలవరపు గోపి రాసిన ” ఒక వేణువు వినిపించెను అనురాగ గీతిక ఒక రాధిక అందించెను నవరాగ మాలిక” అనే పాటను ఆనంద్ ఆలపించారు. ఆ పాట ఇప్పటికీ ఆంధ్రరాష్ట్రం నలుమూలలా వినపడుతునే ఉంటుంది. 1976లో బాబ్ అండ్ బాబ్ రిక్రియేషన్స్ పతాకంపై లక్ష్మీ అమ్ములు నిర్మాతగా, జెవిఎస్ శాస్త్రి సహనిర్మాతగా , వెంకన్నబాబు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సివి రామన్న దర్శకత్వంలో మనిషి రోడ్డున పడ్డాడు అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు రాజబాబు అందించిన కథకు భమిడిపాడి రాధాకృష్ణ సంభాషణలు రాసారు.
ఈ సినిమాలో శంకర్ గణేష్ సంగీత దర్శకత్వంలో ఆనంద్ ఒక పాటను పాడారు.1977 నవంబర్ 18వ తేదీన క్రాంతికుమార్ నిర్మించగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఆమెకథ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో జయసుధ, రజనీకాంత్ జంటగా నటించారు. ఈ సినిమాలో ” పువ్వులనడుగు నవ్వులనడుగు రివ్వున ఎగిరే గువ్వలనడుగు నువ్వంటే నాకెంత ప్రేమో” అనే పాటను వేటూరి సుందరరామమూర్తి రాయగా చక్రవర్తి అద్భుతంగా స్వరపరచారు. ఆ పాటను జి.ఆనంద్, పి.సుశీలతో కలసి ఆలపించారు. ఆ పాట ఎంతో ప్రాచుర్యం పొందింది. 1977లో క్రాంతికుమార్ నిర్మాతగా కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మురళీమోహన్, జయచిత్ర నటించిన కల్పన అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు చక్రవర్తి స్వరకల్పన చేసారు.
ఈ సినిమాలో వేటూరి సుందరరామ్మూర్తి రాయగా చక్రవర్తి స్వరకల్పనలో ” దిక్కులు చూడకు రామయ్యా పక్కన ఉన్నదిసీతమ్మ ” అనే పాటలను జి.ఆనంద్, సుశీల ఆలపించారు. ఈ పాట బహుళ ప్రజాదరణ పొందింది. రామకృష్ణా సినీస్టూడియోస్ పతాకంపై నందమూరి తారకరామారావు స్వీయనిర్మాణంలో కథ,స్క్రీన్‌ప్లే దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన దాన వీరశూరకర్ణ అనే చిత్రం 1977జనవరి 14వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో డాక్టర్ సి నారాయణరెడ్డి రాసిన జయీభవ విజయీభవ అనే పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. జి ఆనంద్ పాడారు. ఈ పాటను పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరచారు. 1977లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన బంగారక్క చిత్రంలో ఆనంద్ పాడారు.దేవులపల్లి కృష్ణశాస్త్రి రాయగా కెవి మహాదేవన్ స్వరకల్పనలో దూరాన దూరాన తారాదీపం భారమైన గుండెలో ఆరని తాపం అంటూ ఆనంద్ ఆలపించారు. ఈ పాట పాడే అవకాశం దేవులపల్లిగారి సిఫారసుతో లభించింది.జయకృష్ణ నిర్మించగా బాపు దర్శకత్వంలో 1978 నవంబర్ 9వతేదీన మనవూరి పాండవులు చిత్రం విడుదలైంది. ఈ సినిమాకు కెవి మహాదేవన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో ఆరుద్ర రాసిన జెండాపై కపిరాజు అనే పాటను ఆనంద్, బాలు,ఎం ఎస్ రామారావు ఆలపించారు.
ఆరుద్ర ఈ సినిమాకోసం రాసిన టైటిల్ సాంగ్‌ను ఆనంద్, బాలు,ఎం ఎస్ రామారావు ఆలపించారు. కొసరాజు రాఘవయ్య చౌదరి రాసిన నల్లానల్లని మబ్బుల్లోనా లగ్గోపిల్లా తెల్లాతెల్లా చందమామ లగ్గోపిల్లా అనే పాటను జి ఆనంద్, ఎస్ పి శైలజ ఆలపించారు. ఈ పాట ఎంతో హృద్యంగా ఉంటుంది. శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించగా రాజాచంద్ర దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే చిత్రం 1978లో విడుదలైంది. ఈసినిమాకు సంగీతాన్ని చక్రవర్తి సమకూర్చారు. ఈ సినిమాలో ఉత్పల సత్యన్నారాయణాచార్య రాసిన ” చల్లని రామయ్య చక్కని సీతమ్మ” అనే పాటను జి.ఆనంద్, పిఠాపురం నాగేశ్వరరావు, చంద్రశేఖర్, ఎల్ ఆర్ అంజలి ఆలపించారు.క్రాంతి కుమార్ నిర్మించగా కె.వాసు దర్శకత్వంలో ప్రాణం ఖరీదు అనే చిత్రం 1978 సెప్టెంబర్ 22వ తేదీన విడుదలైంది. ఈసినిమాకు చక్రవర్తి సంగీతాన్ని అందించారు. ఈసినిమాలో ఎనియల్లో ఎనియల్లో ఎందాక అనే పాటను ఎస్పి శైలజతో కలసి ఆనంద్ ఆలపించారు. ఏడిద నాగేశ్వరరావు నిర్మించగా కొమ్మినేని శేషగిరిరావు దర్శకత్వంలో తాయారమ్మ బంగారయ్య అనే చిత్రం 1979 జనవరి 12వ తేదీన విడుదలైంది. ఈ సినిమాకు చక్రవర్తి స్వరకల్పన చేసారు. ఈ సినిమాకు ఆనంద్ పాడారు. సమతా ఫిలింస్ పతాకంపై ఛటర్జీ నిర్మించగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో విడుదలైన జూదగాడు చిత్రంలో మల్లెల వేళ అనేపాటను పి.సుశీలతో కలసి ఆనంద్ ఆలపించారు.
1980లో విడుదలైన శ్రీ వేంకటేశ్వర భక్తిమాల ఆల్బమ్‌లో ఆనంద్ పాడారు. 1981లో ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ నిర్వహణలో జీసెస్ నాకింగ్ ఎట్ ది డోర్ అనే ఆల్బమ్‌ను విడుదలైంది. దీనిలో హృదయమనెడు తలుపునొద్ద అనే పాటను ఆనంద్ ఆలపించారు. 1978 డిసెంబర్ 21న విడుదలైన కరుణామయుడులో దావీదు తనయా హోసన్న అనే పాటను ఎల్ ఆర్ అంజలి, విల్సన్లతో కలసి ఆనంద్ ఆలపించారు. 1980 ఫిబ్రవరి 29వ తేదీన ఉమాదేవి పిక్చర్స్ పతాకంపై కె.సత్యం దర్శకత్వంలో విడుదలైన పట్నంపిల్ల చిత్రంలో పయనించే చిరుగాలి అనే పాటను ఆనంద్ పాడారు. 1981లో విజయబాపినీడు దర్శకత్వంలో విడుదలైన డబ్బు డబ్బు డబ్బు అనే చిత్రంలో హృదయం ప్రణయం అనేపాటను ఆనంద్ ఆలపించారు.
1981లో సమాధాన ప్రభువు అనే ఆల్బమ్‌లో ఆనంద్ పాడారు.సుశీల ఆర్ట్స్ పతాకంపై జి రెడ్డిశంకర్, జో గోపాలరెడ్డి, పి.పార్థసారధిరెడ్డి సంయుక్తంగా నిర్మించగా శరత్‌బాబు సమర్పణలో రాజేంద్రప్రసాద్, గౌతమి జంటగానటించిన గాంధీనగర్ రెండవ వీధి అనే చిత్రం 1987 జూలై 6వ తేదీన విడుదలైంది. ఈసినిమాతో వెండితెరకు జి.ఆనంద్ సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు. ఈసినిమాలో రెండు పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా ఒకపాటను వేటూరి రాసారు. 132 నిమిషాల నిడివిగల ఈసినిమాలో 14 నిమిషాల పది సెకన్ల సమయంగల మూడు పాటలకు ఆనంద్ చక్కటి స్వరకల్పనగావించారు.
1987లో విడుదలైన స్వతంత్రానికి ఊపిరిపోయండి అనే చిత్రానికి ఆనంద్ సంగీతాన్ని అందించారు. 1990లో అష్టాక్షరీ క్రియేషన్స్ పతాకంపై విడుదలైన రంగవల్లి చిత్రానికి ఆనంద్ సంగీతదర్శకత్వం వహించారు. ఈసినిమాకు కె వెంకట లక్ష్మీ నిర్మాతగా వ్యవహరించారు.సుదర్శక భట్టాచార్య దర్శకత్వం బాధ్యతలను చేపట్టారు. ఆచార్య ఆత్రేయ సమర్పణ చేసారు. 1997లో ఏసుపాదమునందు అనే ఆల్బమ్‌లో పాటలను ఆలపించారు. 2002లో శ్రీశైలం మల్లన్న అనే ప్రయివేటు ఆల్బమ్లోను, శ్రీ అయ్యప్ప భక్తిమాల అనే ఆల్బమ్లోను ఆనంద్ పాడారు. 2014లో ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర గాను సుధ అనే ఆల్బమ్‌ను విడుదలైంది. దీనిలో పాటలను జి.ఆనంద్, వాణీజయరామ్, ధనలక్ష్మీ ఆలపించారు. 2019లో విడుదలైన శబరిగిరి శిఖరాన అనే ఆల్బమ్‌లో ఆనంద్ పాడారు. నాలుగు దశాబ్దాలుగా అనేక మధురగీతాలను ఆలపించిన జి. ఆనంద్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అనడం అతిశయోక్తి కాదు.