భారతీయ శాస్త్రీయ సంగీత మేరునగ శిఖరం మంచాల జగన్నాథరావు

(21న జగన్నాథరావు శతజయంత్యుత్సవం సందర్భంగా)


సంగీతానికి పుట్టినిల్లు అయిన విజయనగరంలో సంగీత సమ్రాట్‌ మంచాల జగన్నాథరావు గారు 1921 జనవరి 21వ తేదీన చీపురుపల్లిలో జన్మించారు. అమ్మవారు సోకినందున దురదృష్టవశాత్తు ఆరేళ్ల పసిప్రాయంలోనే కంటిచూపును కోల్పోయారు. మద్రాసుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ శ్రీనివాసాచారి గారి వైద్యము వలన ఒక కన్ను పాక్షికంగా పనిచేసింది. దృష్టిలో ఉన్నలోపాన్ని అధిగమించేందుకుగాను జగన్నాథరావు గారికి సంగీతంలో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. 1928లో శ్రీ ఆదిరాజు నరసింహమూర్తి వద్ద శిక్షణ ఇప్పించారు. ముత్తుస్వామి దీక్షితుల కుటుంబానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ పద్మనాభ అయ్యర్‌, శ్రీమతి సీతామహాలక్ష్మీ దంపతుల వద్ద 1935లోను శిక్షణనిప్పించారు. ముత్తుస్వామి దీక్షితుల కీర్తనలు, క్షేత్రయ్యపదాలు అభ్యసించారు. 17 ఏళ్ల ప్రాయంలోనే సంగీతంలో నిష్ణాతులైన జగన్నాథరావు గారు ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. 1938లో ఆకాశవాణి, మద్రాసులో కచేరీ చేసారు. విశాఖపట్నం నుండి మద్రాసు వరకు వ్యయప్రయాసలకోర్చి ప్రయాణించి తన విద్వత్తుతో అందరి మన్ననలను పొందారు. త్యాగబ్రహ్మ సభలో కూడా కచేరీ చేసి విమర్శకుల ప్రశంసలను పొందారు. కీర్తిశేషులు విస్సా అస్పారావు గారు 1950లో తొలిసారిగా జగన్నాథరావు గారు రాసిన పుస్తకాన్ని ప్రచురించారు. జీవనగమనంలో బ్రతుకు తెరువుకోసం 20 మంది కళాకారులతోను, కర్ణాటక సంగీతంలో నిష్ణాతులైన మరో 20 మందితోను కలిపి రికార్డింగ్‌ కోసం ఒక ఆర్కెస్ట్రాను ప్రారంభించారు. సంగీతంతో పాటు సాహిత్యంలోను అభినివేశం కలిగిన జగన్నాథరావుగారు రాసిన 14 రచనలు వేర్వేరు పత్రికలలో ప్రచురితమయ్యాయి. దేశభక్తిని పెంపొందించే చక్కటి రచనలకు ప్రాచుర్యం లభించి ఆల్‌ ఇండియా రేడియోలో కాంట్రాక్టు రచయితగా, కవిగా 1946లో అవకాశం లభించింది. 1945 నుండి 1948 వరకు ప్రముఖ గాయకులు పిబి శ్రీనివాస్‌, ఘంటసాల, రావు బాలసరస్వతీదేవి,ఎస్‌ జానకి వంటి గాయకుల కార్యక్రమాలకు ఆర్కెస్ట్రా సహకారం అందించారు.1947 ఆగస్టు 14న అర్ధరాత్రి ” సుజలాం సుఫలాం” పేరిట జరిగిన కార్యక్రమానికి కూడా జగన్నాథరావు గారు ఆర్కెస్ట్రా సహకారం అందించారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పటికీ శాస్త్రీయ సంగీతాన్ని విడిచిపెట్టలేదు. 1945-1946లో మద్రాసు మ్యూజిక్‌ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో ఎక్స్‌పర్ట్‌ కమిటీలో అత్యంత పిన్నవయస్కుడిగా నిలిచారు.శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతంలో ఆయన సాధించిన అపారమైన అనుభవం ఆయనకు ఆకాశవాణిలో ప్రవేశానికి ద్వారాలు తెరిచాయి. 1948లో పాట్నాలో ఆల్‌ ఇండియా రేడియో కార్యాలయం ప్రారంభమైనపుడు ఆయనకు అందులో చేరే అవకాశం లభించింది. ఐదేళ్ల పాటు ఆక్కడ పనిచేసే సమయంలో ఆయనకు ఉత్తరభారతదేశ సాంప్రదాయం సంగీతంలో మెళకువలో నేర్చుకునేందుకు వీలు చిక్కింది. ప్రముఖ హిందుస్థానీ సంగీత గాయకులు ఆర్‌.నాయక్‌, పండిట్‌ చంద్రకాంత్‌ దాస్‌, పండిట్‌ రామేశ్వర్‌ లాతమ్‌ వంటి మహనీయుల గాత్రంలో సొబగులను అందిపుచ్చుకునేందుకు అవకాశం లభించింది.

సుగమ్‌ సంగీత్‌ కార్యక్రమం ద్వారా ఆకాలంలో ఉన్న గొప్ప రచయితలను, కవులను ఆల్‌ ఇండియా రేడియో ద్వారా పరిచయ కార్యక్రమాలను నిర్వహించారు. దక్షిణభారతదేశంలో వైణికునిగా ప్రముఖమైన స్థానాన్ని సంపాదించారు. వందలాది హిందీ గీతాలను, భజనలను వీణపై కంపోజ్‌ చేసి పేరు ప్రఖ్యాతులు సాధించారు. 1953లో ఆకాశవాణి, అలహాబాద్‌ కేంద్రంలో శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతానికి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించే సందర్భంలో సుమిత్రా నందన్‌ పంత్‌తో కలసిపనిచేసే అవకాశం లభించింది. శ్రీ హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌, శ్రీమతి మహాదేవి వర్మ, పి.సి.ఓజా, కేదార్‌నాథ్‌ మిశ్రా, వింధ్యాచల్‌ ప్రసాద్‌ గుప్తా, ఆర్‌ సి ప్రసాద్‌ సిన్హా, రామ్‌గోపాల్‌ శర్మ వంటి మహనీయుల రచనలకు జగన్నాథరావుగారు సంగీతాన్ని సమకూర్చారు. 1955, 1957లలో జరిగిన రెండు జాతీయ సంగీత ఉత్సవాల్లో జగన్నాథరావు గారు వీణద్వారా వీనుల విందు గావించారు.

1956లో ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రానికి బదిలీ అయ్యారు. అక్కడే శ్రీకృష్ణ లీలా తరంగిణి, రాధా వంశీధర విలాస నాటకం, గీతాశంకరం, వరదయ్య, మువ్వగోపాల చూడామణి, క్షేత్రయ్య, శ్రీకృష్ణ కందర్థ దరువులు, సౌందర్యలహరి, ఆనందలహరి, అదిగో భద్రాద్రి, త్యాగరాజు దర్శించిన రాముడు, నందనందనా గోపాలా, రాజరాజేశ్వరీ, పరాశక్తి వంటి సంగీత రూపకాలు ఊపిరిపోసుకున్నాయి. రంగానుభవం, సంగీత సాహిత్య సౌరభం వంటి సంగీత సంబంధిత కార్యక్రమాలు దేశమంతా ప్రాచుర్యాన్ని పొందమే గాక ఢిల్లీ, బరోడా, మైసూర్‌ తదితర ప్రాంతాల విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్ధులకు ఎంతో దోహదపడ్డాయి. ఆ మహనీయుని కలం నుండి మొత్తంగా 22 పుస్తకాలు వెలువడ్డాయి. సంగీత సంజ్ఞామానములతో ఆయన రూపొందించిన క్షేత్రయ్య పదములను ఆంధ్రగాన కళాపరిషత్‌ ప్రచురించింది. అధ్యాత్మ రామాయణ కీర్తనలను ఆంధ్రగాన కళాపరిషత్‌ ప్రచురించింది. ఆధునిక సంగీతం(తెలుగు) మొదటి భాగాన్ని కాంతిలత పబ్లికేషన్స్‌ ప్రచురించింది.ఆధునిక సంగీతం(హిందీ) రెండవ భాగంలో అష్టపదులు, హిందీ భజనలు ఉన్నాయి. గీత గోవిందం, గీతాశంకరం వంటి సంస్కృత సంగీత రూపకాలు ఎపి ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌ సంస్కృత గ్రంథాలయం ప్రచురించింది. రాధా తంజావూరుకు చెందిన షాజీమహారాజ్‌ హిందీలో రాసిన కూచిపూడి యక్షగానానికి సంగీత సంజ్ఞామానములతో వంశీధర రూపకం అనే పేరుతో జగన్నాథరావు రాయగా దానిని ఎపి ఓరియంటల్‌ మాన్యుస్క్రిప్ట్‌ సంస్కృత గ్రంథాలయం ప్రచురించింది.క్షేత్రయ్య పదాలపై సంగీత సంజ్ఞామానములతో రాగలక్షణాలతో రాయగా దానిని ఎపి సంగీతనాటక అకాడమీ ప్రచురించింది.

భద్రాచల రామదాసు కీర్తనలను సంగీత సంజ్ఞామానములతో రూపొందించగా దానిని ఎపి సంగీతనాటక అకాడమీ ప్రచురించింది.ఆంధ్రుల సంగీత కళపై రాసిన రచనను ప్రపంచ తెలుగు సదస్సులో ప్రచురించారు. అన్నమాచార్య ఆధ్యాత్మిక సంకీర్తనలు మూడు భాగాలుగా రాగలక్షణాలతో సంగీత సంజ్ఞామానములతో రూపొందించగా దానిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది.త్యాగరాజు కీర్తనలును మూడు భాగాలుగా రాగలక్షణాలతో సంగీత సంజ్ఞామానములతో రూపొందించగా దానిని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించింది. ముత్తుస్వామి దీక్షితుల వంటి మహనీయుల కృతులతో కృతిరత్నావళి అనే పేరుతో నాలుగు భాగాలుగా రూపొందించగా దానిని కూడా ప్రచురించింది. నారాయణ తీర్ధుల వారి వంద తరంగాలు, రెండు వందల హిందీభజనలు రాగలక్షణాలతో సంగీత సంజ్ఞామానములతో రూపొందించగా దానిని కూడా ప్రచురించారు.

ఏడున్నర గంటలపాటు ఆయన చేసిన అద్భుతమైన కచేరీని, 9 గంటలపాటు సాగించిన క్షేత్రజ్ఞ పదాలను కేంద్ర సంగీత నాటక అకాడమీ రికార్డు చేసింది.ఆ మహనీయుని సంగీతానికి పరవశించి ఆంధ్ర ప్రదేశ్‌ సంగీత నాటక అకాడమీ జగన్నాథరావుగారిని కళాప్రవీణ అనే బిరుదును ప్రదానం గావించింది. 1982లో ఆంధ్రవిశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. 12 గంటల పాటు నిర్విరామంగా విద్యార్ధులు గావించిన అన్నమాచార్య కీర్తనలను, 15 గంటల పాటు నిర్విరామ ఆధ్యాత్మిక కీర్తనలను తిరుమల తిరుపతి దేవస్థానం కోసం రికార్డు చేసారు. ఉద్యోగ విరమణానంతరం కూడా రెండేళ్లపాటు ఆకాశవాణి, దూరదర్శనలలో ప్రొడ్యూసర్‌గా నియమితులై సేవలందించారు. సంగీతసార్వభౌముడు మంచాల జగన్నాథరావు 1985 జూన్‌ 30వ తేదీన దేవుని సాన్నిధ్యానికి చేరుకున్నారు. నేడు ఆయన మన మధ్యలేకున్నా ఆయన కీర్తి ఆచంద్రతారార్కం అలరారుతుందని అనడం అతిశయోక్తికాదు.

 

(Visited 3 times, 1 visits today)

2 thoughts on “భారతీయ శాస్త్రీయ సంగీత మేరునగ శిఖరం మంచాల జగన్నాథరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *