ఆంధ్రపితామహుడు మాడపాటి హనుమంతరావు
(22న మాడపాటి హనుమంతరావు జయంతి)
మాడపాటి హనుమంతరావు 1885 జనవరి 22వ తేదీన కృష్ణాజిల్లా నందిగామ తాలూకా పొక్కునూరు గ్రామంలో జన్మించారు. తండ్రి వెంకటప్పయ్య, తల్లి వెంకట సుబ్బమ్మ. ఆయనకు ఐదేళ్ళ ప్రాయంలో పితృవియోగం కలిగినందున సూర్యాపేటలో గల మేనమామ జమలాపురం వేంకటరావు ఆశ్రయం పొందారు.మాడపాటి హనుమంతరావు గారి ప్రాధమిక విద్యాభ్యాసము సూర్యాపేటలో తిరునగరి నరసయ్యగారనే ఛాత్తాదవైష్ణవోపాధ్యాయుని ప్రయివేటు పాఠశాలలో 3 ఏళ్లు, తరువాత ఇబ్రహీం పట్టణంలో ఒక మేరువ కులస్ధుని పాఠశాలలో 5 నెలలు సాగింది. నల్గండలో గల మేనమామ రామచంద్రరావు గారి వద్ద ఉంటూ ఉర్దూ, పారశీక, తెలుగు చదువుకున్నారు. 1898 లో ఉర్దూ మిడిల్ పరీక్షలో బంగారుపతకాన్ని సాధించారు. భువనగిరిలో అప్పర్ప్రయిమరీ విద్యను కొనసాగించి, 1899 లో ఇంగ్లీషు మిడిల్లోను, 1902 మద్రాసు విశ్వవిద్యాలయంనుండి మెట్రిక్యులేషన్ ప్రధమశ్రేణిలోను పూర్తిచేసారు.1904 లో హనుమకొండలో స్కూల్ఇనస్పెక్టర్ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా 8 ఏళ్లపాటు తొలి ఉద్యోగాన్ని చేసారు.తరువాత హైదరాబాద్ నగరంలో శాసన నిర్మాణ శాఖలో అనువాదకుని పదవిలో ఐదేళ్లు కొనసాగి ఆ సమయంలోనే హైకోర్టు వకీలు పరీక్షను కూడా పూర్తిచేసారు.24 ఏళ్లపాటు న్యాయవాద వృత్తిలో కొనసాగారు.ఆయన నారాయణగుడలో ఒక బాలికల పాఠశాలను స్ధాపించారు. ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసి 1930 లో జోగిపేటలో తొలి సమావేశాన్ని కూడా ఏర్పాటుచేసారు.ముషీర్-ఇ-దక్కన్ అనే ఉర్దూ పత్రికకు 13 ఏళ్లపాటు సంపాదకునిగా సేవలందించారు.హైదరాబాద్‌కు మేయర్ పదవి లభించిన తరువాత ఆ పత్రికలో పనిచేయడం మానివేసారు.మాడపాటి హనుమంతరావుగారు నీలగిరి, తెలుగుపత్రిక అనే వారపత్రికలకు వ్యాసాలు రాసేవారు.
మున్షీప్రేమ్‌చంద్, కేల్కర్ రచనలను ఆయన తెలుగులోకి అనువదించారు.మహాభారత సమీక్ష, ఎపిక్ ఇండియా, క్షాత్రకాలపు హింద్వార్యులు అనే విమర్శనాత్మక గ్రంధాలను వెలువరిచారు. మల్లికాగుచ్ఛము, మాలతీగుచ్ఛము అనే కధాసంపుటాలురచించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే బిరుదును కైవసం చేసుకున్నారు.గ్రంథాలయ ఉద్యమం కోసం హనుమంతరావు విస్తృతమైన కృషిచేసారు. హైదరాబాద్‌లోని శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, హనుమకొండలోని రాజ రాజ నరేంద్ర ఆంథ్ర గ్రంథాలయంల అభివృద్ధిలో హనుమంతరావు కీలకపాత్ర పోషించారు. మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలను హైదరాబాద్‌లోని నారాయణగుడలో స్థాపించారు. ఆంధ్రపితామహుడుగా పేర్గాంచిన హనుమంతరావుకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. 1951 లో హైదరాబాద్ మునిసిపాల్టీకి మేయర్‌గా ఎన్నికయ్యారు. 1958 లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి అధ్యక్షునిగా ఎంపికయ్యారు. 1970 నవంబర్ 11వ తేదీన ఆయన కన్ను మూసారు.