రూ.3000కు ట్రై చేస్తే రూ.6 లక్షలు మాయం


మోసపోయిన చార్టెడ్ అకౌంటెంట్

(జి. సాయి ప్రసాద్, హైదరాబాద్)

పోలీసులు ఎన్ని సార్లు హెచ్చరించినా ప్రజలు సైబర్ నేరాల బారిన పడుతూనే ఉన్నారు. లోక జ్ఞానం లేని వారే కాదు ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా సైబర్ దొంగల చేతుల్లో మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఘటనను చూస్తే సైబర్ నేరాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం అవుతుంది. హైదరాబాద్ నగరానికి చెందిన బిచార్టెడ్ అకౌంటెంట్ ఒకరు 3 వేల రూపాయల సైకిల్ ను అమ్మేసేందుకు ప్రయత్నించి ఏకంగా 6 లక్షల రూపాయలను పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చీబౌలి ప్రాంతానికి చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఈ మధ్య తన వద్ద ఉన్న సైకిల్ ను ఓఎల్ఎక్స్ లో అమ్మకానికి పెట్టాడు. దాని ధరను 3500 రూపాయలుగా పెట్టాడు. దాన్ని చూసిన ఓ సైబర్ నేరగాడు అతడికి ఫోన్ చేశాడు.
తాను ఆ సైకిల్ ను కొంటానని, ధరను కాస్త తగ్గించమని కోరాడు. ఆ తర్వాత ఇద్దరూ మూడు వేల రూపాయల వద్ద సైకిల్ కొనేలా అంగీకారానికి వచ్చారు. అయితే ముందుగా 2 వేల రూపాయలను అడ్వాన్స్ గా ఇస్తాననీ, సైకిల్ ను తీసుకునే సమయంలో మిగిలిన 1000 రూపాయలు ఇస్తానని ఆ వ్యక్తి చెప్పాడు. దీనికి సరేనన్న చార్టెడ్ అకౌంటెంట్ డబ్బులను పంపించమని కోరాడు. దాంతో చార్టెడ్ అకౌంటెంట్ వాట్సప్ నెంబర్ కు కొనుగోలుదారుడు ఓ క్యూఆర్ కోడ్ ను పంపాడు. ఆ తర్వాత ఫోన్ చేసి మీకు ఓ క్యూఆర్ కోడ్ ను పంపించాను, దాన్ని స్కాన్ చేస్తే మీ అకౌంట్లోకి రెండు వేలరూపాయలు వస్తాయని చెప్పాడు. సరేనని దాన్ని స్కాన్ చేస్తే చార్టెడ్ అకౌంటెంట్ ఖాతాలోంచి 2 లక్షల రూపాయలు విత్ డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే చార్టెడ్ అకౌంటెంట్ అతడికి ఫోన్ చేసి నా అకౌంట్లోంచి డబ్బులు పోయాయేంటి? అని నిలదీస్తే.. ‘అయ్యో, ఏదో పొరపాటు జరిగిందనుకుంటా సర్, మరో క్యూఆర్ కోడ్ ను పంపిస్తాను దాన్ని స్కాన్ చేయండి. మీకు మీ లక్షలతోపాటు అదనంగా మనం మాట్లాడుకున్న 2 వేలు కూడా వస్తాయి’ అని చెప్పాడు. రెండోసారి పంపిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే మరో 2 లక్షల రూపాయలు అతడి అకౌంట్ నుంచి మాయం అయ్యాయి. దీంతో కోపోద్రిక్తుడయిన చార్టెడ్ అకౌంటెంట్ అతడికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘ఏదో టెక్నికల్ ఎర్రర్ అనిపిస్తోంది సర్. నేను ఈ సారి ఆ ప్రాబ్లం లేకుండా చేస్తాను. ఇదొక్కసారి ట్రై చేయండి. మీ డబ్బులు మీకు వస్తాయి. దాన్ని స్కాన్ చేస్తే రూ.4లక్షల రెండు వేల రూపాయలు వస్తాయి’ అని చెప్పాడు. సరేనని స్కాన్ చేస్తే ఈ సారి కూడా రెండు లక్షలు అతడి అకౌంట్ నుంచి మాయమయ్యాయి. మొత్తంగా ఆరు లక్షల రూపాయలను ఆ చార్టెడ్ అకౌంటెంట్ కోల్పోయాడు. దీంతో ఆ మోసగాడికి మళ్లీ ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన చార్టెడ్ అకౌంటెంట్ వెంటనే సైబరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.

(Visited 77 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *