అనకాపల్లి జిల్లా రేషన్‌ కార్డుదారులపై వివక్ష తగదు తక్షణం పోషక బియ్యం పంపిణీ చేయాలి: ప్రభుత్వానికి కాండ్రేగుల వెంకట రమణ విజ్ణాప్తి

అనకాపల్లి :

 

 

జాతీయ ఆహార భద్రత చట్టం`2013 అమల్లో భాగంగా అనకాపల్లి జిల్లా రేషన్‌ (బియ్యం) కార్డుదారులకు బలవర్ధకమైన ఫోర్ట్‌ఫైడ్‌ (పోషక) బియ్యాన్ని తక్షణం పంపిణీ చేయాలని కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన వినతిపత్రంలోని వివరాలను గురువారం ఆయన పత్రికలకు విడుదల చేశారు. జిల్లాను ఆనుకుని ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏప్రిల్‌ నుంచి, విశాఖపట్నం జిల్లాలో జూన్‌ నుంచి రేషన్‌ కార్డుదారులకు పోషక బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుండగా రెండు జిల్లాలకు మధ్యలో ఉన్న అనకాపల్లి జిల్లాలోని రేషన్‌ కార్డుదారులకు మాత్రం సార్టెక్స్‌ బియ్యం సరఫరా చేస్తుండడం ఆక్షేపనీయమన్నారు. జిల్లా రేషన్‌ కార్డుదారులపట్ల చులకనగా వ్యవహరించడం, వివక్ష చూపడం ప్రభుత్వానికి, పాలకులకు తగదన్నారు. ఓట్లు వేసి గెలిపించుకున్న ‘స్థానిక’ ప్రజాప్రతినిధులు అదే విధంగా జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిరదన్నారు. గతంలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రంగా నిలిచిన అనకాపల్లి … జిల్లాగా ఏర్పాటయ్యాక పేదోళ్లు ఏం పాపం చేశారని పోషక బియ్యం పంపిణీ చేయలేదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. జిల్లాలోని 24 మండలాల్లోని 5,40,036 బియ్యం, అన్నపూర్ణ, అంత్యోధయ అన్నయోజన కార్దుదారుల హక్కులకు భంగం కల్గిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం 1,069 రేషన్‌ డిపోలు, 374 మొబైల్‌ వాహనాల ద్వారా పోషక బియ్యం కాకుండా 7,995.027 మెట్రిక్‌ టన్నులు సార్టెక్స్‌ బియ్యం పంపిణీ జరుగుతుందన్నారు. అందరికీ పోషక బియ్యం పంపిణీ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా బియ్యం కార్డుదారులందరికీ జాతీయ ఆహార భద్రత చట్టం`2013 ప్రకారం బలవర్ధకమైన పోషక బియ్యంను పంపిణీ చేయాలని కాండ్రేగుల వెంకటరమణ కోరారు. పౌష్టికాహారం ద్వారా ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం నలభై ఏడో రాజ్యాంగ అధికరణ ప్రకారం ప్రభుత్వాల ప్రాథమిక విధి అని తొమ్మిదేళ్ల క్రితం సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకు, సురక్షితమైన ఆహారం పొందడం జీవించే హక్కులో అంతర్భాగమని కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ అన్నారు. ఈ విషయమై సీఎం, రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, కమిషనర్లకు కూడా వినతిపత్రాలు పంపామని కన్సూమర్‌ ఆర్గనైజేషన్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు కాండ్రేగుల వెంకటరమణ తెలిపారు.

(Visited 62 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.