ప్రియమైన చెల్లెమ్మ దేవికి నీ అన్నయ్య రాస్తున్న ఉత్తరం….

నువ్వూ నేనూ                                           
ఒకే కొమ్మకు పూచిన
రెండు పువ్వులం!!

నువ్వెంతో ఇష్టమూ
నువ్వంటే ప్రేమానూ

నువ్వు పెళ్ళి చేసుకుని మెట్టినింటికి
వెళ్ళిపోతేనేం
నువ్విక్కడే మన ఇంటే ఉన్నట్లు అన్పిస్తుంటుంది

కానీ
ఒక్కొక్కప్పుడు నేనిక్కడ
ఒక్కడినే ఉన్నట్టనిపించి
ఎంత బాధ వేస్తుందో
మనసంతా బరువెక్కుతుంది
అయినా
నువ్విక్కడ లేకుండా లేవు
నీ తలపేగా సదా….

నువ్వేదన్నా చేస్తే                                               
ఎందుకలా చేసావని
అడగడానికి
నేనక్కడ లేకపోవచ్చు కానీ
నా వరకూ వస్తే
చెవులు మెలేసీ
మరీ అడుగుతాను….

చిన్నప్పుడు
మన ఇంటి పెరట్లో
వేప చెట్టు
మామిడి చెట్టు కింద
ఎంతలా ఆడుకునే వాళ్ళమో గుర్తుందా??

ఒకరోజు దొంగా పోలీస్ ఆట
మరో రోజు పరుగు పందెం
ఇంకో రోజు స్కిప్పింగ్
ఇలా ఎన్నెన్ని ఆటలో….

నీకు గోలీలాట సరిగ్గా వచ్చేది కాదు
అప్పుడు నీకో మొట్టికాయ వేసి
ఎలా ఆడాలో చెప్పేవాడిని…                                     

కానీ మొట్టికాయకు
నువ్వేడిస్తే నాకూ ఏడుపు వచ్చేది
నిన్నెందుకు కొట్టేనా అని…

మన మధ్య ఎప్పుడూ నవ్వులే
కొనసాగాలి
ఎంతెంత దూరాన ఉన్నాసరే,
అంతేతప్ప కన్నీళ్ళు కావు!!

నువ్వడిగిందెప్పుడూ
కాదనక చేసిపెట్టడంలో
నాకెంత ఆనందమో తెలుసా….

నీపైనున్న ఆత్మానుబంధ ఆప్యాయత
నన్నెప్పుడూ నీ ఎదుటే ఉండేలా చేస్తుంది

నువ్వు దేన్నయినా సమర్థతో
సరి చేయగలవన్న నమ్మకం నాది

కానీ
నీకెప్పుడు ఏది కావాలన్నా
చెయ్యడానికి నేనున్నానని
గుర్తు పెట్టుకో…

రాత్రీ పగలూ
నీ నామస్మరణే నాకు

కొన్నిసార్లు
నువ్వింకా ఇక్కడున్నట్టు
నేనేదైనా పని మీద వెళ్ళి
ఆలస్యంగా వచ్చినప్పుడు
అమ్మతో పోటీ పడి
నువ్వొచ్చి తలుపు తీసి
ఎందుకన్నయ్యా
ఇంతాలస్యం అని అడుగుతున్నట్లే
అన్పిస్తుంది
నువ్వు నాకోసం నిద్రపోకుండా
మేల్కొని ఉన్న రోజులెన్నో

నిన్నక్కడ బావగారు                                                 
మంచిగానే చూసుకుంటున్నారన్న
నీ మాటే నాకానందం
మనవడితో నీకు సరిపోతుంటుందని
తెలుసు
అందుకే నీ నించి మెసేజ్ ఆలస్యమైనా
కోపం రాదు

నువ్వేం చేసినా
నాకు తెలీకుండా
నాతో చెప్పకుండా
చెయ్యవని బాగా తెలుసు

నువ్వంటే
ఎంతో ఇష్టమున్న నాకెప్పటికీ
ప్రియమైన చెల్లివే…
ఈ అనుబంధం ఎప్పటికీ
ఇలానే కొనసాగాలన్నదే
ఈ అన్నయ్య ఆకాంక్ష

                                                                                           – యామిజాల జగదీశ్

(Visited 63 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *