పెన్నంటే నాకిష్టం!!


రాయడం
చదవడం
మొదలుపెట్టినప్పటి నించీ
పెన్నూ
నాకొక వేలైంది!
నాకెంతో సన్నిహితమైంది!

అక్షరాలతోనూ
వాక్యాలతోనూ
సాన్నిహిత్యం పెంచుకున్నకొద్దీ
నా శ్వాసగా మారిన
పెన్నంటే నాకెంతో ఇష్టం!!

రాస్తున్నంత సేపూ
వేళ్ళమధ్య ఉంటూ
కాగితంమీద పెట్టగానే
వేలు అంచులను దాటినా
మనసు చెప్పినట్టే రాసుకుంటూపోయే
పెన్నంటే నాకెంతో ఇష్టం!!

కాగితమంటే
ఎంతిష్టమో నా పెన్నుకి….
అందులోనూ
తెల్ల కాగితాలకంటే
రూల్డు కాగితాలంటే
మహాయిష్టం!!

నేను రాయడానికి
ఆలోచిస్తున్నప్పుడు
నా వంక చూస్తుంటుందే తప్ప
నిద్రలోకి జారుకోదు,
రాయడానికెప్పుడూ
వెనకడుగు వేయని
నా పెన్నంటే నాకెంతో ఇష్టం!!

కవితలు
అందులోనూ
ప్రేమకవితలు
రాస్తున్నప్పుడు
నాకు తెలీకుండానే
సిగ్గుపడే నా పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

రాయడం
ముగించేంత వరకూ
తనకు క్యాప్ పెట్టనివ్వని పెన్ను
సిరా విషయంలోనూ
చివరికొచ్చెస్తుంటే
ముందుగానే సంకేతాలిస్తుంది
రాయడం పల్చబడి….

ఎదుటపడి
చెప్పలేని మాటలను
కాగితంమీద పెట్టటానికి
తన రక్తమైన సిరాని అర్పించడంలో
ఏమాత్రం వెనకాడని పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

ఒంటికాలిపై నిల్చుని
నొప్పెంతైనా భరిస్తుందే తప్ప
రాయనని మొండికేయని
నా పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

కాగితం మీద
నేనెంతసేపు రాసినా
అలసిపోని నా పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

నేను పడుకున్నప్పుడు
అప్పటివరకూ రాసిన అక్షరాలను
దాచేయడమో
మిగిలిన అక్షరాలను
తస్కరించడమో
తెలీని ఆత్మాభిమానమున్న
నా పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

కాగితాన్ని
ప్రేయసిగా చేసుకుని
అక్షరాల ద్వారా
రాయబారం పంపే
నా పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

రాసే నేను భౌతికంగా అస్తమించినా
నా రాతలకు అస్తమానమంటూ
లేకుండా ఒకరిద్దరి మనసులలోనైనా
నువ్వు బతికుండేలా చూసుకుంటానని
నాకు మాటిచ్చిన పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

చొక్కాజేబులోనే ఉంటూ
గుండెచప్పుడిని వింటూ
నన్ను నడిపించే పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

అక్షరాల ద్వారా
తన ఉనికిని చాటుతూనే ఉండే
పెన్నంటే నాకెంతో ఇష్టం!!

రాసే నను అలసిపోతే
తదుపరి మాటలను ఆలోచించే
మెదడు వెన్నంటే ఉండే
పెన్నంటే నాకిష్టం!!

అందుకే నా పెన్నుకి
“ఊహల కవికలం” అని
నామకరణమూ చేసాను!!

సందర్భాన్నిబట్టి
వాడి వేడి మాటలతోనూ
అవసరమైన మనసుకి
ప్రియమైన మాటలతోనూ
చదివేవారి మనసుని
ఆకట్టుకునే నేర్పుని చూపడంలో
చాణ్యుకుడిలా
వ్యవహరించే నా పెన్నంటే
నాకెంతో ఇష్టం!!

అందుకే
నా పెన్ను
నాకు శ్వాస!! ధ్యాస!!

                                                                                                    – యామిజాల జగదీశ్

(Visited 48 times, 1 visits today)

2 thoughts on “పెన్నంటే నాకిష్టం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *