చిత్ర లేఖనం ద్వారా భావవ్యక్తీకరణ చేయవచ్చు : ఎంఇవో డి.దివాకర్
అనకాపల్లి :
చిత్ర లేఖనం శిక్షణ ద్వారా భావవ్యక్తీకరణ చేయవచ్చని, తద్వారా సృజనాత్మకత మెరుగుపడుతుందని మండల విద్యాశాఖాధికారి (ఎంఇవో) డి.దివాకర్ పేర్కొన్నారు. శ్రీ గౌరీ గ్రంథాలయంలో 15 రోజులుగా జరుగుతున్న ఉచిత చిత్ర లేఖనం శిక్షణా తరగతులు మంగళవారంతో ముగిసాయి. ఈ సందర్భంగా జరిగిన సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన దివాకర్ మాట్లాడుతూ బాల్య దశ నుంచి చిత్రలేఖనం అవవరచుకోవాలని, ఆ దిశలో ప్రభుత్వ విద్యా సంస్ధలు సేవలందిస్తున్నాయన్నారు. చిత్ర లేఖనంపై ఆసక్తి కలిగేలా బొమ్మలు గీయడం, అంతేకాకుండా దగ్గరుండి ప్రాక్టీస్ చేయించడం … విద్యార్ధుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీయడం ప్రధాన బాధ్యతగా తీసుకున్న శ్రీ గౌరీ గ్రంథాలయం కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. చిత్ర లేఖనం కొందరికి హాబీ, మరికొందరికి ప్యాషన్, ఒక అందమైన బొమ్మను చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వేయి వీణల సంగీతంతో సమానమన్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలు చదువుతో పాటు ఇతర వ్యాపకాలపైనా దృష్టిపెట్టాలన్నారు. ఆటలు, నృత్యాలు, కళలపైనా ఇష్టం పెంచుకోవాలన్నారు. అటువంటి వాటిలో చిత్రలేఖనం ప్రధానంగా నిలుస్తుందని ఎంఇవో దివాకర్ అన్నారు.
నేవల్ ఎంప్లాయిస్ కో`ఆపరేటివ్ బ్యాంకు సహాయ కార్యదర్శి పెంటకోట గణేష్ మాట్లాడుతూ మదిలో మెదిలే ఆలోచనలు, ఊహకందని ఆలోచనలకూ దృశ్య రూపం ఇవ్వడమే చిత్ర లేఖనమన్నారు. విద్యార్థుల్లోని సహజమైన సృజనాత్మక నైపుణ్యం పెంపుదలకు చిత్రలేఖనం దోహదపడుతుందన్నారు.
శ్రీ గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రంథాలయ మాజీ కార్యదర్శి మళ్ల బాపునాయుడు, సభ్యులు మారిశెట్టి శివరామకృష్ణ, బొడ్డేడ జగ్గఅప్పారావు, విద్యార్ధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం డ్రాయింగ్ పోటీలలో సీనియర్స్, జూనియర్స్ విభాగం విజేతలకు మండల విద్యాశాఖాధికారి డి.దివాకర్, పెంటకోట గణేష్ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా డ్రాయింగ్ శిక్షకులు ఎం.అనిరుద్, శరకడం విజయలక్ష్మి, సానా లావణ్యలను ఘనంగా గ్రంథాలయం కార్యవర్గం సత్కరించింది.