నేడు కోవిడ్ వాక్సిన్ ట్రైయల్ రన్


విశాఖపట్నం: ‘’కోవిడ్-19 వాక్సిన్ ట్రైయల్ రన్’’ను శనివారం జిల్లాలో చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో శుక్రవారం నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటి జిల్లా కలెక్టరు అధ్యక్షతన నిర్వహించ బడింది. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ కరోనా వాక్సిన్ వేయుటకు ముందుగా విధి విధానాలు పక్కాగా నిర్వహించేందుకు ట్రైయల్ రన్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రైయల్ రన్ ను శనివారం నగరంలో ఈ.ఎన్.టి. ఆసుపత్రి, ప్రథమ ఆసుపత్రి, ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం, సింహాచలంలలో నిర్వహించేందుకు ఎంపిక చేశామన్నారు. ట్రయిల్ రన్ ను దేశంలో నాలుగు రాష్ట్రాలలో ఇప్పటికే చేపట్టారని, మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో నిర్వహించినట్లు తెలిపారు. త్వరలోనే దేశంలో కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉన్నందున ఇటువంటి ట్రయిల్ రన్ నిర్వహించవలసిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు చెప్పారు. వాక్సిన్ ను రవాణా చేసే విధానం, వాక్సిన్ వేసే ప్రదేశం వద్ద వాటిని భద్రపరిచే విధానం, బందోబస్తు విధానం పక్కాగా నిర్వహించాలని అన్నారు. వాక్సిన్ వేసే కేంద్రంలో వేచి ఉండేదుకు, వాక్సిన్ వేసేందుకు, పరిశీలనకు మూడు గదులు ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు చేసేది కేవలం ‘’డ్రై రన్’’ మాత్రమేనని, అంటే ఎటువంటి మందులను లేదా ఇంజెక్షన్లను వేయరని, కేవలం మాక్ డ్రిల్ గా మాత్రమే చేపట్టినట్లు చెప్పారు ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వాక్సిన్ కేంద్రం వద్ద ఎన్నికల పోలింగు కేంద్రం వద్ద విధంగానే అన్ని ఏర్పాట్లు పక్కాగా జరగాలన్నారు.వాక్సిన్ కేంద్రం వద్దకు జాబితాలో ఉన్న వ్యక్తులను మాత్రమే అనుమతించడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ తీసుకునే లబ్ధిదారులుగా వైద్య సిబ్బందే ఉంటారని చెప్పారు. వారిని వాక్సిన్ అనంతరం పరిశీలన (అబ్జర్వేషన్) గదిలో ఉంచి కనీసం 30 నిమిషాలు పరిశీలించడం జరుగుతుందన్నారు. వాక్సిన్ కేంద్రం వద్ద అంబులెన్సు ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 9 గంటల నుండి వాక్సిన్ ట్రైయల్ రన్ ప్రారంభం అవుతుందని, ప్రతి కేంద్రంలో 25 మందికి వ్యాక్సిన్ వేసే విధంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. వాక్సిన్ కేంద్రంలో బయో వేస్ట్ డిస్పోజ్ చేయుటకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు.

వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ముందుగా హెల్త్ కేర్ వర్కర్స్ కు వ్యాక్సిన్ను వేస్తారని, తరువాత ఫ్రెంట్ లైన్ వర్కర్ లైన రెవిన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్య, మున్సిపల్ సిబ్బంది అంగనవాడి కార్యకర్తలకు వేయడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా మిగిలిన శాఖలలో వున్న ఉద్యోగులలో తీవ్ర అనారోగ్య సమస్యలు (కోమోర్బిడిటీస్) కలిగి ఉన్నవారికి వేయడం జరుగుతుందన్నారు. మండలాన్ని ఒక యూనిట్ గా తీసుకుని ప్రజలకు వ్యాక్సిన్ వేసే అవకాశం ఉన్నందున మండల తాసిల్దార్ లకు ఈ విషయమై పూర్తి అవగాహన కల్పించాలని సబ్ కలెక్టర్ రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ సృజన జాయింట్ కలెక్టర్లు ఎమ్.వేణుగోపాల రెడ్డి, పి.అరుణ్ బాబు, పాడేరు ఐటీడీఏ పీవో ఎస్.వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్.మౌర్య, డిఆర్వో ఏ.ప్రసాద్, ఆర్డీవోలు కె.పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీశివజ్యోతి, ఏఎంసి ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ సూర్యనారాయణ, డి.ఆర్.డి.ఏ. పి.డి వి. విశ్వేశ్వరరావు జీవీఎంసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శాస్త్రి, డాక్టర్ దేవిమాధవి, యునిసెఫ్ ప్రతినిధి, యు.ఎన్.డి.పి. ప్రతినిధి పావని, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

(Visited 14 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.