భారత రత్నం అటల్‌ బిహారీ వాజ్‌పేయీ

(25న వాజ్‌పేయీ జయంతి సందర్భంగా)
సామాన్యునిగా ప్రస్థానాన్ని ప్రారంభించి తన అసమాన ప్రతిభా పాటవాలతో, అపరిమిత శక్తిసామర్ధ్యాలతో, రాజకీయ మేథావిగా, అపర భీష్మునిగా, అనన్య సామాన్యునిగా భారతదేశ ప్రధానమంత్రి స్థాయివరకు ఎదిగిన భారతరత్నం అటల్‌ బిహారీ వాజ్‌పేయీ భారతీయులందరికీ స్ఫూర్తిప్రదాత .

జననం : రాజనీతిజ్ఞుడు, ఉదారవాది, మానవతావాది,కవి, సిద్ధాంతకర్త, వక్త, నిరాడంబరుడు, దూరదృష్టి, నాయకత్వ పటిమ, పరిణితి, నిరుపమాన వాగ్దాటి కలిగిన అటల్‌ బిహారీ వాజ్‌పేయీ 1924 డిసెంబర్‌ 25వ తేదీన మధ్యప్రదేశ్‌లో గ్వాలియర్‌లో జన్మించారు. తల్లి కృష్ణాదేవి, తండ్రి కృష్ణబిహారీ వాజ్‌పేయీ. వాజ్‌పేయీకి ముగ్గురు సోదరులు : అవధ. సుధ, ప్రేమ్‌, ఆయనకు ముగ్గురు అక్కలు : ఊర్మిళ, కమలాదేవి, విమల.

కుటుంబ నేపథ్యం : అటల్‌ యొక్క తాతగారు పండిట్‌ శ్యామ్‌లాల్‌ వాజ్‌పేయీ గారు ఉత్తరప్రదేశ్‌లోని బటేశ్వర్‌ అనే గ్రామం నుండి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు 39 కిలోమీటర్ల దూరంలో గల మొరేనా అనే గ్రామానికి వలస వెళ్లారు. అటల్‌ యొక్క తండ్రి గారు గొప్ప కవి. ఆయన ఉపాధ్యాయవృత్తిలో కొనసాగారు.

విద్యాభ్యాసం : భరతమాతకు కీర్తిగా దేశ ప్రజలకు నిరంతర స్ఫూర్తిగా నిలిచిన వాజ్‌పేయీ ప్రాధమిక విద్యాభ్యాసం ఆర్‌ ఎస్‌ ఎస్‌కు అనుబంధంగా నడిచే సరస్వతీ శిశుమందిర్‌లో సాగింది. తరువాత గ్వాలియర్‌లో బారా అనే ప్రాంతంలో గల గోర్ఖీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అటల్‌ యొక్క విద్యాభ్యాసం కొన సాగింది. ఆయన గ్వాలియర్‌ విక్టోరియా కాలేజీలో హిందీ, ఇంగ్లీష్‌, సంస్కృతము ప్రధాన అంశాలుగా బ్యాచులర్‌ డిగ్రీని ప్రథమ శ్రేణిలో పూర్తిచేసారు. ఆ కాలేజీని ప్రస్తుతం లక్ష్మీబాయి కాలేజీ అని పిలుస్తున్నారు. అటల్‌ తన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని (ఎం.ఏ. పొలిటికల్‌ సైన్స్‌)ను కాన్పూర్‌లో గల దయానంద్‌ ఆంగ్లో వేదిక్‌ కాలేజీలో పూర్తిచేసారు. ఆయన పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌లో కూడా ప్రథమ శ్రేణి సాధించారు.

పాత్రికేయునిగా : వాజ్‌పేయీ కొంతకాలం రాష్ట్రధర్మ, పాంచజన్య, స్వదేశ్‌, వీర్‌ అర్జున్‌ అనే పత్రికల్లో పనిచేసారు. రాష్ట్రధర్మ, పాంచజన్య, స్వదేశ్‌ అనే మూడు పత్రికలను దీనదయాళ్‌ ఉపాధ్యాయ స్థాపించారు.
నాయకత్వ లక్షణాలు : అఖండ భారత పరమ వైభవ సాధనా పథ పథికునిగా, హైందవ జాతి సమారాధకునిగా చరిత్ర సృష్టించిన అటల్‌జీలో చిన్న నాటి నుండి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయనకు అవి పుట్టుకతోనే వచ్చాయి. 1939లో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ( ఆర్‌ ఎస్‌ ఎస్‌) లో చేరారు. బాబా సాహెబ్‌ ఆప్టే పట్ల ఆకర్షితులై 1940 నుండి 1944 వరకు ఆర్‌ ఎస్‌ ఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా శిబిరంలో శిక్షణ పూర్తిచేసుకున్నారు. 1947లో ఆయన ప్రచారక్‌గా మారారు.ఆర్యసమాజ్‌ ఆధ్వర్యంలో గ్వాలియర్‌లో నడుస్తున్న ఆర్యకుమార్‌ సభలో ఆయన సభ్యునిగా చేరిన కొన్నిరోజులకే అంటే 1944లో జనరల్‌ సెక్రటరీగా ఎదిగారు. ఆయన సేవారంగంలో బిజీగా మారిన నేపథ్యంలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించడం మధ్యలోనే వదిలివేసారు. అయితే ఆయనను విస్తారక్‌గా ఉత్తరప్రదేశ్‌కు పంపినప్పుడు అక్కడగల దీనదయాళ్‌ ఉపాధ్యాయకు చెందిన పత్రికలో పనిచేసారు. రాష్ట్రధర్మ అనే హిందీ మాసపత్రికలోను, పంచాయన అనే హిందీ వారపత్రికలోను, స్వదేశీ వీర్‌ఆర్జున్‌ అనే దినపత్రికలోను ఆయన జర్నలిస్ట్‌గా పనిచేసారు.

స్వాతంత్య్ర ఉద్యమంలోకి : 1942 ఆగస్టులో జరిగిన క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందులకు అటల్‌జీ యొక్క సోదరుడు ప్రేమ్‌ను అరెస్ట్‌ చేసి 23 రోజుల పాటు జైలులో నిర్బంధించారు. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా మరి పోరాడనని వ్రాతపూర్వకంగా హామీ యిచ్చిన తరువాత మాత్రమే ప్రేమ్‌ను జైలునుండి విడుదలచేసారు.
భారతీయ జనసంఘ్‌ : ఎండిన జాతీయతా నది నిండడానికి, సాంస్కృతిక ధారలు కురిపించడానికి, రాజనీతి యజ్ఞాన్ని నిర్వహించడానికి 1951 అక్టోబర్‌ 21వ తేదీన శ్యామ్‌ప్రకాశ్‌ ముఖర్జీగారు భారతీయ జనసంఘ్‌ను ఢిల్లీలో స్ధాపించారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా స్ధాపించిన భారతీయ జనసంఘ్‌కు జాతీయప్రధాన కార్యదర్శిగా వాజ్‌పేయీ నియమితులయ్యారు. ఈ పార్టీకి ఎన్నికల గుర్తు ఆయిల్‌ లేంప్‌. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భారతీయ జనసంఘ్‌ మూడు స్ధానాలను గెలుచుకుంది.తరువాత రోజుల్లో రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పార్టీ బలపడింది.
1975లో ఇందిరాగాంధీ ఎమర్జన్సీ ప్రకటించినప్పుడు పార్టీకి చెందిన నాయకులను జైలులో పెట్టారు.
దీనదయాళ్‌ ఉపాధ్యాయ మరణం తరువాత భారతీయ జనసంఘ్‌ బాధ్యతలను వాజ్‌పేయీ తన భుజ స్కంధాలపై వేసుకున్నారు. 1968లో ఆయన జనసంఘ్‌కు అధ్యక్షులు అయ్యారు. నానాజీ దేశ్‌ముఖ్‌, ఎల్‌ కె అద్వానీ, బల్‌రాయ్‌ మేథక్‌లతో కలసి జనసంఘ్‌కు జాతీయస్ధాయి గుర్తింపు తీసుకువచ్చారు.
వాక్‌ చాతుర్యం : వాజ్‌ పేయీ యొక్క వాక్‌ చాతుర్యానికి జవహర్‌ లాల్‌ నెహ్రూ కూడా ఆశ్చర్య పోయేవారట. 1957 పార్లమెంట్‌ ఎన్నికలసమయంలో పార్టీ ప్రచారంలో వాజ్‌పేయీ ప్రసంగాలు విని వాజ్‌పేయీ తప్పకుండా గొప్ప నాయకుడు అవుతాడని ఊహించారు.

ఎమర్జన్సీలో అరెస్ట్‌ : ఇందిరా గాంధీ ఎమర్జన్సీ ప్రకటించిననేపథ్యంలో వాజ్‌పేయీని అరెస్ట్‌ చేసారు. 1977లో జయప్రకాష్‌ నారాయణ్‌ పిలుపు మేరకు కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు గాను జనసంఘ్‌ పార్టీని జనతాపార్టీలోకి విలీనం చేసారు.
జనతాపార్టీ ఆవిర్భావం : 1977లో ఎమర్జన్సీ రద్దు అయిన తరువాత అప్పటి రాజకీయ పరిస్థితుల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. భారతీయ జనసంఘ్‌, భారతీయ లోక్‌దళ్‌, కాంగ్రెస్‌-ఓ, సోషలిస్టు పార్టీలు కలిపి జనతాపార్టీగా ఆవిర్భవించాయి.
1975 జూన్‌ 25 నుండి 1977 మార్చి 21వ తేదీ వరకు ఎమర్జన్సీ అమలులో ఉంది. 1977 మార్చి 16వ తేదీనుండి 19వ తేదీ వరకు లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. 21వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి.

1977 ఎన్నికలు-ఫలితాలు : ఈ ఎన్నికల్లో జనతాపార్టీ ఎలయన్స్‌కు మొరార్జీ దేశాయ్‌ నాయకత్వం వహించగా కాంగ్రెస్‌ పార్టీకి ఇందిరాగాంధీ నాయకురాలుగా ఉన్నారు. మొత్తంగా 545 సీట్లకు గాను 345 సీట్లు జనతాపార్టీ కైవసం చేసుకోగా కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 189 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇండిపెండెంట్లు 2 స్ధానాల్లో గెలువగా 19 స్ధానాలలో ఇతరులు గెలిచారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత వాజ్‌పేయీకి విదేశీవ్యవహారాల శాఖామాత్యులుగా సేవలందించే అవకాశం లభించింది. ఆయన మంత్రిగా వ్యవహరించిన కేబినెట్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం: విదేశీ వ్యవహారాల శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్న తరుణంలో వాజ్‌పేయీ ఐక్యరాజ్యసమితిలో తొలిసారి హిందీలో ప్రసంగించారు.

6వ పంచవర్ష ప్రణాళికలు : జనతాపార్టీ పాలన సమయంలో 6వ పంచవర్ష ప్రణాళికలు అమలు చేయబడ్డాయి. వ్యవసాయానికి పెద్ద పీట వేసారు. గ్రామీణ పరిశ్రమలకు ప్రాధాన్యత కల్పించారు.
పెద్దనోట్లు రద్దు : జనతా పార్టీ పాలనలో జరిగిన విశేషమైన అంశాలలో ఒకటిగా పెద్దనోట్లు రద్దు గురించి చెప్పక తప్పదు. 1978 జనవరి 16వ తేదీన 1000, 5000, 10,000 రూపాయల నోట్లును రద్దు చేసారు.

భారతీయ జనతాపార్టీ ఆవిర్భావం :
1979లో జనతాపార్టీ పాలన పూర్తయింది. 1980లో మరోమారు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో జనతాపార్టీకి కేవలం 31 సీట్లు మాత్రమే వచ్చాయి. అటువంటి తరుణంలో ఏర్పడిన పరిస్థితులను బేరీజు వేసి అప్పట్లో గొప్ప నాయకులుగా వెలుగొందుతున్న ఎల్‌ కె అద్వానీ, భైరాన్‌సింగ్‌ షెకావత్‌ తదితరులుతో చర్చించి భారతీయ జనతాపార్టీని 1980 ఏప్రిల్‌ 6వ తేదీన వాజ్‌పేయీ స్థాపించారు. భాజపాకు వ్యవస్ధాపక అధ్యక్షులుగా వాజ్‌పేయీ వ్యవహరించారు. అయితే ఇందిరాగాంధీ హత్య జరిగిన నేపథ్యంలో ఆమె పట్ల సానుభూతితో కాంగ్రెస్‌పార్టీ 1984ఎన్నికల్లో విజయభేరి మోగించిందని కొందరు రాజకీయ విశ్లేషకులు వివరిస్తారు. 1984 ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి కేవలం రెండు లోక్‌సభ స్ధానాలు మాత్రమే వచ్చాయి.

ప్రధానిగా తొలిసారి : 1996లో వాజ్‌పేయీ ప్రధానిగా తొలిసారి ఎన్నికయ్యారు. 1996 మే 16వ తేదీనుండి 1996 జూన్‌ 1వ తేదీ వరకు మాత్రమే ఆ పదవిలో కొనసాగారు.

1998 ఎన్నికలు: 1998 ఫిబ్రవరి 16, 22, 28వ తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్‌డిఏ ఎలయన్స్‌గా భారతీయజనతాపార్టీ వాజ్‌పేయీ నేతృత్వంలో విజయం సాధించింది.

మూడోసారి ప్రధానిగా : 1999లో జరిగిన ఎన్నికల్లో భాజపా మరోమారు విజయదుందుభి మ్రోగించింది. 1999 అక్టోబర్‌ 13వ తేదీనుండి 2004 మే 22వ తేదీ వరకు అధికారంలో ఉన్నారు. 1999 సెప్టెంబర్‌ 5, 11, 18, 25వ తేదీలతో పాటు అక్టోబర్‌ 3వ తేదీన ఎన్నికలు జరిగాయి.

అణుపరీక్షలు : వాజ్‌పేయీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే అణుపరీక్షలు నిర్వహించారు. 1974లో తొలిసారిగా భారతదేశంలో అణుపరీక్షలు జరిగాయి. రాజస్ధాన్‌లో పోఖ్రాన్‌ అనే ప్రాంతంలో అణుపరీక్షలు అప్పట్లో జరిగాయి. అదే ప్రాంతంలో వాజ్‌పేయీ ప్రభుత్వం మరోమారు అణుపరీక్షలను నిర్వహించింది. ఈ పరీక్షలకు పోఖ్రాన్‌-2 అని పేరుపెట్టారు.

లాహోర్‌ సమావేశం : పాకిస్తాన్‌తో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు 1999లో లాహోర్‌ సమావేశం నిర్వహించారు.
ఢిల్లీ-లాహోర్‌ బస్సు సర్వీసు : : 1999 ఫిబ్రవరిలో ఢిల్లీ నుండి లాహోర్‌కు బస్సు సర్వీసు ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించారు.
అటల్‌ బిహారీవాజ్‌పేయీ విగ్రహం : భాజపా జాతీయ అధ్యక్షులు నితిన్‌ గడ్కరీ ముంబాయిలో లోనావాలాలో గల వాక్స్‌ మ్యూజియంలో వాజ్‌పేయీ విగ్రహాన్ని ప్రతిష్టించారు.
జాతీయ రహదారుల అభివృద్ధి : జాతీయ రహదారుల అభివృద్ధి కోసం భారతీయజనతాపార్టీ చేసిన కృషి అనన్య సామాన్యంగా చెప్పుకోవచ్చు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక వాజ్‌పేయీ ప్రభుత్వం చేసిన కృషి అద్భుతమైనదని చెప్పక తప్పదు.
2000 డిసెంబర్‌లో ఫేజ్‌-1 కింద 5,846 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. 2003 డిసెంబర్‌లో ఫేజ్‌-2 కింద 7,300 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు.
ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన : ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన పథకాన్ని 2000 డిసెంబర్‌ 25వ తేదీన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించబడింది. గ్రామీణుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఈ పథకం దోహదపడింది. మారుమూల గ్రామీణప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించబడింది. 2011 నుండి 2014 వరకు ఈ పథకంలో భాగంగా రోజుకు సగటున 75 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మించడం జరిగింది.

అమెరికాతో సంబంధాలు : 2000 మార్చిలో అమెరికా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌ ఇండియాలో పర్యటించాడు. ఆ పర్యటన భారత అమెరికా సంబంధాలు బలపడేందుకు దోహదపడింది.

భారతపార్లమెంట్‌పై దాడి : 2001 డిసెంబర్‌ 13వ తేదీన ఉగ్రవాదులు భారతపార్లమెంట్‌పై దాడి చేసారు. అయితే ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను చంపివేయడం జరిగింది.
పోటా చట్టం : ప్రివెన్షన్‌ ఆఫ్‌ టెర్రరిస్ట్‌ ్స ఏక్ట్‌ పేరిట పోటా చట్టాన్ని భారతీయ జనతాపార్టీ రూపొందించింది.
వృద్ధిరేటు : 2002-2003లో భారతీయ ఆర్ధిక శాస్త్ర నిపుణుల ప్రకారం వృద్ధిరేటు 6 నుండి 7శాతానికి పెరిగింది. విదేశీ పెట్టుబడులు పెరిగాయి. పారిశ్రామిక అవస్థాపనా సౌకర్యాలు మెరుగుపడ్డాయి.

ఉద్యోగాలు పెరిగాయి గ్రామీణ ఆధునికీకరణ జరిగింది. పంటలు సైతం బాగా పండాయి. భారతదేశ స్ధాయి అంతర్జాతీయంగా పెరిగింది. దానితో వృద్ధిరేటులో పెరుగుదల సంభవించింది.

చైనా పర్యటన : 2003 జూలైలో వాజ్‌పేయీ చైనాదేశంలో పర్యటించారు. ఈ పర్యటన వలన భారత చైనా సంబంధాలు బలపడ్డాయి.
వాజ్‌పేయీ విదేశపర్యటనలు :
1965లో పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్న సమయంలో ఈస్ట్‌ ఆఫ్రికా దేశాలలో పర్యటించారు.
పార్లమెంటరీ చర్చలలో భాగంగా 1967లో ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు, 1983లో యూరోపియన్‌ పార్లమెంట్‌కు, 1987లో కెనడా పార్లమెంట్‌కు వెళ్లారు.
కెనడాలో జరిగిన కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సమావేశాల్లో 1966లో తొలిసారి, 1994లో మరోమారు పాల్గొన్నారు.
1994లో జాంబియాలో జరిగిన కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సమావేశాల్లో పాల్గొన్నారు.
1974లో జపాన్‌లో జరిగిన ఇంటర్‌-పార్లమెంటరీ యూనియన్‌ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
1975లో శ్రీలంకలో జరిగిన ఇంటర్‌-పార్లమెంటరీ యూనియన్‌ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
1984లో స్విట్జర్లాండ్‌లో జరిగిన ఇంటర్‌-పార్లమెంటరీ యూనియన్‌ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
1988, 1990, 1991, 1992, 1993, 1994, 1996లలో ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీకి వెళ్లారు.
1993లో జెనీవాలో జరిగిన హ్యూమన్‌రైట్స్‌ కమీషన్‌ సమావేశాల్లో పాల్గొన్నారు.
రాజకీయాలకు రిటైర్మంట్‌ : 2005 డిసెంబర్‌లో వాజ్‌పేయీ రాజకీయాలకు రిటైర్మంట్‌ ప్రకటించారు. ఇకనుండి రాజకీయాల్లో భాగంగా ఎటువంటి ఎన్నికల్లోనూ పోటీచేయనని ప్రకటించారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన ముంబాయి శివాజీ పార్కులో భాజపా సిల్వర్‌జూబ్లీ సమావేశాల్లో వాజ్‌పేయీ మాట్లాడుతూ ఈ ప్రకటన చేసారు.
కురువృద్ధుడు వాజ్‌పేయీ : మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ఒక సారి మాట్లాడుతూ వాజ్‌పేయీని కురువృద్ధుడని, భీష్మ పితామహుడని అభివర్ణించారు.

వాజ్‌పేయీ వ్యక్తిగత విషయాలు : వాజ్‌పేయీ వివాహం చేసుకోలేదు. నమిత భట్టాచార్య అనే ఆమెను దత్తత తీసుకున్నారు.ప్రొఫెసర్‌ కౌల్‌, రాజకుమారీ దంపతుల కుమార్తె నమిత. కాలేజీ రోజుల్లో తాను ఇష్టపడ్డ రాజ్‌కుమారీ కుమార్తెయే నమిత. వాజ్‌పేయీకి రొయ్యలు, చేపలకూర, గ్వాలియర్‌ బూందీ లడ్డు, జిలేబీ అంటే ఇష్టం. పాత ఢిల్లీలో దొరికే బెండకాయలు – బంగాళాదుంపలతో చేసిన కూర, గులాబ్‌ జామ్‌లు అన్నా ఇష్టం. అలాగే వాజ్‌పేయీకి పెంపుడు జంతువులంటే ప్రాణం. ఆయన వద్ద నస్సీ, సోఫీ అనే కుక్క పిల్లలు, రితూ అనే పిల్లి పిల్ల ఉండేవి. ఆయనకు ధోవతీ, కుర్తా, పఠానీ సూట్‌ ధరించడం అంటే ఇష్టం. ఆయనకు నీలం రంగు అంటే ఇష్టం. ఆయనకు ఇష్టమైన పర్యాటక ప్రదేశాలలో మౌంట్‌ ఆబూ, మనాలీ ముందు వరుసలో ఉంటాయి. ఆయన హరిప్రసాద్‌ చౌరాసియా వేణుగానమన్నా, అహ్మద్‌ ఆలీ ఖాన్‌ వాయించే సరోద్‌ అన్నా, భీమ్‌శేన్‌ జోషి గాత్రమన్నా ఇష్టం. ఆయనకు లతామంగేష్కర్‌, మహ్మద్‌ రఫీ అంటే ఇష్టం. వారిద్దరూ కలిపి పాడిన కభీ కభీ మేరే దిల్‌ మే అనే పాటను ఎక్కువగా ఇష్టపడేవారు. ఆయనకు హిందీ సినిమాల్లో దేవదాసు, తీస్రీమంజిల్‌ అంటే ఇష్టం. ఆయనకు ప్రముఖ హిందీ కవులు సూర్యకాంత్‌ త్రిపాఠీ, బాలకృష్ణ శర్మ, జగన్నాథ్‌ ప్రసాద్‌, మిలింద్‌ రచనలంటే ఇష్టం, ఉర్దూ రచయిత అహ్మద్‌ ఫైజ్‌ను అభిమానించేవారు. ఆయనకు హాకీ, ఫుట్‌బాల్‌ ఆటలపై మక్కువ ఎక్కువ.

స్వాతంత్య్ర ఉద్యమంలో : 1942 నుండి స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. వాజ్‌పేయీ క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.

అవార్డులు-పురస్కారాలు:
1992లో భారతప్రభుత్వం నుండి పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు.
1993లో కాన్పూర్‌ విశ్వవిద్యాలయం వాజ్‌పేయీకి డి.లిట్‌ ప్రదానం చేసింది.
1994లో లోకమాన్య తిలక్‌ పురస్కారం లభించింది.
1994లో ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గౌరవాన్ని పొందారు.
1994లో భారతరత్న గోవింద్‌ వల్లభ్‌పంత్‌ పురస్కారం లభించింది.
2015లో భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న వరించింది.
2015లో బంగ్లాదేశ్‌ ప్రభుత్వం లిబరేషన్‌ ఆఫ్‌ వార్‌ అవార్డు ప్రకటించింది.

వాజ్‌పేయీ జీవితగమనం:
1938 : ఆల్‌ ఇండియా స్టూడెంట్‌ ఫెడరేషన్‌లో సభ్యునిగా
1939 – ఆర్యసమాజ విద్యార్ధి విభాగం ” ఆర్య కుమార్‌ సభ”లో చేరారు.
1939 : రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యకర్తగా
1942 : క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని 23 రోజుల పాటు జైలుశిక్ష
1944 -ఆర్యసమాజ్‌ ప్రధాన కార్యదర్శిగా
1947- బాబాసాహెబ్‌ ఆప్టేను స్ఫూర్తిగా తీసుకుని పూర్తిస్ధాయి ప్రచారక్‌గా మారారు.
1951 – భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకులు దీనదయాళ్‌ గారి చేతులమీదుగా సభ్యత్వం
1953 – కాశ్మీర్‌లో ప్రవేశించే భారతీయులకు తప్పనిసరిగా ఏదో ఒక గుర్తింపుకార్డు తప్పనిసరి. ఆ విషయంపై నిరశిస్తూ దీనదయాళ్‌ నిరసన తెలిపే సందర్బంలో వాజ్‌పేయీ ఆయన వెన్నంటే ఉన్నారు.
1957 -లోక్‌ ఎన్నికల్లో లక్నో, మధుర, బలరాంపూర్‌లో అంటే మొత్తంగా 3 స్ధానాల నుండి లోక్‌సభకు పోటీ చేసారు. మధుర, లక్నో, నియోజక వర్గాల నుండి ఓటమి పాలైనా బలరాంపూర్‌ నియోజక వర్గం నుండి గెలిచి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు
1957 నుండి 1977 వరకు – భారతీయ జనసంఘ్‌పార్టీకి పార్లమెంటరీ నాయకునిగా
1962 – రాజ్యసభకు ఎన్నిక
1966- 1967 – గవర్నమెంట్‌ అస్యూరెన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా
1967 – లోక్‌సభకు ఎన్నిక
1967-1970 – పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా
1968 – ఉత్తరప్రదేశ్‌లో మొఘల్‌ సరాయి వద్ద దీనదయాళ్‌ ఉపాధ్యాయ హత్యకు గురయ్యారు.
1968-1973 – భారతీయ జనసంఘ్‌ పార్టీ అధ్యక్షునిగా
1970 – జనసంఘ్‌ అధ్యక్షునిగా ఉన్న సమయంలో మన రాష్ట్రంలో జగ్గయ్యపేట సభలో పాల్గొన్నారు.
1971 – లోక్‌సభకు ఎన్నిక
1975 – ఎమర్జెన్సీ సమయంలో గృహనిర్బంధానికి గురయ్యారు.
1977 – లోక్‌సభకు ఎన్నిక
1977 – జనతాపార్టీ వ్యవస్ధాపక సభ్యునిగా
1977 – ఐక్యరాజ్యసమితిలో తొలిసారి ప్రసంగం ( హిందీలో)
1977 – వాజ్‌పేయీ రాసిన ఇండియాస్‌ ఫారన్‌ పాలసీ – న్యూడైమన్షన్‌ అనే పుస్తకం ప్రచురించబడింది.
1977-1979 – మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్న కేంద్ర కేబినెట్‌లో విదేశీ వ్యవహారాల శాఖామంత్రిగాను,
కాంగ్రెసేతర తొలి విదేశాంగ మంత్రిగా గుర్తింపు
1978- ఐక్యరాజ్యసమితిలో రెండవ సారి హిందీలో ప్రసంగించారు.
1979 : మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేయడంతో జనసంఘ్‌ పార్టీని రద్దు చేసారు.
1980-1986 – భారతీయ జనాతాపార్టీ అధ్యక్షునిగా
1980- లోక్‌సభకు ఎన్నిక
1980- 1984 – భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ నాయకునిగా
1981- వాజ్‌పేయీ రాసిన అస్సాం ప్రాబ్లమ్‌ , రిప్రెషన్‌ నో సొల్యూషన్‌ అనే పుస్తకం ప్రచురితమైంది.
1983 – భారతీయ జనతాపార్టీ ఆవిర్భావ సభల కోసం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు.
1983 – విజయవాడలో తెలుగుదేశంపార్టీ ఏర్పాటు చేసిన మహానాడుకు వాజ్‌పేయీ విచ్చేసారు.
1986- రాజ్యసభకు ఎన్నిక
1986 – భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ నాయకునిగా
1986 – విజయవాడలో భాజపా జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు.
1986- జనరల్‌ పర్పసన్‌ కమిటీ సభ్యునిగా

1988 – ఎయిమ్స్‌ ఆసుపత్రిలో మూత్రపిండాల శస్త్రచికిత్స
1988-1990 – హౌస్‌ కమిటీ సభ్యునిగా
1988-1990 – సభా వ్యవహారాల కమిటీ సభ్యునిగా
1990-91 – పిటిషన్స్‌ కమిటీ ఛైర్మన్‌గా
1991 – లోక్‌సభకు ఎన్నిక
1992 – అటల్‌ బిహారీ వాజ్‌ మేమ్‌ తినా దశక అనే రచన గావించారు.
1992- కేంద్ర ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్‌ పురస్కారం
1991-93 – పబ్లిక్‌ అక్కౌంట్స్‌ కమిటీ ఛైర్మన్‌గా
1993 – కాన్పూర్‌ విశ్వవిద్యాలయం వాజ్‌పేయీకి డి.లిట్‌ ప్రదానం చేసింది.
1993-1996 – భారతీయ జనతాపార్టీ పార్లమెంటరీ నాయకునిగా
1993-96 – ఎక్స్‌టెర్నల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా
1993-1996 – లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా
1994 – ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక
1994 – జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సదస్సులో పాల్గొన్నారు.
1994 – లోకమాన్య తిలక్‌ పురస్కారం లభించింది.
1994 – భారతరత్న గోవింద్‌ వల్లభ్‌పంత్‌ పురస్కారం లభించింది.
1996 ఎన్నికల్లో సినీ నటుడు కృష్ణంరాజు కోసం ప్రచారం కోసం నరసాపురం వచ్చారు.
1996 – స్టార్‌ టీవీలో ముఖాముఖి ఇంటర్వ్యూ ఇచ్చారు.
1996 – లోక్‌సభకు ఎన్నిక
1996 మే 13 నుండి – 1996 మే 31 వరకు – భారత ప్రధానిగా

1996-97 – లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునిగా
1997-1998 – ఎక్స్‌టెర్నల్‌ ఎఫైర్స్‌ కమిటీ ఛైర్మన్‌గా
1998 – లోక్‌సభకు ఎన్నిక
1998-1999 – భారత ప్రధానిగా
1998లో – ఐక్యరాజ్యసమితిలో భారతప్రధాని హోదాలో ప్రసంగం
1998 – పార్లమెంటు ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ భాజపాలు చేరువయ్యాయి.
1998 మే 11, 13వ తేదీలలో పోఖ్రాన్‌లో ఐదు అణుపరీక్షల నిర్వహణ
1999 – ఏప్రిల్‌ 17వ తేదీన ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయీ ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వచ్చింది.
1999 – ఫిబ్రవరి 20వ తేదీన ఢిల్లీ – లాహోర్‌ బస్సును ప్రారంభించి తాను స్వయంగా ప్రయాణించారు.
1999 – లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, టీడీపీ కలసి పోటీ చేసాయి.
1999 – లోక్‌సభకు ఎన్నిక
1999 అక్టోబర్‌ 13 నుండి – 2004 మే 13 వరకు – భారత ప్రధానిగా
1999- ఆపరేషన్‌ విజయ్‌ పేరుతో కార్గిల్‌ యుద్ధానికి శ్రీకారం
1999 – కార్గిల్‌ యుద్ధంలో గెలుపు
1999 – పాకిస్థాన్‌కు బస్సులో యాత్ర
1999 – జనవరి 6న స్వర్ణ చతుర్భుతి ప్రారంభం
1999 – ఫిబ్రవరి 21న లాహోర్‌ డిక్లరేషన్‌పై నవాజ్‌ షరీఫ్‌తో కలసి సంతకం
2000 – ఐక్యరాజ్యసమితిలో భారతప్రధాని హోదాలో ప్రసంగం
2000- మార్చిలో తిరుపతిలో నీటి పంపింగ్‌కు సంబంధించి కళ్యాణ గంగ ప్రాజక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసారు.

2000 – ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ చునే హువే భాషణ అనే పుస్తకం విడుదలయ్యింది.
2001 – సర్వశిక్షా అభియాన్‌ పధకానికి శ్రీకారం
2001 – డిసెంబర్‌ 13వ తేదీన లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఐదుగురు తీవ్రవాదులు పార్లమెంటు భవనంపై దాడి
2001 – వేల్యూస్‌, విజన్‌ అండ్‌ వెర్సస్‌ ఆఫ్‌ వాజ్‌పేయీ – ఇండియాస్‌ మేన్‌ ఆఫ్‌ డెస్టినీ అనే పుస్తకాన్ని వాజ్‌పేయీ రాసారు.
2001 – నవాజ్‌ షరీఫ్‌తో ఆగ్రాలో చర్చలు జరిపారు.
2001 – ఐక్యరాజ్యసమితిలో భారతప్రధాని హోదాలో ప్రసంగం
2001 – డిసెంబర్‌ 20వ తేదీన ఆపరేషన్‌ పరాక్రమ్‌ పేరిట ఐదు లక్షల మంది సైనికులను సరిహద్దులో మోహరించి, 5నెలలకు పైగా సైన్యాన్ని సరిహద్దులో ఉంచారు.
2002- ఐక్యరాజ్యసమితిలో భారతప్రధాని హోదాలో ప్రసంగం
2003 – ఐక్యరాజ్యసమితిలో భారతప్రధాని హోదాలో ప్రసంగం
2003 నవాజ్‌ షరీఫ్‌తో మరోమారు చర్చలు జరిపారు.
2004 – చారిత్రక పాకిస్థాన్‌ పర్యటనకు భారత క్రికెట్‌ జట్టు ప్రయాణించే సందర్భంగా ఆటలోనే కాదు, ప్రజల హృదయాలను కూడా గెలుచుకోవాలని సూచించారు.
2004 – లోక్‌సభకు ఎన్నికయినా పార్టీకి మెజార్జీ రానందున ఆయన ప్రతిపక్షనేతగా ఉండేందుకు నిరాకరించి ఆ పదవికి ఎల్‌ కె అద్వానీని నియమించి వాజ్‌పేయీ ఎన్‌ డి ఏ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
2005- ముంబైలో శివాజీపార్కులో ప్రసంగించారు.
2005- క్రియాశీలక రాజకీయాల నుండి వాజ్‌పేయీ తప్పుకున్నారు. నెహ్రూ తరువాత వరుసగా మూడుసార్లు ప్రధాని అయిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు
2006 – జనవరి 14వ తేదీన వేయి పున్నముల పండగ ( సహస్ర చంద్ర దర్శన్‌)

2009- ఈ ఎన్నికల్లో తాను పోటీచేయని కారణంగా తన బదులుగా లాల్‌జీ టాండన్‌ పేరును సూచించారు.
2009 ఫిబ్రవరి 6 : ఊపిరి తిత్తులలో ఇన్‌ఫెక్షన్‌ రావడం వలన ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.
2009 – పక్షవాతం వచ్చింది
2014 – వాజ్‌పేయీ పుట్టిన రోజును ” సుపరిపాలన దినోత్సవం” గా ప్రకటన
2015 – భారత ప్రభుత్వం నుండి భారతరత్న పురస్కారం
2015 – బంగ్లాదేశ్‌ ప్రభుత్వం లిబరేషన్‌ ఆఫ్‌ వార్‌ అవార్డు ప్రకటించింది.
2018 : జూన్‌ 11న ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. 9 వారాల పాటు ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొంది ఆగస్టు 16వ తేదీన సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు కన్నుమూసారు.

పద్యకవిత్వం :
1995లో మేరీ ఇక్యావన్‌ కవితాయే అనే పుస్తకం హిందీలో విడుదలైంది.
1997లో శ్రేష్ట కవితా అనే పుస్తకం ఆవిష్క ృతమైంది.
1999లో నవదిశ అనే పేరుతో ఒక ఆల్బమ్‌ విడుదలైంది.
1999 లో క్యా ఖోయా క్యా పాయా – అటల్‌ బిహారీ వాజ్‌పేయీ వ్యక్తి ఔర్‌ కవిత్వం అనే పుస్తకం విడుదలైంది.
2002లో సంవేదన అనే ఆల్బమ్‌ విడుదలైంది.
2003లో 21 పద్యాలు(పోయమ్స్‌) అనే పుస్తకం ప్రచురించబడింది.

పార్లమెంట్‌ ఎన్నికల్లో వాజ్‌పేయీ:
1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వాజ్‌పేయీ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. భారతీయ జనసంఘ్‌ పార్టీతరపున ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌నియోజక వర్గం నుండి పోటీచేసి విజయాన్ని సాధించారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 118380 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్ధి భారతకాంగ్రెస్‌కు చెందిన హైదర్‌ హుస్సేన్‌కు 108568 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల తరువాత 1962 వరకు బలరాంపూర్‌ ఎంపీగా కొనసాగారు.
1967లో భారతీయ జనసంఘ్‌ పార్టీతరపున ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌్‌ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీచేసి భారత జాతీయ కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఎస్‌.జోషిపై విజయం సాధించి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1971 వరకు బలరాంపూర్‌్‌ ఎంపీగా కొనసాగారు.
1971లో భారతీయ జనసంఘ్‌ పార్టీతరపున గ్వాలియర్‌ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీచేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయికి 188995 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌పార్టీకి చెందిన గౌతమ్‌ శర్మకు 118685 ఓట్లు వచ్చాయి. గ్వాలియర్‌ నియోజకవర్గంలో వాజ్‌పేయీ 1977 వరకు ఎంపీగా కొనసాగారు.
1977లో జనతాపార్టీ తరపున పోటీ చేసి కొత్తఢిల్లీనుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 1,25,936 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌పార్టీకి చెందిన శశిభూషణ్‌కు 48 వేల 750 ఓట్లు వచ్చాయి. కొత్తఢిల్లీ నియోజకవర్గం నుండి వాజ్‌పేయీ 1980 వరకు ఎంపీగా కొనసాగారు.
1980లో భారతీయ జనతాపార్టీ తరపున కొత్తఢిల్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 94098 ఓట్లు రాగా సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌పార్టీకి చెందిన సి ఎం స్టీఫెన్‌కు 89053 ఓట్లు వచ్చాయి. వాజ్‌పేయీ ఢిల్లీ ఎంపీగా 1984 వరకు కొనసాగారు.
1991లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజకవర్గం నుండి పోటీచేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 194886 ఓట్లు రాగా సమీపప్రత్యర్ధి కాంగ్రెస్‌పార్టీకి చెందిన రంజిత్‌ సింగ్‌కు 77583 ఓట్లు వచ్చాయి. లక్నో నియోజకవర్గం ఎంపీగా వాజ్‌పేయీ 1996 వరకు కొనసాగారు.
1996లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజకవర్గం నుండి పోటీచేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి394865 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌పార్టీకి చెందిన రాజ్‌బబ్బర్‌(ప్రముఖ సినీనటుడు)కు 276194 ఓట్లు వచ్చాయి. 1998 వరకు లక్నో ఎంపీగా వాజ్‌పేయీ కొనసాగారు.
1998లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజకవర్గం నుండి పోటీచేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 431738 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ముజఫర్‌ ఆలీకి 215475 ఓట్లు వచ్చాయి. 1999 వరకు లక్నో ఎంపీగా వాజ్‌పేయీ కొనసాగారు.

1999లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజకవర్గం నుండి పోటీచేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 362709 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డాక్టర్‌ కరన్‌సింగ్‌కు 239085 ఓట్లు వచ్చాయి. 2004 వరకు లక్నో ఎంపీగా వాజ్‌పేయీ కొనసాగారు.
2004లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజకవర్గం నుండి పోటీచేసి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 324714 ఓట్లు రాగా ఆయన సమీప ప్రత్యర్ధి సమాజ్‌వాద్‌ పార్టీకి చెందిన మధుగుప్తాకు 106339 ఓట్లు వచ్చాయి. 2009 వరకు లక్నో ఎంపీగా వాజ్‌పేయీ కొనసాగారు.

ఆదర్శప్రాయుడు అటల్‌ : సామాన్య కార్యకర్తగా ఉన్నప్పుడు అటల్‌ ప్రవర్తన ఎలా ఉండేదో, అంతే
చిత్తశుద్ధితో భారతీయ ప్రధానిగా ఉన్నప్పుడు కూడా అంతే చక్కటి వ్యవహారశైలితో అందరినీ ఆకట్టుకున్న అటల్‌ భారతీయుల గుండెల్లో తనదైన సుస్ధిరస్ధానాన్ని సంపాదించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో అనుబంధం : మనరాష్ట్రంలో 1984లో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావుకు వెన్నుదన్నుగా వాజ్‌పేయీ నిలిచారు. ఎన్టీ రామారావు కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసిన సమయంలో విజయవాడలో జరిగిన బహిరంగ సభలో వాజ్‌పేయీ పాల్గొన్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గణపతి సచ్చిదానంత స్వామీజీ దర్శనార్ధం వాజ్‌పేయీ పలుమార్లు విజయవాడ వచ్చారు. మన రాష్ట్రంలో గుంటూరుకు ఆయన పలుమార్లు విచ్చేసారు. గుంటూరులో గల జూపూడి యజ్ఞనారాయణ కుటుంబంతో గల సన్నిహిత సంబంధాల వలన వారికోసం వాజ్‌పేయీ గుంటూరు వచ్చారు. తెనాలిలో నివసించిన టీ రామాచార్యులు కోసం కొన్నిమార్లు వాజ్‌పేయీ తెనాలికి కూడా వచ్చారు. ప్రధానమంత్రి పదవి స్వీకరించిన తరువాత తొలిసారి 1988లో విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.


వెంకయ్యనాయుడితో అనుబంధం : జై ఆంధ్ర ఉద్యమ సమయంలో వాజ్‌పేయీ దృష్టిలో వెంకయ్యనాయుడు పడ్డారు. జనసంఘ్‌ పార్టీకి సంబంధించిన సమావేశం కోసం వాజ్‌పేయీ నెల్లూరు జిల్లాలో పర్యటించిన సమయంలో వాజ్‌పేయీ మాట్లాడేటప్పుడు మైక్‌ను వెంకయ్యనాయుడు పట్టుకున్నారు.

ఇందిరమ్మకు ప్రశంసలు
1971లో లోక్‌సభలో ప్రతిపక్షనాయకునిగా ఉన్న సమయంలో వాజ్‌పేయీ ” ఇందిరాగాంధీని అపర కాళికగా’ అభివర్ణించారు. బంగ్లాదేశ్‌కు భారతప్రభుత్వం స్వాతంత్య్రం ప్రసాదించిన నేపథ్యంలో ఇందిరాగాంధీని మెచ్చుకున్నారు.

సంస్కరణవాది: మనదేశాన్ని ఆధునిక సంస్కరణల దిశగా నడిపించిన సంస్కరణవాది వాజ్‌పేయీ. స్వర్ణభుజి అనే జాతీయ రహదారుల ప్రాజక్టుకు స్వీకారం చుట్టి 2001లో ప్రవేశపెట్టారు.న్యూఢిల్లీ, కలకత్తా, మద్రాసు, బొంబాయి నగరాలను కలుపుతూ 4,6 లేన్ల జాతీయ రహదారి నిర్మించడానికి స్వీకారం చుట్టారు.

డిజిన్విస్ట్‌మెంట్‌ : ప్రభుత్వ రంగ సంస్థల నుండి పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌)కు వాజ్‌పేయీ స్వీకారం చుట్టారు. కేంద్రప్రభుత్వ ఆధీనంలో ఉన్న 32 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు అప్పగించారు.
రాజకీయ రణక్షేత్రంలో వాజ్‌పేయీ 1957లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారిగా వాజ్‌పేయీ పోటీచేసారు. భారతీయ జనసంఘ్‌ అభ్యర్ధిగా వాజ్‌పేయీ ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని లక్నో, మధుర, బలరాంపూర్‌ నియోజక వర్గాల నుండి అంటే మొత్తంగా 3 స్థానాల నుండి పోటీ చేసారు. బలరాంపూర్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి హైదర్‌ హుస్సేన్‌పై గెలిచి లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టారు.

ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 118380 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి హైదర్‌ హుస్సేన్‌కు 108568 ఓట్లు వచ్చాయి. లక్నో నియోజక వర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి పులిన్‌ బిహారీ బెనర్జీ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో పులిన్‌ బిహారీ బెనర్జీకి 69519 ఓట్లు రాగా వాజ్‌పేయీకి 57034 ఓట్లు వచ్చాయి. మధుర నియోజక వర్గంలో ఇండిపెండెంట్‌ అభ్యర్ధి రాజమహేంద్రప్రతాప్‌ చేతిలో ఓటమి చవిచూసారు.
1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి వాజ్‌పేయీ బలరాంపూర్‌ మరియు లక్నో నియోజక వర్గాల నుండి పోటీచేసారు. లక్నోలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి బి కె థావన్‌ చేసిలో ఓడిపోయారు. థావన్‌కు 116637 ఓట్లు రాగా, వాజ్‌పేయీకి 86620 ఓట్లు వచ్చాయి. బలరాంపూర్‌ నియోజక వర్గంలో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి సుభద్రా జోషి చేతిలో ఓడిపోయారు. సుభద్రాజోషికి 102260 ఓట్లు రాగా, వాజ్‌పేయీకి 100208 ఓట్లు వచ్చాయి. అయితే 1962లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1967 ఫిబ్రవరి 25వ తేదీన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు.
1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వాజ్‌పేయీ మారోమారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. బలరాంపూర్‌ నియోజక వర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి సుభద్రాజోషిని ఓడించి లోక్‌సభలో అడుగుపెట్టారు. వాజ్‌పేయీకి 142446 ఓట్లు రాగా, సుభద్రాజోషికి 110704 ఓట్లు వచ్చాయి.
1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గ్వాలియర్‌ నియోజక వర్గం నుండి వాజ్‌పేయీ ఎన్నికయ్యారు. వాజ్‌పేయీకి 188995 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి గౌతమ్‌ శర్మకు 118685 ఓట్లు వచ్చాయి.

1968లో జరిగిన రైలు ప్రమాదంలో భారతీయ జనసంఘ్‌ వ్యవస్ధాపకులు దీన దయాళ్‌ ఉపాధ్యాయ మరణించిన నేపథ్యంలో పార్టీపగ్గాలు వాజ్‌పేయీ చేతికి వచ్చాయి. భారతీయ జనసంఘ్‌ పార్టీకి జాతీయ అధ్యక్షునిగా వాజ్‌పేయీ బాధ్యతలను స్వీకరించారు.
1975లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో వాజ్‌పేయీ అరెస్టయ్యారు.
1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ లోక్‌దళ్‌ పార్టీ తరపున న్యూఢిల్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసిన గెలిచారు. వాజ్‌పేయీకి 125936 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి శశిభూషణ్‌కు 48750 ఓట్లు వచ్చాయి.
1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుండి జనతాపార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి వాజ్‌పేయీ గెలిచారు. వాజ్‌పేయీకి 94098 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌(ఐ) అభ్యర్ధి సి.ఎం.స్టీఫెన్‌కు 89053 ఓట్లు వచ్చాయి.
1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గ్వాలియర్‌ నియోజక వర్గం నుండి భారతీయ జనతాపార్టీ నుండి పోటీచేసారు.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాధవరావు సింధియా చేతిలో ఓటమి పాలయ్యారు. సింధియాకు 3,07,735 ఓట్లు రాగా వాజ్‌పేయీకి 1,32,141 ఓట్లు వచ్చాయి.
1986లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వాజ్‌పేయీ మధ్యప్రదేశ్‌ నుండి ఎన్నికయ్యారు. 1991 జూన్‌ 17వ తేదీన రాజీనామా చేసారు.
1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజక వర్గం నుండి పోటీచేసి గెలిచారు.ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 194886 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి రంజిత్‌ సింగ్‌కు 77583 ఓట్లు వచ్చాయి.
1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజక వర్గం నుండి పోటీచేసి గెలిచారు.ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 394865 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి సమాజ్‌వాద్‌ పార్టీ అభ్యర్ధి రాజ్‌బబ్బర్‌కు 276194 ఓట్లు వచ్చాయి.
1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజక వర్గం నుండి పోటీచేసి గెలిచారు.ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 431738 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి సమాజ్‌వాద్‌ పార్టీ అభ్యర్ధి ముజఫర్‌ ఆలీకి 215475 ఓట్లు వచ్చాయి.
1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజక వర్గం నుండి పోటీచేసి గెలిచారు.ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 362709 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి డాక్టర్‌ కరణ్‌సింగ్‌కు 239085 ఓట్లు వచ్చాయి.

2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ తరపున లక్నో నియోజక వర్గం నుండి పోటీచేసి గెలిచారు.ఈ ఎన్నికల్లో వాజ్‌పేయీకి 324666 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి సమాజ్‌వాదీపార్టీ అభ్యర్ధి మధు గుప్తాకు 106337 ఓట్లు వచ్చాయి.
1977లో కాంగ్రెస్‌పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన కొన్ని రాజకీయపార్టీలు, భారతీయ జన్‌సంఘ్‌ కలసి జనతాపార్టీగా ఆవిర్భవించాయి. 1977లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ విజయపథాన్ని చేరుకోగా మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు ఆ కేబినెట్‌లో వాజ్‌పేయీ విదేశీవ్యవహారాల శాఖామాత్యులుగా ఉన్నారు.

వాజ్‌పేయీ ఇష్టాయిష్టాలు :
వాజ్‌పేయీ ప్రేమకథ : 1942లో గ్వాలియర్‌లో చదువుకునే రోజుల్లో ఆయన రాజ్‌కుమారిని ఇష్టపడ్డారు. కొన్ని కారణాల వల్ల వారి వివాహం జరుగలేదు. తరువాత ఆయన ఎప్పుడూ వివాహం జోలికి పోకుండా జీవితకాలం ఆజన్మబ్రహ్మచారిగా మిగిలిపోయారు.

ప్రాణస్నేహితుడు : హిందూ మహాసభ కార్యకర్త, నేషనల్‌ లా కౌన్సిల్‌ మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది ఎన్‌ ఎం ఘటాటే – వాజ్‌పేయీకి ప్రాణమిత్రుడు.


రాజీవ్‌ గాంధీతో వాజ్‌పేయీ అనుబంధం : 1988లో వాజ్‌పేయీ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న నేపధ్యంలో ఆయన అమెరికాలో చికిత్స చేయించుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజీవ్‌ గాంధీ ” ఐక్యరాజ్య సమితి” సమావేశాల్లో పాల్గొనే బృందంలో వాజ్‌పేయీ పేరును కలిపి ఆ సమావేశాల తరువాత చికిత్స చేయించుకోమని సూచించారు.

అక్షర యోధుడు వాజ్‌పేయీ : వాజ్‌పేయీకి చిన్ననాటి నుండి రచనా వ్యాసంగం పట్ల మక్కువ. మేరీ సంసదీయ యాత్ర ( పార్లమెంట్‌లో నా ప్రస్ధానం) అనే పేరుతో నాలుగు సంపుటాలు విడుదల చేసారు. 1957-1995 మధ్యకాలంలో పార్లమెంట్‌లో చేసిన ప్రసంగాలను మూడు సంపుటాలుగా విడుదల చేసారు. జనసంఘ్‌ ఔర్‌ ముసల్మాన్‌ అనే పుస్తకాన్ని కూడా రాసారు.1961లో నేషనల్‌ ఇంటిగ్రేషన్‌, 1977లో ఇండియన్‌ ఫారెన్‌ పాలసీ, అదే ఏడాది డైనమిక్స్‌ ఆఫ్‌ ఓపెన్‌ సొసైటీ, 1981లో అస్సాం సమస్యపై, 1992లో అటల్‌ బిహారీ వాజ్‌మే తినాదశక, 1996లో కుచ్‌ లిఖా కుచ్‌ భాషణ్‌, అదే ఏడాది సెక్యులర్‌ వాదంపై ఒక పుస్తకం, 1997లో రాజనీత్‌ కే రఫ్తిల్‌ రహేం, 1998లో బ్యాక్‌ టు స్కే ్వర్‌ వన్‌, 1999లో డిసీవ్‌ డేస్‌, అదే ఏడాది శక్తి సే శాంతి, 2000లో వాజ్‌పేయీకే చున్‌హువే భాషణ్‌, 2001లో ఇండియాస్‌ మేన్‌ ఆఫ్‌ డెస్టినీ, 2003లో ఇండియాస్‌ పెర్‌స్పెక్టివ్స్‌ ఆన్‌ ఏషియాన్‌ అనే రచనలు చేసారు.


పుట్టపర్తి సత్యసాయిబాబాతో అనుబంధం : 1965 నుండి సత్యసాయితో వాజ్‌పేయీకి అనుబంధం కొనసాగింది. ప్రధానిగా ఉన్న సమయంలోను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాజ్‌పేయీ : సత్యసాయి దర్శనార్ధం పుట్టపర్తి విచ్చేసారు. 1999లో ఒకసారి చంద్రబాబుతో కలసి బాబాను దర్శించుకున్నారు. 2001 జనవరి 18న సత్యసాయి బెంగుళూరులో నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీస్‌ ఆసుపత్రిని వాజ్‌పేయీ ప్రారంభించారు. చివరిగా 2004లో బాబాను దర్శించుకున్నారు.

దేవుని సన్నిధికి : బహుభాషా ప్రావీణ్య కవిపండిత పరిపోషకునిగా, అనర్గళ అమోఘ వాక్పటిమా భావోద్విగ్న భవసార భావుకునిగా, జాతీయ తత్త్వజ్ఞునిగా, రాష్ట్ర ధర్మ ప్రవర్ధకునిగా ఒక వెలుగు వెలిగిన మానవతా విలువల మహోత్క ృష్ట శిఖరం వాజ్‌పేయీ 2018 ఆగస్టు 16వ తేదీన కన్నుమూసారు. ఆగస్టు 23వ తేదీన వాజ్‌పేయీ అస్థికలను విజయవాడ భవానీపురంలోని పున్నమి ఘాట్‌ వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసారు. మన రాష్ట్రంతో పాటు తమిళనాడులో 6 చోట్ల, మధ్యప్రదేశ్‌లో 10 చోట్ల, గోవాలో రెండు చోట్ల, కర్ణాటకలో 8 చోట్ల, తెలంగాణాలో రెండు చోట్ల అస్థికలను వివిధ నదుల్లో కలిపారు.

స్మారకాలు : వాజ్‌పేయీ స్మారకార్ధం పలు నిర్ణయాలు తీసుకున్నారు.ఛత్తీస్‌గఢ్‌ నూతన రాజధాని నయా రాయ్‌పూర్‌కు అటల్‌ నగర్‌ అని పేరుపెట్టాలని ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. నయా రాయ్‌పూర్‌లోని నేషనల్‌ పార్క్‌కు, బిలాస్‌పూర్‌ యూనివర్సిటీకి, రాజ్‌నందగావ్‌ వైద్య కళాశాలకు వాజ్‌పేయీ పేరు పెట్టాలని నిర్ణయించారు. ఉత్తరాఖండ్‌లో రిషీకేశ్‌ లోని ఎయిమ్స్‌ ఆడిటోరియంకు, బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ మార్గంకు, మహారాష్ట్ర ప్రభుత్వ స్టడీ సర్కిల్‌కు వాజ్‌పేయీ పేరు పెట్టేందుకు నిర్ణయించారు. వాజ్‌పేయీ పేరిట 13 యూనివర్సిటీల్లో అధ్యయన పీఠాలను ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2015 డిసెంబర్‌ 24వ తేదీన మై స్టాంప్‌ పేరిట ఒక స్టాంప్‌ను కూడా విడుదల చేసారు. 2016 డిసెంబర్‌ 20వ తేదీన వాజ్‌పేయీపై విజయనగరం విజయనగరంకు చెందిన రచయిత సముద్రాల గురుప్రసాద్‌ రాసిన భారతరత్నం వాజ్‌పేయీ పుస్తకాన్ని అప్పటి కేంద్ర పౌరవిమానయానశాఖామాత్యులు శ్రీ పూసపాటి అశోక్‌గజపతిరాజు గారు ఆవిష్కరించారు.

(Visited 650 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.