భావకవితా కల్పవల్లి – దేవులపల్లి

(24న దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి సందర్భంగా)

తెలుగు సారస్వత రంగంలో భావ కవితా పితామహుడు. భావ కవితా యుగచక్రవర్తి దేవులపల్లి కృష్ణశాస్త్రి. ప్రముఖ పద్య రచయిత, నాటక రచయిత, ఆంధ్రా షెల్లీగా పేర్గాంచిన దేవులపల్లి కృష్ణశాస్త్రి 1897 నవంబర్‌ 1వ తేదీన తూర్పు గోదావరి జిల్లా రావువారి చంద్రంపాలెంలో జన్మించారు. ఆయన ఉన్నత పాఠశాల వరకు పిఠాపురంలో పూర్తిచేసారు. 1918లో విజయనగరం మహారాజా కళాశాలలో చేరి అక్కడే ఆర్ట్స్ లో బ్యాచులర్‌ డిగ్రీ పూర్తిచేసారు. 1929లో శాంతినికేతన్‌లో విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ను కలిసిన నాటి నుండి దేవులపల్లి కృష్ణశాస్త్రిలో గొప్ప మార్పు సంభవించింది. తొలుత మిషనరీ స్కూలులోను మరి కొంతకాలం పిఠాపురం హైస్కూలులో ఉపాధ్యాయునిగా పనిచేసారు.

1932 నుండి 1941 వరకు కాకినాడలోని కళాశాలలో పనిచేసారు. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక నాటికలను రాసారు. వందలమార్లు ఆ నాటికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. తిరప్పావైను తెలుగులోని తర్జుమా చేసి దేవులపల్లి భక్తుల మనస్సును చూరగొన్నారు. ప్రతీ పాశురమును పల్లవి, అనుపల్లవి, చరణాలు అందంగా రూపొందించారు. ఆ విధంగా తర్జుమా చేయబడ్డ పాటలను కర్ణాటక సంగీతంలో ప్రముఖ గాయని అమృతవల్లి సుందరం ఆలపించారు.అమృత వీణ,శ్రీ ఆండాళ్లు తిరుప్పావై కీర్తనలు,కృష్ణ పక్షం, ప్రవాసం, మహతి, మేఘమాల, కన్నీరు,ఊర్వశి,ఋగ్వీధి వంటి రచనలు దేవులపల్లి కలం నుండి జాలువారాయి. వాహినీ స్టూడియోస్‌ పతాకంపై 1951 డిసెంబర్‌ 20న విడుదలైన మల్లీశ్వరి చిత్రంలో అన్ని పాటలను దేవులపల్లి రాసారు. మనసున మల్లెల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో అనే పాట, ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్నీ తిరిగి చూశావు ఏడ తానున్నాడో బావా అనే పాట తెలుగువారిని అలరించాయి. వాహినీ స్టూడియోస్‌ బ్యానర్‌పై బి.ఎన్‌ రెడ్డి స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహించగా 1960 ఫిబ్రవరి 24న విడుదలైన రాజమకుటం చిత్రంకోసం సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవళించేనే అంటూ దేవులపల్లి రాయగా మాస్టర్‌ వేణు చక్కగా స్వరకల్పనచేసారు.

శ్రీ విజయభారత్‌ మూవీస్‌ పతాకంపై ఐ ఎన్‌ మూర్తి దర్శకత్వంలో 1968 జనవరి 4న విడుదలైన సుఖ దుఃఖాలు చిత్రంలో దేవులపల్లి రెండు పాటలను రాసారు. ఇది మల్లెల వేళయని ఇది మల్లెలమాసమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది అనే పాటను ఎస్‌ పి కోదండ పాణి మధురంగా స్వరకల్పనచేసారు. ఇదేసినిమా కోసం మేడంటే మేడాకాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అని దేవులపల్లి రాయగా బాలు గొంతునుండి జాలు వారింది.వాహినీ పిక్చర్స్‌ బ్యానర్‌పై బిఎన్‌ రెడ్డి స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహించగా 1969 మార్చి 19న విడుదలైన బంగారుపంజరం చిత్రంలో అన్ని పాటలను దేవులపల్లి రాసారు.పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా పక్కన నువ్వుంటే ప్రతిరాత్రీ పున్నమిరా అనే పాటను దేవులపల్లి రాయగా ఎస్‌జానకి మధురంగా ఆలపించారు. పద్మఫిలింస్‌ బ్యానర్‌పై చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో 1969 డిసెంబర్‌4న విడుదలైన ఏకవీర చిత్రంలో ప్రతిరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి బ్రతుకంతా ప్రతినిమిషం పాటలాగ సాగాలి అంటూ దేవుపల్లి రాసిన పాట తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది.

ఎందుకంటే ఘంటసాల, బాలు కలసి తొలిసారి ఆలపించిన పాటగా నిలిచింది. ఆ పాటను కెవి మహాదేవన్‌ గొప్పగా స్వరపరచారు. భవానీ పిక్చర్స్‌ పతాకంపై కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో 1970 ఆగస్టు 13న విడుదలైన మాయని మమత చిత్రంలో రానిక నీకోసం సఖీ రాదిక వసంతమాసం రాలిన సుమాలు ఏరుకొని జాలిగా గుండెలో దాచుకొని ఈ దూరపు సీమలు చేరుకొని రానిక నీకోసం అంటూ దేవులపల్లి రాయగా ఘంటసాల గళంలోనుండి జాలువారింది.లక్ష్మీ ఫిలింస్‌ పతాకంపై వి.మధుసూదనరావు దర్శకత్వంలో 1973 జూలై 5న విడుదలైన భక్తతుకారాం చిత్రం కోసం దేవులపల్లి రాసిన ఘనాఘన సుందరా కరుణారసమందిరా అది పిలుపో మేలుకొలుపో అనే పాట పి.ఆదినారాయణరావు స్వరపరచగా ఘంటసాల ఆలపించారు.

1975లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన బలిపీఠం చిత్రం కోసం కుశలమా నీకు కుశలమేనా మనసు నిలుపుకోలేక మరీమరీ అడిగేను అంటూ దేవులపల్లి రాసిన పాట నేటికి సినీ సంగీత విభావరులలో మురిపిస్తూనే వుంటుంది. ఇదే ఏడాది రంజిత్‌ మూవీస్‌ పతాకంపై కెఎస్‌ ప్రకాశరావు దర్శకత్వంలో విడుదలైన చీకటి వెలుగులు అనే చిత్రంకోసం దేవులపల్లి రాసిన చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వన్నెలు అనే పాటను బాలు, సుశీల ఆలపించారు.1976లో విజయాప్రొడక్షన్స్‌ పతాకంపై బాపు దర్శకత్వంలో విడుదలైన శ్రీ రాజేశ్వరీ విలాస్‌ కాఫీక్లబ్‌ చిత్రంలో నాపేరు బికారి నాదారి ఎడారి మనసైనచోట మజిలీ కాదన్నచోట బదిలీ అంటూ దేవులపల్లి రాయగా పెండ్యాల స్వరకల్పనలో బాలు ఆలపించగా ఇప్పటికీ తెలుగు వారింట వినపడుతునే వుంటుంది. ఇదే ఏడాది నవత ఆర్ట్‌ ్స పతాకంపై సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో విడుదలైన అమెరికా అమ్మాయి చిత్రంలో పాడనా తెనుగు పాట పరవశనై మీఎదుట మీ పాట అని దేవులపల్లి రాయగా జి కె వెంకటేష్‌ స్వరకల్పనలో పి.సుశీల మధురంగా ఆలపించారు. 1977లో అమృతా ఫిలింస్‌ పతాకంపై కె ఎస్‌ ఆర్‌ దర్శకత్వంలో విడుదలైన ఈబంధం ఏనాటిదో చిత్రంకోసం దేవుపల్లి రాసిన ఎవరు నేర్పేరమ్మా ఈ కొమ్మకు పూలిమ్మని రెమ్మ రెమ్మకు అనే పాట సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో సుశీల ఆలపించగా సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఇదే ఏడాది రవిశంకర్‌ పిక్చర్స్‌ పతాకంపై దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన మా బంగారక్క చిత్రంకోసం దూరాన దూరాన తారాదీపం భారమైన గుండెలో ఆరనితాపం అనే పాటను దేవుపల్లి రాయగా రమేష్‌ నాయుడు స్వరకల్పనలో జి.ఆనంద్‌ మధురంగా ఆలపించారు.1978లో కె విశ్వనాథ్‌ దర్శకత్వంలో విడుదలైన సీతామాలక్ష్మీ చిత్రంలోని మావి చిగురు తినగానే కోవిల పలికేనా కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా అనే పాటలను దేవులపల్లి రాసారు. తారకప్రభు ఫిలింస్‌ పతాకంపై దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1982 సెప్టెంబర్‌ 24న విడుదలైన మేఘసందేశం చిత్రంలో నాలుగు పాటలు రాసారు. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై ఈ అడవి దాగిపోనే అనే పాట దేవులపల్లి రాయగా పి సుశీల గొంతునుండి జాలువారింది.మరోపాట ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో అంటూ ఆయన రాయగా రమేష్‌నాయుడు మధురంగా స్వరపరచారు. శీతవేళ రానీయకు రానీయకు శిశిరానికి చోటీయకు చోటీయకు అనే పాటను, సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో అంటూ దేవుపల్లి రాసినపాటలను కె జె ఏసుదాస్‌ మధురంగా ఆలపించారు.

1979 అక్టోబర్‌ 12న దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన గోరింటాకు చిత్రంలో రెండు పాటలను దేవులపల్లి రాసారు. గోరింట పూచింది కొమ్మలేకుండా మురిపాల అరచేత మొగ్గతొడిగింది అనే పాట దేవుపల్లి రాయగా పి.సుశీల చక్కగా ఆలపించారు. ఎలా ఎలా దాచావు అలవికాని అనురాగం ఇన్నాళ్లూ ఇన్నేళ్లూ అంటూ ఆయన రాయగా కె వి మహాదేవన్‌ స్వరకల్పనచేసారు. వాహినీ అండ్‌ ప్రసాద్‌ స్టూడియో బ్యానర్‌పై లక్ష్మీ దీపక్‌ దర్శకత్వంలో 1979 మే 4వ తేదీన విడుదలైన కార్తీకదీపం చిత్రంలో దేవులపల్లి రాసిన పాట ఇప్పటికీ ప్రతీ ఇంట్లో వినపడుతునే ఉంటుంది. ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం అనే పాట సత్యం స్వరకల్పనలో సుశీల, జానకి పాడారు. 1983లో కళ్యాణీ ఆర్ట్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై జంధ్యాల దర్శకత్వంలో విడుదలైన ఆనందభైరవి చిత్రంకోసం దేవులపల్లి ఒకపాటను రాసారు.

కొలువైతివా రంగశాయి కొలువైన నినుచూడ కలవా కన్నులు వేయి అని రాయగా రమేష్‌నాయుడు స్వరకల్పనలో బాలు,జానకి ఆలపించారు.క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1986 అక్టోబర్‌ 2న విడుదలైన రాక్షసుడు చిత్రంలో దేవులపల్లి రాసిన పాట దేశభక్తిని పెంపొందింపచేసింది. జయ జయ జయ జయభారత జనయిత్రీ దివ్యధాత్రి అంటూ దేవుపల్లి రాయగా ఇళయరాజా స్వరకల్పనలో జానకి ఆలపించారు.దేవుపల్లి భావకవిత్వానికి రూపురేఖలు దిద్ది భావ కవితా సౌధాన్ని ఉత్క ృష్టంగా నిర్మించారు.రసాత్మకమైన, కవితాత్మకమైన, సృజనాత్మకమైన రచనలు గావించారు.తెలుగింటి సాంప్రదాయకమైన ఆడపిల్ల ఎలా ఉంటుంది? కృష్ణశాస్త్రి కవితలా ఉంటుంది. తాను రాసిన కవితలకు కావ్యగౌరవాన్ని సాధించిన మహనీయుడు. తెలుగు పదాలకు నగిషీలద్ది భావకవితా యుగానికి కల్పవల్లిగా పేర్గాంచి, తెలుగు సినీ పాటలకు సాహిత్య పూహళింపులను పరిమళాలను అద్ది తెలుగు సినీగీతాల ఖ్యాతిని ద్విగిణీకృతం చేసిన ఘనాపాఠి దేవులపల్లి కృష్ణశాస్త్రి.తెలుగు కవితా సరస్వతి తలవాకిట తారామణిహారం కట్టి వెన్నెల కర్పూరం వెలిగించిన దేవులపల్లి కాళిదాసు కావ్యాన్ని ఒక్క పాటలో కూర్చి మేఘసందేశం వినిపించి తెలుగువారి గుండెల్లో పదిలంగా నిలిచారు. ఓ భావకవితా భారతీ చరణ చారణ చక్రవర్తీ .. అందుకో మా సుమచందన వందనం.

(Visited 85 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *