“భూ’చోళ్ల ఆట కట్టిస్తాం
-
గీతం స్థలాలు స్వాధీనం సక్రమమే
ప్రభుత్వ భూములపై ఎవరు కన్నేసినా తాట తీస్తాం
అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆక్రమించుకుని తమ ఆధీనంలో పెట్టుకున్న రూ.800 కోట్ల పైచిలుకు విలువైన, 40 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ భూమిని చట్టబద్ధంగా రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు . ప్రభుత్వ భూముల్ని కాపాడాలనే లక్ష్యంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక పాలసీగా ఆక్రమణలను తొలగిస్తున్నాం. విశాఖపట్నం లాంటి మహానగరంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏడాదికాలంగా ఆక్రమణదారుల చెరలో ఉన్న ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిపై గీతం యాజమాన్యం కోర్టుకు వెళ్ళితే… కోర్టు తాత్కాలికంగా ఒక ఆర్డర్ ను ఇస్తే.. దానిని కూడా వక్రీకరించి టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా ఇదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందన్నట్టు ప్రచారం చేస్తున్నాయి.
అలా ఎక్కడా చెప్పలేదు
గీతం యాజమాన్యం వేసిన రిట్ పిటీషన్ లో.. ఎక్కడా అది తమకు సంబంధించిన భూమి అనిగానీ, దానిపై తమకు హక్కు ఉందనిగానీ చెప్పలేదు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లో ఆ సంస్థకు చెందిన బిల్డింగులు, వారి పరధిలో వారికి హక్కు ఉన్న బిల్డింగులను కూల్చవద్దని చెప్పారు. అంతేతప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని కట్టినటువంటి కట్టడాలను కూల్చవద్దని ఎక్కడా చెప్పలేదు. 30వ తేదీ వరకు గీతం కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ లు కూల్చవద్దని, గీతం యాజమాన్యం కూడా అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయవద్దని మాత్రమే ఉంది. ప్రభుత్వ చర్యను హైకోర్టు ఎక్కడా తప్పుబట్టలేదు. దీనిని టీడీపీ తమకు ఇష్టం వచ్చినట్లు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటుందని అమర్నాథ్ పేర్కొన్నారు.
అది వారి భూమి కాదు…
గీతం యూనివర్సిటీ యాజమాన్యమే 2020, ఆగష్టు 3వ తారీఖున.. ఎండాడ గ్రామంలో వారి ఆధీనంలో ఉన్న 43 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎలియనేషన్ కోసం గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.. దీని అర్థం ఏమిటి, అది వారి భూమి కాదనే కదా.. ఇంతకంటే రుజువు ఏం కావాలి? ప్రభుత్వ భూమిని వారి స్వాధీనంలో పెట్టుకుని, ఎలియనేషన్ లో మీరు ఎంత ఫిక్స్ చేస్తే అంత డబ్బు కడతామని లేఖరాసిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడానికి ఇంతకంటే రుజువు ఏం కావాలి? గీతం విశ్వవిద్యాలయం అవసరాల కోసం గతంలో ప్రభుత్వాలు 71 ఎకరాలు కేవలం రూ.18వేలుకు ఇవ్వడం జరిగింది. ఆ డబ్భై ఎకరాలకు ఆనుకుని, వారి సొంత జిరాయితీ పట్టా భూమి 30ఎకరాలు ఉన్నప్పటికీ దాన్ని వారి అవసరాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపార అవసరాల కోసం ఉంచుకుని, ప్రభుత్వ భూమిని అప్పనంగా ఆక్రమించుకుని, కొట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. 1998లోనే గీతం యాజమాన్యానికి 71 ఎకరాలు అవసరం లేదు, అందులో 22 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయండని సీసీఎల్ఏ లెటర్ పెడితే.. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 15రోజుల తర్వాత సీసీఎల్ఏ ఇచ్చిన ఆర్డర్ ను మళ్లీ తిరిగి రీబ్యాక్ చేశారని అమర్నాథ్ అన్నారు.
భూదాహం..
విద్యా దాహం కన్నా.. భూ దాహమే ఎక్కువ… అన్న చందంగా గీతం యూనివర్సిటీ యాజమాన్యం తీరు ఉంది అనే మాట నిన్న కోర్టు ఆర్డర్ ఇచ్చే సమయంలో జరిగిన వాదనల్లో కూడా చర్చకు వచ్చింది. గీతం యాజమాన్యం వేసిన రిట్ పిటీషన్ వాదనల సమయంలో న్యాయమూర్తులు ఏమన్నారో.. వారి అడ్వకేట్ లనే అడిగితే నిజాలు చెబుతారు. గీతం భూ ఆక్రమణల గురించి మాట్లాడితే.. వేల మందికి విద్యను అందిస్తున్నాం అంటున్నారు, ఒక పేదవాడికి ఏరోజైనా ఆ విశ్వవిద్యాలయంలో ఫ్రీగా సీటు ఇచ్చారా..? పేదవాడు అక్కడ చదువుకునే అవకాశం కల్పించారా? అని గుడివాడ ప్రశ్నించారు.
బాబు డ్రామాలెన్నో..
ఎలియనేషన్ కోసం అనేక సంవత్సరాలుగా దరఖాస్తులు పెడుతున్నామని గీతం యాజమాన్యం రిట్ పిటిషన్ లో చెప్పారు, 2014లో కూడా దరఖాస్తు పెట్టారు. అప్పుడు ఒక కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించిన సబ్జెక్టు కేబినెట్ అప్రూవల్ కు వెళ్లినపుడు ఇప్పటి ప్రతిపక్ష నేత, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, ఇది తన కుటుంబానికి సంబంధించిన వ్యవహారం, వారితో నాకు చుట్టరికాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాల భూమి ఎలియనేషన్ చెయ్యాలంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేబినెట్ సమావేశంలో చేయడం సమంజసం కాదు, ఈ కేబినెట్ సమావేశం నుంచి బయటకు వెళ్తున్నాను, కేబినెట్ సహచరులు అంతా కూడా దీనిపై నిర్ణయం తీసుకోండని చంద్రబాబు బయటకు వెళ్లిపోయారని గుడివార్ అమర్నాథ్ గుర్తు చేశారు. గ్యారెంటీగా చంద్రబాబే చెప్పి ఉంటారు, ఇప్పటికే గీతం యూనివర్సిటీకి ఇచ్చిన ప్రభుత్వ భూమి ఎక్కువైంది దాన్ని పక్కన పెట్టేయండని, ఆ కేబినెట్ సమావేశంలో మంత్రులంతా మాట్లాడుకుని, ఆ రకంగానే రిజెక్ట్ చేశారు, ఫైల్ వెనెక్కి వచ్చేసింది. నిజంగా వారు యూనివర్సిటీని విస్తరించాలనుకుంటే.. మరో 30 ఎకరాలు వారి సొంత భూమి పక్కనే ఉంది, దాన్ని మాత్రం వాడుకోకూడదు, ప్రభుత్వ భూమి మాత్రం కొట్టేయాలన్నది వారి విధానంలా ఉంది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనించాలన్నారు.
భూములు కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది
గీతం యూనివర్సిటీ ఆక్రమించిన 40 ఎకరాల పైచిలుకు భూమిని ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకుంది. ఈ భూమిని ప్రభుత్వ అవసరాలకు ప్రజల ఆస్తిగా వినియోగించే కార్యక్రమం చేస్తాం, ఆ సంస్థ పరిధిలో ఉన్నటువంటి భూములే కాదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రిజగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
అంతా అవినీతే…
చంద్రబాబు తెలుగుదేశం పార్టీ పేరుతో రాజకీయంగా ఒక అవినీతి విశ్వవిద్యాలయం, ఒక అక్రమాల విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నాడు. వారు చేసే దందాలు, భూ ఆక్రమణలు, అవినీతి ఎదుటివారు కూడా చేస్తారేమో అన్నది వారి ఆలోచన. చంద్రబాబు, తన అవినీతి, అక్రమాల సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి మాత్రమే తాపత్రయపడుతున్నారే తప్ప ప్రభుత్వ ఆస్తులు, ప్రజల తాలుకు సంపద ఏమైపోయినా ఫర్వాలేదు అన్న పద్ధతిలో ఉన్నాడు. చంద్రబాబుకు, ఆయన కొడుక్కి, ఆ పార్టీ నాయకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, గీతం యూనివర్సిటీ ఆక్రమించుకున్న 40 ఎకరాల ప్రభుత్వ భూమి సక్రమమే అని ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. చెప్పలేరు! ఎందుకంటే అది ప్రభుత్వ భూమి అని, కొన్ని వందల కోట్ల విలువైన ప్రజల ఆస్తి అని మీకూ తెలుసు, అయినా సిగ్గు, శరం లేకుండా రాజకీయం చేస్తున్నారని అమర్ దుమ్మెత్తి పోశారు.