శత్రువునే ప్రేమించాలి…
“శత్రువుని ప్రేమించు” అన్నాడు జీసస్.
“మిత్రుడినే కదా ప్రేమించగలం….శత్రువుని ఎలా ప్రేమించడం?” అని అడగొచ్చు.
మిత్రుడిని ప్రేమించడంలో గొప్పేముంది? అది చాలా తేలిక.
శత్రువుని ప్రేమించడమే గొప్ప. ఎందుకంటే అది కఠినమైనది.
పగ అనేది నిప్పు. నిప్పుని నిప్పుతో ఆర్పలేం. నీటితోనే ఆర్పగలం.
ప్రేమ అనేది ఓ రకమైన దాడి. మిత్రుడు మనతో అంటే మన ప్రేమాభిమానాలతో గెలిచిన రాజ్యమై ఉంటాడు. కనుక దానిమీద మళ్లీ మళ్ళీ దాడి చేయడం అనవసరం.
శత్రువేమో విజయం సాధించవలసిన దేశమై ఉంటాడు. దానిపైనేగా దాడి చేయడం అవసరం.
ఆలోచించి చూడగా,
మిత్రుడు మన శత్రువై ఉన్నాడు.
శత్రువు మన మిత్రుడై ఉన్నాడు.
మిత్రుడు మన లోపాలను మనతో చెప్పడానికి కాస్తంత జంకుతాడు. అసలు చెప్పకపోవచ్చు. దాంతో అతనికి తెలీకుండానే మన తిరోగతికి అతను కారణమై ఉంటాడు. అంతేకాదు, ఈ క్రమంలో కొన్ని దుర్గుణాలుకూడా మిత్రుల వల్ల మనకు సంక్రమించే అవకాశాలున్నాయి.
మరోవైపు శత్రువు అద్దంలా ఉంటాడు. మన లోపాలను మనకు తెలియజెప్పేవాడై ఉంటాడు. దీని వల్ల మనం మన తప్పులను సరిదిద్దుకోగల అవకాశముంది.
మిత్రుడు మన పరుపై ఉంటాడు. దానిపై మనం సుఖంగా పడుకుండిపోతాం.
శత్రువు అలారమై ఉంటాడు. అతని వల్ల మనం మేల్కొంటాం. చురుకుగా ప్రవర్తించగలం.
శత్రువు మనకు తప్పులు చెప్తాడు. ఇందువల్ల మనం అప్రమత్తమయ్యే అవకాశాలున్నాయి. అంతేకాదు, మనకు తెలియకుండానే మనలో దాగిన మన శక్తియుక్తులు అతని వల్లే బయటికొస్తాయి.
శత్రువు సానపెట్టే రాయిలాటివాడు. మన తెలివితేటలను అతని వల్ల సానపెట్ట కోవచ్చు.
జీవితం అనేది పోరాటం వల్ల ఆసక్తికరంగా మారుతుంది. పోరాటం వల్ల పురోగతి సాధ్యం. శత్రువు వైఖరి ఇందుకు దోహదపడతుంది.
జీవితం అనేది విభిన్నరీతుల సమ్మేళనం.
నెగిటివ్, పాజిటివ్ కలిస్తేనే విద్యుద్దీపం వెలుగుతుంది. శత్రువు నెగిటివ్ శక్తిగా ఉండటం వల్లే మనం ప్రకాశవంతమవుతాం.
శత్రువు బోధి వృక్షమై ఉంటాడు. దాని నీడలో మనకు జ్ఞానం సిద్ధిస్తుంది.
మన దగ్గర ఉన్నదే నిజమని అనుకోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. శత్రువు దగ్గర నిజం ఉండొచ్చు. ప్రేమ అనే దీపంతో దానిని మనం చూడగలం.
తీవ్ర తపస్సుతో మాత్రమే నశించే అహంకారాన్ని శత్రువు సులభంగా అణిచేయగలడు. అహంకారం నశించినప్పుడు జ్ఞానం పొందవచ్చు.
చీకటి అంటూ లేకుంటే దీపం అవసరమే లేదుగా. అలాగే పగ అంటూ లేకుంటే ప్రేమ అవసరమూ లేదు.
చీకటే వెలుగుకు అర్థాన్ని ఇస్తుంది.
పగే ప్రేమకు అర్థాన్నిస్తుంది.
మనల్ని ప్రేమించే వారిని మాత్రమే ప్రేమిస్తుంటే ప్రపంచంలో ఏ మార్పూ ఉండదు.
శత్రువుని ప్రేమించడం ద్వారానే ఆనందమయమైన ప్రపంచాన్ని సృష్టించడం సాధ్యం.
– యామిజాల జగదీశ్,వీడ్రీమ్స్ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్