టాయిలెట్లుకు తాళాలు … ఇదేనా స్వచ్ఛ భారత్ ? నిర్మించి ఏడాది దాటినా వినియోగంలోకి రాలేదు … మంత్రి కోసం నిరీక్షణ ! ట్విట్టర్‌లో జీవీఎంసీ కమిషనర్‌కు కాండ్రేగుల వెంకటరమణ ఫిర్యాదు
అనకాపల్లి :
పట్టణంలోని చిననాలుగురోడ్ల జంక్షన్ జీవీఎంసీ వాణిజ్య సముదాయం (కూరగాయల బజారు)లో నిర్మించిన టాయిలెట్లు (మరుగుదొడ్లు, మూత్రశాలలు)ను తక్షణం వినియోగంలోకి తీసుకురావాలని మండల వినియోగదారుల మండలి కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ ద్వారా జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. నిర్మాణం పూర్తై ఏడాది దాటినా ఉద్దేశపూర్వకంగా జీవీఎంసీ అధికార యంత్రాంగం టాయిలెట్లుకు తాళాలు వేసేసి నిరుపయోగంగా ఉంచడం సిగ్గుచేటన్నారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్‌రోడ్డులో టాయిలెట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అవసరాల దృష్ట్యా లక్షలాది రూపాయలతో ప్రభుత్వం 2022లో టాయిలెట్లును నిర్మించింది. అయితే టాయిలెట్లు భవనం ప్రారంభోత్సవ నెపంతో ఏడాదిగా తాళాలు వేసేసి నిరుపయోగంగా ఉంచడం సమంజసం కాదన్నారు. అనకాపల్లికి నడిబొడ్డున ఉన్న ఈ జంక్షన్ ప్రధాన వ్యాపార కేంద్రం కావడంతో రూ. కోట్లలో వ్యాపార లావాదేవీలు జరుగుతాయి, బస్టాప్ కూడా ఉంది. ప్రయాణికులు, పాదచారులు, వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటున్న ఈ ప్రాంతంలో టాయిలెట్లు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో కూరగాయల బజారు పరిసర ప్రాంతాల్లోను, షాపుల ప్రక్కన రోడ్లుపైనే మూత్ర విసర్జన చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసనతో దుర్ఘందపూరితంగా తయారవుతోంది. దీనివల్ల దోమల రోత పెరిగి, అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. స్వచ్ఛభారత్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న జీవీఎంసీ ఈ విషయంలో టాయిలెట్లును వినియోగంలోకి తీసుకురాకుండా మంత్రి గుడివాడ అమర్నాధ్ అనుమతి కోసం నిరీక్షిస్తున్నామని జీవీఎంసీ వర్గాలు చెబుతుండడం ఆక్షేపనీయమన్నారు. ఇదేనా స్వచ్ఛ భారత్ అని ఆయన నిలదీశారు. టాయిలెట్లు వద్ద మహిళలకు, పురుషులకు అని తెలిసేలా చిహ్నాలతో పేర్లు వ్రాయించాలని మండల వినియోగదారుల మండలి కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ ఫిర్యాదులో పేర్కొన్నారు.