మహేంద్రజాలికులు

(23న ప్రపంచ ఇంద్రజాల దినోత్సవాన్ని పురస్కరించుకుని)

 విజ్ఞాన వినోదాల సమ్మేళనమే ఇంద్రజాలం. టక్కు టమార గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాలమంటూ వినోదాన్ని పంచే కొంతమంది ఇంద్రజాలికుల వివరాలను పొందుపరుస్తున్నాం.


పి సి సర్కార్‌ : భారతీయ ఇంద్రజాలకులలో అగ్రగణ్యుడుగా పేర్గాంచిన పి సి సర్కార్‌ పూర్తిపేరు ప్రొతుల్‌ చంద్ర సర్కార్‌. 1913 ఫిబ్రవరి 23వ తేదీన బెంగాల్‌ రాష్ట్రంలో తంగైల్‌ జిల్లాలో అషేక్‌పూర్‌లో జన్మించారు. ప్రస్తుతం ఆ ప్రదేశం బంగ్లాదేశ్‌లో ఉంది. ఆయన విద్యాభ్యాసం షిబాంత్‌ ఉన్నత పాఠశాలలో కొనసాగింది. గణపతి చక్రవర్తి వద్ద ఇంద్రజాలంలో తొలి పాఠాలను అభ్యసించారు. 1930 నాటికి ఇంద్రజాలంలో ప్రపంచ ఖ్యాతి సాధించారు. ఆయన కలకత్తాతో పాటు జపాన్‌ తదితర దేశాల్లో కూడా తన ప్రదర్శనలు గావించారు. ఆయన వాసంతీదేవిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు మానిక్‌ సర్కార్‌, పి సి సర్కార్‌ జూనియర్‌ అనే సంతానం గలదు. భారత ప్రభుత్వం అతని ప్రతిభను గుర్తించి 1964లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 1971 జనవరి 6వ తేదీన జపాన్‌లో గుండెపోటుతో మరణించారు. కలకత్తా నగరంలో ఒక ప్రధాన వీధికి ఆయన పేరును పెట్టారు. 2010 ఫిబ్రవరి 23వ తేదీన భారత ప్రభుత్వం అతని ఫోటోతో 5 రూపాయల విలువ గల ఒక పోస్టల్‌ స్టాంపును విడుదల చేసింది.
పీర్‌ మహ్మద్‌ చేల్‌ : ప్రముఖ ఇంద్రజాలికులు మహ్మద్‌ చేల్‌ : గుజరాత్‌ రాష్ట్రంలో భావనగర్‌ జిల్లా గాదాడ తాలూకా నింగాల అనే గ్రామంలో 1850లో జన్మించారు. 1925లో ఆయన స్వర్గస్థులయ్యారు.

గోపీనాథ్‌ ముత్తుక్కడ్‌ : గోపీనాథ్‌ 1964 ఏప్రిల్‌ 10వ తేదీన కేరళ రాష్ట్రంలో నిలంబూర్‌ సమీపాన కవలముక్కట్ట అనే గ్రామంలో జన్మించారు. తండ్రి కుంజున్ని నాయర్‌, తల్లి దేవకి. ఆసియా ఖండంలో మొట్టమొదటి మేజిక్‌ అకాడమీని ఆయన తిరువనంతపురంలో స్థాపించారు.1995లో సంగీత నాటక అకాడమీ అవార్డును సాథించారు. ఇంటర్నేషనల్‌ మెజీషియన్స్‌ సొసైటీ వారి ఇంటర్నేషనల్‌ మెర్లిన్‌ అవార్డు సాధించారు. 2002లో విస్మయ భారత యాత్ర, 2005లో గాంధీ మంత్ర, 2007లో విస్మయ స్వరాజ్‌ యాత్ర తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఇంగ్లాండ్‌, ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, యునైటడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, నేపాల్‌, శ్రీలంక, మాల్దీవులు తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలు గావించారు. 2007 నవంబర్‌ 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఆయన అరుదైన ప్రపంచ రికార్డును సంపాదించుకున్నారు. సముద్రమట్టానికి 14 వేల 400 కిలోమీటర్ల ఎత్తులో సిక్కిం రాష్ట్రంలో ” నా తు ల ” అనే చోట ఇండో-చైనా ఫ్రెండ్‌షిప్‌ మేజిక్‌షో నిర్వహించారు. ఈ ప్రదర్శనకు గాను ఆయన అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం యొక్క ప్రశంసలను కూడా అందుకున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఎం ఎ ఆర్‌ సి ( మేజిక్‌ అకాడమీ రీసెర్చ్‌ సెంటర్‌ ) స్థాపించారు.

