అభినవ ఆంధ్రభోజుడు ఆనందగజపతిరాజు

(31న ఆనందగజపతి రాజు జయంతి)

అభినవ ఆంధ్రభోజుడుగా పేర్గాంచిన ఆనందగజపతిరాజు గారు 1850 డిసెంబర్‌ 31వ తేదీన జన్మించారు. ఆయన తండ్రి 3వ విజయరామగజపతి. తల్లి అలకరాజేశ్వరీ దేవి. ఆనందగజపతిరాజుకు నారాయణ గజపతి అనే సోదరుడు, అప్పల కొండయాంబ అనే సోదరి గలరు.ఆంధ్రంతో పాటు ఆంగ్ల, సంస్కృత, పారశీక భాషలలో గూడా ఆనందగజపతి ప్రావీణ్యం సంపాదించారు.ఆయన సంస్కృతమును పండిత భాగవతుల హరిశాస్త్రి వద్ద, ఇంగ్లీషును మేజర్‌ థాంసన్‌, కాశీ భీమేశ్వర శాస్త్రి, లింగం లక్ష్మాజీల వద్ద నేర్చుకున్నారు.ఆయనకు లాటిన్‌ మరియు ఫ్రెంచి భాషలపై కూడా చక్కటి పట్టు ఉంది.ఆయనకు 8 ఏళ్ల ప్రాయంలో ఉపనయనము జరిగింది.22 ఏళ్ల ప్రాయంలో జయపూర్‌కు చెందిన వనకుమారీ దేవిని వివాహమాడారు. ఆయనకు ”డ్యూక్‌ ఆఫ్‌ బకింగ్‌ హామ్‌ ” అనే బిరుదు ఉంది.ఆయన అనేక గ్రంధాలను ముద్రించారు. వాచస్పతి మిశ్రుడు రచించిన న్యాయవార్తిక తాత్పర్యటీక, గౌతమ మహర్షి న్యాయసూత్రాలు అనే గ్రంధాలను శిలాదిత్యుడు రచించిన సప్తవదార్ధి అనే గ్రంధాన్ని, మాధవ విద్యారణ్యుడు రాసిన విషయ ప్రమేయ సంగ్రహం అనే గ్రంధాన్ని, అప్పయ్యదీక్షితులు రాసిన వేదాంత కల్పతరు పరిమళం తదితర గ్రంధాలను ఆనందగజపతి ముద్రించారు.ఆయన ఆస్ధాన పండితులుగా ముడుంబనరసింహాచార్యులు కొనసాగారు.ఆయన ప్రోత్సాహంతో కొల్లూరు రామశాస్త్రి ” ధర్మ సింధూరం, శూద్రకమలాకరం ” లను తెలుగులోకి అనువదించారు.ఆయన ఆస్ధానంలో పేరి కాశీనాధశాస్త్రి, గురజాడ శ్రీరామమూర్తి, నిడుదవోలు సుందరం పంతులు, మండా చిట్టికామశాస్త్రి, పేరి వేంకట శాస్త్రి ప్రముఖ స్ధానం సంపాదించారు.ఆయన ప్రోత్సాహంతో గురజాడ అప్పారావు ”కన్యాశుల్కం ” నాటకంను రాసి ఆయనకే అంకితమిచ్చారు.ఆనందగజపతి తన తండ్రి నెలకొల్పిన ఆంగ్ల కళాశాలకు ఫస్టు గ్రేడ్‌ స్ధాయికి పెంపొందించారు. ఆయనకు మహారాజా మన్నెసుల్తాన్‌, కె సి ఎన్‌ ఐ అనే బిరుదులు గలవు. ఆయన మద్రాసులోని ఎగువ సభకు సభ్యులుగా వ్యవహరించారు. ఆ మహనీయులు తమ వంశానికి చెందిన విషయాలతో ట్రీటీ అనే గ్రంధాన్ని రాసారు.
శ్రీ కిళాంబి రామానుజాచార్యులకు చదువు చెప్పించిన ఘనత ఆనందగజపతిగారికే దక్కుతుంది. ప్రపంచంలో ప్రముఖులైన రాచకుటుంబీకులను, చక్రవర్తులను 1878లో విక్టోరియా మహారాణి మూడు కేటగిరీలుగా విభజించింది. 1887 ఫిబ్రవరి 15వ తేదీన ఆనందగజపతికి మొట్ట మొదటి కేటగిరీని కేటాయించి నైట్‌ గ్రాండ్‌ కమాండర్‌ అనే బిరుదును ప్రదానం చేసింది.మాక్స్‌ముల్లర్‌ ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసేందుకు లక్షలాది రూపాయలను ఆనందగజపతిరాజు ఆర్ధిక సహాయం చేసారు.1894 సెప్టెంబర్‌ 3వ తేదీన సాంప్రదాయ సంగీతాన్ని, ముఖ్యంగా హిందుస్తానీ సంగీత సౌరభాలను కాపాడేందుకు గాను ఏర్పాటైన ” పూనా గాయని సమాజానికి ” ఆనందగజపతిరాజుగారు పెద్ద ఎత్తున విరాళాన్ని ఇచ్చి ఆదుకున్నారు.మద్రాసుకు చెందిన తచ్చూరి సింగరాచార్య సోదరులు రచించిన గేయాల సిద్ధాంజనం, స్వర మంజరి పుస్తకాలను ముద్రించేందుకు అవసరమైన ఆర్ధిక సహాయాన్ని ఆనందగజపతిరాజు గారు అందించారు.త్రిస్ధాయిలలో, చతుష్కాలాలలో రోజూ 12 గంటల పాటు సంగీత సాధన చేసే వేంకట రమణదాసుతో ఆనందగజపతిరాజకు గొప్ప సాన్నిహిత్యం ఉంది.సరస సాహిత్య సంగీత విద్వత్‌ పతి అయిన ఆనందగజపతి తన సరసన సింహాసనంపై వేంకటరమణదాసుకు ఒకసారి స్ధానం కల్పించారు. ఆనందగజపతిరాజుగారితో కలిసి దాసు 19 ఏళ్ళ పాటు వీణ సాధన చేయడమే గాక మంచి మైత్రిని కొనసాగించాడు.ఆనందగజపతిరాజు గారు గోమఠం శ్రీనివాసాచార్యులను తన ఆస్థానానికి ఆహ్వానించి శ్రీనివాసాచార్యులు ఆంగ్లంలో రాసిన హరిశ్చంద్ర నాటకంపై తన అభినందనలు తెలిపారు.మహామహుడు ఆనందగజపతి 1897 మే 22 వ తేదీన స్వర్గస్ధులయ్యారు.
సముద్రాల గురుప్రసాద్‌, విజయనగరం
సెల్‌ : 9490462262

(Visited 38 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *