ఆర్టీఐ దరఖాస్తుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి : డిఆర్ఒ పి వెంకటరమణ
అనకాపల్లి :
సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) దరఖాస్తుదారుల పట్ల అధికార యంత్రాంగం మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని జిల్లా రెవిన్యూ అధికారి (డీఆర్‌వో), ఆర్టీఐ చట్టం నోడలాఫీసర్ పి.వెంకటరమణ స్పష్టం చేశారు. రెవిన్యూ డివిజనల్ అధికారి సమావేశం హాలులో ఆర్టీఐ చట్టం 17వ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం స్వచ్ఛందంగా వెల్లడిరచాల్సిన విధులు, బాధ్యతలు, సేవలు వెల్లడిరచు 17 అంశాల తాజా పరిచిన ఆర్టీఐ సెక్షన్ 4 (1) (బి) సమాచారాన్ని తక్షణం రూపొందించాలని, పీఐవో, ఏపీఐవో, అప్పీలేట్ అథారిటీ వివరాలు కలిగిన ఆర్టీఐ బోర్డును ప్రతి కార్యాలయం ముందు ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీఐ ఉత్తరప్రత్యుత్తరాల్లో ఆర్టీఐ లోగోను విధిగా వినియోగించాలన్నారు. పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రతి నెల మూడవ శుక్రవారం అప్పీళ్లు పెండిరగ్ , ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష చేయనున్నామన్నారు. అందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని హితవు పలికారు. పీఐవోలు విధిగా ఆర్టీఐ రిజిష్టర్లు నిర్వహించాలన్నారు. నిర్ధేశిత గడువుతో సంబంధం లేకుండా అందుబాటులో ఉన్న సమాచారాన్ని తక్షణం దరఖాస్తుదారులకు అందజేయాలని డీఆర్‌వో వెంకటరమణ తెలిపారు. ఏ సమాచారాన్ని ఇవ్వవచ్చు … ఏ సమాచారం ఇవ్వకూడదు అన్న విషయాలపై అధికార యంత్రాంగం స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. ఈ సందర్బంగా ఆర్టీఐ చట్టం ప్రాధాన్యతలు గురించి ఆయన వివరించారు. సదస్సులో ఆర్టీఐ చట్టం ఉద్యమకర్త కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ కారణాలేమైనప్పటికీ పీఐవోలు దరఖాస్తుదారులు కోరుతున్న సమాచారాన్ని సకాలంలో ఇవ్వకపోతుండడం వల్ల అప్పీళ్ల సంఖ్య పేరుకుపోతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారు కోరిన సమాచారం ఏ ఉద్యోగి వద్ద ఉందో ఆ ఉద్యోగినే ఆర్టీఐ చట్టం సెక్షన్ 5 (4), 5 (5)లను అనుసరించి పీఐవోగా నియమించాలని దీనివల్ల సత్వరం సమాచార పంపిణీ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి తహశీల్ధార్ వై.శ్రీరామమూర్తి (బుజ్జి), డివిజన్ పరిధిలోని వివిధ ప్రభుత్వ శాఖల ఆర్టీఐ పీఐవోలు, ఆర్టీఐ ఉద్యమకర్త మారిశెట్టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.