ప్రేమోన్మాది పైశాచికం…

ప్రేమించలేదని యువతిపై పెట్రోల్ పోసి తాను నిప్పంటించుకున్న వైనం


విశాఖపట్నం : ప్రేమ పేరుతో ఓ ఉన్మాది పైశాచికత్వానికి పాల్పడ్డాడు. తనను ప్రేమించడంలేదని యువతిపై పెట్రోల్ పోసి తాను నిప్పంటించుకున్నాడు. వీరిద్దరికీ కాలి తీవ్ర గాయాలు కావడంతో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నగర వాసులు ఉలిక్కిపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్, భూపాలపల్లి ప్రాంతానికి చెందిన పలకల హర్షవర్ధన్ (21) పంజాబ్ లోని జలంధర్ లో గల ఇంజనీరింగ్ కళాశాలలో 2017లో బీటెక్ కోర్సులో చేరాడు. నగరంలోని ఎన్ఏడి కొత్తరోడ్డు, పాత కరసా ప్రాంతానికి చెందిన ప్రత్యూష (20) అదే కళాశాలలో బీటెక్ పూర్తి చేసింది. ఓకే కళాశాల కాబట్టి వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకుని హర్షవర్ధన్ ప్రేమించమని ప్రత్యూషను వేధించేవాడు. బీటెక్ పూర్తి అయిన తర్వాత ఎవరి స్వస్థలాలకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే తనను ప్రేమించలేదని ప్రత్యూషపై హర్షవర్ధన్ కక్ష పెట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం వరంగల్ నుంచి విశాఖ నగరానికి చేరుకొని సూర్యబాగ్ లోని రాఘవేంద్ర లాడ్జ్ లో హర్షవర్ధన్ దిగాడు. నీతో ఒక్కసారి మాట్లాడాలి అంటూ లాడ్జికి రమ్మని ప్రత్యూషా సెల్ ఫోన్ కి కాల్ చేసి బ్రతిమాలాడు.

దీంతో ఆమె శనివారం సాయంత్రం సుమారు ఏడు గంటల సమయంలో లాడ్జికి వెళ్లి గదిలో ఉన్న హర్షవర్ధన్ ను కలిసింది. ఈ నేపథ్యంలో తనను ప్రేమించమని ప్రత్యూషను, హర్షవర్ధన్ కోరాడు. ఎప్పటిలాగే ప్రత్యూష అతని ప్రేమను తిరస్కరించడంతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పెట్రోల్ ఆమె ఒంటిపై వేసి తాను వేసుకుని నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రత్యూష కేకలు వేయగా, లాడ్జి సిబ్బంది గమనించి వెంటనే 108 అంబులెన్స్ కాల్ చేసి తీవ్ర గాయాలపాలైన వారిద్దరినీ కెజీహెచ్ కి తరలించారు. సమాచారం అందగానే, సంఘటన స్థలానికి ఇంచార్జ్ ఏసీపీ శ్రీరాముల శిరీష, సీఐ వెంకట్రావు, ఎస్ఐ మన్మధరావు చేరుకొని పరిశీలించారు. ప్రేమించలేదని ప్రత్యూషపై పెట్రోల్ పోసి తాను కాల్చుకున్నానని ప్రేమోన్మాది హర్షవర్ధన్ పోలీసులకు చెప్పడం గమనార్హం. విషయం తెలిసిన ప్రత్యూష తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కేజీహెచ్ కు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రేమోన్మాది చేతిలో తమ కుమార్తెకు ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదని వారు విలపిస్తున్నారు. సీఐ వెంకట్రావు నేతృత్వంలో రెండో పట్టణ ఎస్ఐ మన్మధరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

(Visited 39 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *