ప్రియమైన నాన్నకు


ఆశ్చర్యం వేస్తోంది కదండీ
నేను మీకీ ఉత్తరం రాయడం….
నిజంగానే
మీకు నేను రాసిన ఉత్తరమిది…

ఫోన్లో అమ్మతో తనివితీరా
మాట్లాడుతుంటాను.
మీతో మాట్లాడింది లేదెప్పుడూ
అంతంతసేపు
నువ్వెలా ఉన్నావని అడిగిందీ లేదు
మీ మనసులో నా గురించి
ఏమనుకుంటున్నారో ఊహించగలను

ఎప్పుడూ నన్ను చూడటంతోనే
మీ చూపులు కోపంగా మారుతాయి
ఇప్పుడూ ఈ ఉత్తరం రాస్తుంటే
మీ చూపులే నన్ను చూస్తున్నట్లు
భ్రమిస్తున్నాను

అది నిజమైన కోపం కాదు

అబద్ధపు కోపమని తెలుసుకోలేకపోయిన
మూర్ఖుడిని నేను
ఇది ఆలస్యంగా తెలిసిరావడంతో
రాస్తున్న ఉత్తరమిది నాన్నా

పిల్లలందరికీ
చిన్నప్పటి కథానాయకుడు
తన తండ్రే
నాకూనూ మీరే నా కథానాయకులు

అమ్మ
నా చిన్నప్పుడు
నాతో తరచూ చెప్పే మాటలు….
మీరు నన్ను మీ భుజాలపై కూర్చోపెట్టుకుని
తిప్పడం…
మాటలు చెప్పించడం
బజారుకి తీసుకువెళ్ళి
ఏదో ఒకటి కొనివ్వడం
ఆడించడం
ఇలా మీ గురించే చెప్తుండేది

“భయపడేవాడు
సాధించడం కఠినం”
ఈత కొట్టడానికి
నన్ను చెరువుకి తీసుకుపోయి
మధ్యలోకి దింపినప్పుడు
నేను భయంతో కేకలు పెడితే
మీరు క్షణం ఆలస్యం చేయక
మీ భుజాలమీద కూర్చోపెట్టుకుని
ఒడ్డుకు తీసుకొచ్చి
మీరు నాతో చెప్పిన మాట అదే…

ఆ మాట వొట్టి మాటే కాదు
అది నా జీవితానికి ఓ మంత్రమైంది
మాటల్లోనూ వచ్చింది లేదా మాట నాన్నా

సైకిల్ తొక్కడం నేర్పించినప్పుడూ
మొదటిసారి క్రికెట్ బ్యాట్
తుపాకీ
సంగీత వాయిద్యాలు వంటివన్నీ
నేను అడక్కముందే
నా చేతిలో ఉండేవి
అవన్నీ మీరు కొనిచ్చినవే

కానీ
నేను కోరుకున్న చదువు మాత్రం
నాకివ్వలేదు మీరు
కారణం
మీరు కాదు
మన ఇంటి పరిస్థితులవి!!

ఎక్కడికి వెళ్ళినా
మీ చెయ్యి పట్టుకుని
నడవడానికే ఇష్టపడే నేను
అటువంటి మన మధ్య
ఎలా ఇంత దూరం చోటుచేసుకుంది!!

అదీనూ నేను చెప్తాను
నెమ్మదిగా ప్రశాంతంగా చదవండి నాన్నా….

నాకొక తమ్ముడనే ఒకడు రావడంతోనే
నన్ను ఒంటరివాడిని చేసినట్టు అనుకున్నాను                       

నేనం అడిగిన వస్తువుని
మీరు వాడికి కనిస్తుండడంతో
నాకు చెడ్డకోపం వచ్చేది

మీ భుజంమీద
నాకున్న చోటుని
వాడు ఆక్రమించడంతో
ద్వేషం మొదలయింది

అర్థం కాని వయస్సులో
ఇవన్నీ నాలో తలెత్తడం నా తప్పా నాన్నా

అబ్బాయో
అమ్మాయో
ఇంట్లో మొట్టమొదటగా పుట్టిన వారికి
వచ్చే గుణాలివి అని
నేను ఆ వయస్సులో
తెలుసుకోలేకపోయాను నాన్నా…

ఈరోజు వరకూ
మీరు నన్ను కొట్టింది లేదు
కొట్టి ఉన్నా
నేను మరచిపోయుంటాను
కానీ
మీరు తిట్టిన మాటలు
ఇప్పటికింకా మరచిపోలేదు నాన్నా…

యవ్వనంలోకి అడుగుపెడుతున్న కొద్దీ
మన మధ్య తేడా అంతకంతకూ
పెరుగుతూ వచ్చింది నాన్నా

యవ్వనంలో
ఏవేవో తప్పులు చేసానని
మీకు మీరు ఊహించుకుని
ఓ నిర్ణయానికొచ్చి
నన్ను తిట్టినప్పుడల్లా
ఆ తప్పులు చేసి చూద్దామనుకుని
నా మనసు నన్ను ఉసిగొల్పడం
నా తప్పా నాన్నా

ఎవరు నా గురించి
ఏం చెప్పినా నమ్మిన మీరు
నేను చెప్పింది మాత్రం నమ్మకపోవడం
నేను చేసినా తప్పా నాన్నా

నేను అబద్ధం చెప్పినా నమ్మే అమ్మ
నిజం చెప్పినా నమ్మని మీరూ
నా గురించి ఎప్పుడూ మీతో పితూరీలు చెప్పే తమ్ముడు
కానీ వాడి పట్ల నేను చూపే అప్యాయత
మీరే చెప్పండి నాన్నా
నేనెవరిని నమ్మాలి….

నాకు దక్కని కాలేజీ జీవితం
తమ్ముడికి దక్కడంతో
సంతోషపడ్డానే తప్ప
అసూయపడలేదు
అయినా
వాడేదైనా తప్పు చేసినప్పుడు
మీరు నన్నేగా ఉదాహరణగా చెప్తారు
ఎందుకు నాన్నా అలా…..

బాల్యంలో
కథానాయకుడిలా కనిపించిన మీరు
యవ్వనంలో విలన్ లా కనిపించారు
కానీ
కాలం గడిచే కొద్దీ ఇదంతా ఆలోచిస్తుంటే
నామీద నాకే ఆసహ్యం వేస్తోంది
మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు
నాన్నా!!

ఈరోజు ఒక్కొక్కటీ ఆలోచిస్తుంటే 
మీకు నామీద నమ్మకం లేకపోవడం
ఓ విధంగా సబబే అన్పిస్తోంది నాన్నా!!

మీ ప్రతి మాటనూ
నేను వ్యతిరేకిస్తూ
ఆవేశంగా మాట్లాడటం
నా పొరపాటే నాన్నా!!

ఓ తండ్రిగా కొడుకుని
క్రమశిక్షణలో పెంచడంకోసం
మీరు అప్పుడప్పుడూ కఠిన నిర్ణయాలు
తీసుకోవడాన్ని
నేను జీర్ణించుకోలేకపోయాను అప్పట్లో….

నా తొందరపాటే
నా తప్పిదం నాన్నా!!
ఇక మీదట సవ్యంగా ఉంటాను నాన్నా
మనమందరం సంతోషంగా ఉండటమే
నాక్కావలసింది

నేను
మీకు రాసిన ఈ ఉత్తరంలో
ఏ మాటన్నా నొప్పించినట్లయితే
నన్ను మన్నించండి నాన్నా….

మీరు
క్షమిస్తారనే గట్టి నమ్మకంతోనే
మొదటిసారిగా
ఈ ఉత్తరం రాసాను నాన్నా….

ఇది మీకోసం మాత్రమే రాసాను.
మీరు మనసులో ఉంచుకుంటే చాలు
నాన్నా….
మీ ఆరోగ్యం జాగ్రత్త
నేను త్వరలోనే బయలుదేరి వస్తాను

                                                                                                   ఇట్లు
                                                                                     మీ ప్రియమైన కొడుకుని

                                                                                           – యామిజాల జగదీశ్

(Visited 92 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *