మహా తత్త్వవేత్త జిడ్డుకృష్ణమూర్తి

(17న జిడ్డు కృష్ణమూర్తి వర్ధంతి సందర్భంగా)

మహా తత్త్వవేత్త జిడ్డుకృష్ణమూర్తి 1895 మే 11 వ తేదీన రాత్రి 12 గంటల 30 నిమిషాలకు మదనపల్లిలో జన్మించారు.తండ్రి జిడ్డు నారాయణయ్య, తల్లి సంజీవమ్మ. తండ్రి రెవెన్యూ శాఖలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేసేవారు. ఆ దంపతులకు 8వ సంతానంగా కృష్ణమూర్తి జన్మించారు. 1897 లో తండ్రికి కడప బదిలీ అయ్యింది. అక్కడ కృష్ణమూర్తికి మలేరియా వచ్చి తగ్గినప్పటికీ శారీరకంగా చాలా బలహీనపడ్డారు.తల్లి సంజీవమ్మ చిన్న వయస్సులో కృష్ణమూర్తికి రామాయణ,భారతాలతో పాటుగా అనిబిసెంట్‌ గురించి గూడా చెప్పేవారు.1901 లో నారాయణయ్యకు కదిరి బదిలీ అయ్యింది.అక్కడే కృష్ణమూర్తికి అక్షరాభ్యాసం, గాయత్రీ మంత్రోపదేశం, ఉపనయనం జరిగాయి.1903 లో తండ్రికి మరలా కడప బదిలీ అయ్యింది.1904 లో 20 ఏళ్ళ వయస్సుగల సోదరి మరణించిన తరువాత ఆమె ఆత్మతో తల్లి తరచుగా మాట్లాడడం కృష్ణమూర్తి చూసేవాడట?ఒక సారి సోదరి ఆత్మతో కృష్ణమూర్తి కూడా మాట్లాడేలా తల్లి చేసిందట?1905 లో సంజీవమ్మ మరణించింది.1907 ఫిబ్రవరి నెలలో ఆల్కాట్‌ మరణించిన తరువాత వారి ఆదేశానుసారము అనిబిసెంట్‌ దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలైంది.1907 లో తండ్రి రిటైరయ్యిన తరువాత దివ్యజ్ఞాన సమాజంలో చేరి సేవలందించేందుకు వ్రాత పూర్వకంగా దరఖాస్తు చేసుకున్నందున 1909 జనవరి 23వ తేదీన నారాయణయ్యకు దివ్యజ్ఞాన సమాజంలో చేరేందుకు అవకాశం లభించింది.అనిబిసెంట్‌ అమెరికాలో చికాగోలో మాట్లాడుతూ జగద్గురువు పశ్చిమ దేశాల్లో అవతరించనున్నట్లు చెప్పారు. ఒక సారి లెడ్‌బీటర్‌ సముద్ర స్నానం చేస్తూ ఆడుకుంటున్న కృష్ణమూర్తిని యోగదృష్టితో చూసి అతనిలో లోకగురువును సందర్శించి ఆ విషయాన్ని ఎర్నెస్ట్‌వుడ్‌కు చెప్పాడు. ఆ తరువాత కృష్ణమూర్తే శ్రీకృష్ణుడు, జీసస్‌ అడుగుజాడల్లో వచ్చిన జగద్గురువని, మైత్రేయుని 3వ అవతారమని ఒక ఉత్తరాన్ని లెడ్‌ బీటర్‌ – అనిబిసెంట్‌కు రాసాడు. అనిబిసెంట్‌ ఆజ్ఞానుసారం కృష్ణమూర్తిని అతని సోదరుడు నిత్యానందంతో సహా లెడ్‌బీటర్‌ సంరక్షణలో ఉంచడం జరిగింది.

1909 నవంబర్‌ 27వ తేదీన మద్రాసుకు వచ్చిన అనిబిసెంట్‌కు తొలిసారిగా కృష్ణమూర్తిని లెడ్‌బీటర్‌ పరిచయంచేసారు. లెడ్‌బీటర్‌ కృష్ణమూర్తి గత జన్మలపై పరిశోధనలు జరిపాడు.గత 28 జన్మలను లెడ్‌బీటర్‌, 2 జన్మలను అనిబిసెంట్‌ పరిశోధన చేసారు. ఆ ఫలితంగా కృష్ణమూర్తి కృత్తికా నక్షత్రమునకు చెందిన వాడని, గత30 జన్మలలో 11 జన్మలు స్త్రీ గాను, 19 జన్మలు పురుషుడుగాను జన్మించినట్లు తెలిసింది.ఆ 30 అవతారాల సమాచారాన్ని దివ్యజ్ఞాన సమాజమునకు చెందిన ”ధియోసఫీ ” లో ప్రచురించారు. తొలి అవతారం క్రీస్తు పూర్వం 11622 అని చివరి అవతారం క్రీస్తు శకం 624 అని అందులో ప్రచురించారు.

1910 జనవరి నెలలో కృష్ణమూర్తి – అనిబిసెంట్‌కు ఒక ఉత్తరం రాస్తూ తనకు తల్లి లేని లోటు తీర్చినందున ఆమెను అమ్మా అని పిలిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.ఆమె అందుకు అంగీకరించారు.11, 12 వ తేదీలలో కృష్ణమూర్తికి దీక్ష ఇవ్వబడింది.ఆ రాత్రి ఆయన సూక్ష్మ శరీరంలో ”కుతుమి ” నివాసానికి వెళ్ళి, మాస్టర్‌ మోర్య, మాస్టర్‌ జ్వాలకుల్‌తో మాట్లాడారు.వారితో కలిసి మైత్రేయుని వద్దకు కూడా వెళ్ళారు.సిద్ధపురుషుల అనుమతితో మైత్రేయులు కృష్ణమూర్తి తలపై చేయి వేసి ఆశీర్వదించారు.మాస్టర్‌ కుతుమి ఉపదేశసారాంశాన్ని కృష్ణమూర్తి ” ఎట్‌ ది ఫీట్‌ ఆఫ్‌ ది మాస్టర్‌ ” ( పరమ గురు చరణ సన్నిధి ) అనే పేరిట తయారు చేయగా 1916 డిసెంబర్‌లో అచ్చు వేయబడింది.1911 జనవరి 11 వ తేదీన జార్జి అరండేల్‌ ఆధ్వర్యంలో బెనారస్‌లో ” ది ఆర్డర్‌ ఆఫ్‌ రైజింగ్‌ సన్‌” (తారక సంఘం) అనేది స్ధాపించబడింది.ఆ సంఘానికి కృష్ణమూర్తి అధిపతిగాను, జార్జి అరండేల్‌ కార్యదర్శిగాను వ్యవహరించేవారు.ఆ సంస్ధ తరపున ” హెరాల్డ్‌ ఆఫ్‌ స్టార్‌” అనే త్రైమాసిక పత్రికను స్ధాపించి దానికి కృష్ణమూర్తిని నామమాత్రపు ఎడిటర్‌గా నియమించారు.ఆ పత్రిక తొలి సంచిక 1911 జనవరిలో వెలువడింది.

ఆ ఏడాది ఫిబ్రవరిలో కృష్ణమూర్తి – అనిబిసెంట్‌తో బర్మాకు వెళ్ళారు. కృష్ణమూర్తి దివ్యజ్ఞాన సమాజంలో చేరేనాటికి 16 వేల మంది మాత్రమేసభ్యులుండేవారు. కృష్ణమూర్తి బోధనల వలన 1928 నాటికి సభ్యుల సంఖ్య 40 వేల కు పెరిగింది.1911 మే 5 వ తేదీన లండన్‌లో చారింగ్‌ అనే ప్రాంతంలో కృష్ణమూర్తికి లేడీ ఎమిలీతో పరిచయం ఏర్పడింది.మే 8వ తేదీన బహిరంగ సభలో (లండన్‌లో) తొలిసారిగా కృష్ణమూర్తి ఉపన్యసించారు.కృష్ణమూర్తికి రెండవ జ్ఞాన దీక్ష ” సిసిలీ ” లో ” టార్మినా”లో లభించింది.కొంతకాలం కృష్ణమూర్తి ” వింబుల్డన్‌” లో ” మిస్‌ డాడ్జి ” ఇంట్లో ఉన్నారు. కృష్ణమూర్తి ” హాలెండ్‌” లో ఉన్న రోజుల్లో ఆయనకు ” హెలెన్‌, జార్జ్‌ ,రూత్‌, రోజలిండ్‌ ” అనే అమ్మాయిలు పరిచయం అయ్యారు. 1917 లో కృష్ణమూర్తి తమ్ముడు నిత్యానందంతో కలిసి మెట్రిక్యులేషన్‌ పరీక్షలకు హాజరుకాగా పరీక్ష తప్పాడు. ఎన్నిసార్లు హాజరైనా పరీక్షలు తప్పుతుండడంతో అనిబిసెంట్‌ కృష్ణమూర్తిని పారిస్‌ పంపించారు. విద్యాభ్యాసానంతరం కృష్ణమూర్తి 1921 ఫిబ్రవరి 3వ తేదీన ఇండియాకు తిరిగి వచ్చారు.

1923 లో ” ఒహైల్‌ ” లో ”బ్రదర్స్‌ ట్రస్ట్‌” వారు ”పైన్‌” కాటేజీ వద్ద ఒక ఇల్లు, ఆరు ఎకరాల భూమి కృష్ణమూర్తికోసం కొనిపెట్టారు. ”హాలెండ్‌” దేశానికి చెందిన ” బెరాన్‌ వాన్‌ పల్లార్‌డల్‌ ” అనే వ్యక్తి 5 వేల ఎకరాల భూమిని, ఒక పెద్ద రాజభవనాన్ని కృష్ణమూర్తికి రాసి ఇచ్చాడు. అప్పుడు కృష్ణమూర్తి దానిని ఒక ట్రస్ట్‌గా ఏర్పాటు చేసి ” ది ఆర్డర్‌ ఆఫ్‌ ది స్టార్‌ ఇన్‌ ది ఈస్ట్‌ ” అనే ప్రపంచ సంస్ధ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసారు. ఆ భవనాన్ని ” ఎర్డే ” భవనం అని పిలుస్తారు.1925 జనవరి లో మదనపల్లికి 18 కిలోమీటర్ల దూరంలో 2 వేల 5వందల అడుగుల ఎత్తులో గల ఋషివ్యాలీలో ఒక ట్రస్టును , ఆ ట్రస్టు ఆధ్వర్యంలో ఒక స్కూలును ఏర్పాటు చేసారు. 1925 నవంబర్‌ 8వ తేదీన తన సోదరుడు నిత్యానందం అనారోగ్యంతో మరణించడం కృష్ణమూర్తిని కలచివేసింది.1925 డిసెంబర్‌ 28వ తేదీన కృష్ణమూర్తి తో మైత్రేయులు మరో సారి మాట్లాడారు.

1929 జనవరి 16వ తేదీన అడయార్‌లో స్టార్‌ సంస్ధ కేంద్ర కార్యాలయాన్ని తెరచారు. 1930 లో కృష్ణమూర్తి దివ్యజ్ఞాన సమాజం నుండి తప్పుకున్నారు. 1933 లో అనిబిసెంట్‌కు అనారోగ్యంగా ఉందని తెలిసి ఆమెను కృష్ణమూర్తి కలసి పరామర్శించారు. అయితే అదే ఏడాది సెప్టెంబర్‌ 20వ తేదీన అనిబిసెంట్‌ మరణించారు.అనిబిసెంట్‌ మరణానంతరం దివ్యజ్ఞాన సమాజానికి జార్జి అరండేల్‌ అధ్యక్షులయ్యారు. ఆ సమయంలో కృష్ణమూర్తి మద్రాసులో వసంతవిహార్‌లో ఉండేవారు.1934 మార్చి 1 వ తేదీన లెడ్‌ బీటర్‌ ” సిడ్నీలోని పెర్త్‌ ” అనే ప్రాంతంలో తుదిశ్వాసను విడిచారు.1937 లో కృష్ణమూర్తి కొంతకాలం రోమ్‌లో గడిపారు.1945 లో జార్జి అరండేల్‌ మరణానంతరం దివ్యజ్ఞాన సమాజానికి జినరాజదాస అధ్యక్షులుగా నియమితులయ్యారు.1946 లో కృష్ణమూర్తి తన స్నేహితులతో కలిసి ” ఒహై ” లో కలసి ” హ్యాపీ వ్యాలీ స్కూల్‌ ”ను తెరిచారు.1948 లో కృష్ణమూర్తి ఉపన్యాసాలు బొంబాయిలో ఏర్పాటు చేయబడ్డాయి.1950 జనవరిలో కొలంబోలోను, 1951 లో లండన్‌లోను, 1953 లో అమెరికాలోను కృష్ణమూర్తి పర్యటించారు.” ఎడ్యుకేషన్‌ అండ్‌ ది సిగ్నిఫికెన్స్‌ ఆఫ్‌ లైఫ్‌ ” అనే పుస్తకం ఆ ఏడాది ముద్రించబడింది.1953 లో ఋషి వ్యాలీలో మరో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసారు.1954 లో లండన్‌ వెళ్ళి లేడీ ఎమిలీని కృష్ణమూర్తి కలుసుకున్నారు. 1957 లో లేడీ ఎమిలీ ఆత్మకధ ” కేండిల్‌ ఇన్‌ ది సన్‌ ” ముద్రించబడింది.

1955 లో ఒక నెల రోజుల పాటు హిమాలయ ప్రాంతమైన ” రాణికెత్‌” లో కృష్ణమూర్తి గడిపారు.1960 ఆగస్టు 13వ తేదీన వినోభాభావేను కృష్ణమూర్తి కలుసుకున్నారు. 1964 జనవరి 3వ తేదీన లేడీ ఎమిలీ మరణించింది.1966 లో ”దేశికాచారి ” అనే భారతీయుడు కృష్ణమూర్తికి యోగాను నేర్పేందుకు యూరప్‌ వెళ్ళారు.కృష్ణమూర్తి ఫౌండేషన్స్‌ – 1968 లో ఇంగ్లాండులోను, 1969 లో అమెరికాలోను, 1970 లో ఇండియాలోను స్ధాపించబడ్డాయి.1971 లో కొంతకాలం కృష్ణమూర్తి రోమ్‌లో ఉన్నారు. 1973 జూన్‌లో కృష్ణమూర్తి ఫౌండేషన్‌ తొలి అంతర్జాతీయ సమావేశం ”బ్రాక్‌వుడ్‌” లో జరిగింది.1950 లో పుపుల్‌ జయకర్‌ ఇంట్లో ఇందిరాగాంధీ కృష్ణమూర్తిని తొలిసారి కలిసారు.ఆ తరువాత ఆమె తన సమస్యలను పలు మార్లు ఆయనతో చర్చించారు.1986 ఫిబ్రవరి 17వ తేదీన రాత్రి 12 గంటల 30 నిమిషాలకు కృష్ణమూర్తి తుది శ్వాస విడిచారు.

(Visited 38 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *