ఎన్‌వైకెఎస్‌ రాష్ట్ర సలహా కమిటీ సభ్యునిగా వెంకటరమణ

కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ


విశాఖపట్నం : భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌ (ఎన్‌వైకెఎస్‌-యువత కార్యక్రమాలు) రాష్ట్ర సలహా కమిటీ సభ్యునిగా విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన కాండ్రేగుల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు (ఆర్‌ఇఎఫ్‌.ఎన్‌వైకెఎస్‌/పీఆర్‌వోజీ : ఎస్‌ఏసీవైపీ/2020/181 తేది : 24-2-2021) జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాలకు చెందిన 48 మంది ప్రతినిధులు ఉంటారు. గడచిన 30 ఏళ్లుగా వినియోగదారుల రక్షణ చట్టం, 15 ఏళ్లుగా సమాచార హక్కు చట్టం అమలు, చట్టాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమ వ్యాప్తికి వెంకటరమణ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ విజిలెన్స్‌ కమిటీ సభ్యునిగా, రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి సలహా కమిటీ సభ్యునిగా, సమాచార హక్కు చట్టం అమలు, పర్యవేక్షణ విశాఖపట్నం జిల్లా కమిటీ సభ్యునిగా, ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వాల్తేరు డివిజన్‌ రైల్‌ యూజర్స్‌ కన్సల్టేటివ్‌ కమిటీ (డీఆర్‌యుసీసీ) సభ్యునిగా, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ విశాఖపట్నం జిల్లా విజిలెన్స్‌ కమిటీ సభ్యునిగా, పబ్లిక్‌ ఫోరం రాష్ట్ర నమన్వయకర్తగా, విశాఖపట్నం జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షునిగా, అనకాపల్లి మండల కన్స్యూమర్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శిగా, సమాచార హక్కు చట్టం, వినియోగదారుల రక్షణ చట్టం రిసోర్స్‌పర్సన్‌గా, కన్సల్టెంట్‌గా వెంకటరమణ వ్యవహరిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధల నుంచి ఇంత వరకు 35 పర్యాయాలు అవార్డులు, ప్రశంసాపత్రాలు ఆయన పొందారు. కాగా వెంకటరమణ నియామకం పట్ల వినియోగదారుల చట్టం, సమాచార హక్కు చట్టం ఉద్యమకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతను దేశ నిర్మాణ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం, ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయం, సహకారంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలతో యువత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విలువలను అభివృద్ధి చేయడం, లౌకిక మార్గాల్లో ఆలోచింపజేయడం, నైపుణ్యం, అభివృద్ధి, ఉత్పాదక, వ్యవస్థీకృత ప్రవర్తనను అవలంభించడానికి యువతకు సహాయపడటం, యువ నాయకత్వం కోసం దీర్ఘకాలిక వ్యూహాలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. అదే విధంగా క్రీడలు, సాంస్కృతిక, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి యూత్‌ క్లబ్‌లు ఏర్పాటు, ప్రోత్సహిస్తామని కాండ్రేగుల వెంకటరమణ అన్నారు.

(Visited 122 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *