మండల కేంద్రంలో పందులు స్వైర విహారం.
చింతపల్లి :
* పెట్టుబడి లేని వ్యాపారం…లక్షల్లో లాభం…?
* పందులు పాత అప్పులు తీరుస్తాయనే సామెత
- మండల కేంద్రంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వాహన ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మంగళవారం ప్రజాశక్తి విలేఖరి ద్విచక్ర వాహనానికి పందులు అడ్డం రాగా అతను తీవ్ర గాయాలపాలయ్యాడు.ప్రస్తుతం నడవలేని పరిస్థితి.
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారితో అతలాకుతలం అవుతుంటే మండల వాసులు మాత్రం పందులుతో సతమతమవుతూ నరక యాతన అనుభవిస్తున్నారు. ఇళ్ల మధ్య సంచరిస్తూ భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇంటి బయట ఉంటే కరోనా. ఇంటి వద్ద ఉంటే పందులతో యాతన. వసతి గృహాల దగ్గరలో ఉన్న పిచ్చి మొక్కలను ఆవాసాలుగా చేసుకొని వసతి గృహాలలో విద్యార్థులు వదిలేసిన వ్యర్థ ఆహారాన్ని ఆరగిస్తూ జీవనం సాగిస్తున్నాయి. మండల కేంద్రంలో పందులు స్వైర విహారం చేస్తూ ఉండడం వలన మండల వాసులకు టైఫాయిడ్, మలేరియా, డెంగు వంటి ప్రాణాంతక వ్యాధులు పట్టి పీడిస్తాయని మండల వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారికి ఇరువైపులా నిర్మించిన కాలువల్లో నీరు పోయే మార్గం లేక ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతుంది. దీంతో కాలువల్లో, బురదలో దొర్లిన పందులు గ్రామంలో విచ్చలవిడిగా తిరుగుట వలన దోమల ద్వారా మండల వాసులకు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. గిరిజన ప్రభుత్వ గురుకుల కళాశాల, వివిధ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర, బాలికల వసతి గృహాలు ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల (7 వసతి గృహాలు)లతో పాటు గ్రామంలోని పిచ్చి మొక్కలను ఆవాసాలుగా చేసుకుని పందులు జీవనం సాగిస్తున్నాయి. పందుల వలన వసతి గృహ విద్యార్థులకు వ్యాధులు ప్రబలుతున్నాయని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని వసతి గృహ నిర్వాహకులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు వాపోతున్నారు. ప్రభుత్వ గిరిజన గురుకుల జూనియర్ కళాశాల, సాయి బాబా ఆలయం, గూనలంక మధ్యలో తుప్పలు పెరిగి పోవడంతో పాటు పందుల యజమానులు గుడారాలు ఏర్పాటు చేయడంతో వందల సంఖ్యలో ఇక్కడ పందుల పెంపకం జరుగుతుందని సాయి నగర్ వాసులు ఆరోపిస్తున్నారు. సాయిబాబా గుడి ఆవరణలో, వసతి గృహ విద్యార్థులు వదిలిన ఆహార పదార్థాలను తిని పందులు జీవనం సాగిస్తున్నాయి. వసతి గృహాలలో విద్యార్థుల పరిస్థి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మైదాన ప్రాంతాల్లో ఉండే పందుల యజమానులు ఆది, బుధవారాల్లో చేపలు విక్రయిస్తుంటారు. పందులను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మైదాన ప్రాంతీయులకు సొమ్ములు,మండల వాసులకు గాయాలా? అని మండల వాసులు ప్రశ్నిస్తున్నారు. అధికారులకు పందులు నియంత్రించాలని ఎన్నిమార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారని మండల వాసులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మండల కేంద్రంలో పందులను నియంత్రిస్తే కొన్ని రకాల వ్యాధులను, వాహన ప్రమాదాలను నియంత్రిచిన వారవుతారని మండల కేంద్రం వాసులు కోరుతున్నారు.
(Visited 17 times, 1 visits today)