పి సి సర్కార్‌ (జూనియర్‌ ) : పి సి సర్కార్‌ ( జూనియర్‌ ) పూర్తి పేరు ప్రదీప్‌ చంద్ర సర్కార్‌. ఆయన 1946 జూలై 31వ తేదీన కలకత్తాలో జన్మించారు. ఆయన మేజిక్‌ రంగంలో మెర్లిన్‌ అవార్డును స్వీకరించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి సైకాలజీలో డాక్టరేట్‌ సాధించారు. ఆయన తొలి ప్రదర్శనను కలకత్తాలోని సిరిగురి రైల్వే ఇనిస్టిట్యూట్‌లో 1963లో గావించారు.ఆయన జట్టులో 48 టన్నుల బరువుగల ఇంద్రజాల సామగ్రి, 75 మంది ఆర్టిస్టులు, 12 సెట్టింగులు, 12మంది జాదూ గర్ల్‌ ్స, అద్భుతమైన భ్రాంతిని కలిగించే 50 ట్రిక్కులు ఉంటాయి. 1972 మే 22వ తేదీన జయశ్రీని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు మేనక, మౌబాని, ముంతాజ్‌ అనే ముగ్గురు సంతానం ఉన్నారు. 2000 సంవత్సరంలో నవంబర్‌ 8వ తేదీన ఆగ్రాలో గత తాజ్‌మహల్‌ను 2 నిమిషాల పాటు మాయం చేసినట్లు భ్రమ కలిగించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. కలకత్తా నగర 300వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విక్టోరియా హాల్‌ను మాయం చేసి తన ఇంద్రజాల మహిమతో అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసారు. 1992లో పశ్చిమబెంగాల్‌లో వర్ధమాన్‌ జంక్షన్‌ వద్ద క్రిక్కిరిసిన జనంతో ప్రయాణిస్తున్న రైలును కొన్ని క్షణాల పాటు మాయంచేసి దేశప్రజల దృష్టిలోకి వచ్చారు.

ఫిలిప్‌ తిజు అబ్రహాం : అబ్రహాం 1986 ఏప్రిల్‌ 22వ తేదీన కేరళ రాష్ట్రంలో కొట్టారక్కరలో జన్మించారు. ఐ టి రంగంలో విశేష ప్రతిభకనబరుస్తూనే గోపీనాథ్‌ ముత్తుక్కుడ్‌, సారంగ్‌, అబ్దుల్లా, సుభాష్‌ వంటి ఇంద్రజాలికుల వద్ద శిక్షణ పొందారు. సన్‌ టివి, సువర్ణ న్యూస్‌, ఏసియా నెట్‌, విజయ్‌ టివిలలో ఎక్కువగా ప్రదర్శనలు ఇస్తున్నారు.
వజక్కున్నం : ఆయన పూర్తిపేరు వజక్కున్నం నీలకంఠం నంబూద్రి. ఆయన 1903 ఫిబ్రవరి 8వ తేదీన కేరళలో తిరువేగపురలో జన్మించారు. కేరళ రాష్ట్రానికి ఇంద్రజాల పితామహుడుగా కీర్తి ప్రతిష్టలను ఆర్జించారు.గోపీనాథ్‌ ముత్తుక్కుడ్‌ వంటి ఎంతోమంది ఇంద్రజాలికులకు శిక్షణనిచ్చారు. 1940లో తొలిసారిగా ప్రదర్శనను ఇచ్చారు.1983 ఫిబ్రవరి 9వ తేదీన కన్నుమూసారు. 2007 ఫిబ్రవరి 9వ తేదీన వజక్కున్నంపై ఒక డాక్యుమెంటరీ విడుదలైంది.
కాంతిలాల్‌ గిరిధర్‌లాల్‌ వోరా : కె లాల్‌గా పేర్గాంచిన కాంతిలాల్‌ గిరిధర్‌లాల్‌ వోరా 1924 జనవరిలో గుజరాత్‌ రాష్ట్రంలో బాగసార అనే ప్రాంతంలో జన్మించారు. ఆయన ప్రపంచ వ్యాప్తంగా 22 వేల ప్రదర్శనలు గావించారు. 1968లో అమెరికాకు చెందిన ఐ బి ఎం సంస్థ ప్రపంచంలో అతి వేగంగా ఇంద్రజాలం చేయగలిగిన వ్యక్తి గా ( వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ మెజీషియన్‌ ) పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2004 సంవత్సరంలో 20 వేల 600 ప్రదర్శనలు పూర్తిచేసి ప్రపంచంలో అతి ఎక్కువ మేజిక్‌ షోలు పూర్తిచేసిన వ్యక్తిగా చరిత్రకెక్కారు.2012 సెప్టెంబర్‌ 23వ తేదీన స్వర్గస్థులయ్యారు.

మనేకా సర్కార్‌ : ఆమె అసలు పేరు పరమ. ప్రపంచంలో తొలి మహిళా ఇంద్రజాలికురాలిగా ప్రసిద్ధి గాంచిన మనేకా సర్కార్‌ : జూనియర్‌ పి సి సర్కార్‌ యొక్క కుమార్తె. ఇప్పటి వరకు సుమారు 500 ప్రదర్శనలు గావించారు. ఆమె సుస్మిత్‌ రంజన్‌ హల్దార్‌ను వివాహం చేసుకున్నారు. తన తండ్రి అయిన జూనియర్‌ పి సి సర్కార్‌ – తాజ్‌ మహల్‌, దాల్‌ సరస్సులు మాయమైనట్లుగా భ్రమింపచేసిన ఇంద్రజాల ప్రదర్శనలో ఆమె కూడా పాల్గొన్నారు.

కుడా బక్స్‌ : కుడా బక్స్‌ 1906లో జన్మించారు. బై ్లండ్‌ ఫోల్డ్‌ షోలు, మంటల్లో నడవడం వంటి అద్భుత ప్రదర్శనలు కుడా బక్స్‌ గావించేవారు. 1935లో లండన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల ఎదుట ” నిప్పుల్లో నడచి ” ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. 2552 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ వేడిలో నడిచి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసారు.
1938 ఆగస్టు 2వ తేదీన మన్‌హట్టన్‌లో గల రేడియోసిటీలో కుడాబక్స్‌ చేసిన ఇంద్రజాల ప్రదర్శన ఆయనకు గొప్ప కీర్తిప్రతిష్టలను ఆర్జింపచేసింది. 1981 ఫిబ్రవరి 5వ తేదీన ఆయన కన్నుమూసారు.

ప్రహ్లాద్‌ ఆచార్య : ప్రహ్లాద్‌ ఆచార్య 1973 మార్చి 14 తేదీన కర్ణాటక రాష్ట్రంలో ఉడుపిలో జన్మించారు. ఆయన వెంట్రిలాక్విస్ట్‌గా, షాడో ప్లే ఆర్టిస్ట్‌గా ప్రపంచ ఖ్యాతి సాధించారు. ఆయన చేసే ఇంద్రజాలం పేరు ” మాయా జాదూ ”. ఆయన జట్టులో 20 మంది సభ్యులుండేవారు. ఆయన పూర్ణిమా ఆచార్య అనే ప్రసిద్ధ మహిళా ఇంద్రజాలికురాలిని వివాహం చేసుకున్నారు. 1999 అక్టోబర్‌ 2వ తేదీన బళ్లారి జైలునుండి 8 సెకన్లులో మాయమై అందరినీ ఆశ్చర్యపరచారు. 2001 సెప్టెంబర్‌ 1వ తేదీన ఉడుపిలో గల శ్రీకృష్ణ దేవాలయంలోని బంగారు రథాన్ని మాయం చేసినట్లు భ్రమగలిగించి సఫలీకృతులయ్యారు. 2001 డిసెంబర్‌ 10వ తేదీన బెంగుళూరు సెంట్రల్‌ జైలునుండి 10 సెకన్లులో మాయమై అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసారు.


జాదూగర్‌ ఆనంద్‌ : ఆనంద్‌ 1952 జనవరి 3వ తేదీన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో జబల్‌పూర్‌లో జన్మించారు. ఏడేళ్ల ప్రాయంలో తొలిసారిగా తాను చదువుతున్న పాఠశాలలో ఇంద్రజాల ప్రదర్శన గావించారు. 1970లో నర్మదా నదిలో అండర్‌ వాటర్‌ ఎస్కేప్‌ చేసి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేసారు. ఆర్ట్‌ ్సలో మాస్టర్‌ డిగ్రీని పూర్తిచేసిన ఆనంద్‌ 1974లో అర్చనను వివాహం చేసుకున్నారు. ఆయన 36 దేశాల్లో పర్యటించి సుమారు 30 వేల ప్రదర్శనలు ఇచ్చారు.

(Visited 146 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *