ఢిల్లీ వాల్‌..కేజ్రీవాల్‌

సేవ‌కుడే సైనికుడై…

ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్ధాపక దినోత్సవం సంద‌ర్భంగా

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై ప్ర‌త్యేక క‌థ‌నం


ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు, ఢిల్లీ ముఖ్యమంత్రి, భారతీయ సామాజికవేత్త, రాజకీయమేధావి అరవింద్‌ కేజ్రీవాల్‌ 1968 ఆగస్టు 16వ తేదీన హర్యానాలో భివానీ జిల్లా శివానిలో జన్మించారు. తల్లి గీతాదేవి. తండ్రి గోవిందరామ్‌. తండ్రి ఉన్నతవిద్యావంతుడు. ఆయన బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా పనిచేసారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రాధమిక విద్యాభ్యాసం హిసర్‌లో గల కేంపస్‌ స్కూల్‌లోను, తరువాత సోనీపట్‌లో గల క్రిష్టియన్‌ మిషనరీ హోలీఛైల్డ్‌ స్కూల్‌లోను జరిగింది.

1975లో జరిగిన ఐఐటీ-జెఈఈ పరీక్షల్లో అఖిలభారత స్థాయిలో 563 ర్యాంకు సాధించారు.ఆయన ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసారు. 1989లో జంషెడ్‌పూర్‌లో టాటా స్టీల్‌ కంపెనీలో తొలిసారిగా ఉద్యోగంలో చేరారు. సివిల్‌ సర్వీసెస్‌కు తర్ఫీదు పొందే సమయంలో కలకత్తాలో మదర్‌ థెరిస్సాను కలిసారు. మిషనరీస్‌ ఆఫ్‌ చారిటీస్‌లో వాలంటీర్‌గా సేవలందించారు. రామకృష్ణా మిషన్‌లోను, నెహ్రూయువకేంద్రంలోను సేవలందించారు.మూడేళ్లు పనిచేసిన తరువాత సివిల్‌ సర్వీసెస్‌ రాసి ఉత్తీర్ణులయ్యారు. అప్పుడు ఇండియన్‌ రెవెన్యూ సర్వీసెస్‌(ఐ ఆర్‌ ఎస్‌)కు ఎంపికయ్యారు. ఆయనకు తొలిపోస్టింగ్‌ ఢిల్లీలో లభించింది.

1995లో ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో జాయింట్‌ కమీషనర్‌గా ఉద్యోగంలో చేరారు. ఐఆర్‌ఎస్‌లో బ్యాచ్‌మేట్‌గా ఉన్న సునీతను 1995లో వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు హర్షిత అనే కుమార్తె, పులకిత్‌ అనే కుమారుడు ఉన్నారు.1999 డిసెంబర్‌లో మనీష్‌ సిసోడియా, మరికొంతమందితో కలసి పరివర్తన్‌ అనే పేరుతో ఒక సామాజిక స్వచ్ఛంద సంస్థను కేజ్రీవాల్‌ స్థాపించారు. ఈ సంస్ధ ద్వారా ఢిల్లీ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రధానంగా పన్నులు, విద్యుత్‌, ఆహారపంపిణీ అంశాలపై ఎక్కువ అవగాహన కల్పించారు.

2000 సంవత్సరంలో ఉన్నత విద్యకోసం మూడేళ్లు శెలవు పెట్టారు. 2002లో ఉద్యోగంలో తిరిగి చేరారు. ఒక ఏడాది పాటు తిరిగి ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. శెలవు కాలంలోను ప్రభుత్వం జీతం చెల్లించింది. 18 నెలల తరువాత ఆయన జీతంలేని శలవును మంజూరుచేయమని ప్రభుత్వాన్ని అర్ధించాడు. 2004లో ఆయనకు అశోక్‌ఫెల్లోషిప్‌ పేరిట పురస్కారం లభించింది. 2005లో ఖరగ్‌పూర్‌ ఐఐటి నుండి సత్యాంద్ర కేదుబే స్మారక పురస్కారం స్వీకరించారు. 2006 ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో జాయింట్‌ కమీషనర్‌గా ఉద్యోగానికి రాజీనామా చేసారు.2006లో రామన్‌ మేగసేసే పురస్కారం లభించింది. 2006లో భారతదేశంలో ఉత్తమ సంఘసేవకుడిగా పురస్కారం పొందారు. 2008లో ఢిల్లీలో నకిలీ రేషన్‌ స్కామ్‌ను పరివర్తన్‌ సంస్థే బట్టబయలు చేసింది.

సమాచార హక్కు చట్టాన్ని కేజ్రీవాల్‌ సద్వినియోగం చేసుకున్నారు. ఈ చట్టం ద్వారా ఢిల్లీలో గల ప్రభుత్వ సంస్థలలో గల అవినీతిని వెలికి తీసారు. అన్నాహజారేతో కలిసి అవినీతి వ్యతిరేక పోరాటం గావించారు. జనలోక్‌పాల్‌ బిల్లుకోసం తీవ్రంగా కృషిచేసారు. 2009లో ఐఐటి ఖరగ్‌పూర్‌ నుండి మరోమారు పురస్కారం గైకొన్నారు. 2009లో అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ డెవలప్‌మెంట్‌ సంస్థనుండి ఫెలోషిప్‌ లభించింది. 2010లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ విషయంలో జరిగిన అవినీతిపై పోరాడారు. 2010లో ఎకనమిక్‌ టైమ్స్‌ అవార్డు లభించింది. 2011లో అన్నాహజారే, కిరణ్‌బేడీతో కలసి పలు పోరాటాల్లో పాల్గొన్నారు. 2011లో ఎన్‌ డి టి వీ – ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఇచ్చింది. 2012 నవంబర్‌ 26వ తేదీన ఆమ్‌ఆద్మీ పార్టీని స్థాపించారు. దీనికి ఛాత్ర్‌ యువ సంఘర్ష సమితి పేరిట విద్యార్ధి విభాగం ఉంది.ఎవైడబ్ల్యు పేరిట యువతకోసం, ఆప్‌ మహిళాశక్తి పేరటి మహిళా విభాగాలు కూడా ఉన్నాయి.

2012లో ఆయన స్వరాజ్‌ అనే పుస్తకాన్ని రాసారు. 2013లో న్యూఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఆయన షీలా దీక్షిత్‌పై గెలిచి చరిత్ర సృష్టించారు. కొత్త ఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన కేజ్రీవాల్‌కు 44,269 ఓట్లురాగా, సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి షీలాదీక్షిత్‌కు 18,405 ఓట్లు వచ్చాయి. 2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి 31 సీట్లు రాగా, ఆమ్‌ ఆద్మీ పార్టీకి 28 సీట్లు వచ్చాయి. హంగ్‌ ఏర్పడింది. అప్పుడు కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. 2013 డిసెంబర్‌ 28వ తేదీన న్యూఢిల్లీకి ముఖ్యమంత్రిగా రెండవ అతి పిన్న వయస్కుడిగా కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేసారు. జనలోక్‌పాల్‌ బిల్లు ఢిల్లీ శాసనసభలో అమోదం పొందలేని కారణంగా ఆయన తన ప్రభుత్వాన్ని రద్దుచేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం కేవలం 48 రోజుల పాటు మాత్రమే అధికారంలో ఉంది. 2013లో సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ – ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో గౌరవించింది.

2014 ఫిబ్రవరి 14వ తేదీన ఆయన రాజీనామా చేసారు. 2014 మార్చి 25వ తేదీన జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజక వర్గం నుండి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పోటీచేసి ఓటమిని చవిచూసారు. ఈ ఎన్నికల్లో నరేంద్రమోదీకి 5,81,022 ఓట్లు రాగా కేజ్రీవాల్‌కు 2,09,238 ఓట్లు లభించాయి. 2014లో టైమ్‌ పత్రిక నిర్వహించిన ”టైమ్‌ 100 పోల్‌లో” విజేతగా నిలిచారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 432 సీట్లకోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీచేయగా కేవలం 4 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. 2014 ఫిబ్రవరి 3వ తేదీన జనలోక్‌పాల్‌ బిల్లును ఢిల్లీప్రభుత్వం ఆమోదించింది.14వ తేదీన కేజ్రీవాల్‌ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు.

2014 మార్చి 22వ తేదీన ఢిల్లీకి చెందిన జనతాదళ్‌ సెక్యులర్‌పార్టీ – ఆమ్‌ ఆద్మీపార్టీలో విలీనమైంది. అయితే జనతాదళ్‌ సెక్యులర్‌ పార్టీ వ్యవస్థాపకులైన ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్రయాదవ్‌లు బయటకు వచ్చి స్వరాజ్‌ అభియాన్‌ అనే పేరుతో కొత్తపార్టీని స్థాపించారు.2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో కొత్తఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీచేసిన కేజ్రీవాల్‌కు 57,213 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి నుపూర్‌శర్మకు 25,630 ఓట్లు లభించాయి. 2015 ఫిబ్రవరి 14వ తేదీన రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా మరోమారు ప్రమాణ స్వీకారం చేసారు. 2015లో మొహాల్లా క్లినిక్స్‌ పేరిట ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను ప్రారంభించారు.

2016లో ఫార్టూ ్యన్‌ పత్రిక ప్రచురించిన 50 మంది అత్యంత ప్రభావశాలుర జాబితాలో కేజ్రీవాల్‌కు స్థానం దక్కింది. 2017లో ఏన్‌ ఇన్‌సిగ్నిఫికెంట్‌ మేన్‌ అనే పేరుతో కేజ్రీవాల్‌ జీవిత ప్రయాణాన్ని డాక్యుమెంటరీ రిలీజ్‌ చేసారు. 2017లో పంజాబ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నిల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 117 స్థానాల్లో పోటీచేసి 20 స్థానాలును గెలుచుకుంది. అదే ఏడాది గోవా, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసినా ఒక స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేఘాలయ, నాగాలాండ్‌, కర్నాటక, ఛత్తీస్‌గడ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీలకు పోటీచేసి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేక పోయింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒరిస్సా, తెలంగాణా, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు పోటీచేసి ఒక్క స్థానం కూడా సాధించలేకపోయింది.2019 అక్టోబర్‌లో ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ పరిధిలో గల అన్ని బస్సులలోను మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించారు.

2020 ఎన్నికల నాటికి 1000 ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలను పూర్తిచేసారు. 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీని మరోమారు కేజ్రీవాల్‌ విజయపథంలో నడిపించారు. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు 46,758 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి సునీల్‌కుమార్‌ యాదవ్‌కు 25,061 ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీపార్టీకి 62 స్థానాలు లభించాయి.ప్రసుత్తం ఆమ్‌ ఆద్మీ పార్టీకి లోక్‌సభలో ఒక స్థానం, రాజ్యసభలో 3 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆమ్‌ ఆద్మీ పార్టీ తరపున లోక్‌సభలో భగవంత్‌మన్‌, రాజ్యసభలో సంజయ్‌సింగ్‌, పంజాబ్‌ అసెంబ్లీలో హర్‌పాల్‌సింగ్‌ లీడర్లుగా ఉన్నారు.అరవింద్‌ కేజ్రీవాల్‌ చరిత్రలో తనకొకస్థానాన్ని సంపాదించారు. తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 48 రోజులు, రెండవ సారి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల ఒక రోజు, ఇప్పుడు ప్రస్తుతం 264 రోజులగా కొత్తఢిల్లీలో ముఖ్యమంత్రిపీఠంపై కొలువైయున్నారు.

(Visited 22 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.