మావోయిస్టుల లొంగుబాటు
చింతపల్లి : విశాఖపట్నం జిల్లా చింతపల్లి సబ్ డివిజన్ ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు ఎదుట సీపీఐ మావోయిస్టులకు చెందిన 5 గురు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. దీంతో నవంబర్ నెలలో ఒక్క చింతపల్లి సబ్ డివిజన్ లోనే 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ తెలిపారు.
ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ విశాఖపట్నం జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రేరణ, సంకల్పం మరియు ఈమధ్య చెరువురు గ్రామంలో జరిగిన మెగా మెడికల్ క్యాంపు, వాలీబాల్ టోర్నమెంట్ భారీ ఎత్తున నిర్వహించడం జరిగిందని, గిరిజన ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగడం వారికి అవసరమైన సదుపాయాల గురించి పి.ఓ ఐటిడిఎ పాడేరు మరియు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి వారి సమస్యలు తీసుకొని వెళ్లి పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
గత ఐదు నెలల నుంచి ఏరియా కమిటీ మెంబర్ గెమ్మిలి కామేష్, కుంకుమపూడి హరి మొదలైన హార్డ్ కోర్ మిలీషియా సభ్యులు అరెస్టు కాబడినందు వలన మావోయిస్టు మిలీషియా సభ్యులకు ఇది ఒక హెచ్చరికగా పని చేసిందన్నారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది సివిక్ యాక్షన్ ప్రోగ్రాం ద్వారా గిరిజనులకు మరింత దగ్గరయ్యారన్నారు. దీంతో మావోయిస్టు మిలిషియా సభ్యులలో స్వచ్ఛందంగా లొంగిపోవడానికి మార్గం సుగమం అయింది. లొంగిపోయిన మిలీషియా సభ్యులు మరలా తాము మావోయిస్టుల తరపున పని చేయమని, మనశ్శాంతితో కుటుంబాలతో కలసి జీవిస్తామని పోలీసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ సి ఆర్ పి ఎఫ్, దేవేంద్ర నాయుడు అసిస్టెంట్ కమాండెంట్ సి ఆర్ పి ఎఫ్, సీలేరు ఏం.ఎల్.నాయుడ, మురళిధర్ ఇన్స్పెక్టర్ జి.కె.వీధి సర్కిల్ తదితరులు పాల్గొన్నారు.