మహిళా శిరోమణి సరోజినీ నాయుడు
(నేడు సరోజినీ నాయుడు జయంతి)
తన జన్మదినాన్ని భారతదేశమంతా జాతీయ మహిళాదినోత్సవంగా జరుపుకోవడం సరోజినీనాయుడుకు భారతదేశమర్పించే అత్యున్నత గౌరవంగా చెప్పుకోవచ్చు. మహిళాశిరోమణి సరోజినీనాయుడు జన్మదినం సందర్భంగా ఆమెపై ప్రత్యేక వ్యాసం.భారత జాతీయ కాంగ్రెస్‌కు తొలి మహిళా అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా చరిత్రలో నిలిచిన మహామనీషి సరోజినీ నాయుడు. స్వాతంత్య్ర సమరంలో పాల్గన్న వీరవనిత సరోజినీ నాయుడు 1879 ఫిబ్రవరి 13వ తేదీన పండిత బెంగాలీ బ్రాహ్మణ వంశంలో హైదరాబాద్‌లో జన్మించారు. తండ్రి అఘోరనాథ్ ఛటోపాధ్యాయ, తల్లి వరదసుందరీ దేవి.ఆమె స్వగ్రామం తూర్పు బెంగాల్ లోని బ్రహ్మనగరం .ఉద్యోగ నిమిత్తం తండ్రి 1878 లో హైదరాబాద్ తరలి వచ్చారు.తండ్రి స్ధానిక నిజాం కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేసేవారు. ఆ కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండేది.ఆ కళాశాలలో తొలి డాక్టరేట్ పట్టా మొందిన భారతీయ ప్రొఫెసర్ అఘోరనాథ్. తండ్రికి తగ్గతనయురాలుగా పేరు సంపాదించిన సరోజినీ 12 ఏళ్ళ వయస్సులో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలనుండి ప్రథమ శ్రేణిలో మెట్రిక్యులేషన్ పరీక్ష ప్యాసయ్యారు.ఆ వయస్సులోనే ఆల్జీబ్రాపై పద్యాలు గూడా రాసారు.13 ఏళ్ళ వయస్సులో లేడీ ఆఫ్ లేక్ అనే 13 వందల లైన్ల పద్యాన్ని రాసింది.1895 లో ఉన్నత విద్యకోసం నిజాం ప్రభుత్వం వారి స్కాలర్‌షిప్‌తో లండన్‌లోని కింగ్స్ కాలేజీకి వెళ్లారు.తరువాత కేంబ్రిడ్జ్‌లోని గిర్టన్ మహిళా కళాశాలలో విద్యాభ్యాసం చేసారు. ప్రముఖ ఇంగ్లీషు రచయితలు షెల్లీ, బైరన్, వేల్స్ తదితరుల ప్రభావం ఆమె కవిత్వం పై పడింది.ఆమె కవితలు నాలుగు సంపుటాలుగా వెలువడ్డాయి. 1909 లో 40 పద్యాలుతో ” ది గోల్డెన్ త్రెషోల్డ్ ” , 1912 లో 46 పద్యాలతో ”ది బర్డ్ ఆఫ్ టైమ్ ”, 1917 లో 61 పద్యాలతో ” ది బ్రోకెన్ వింగ్ ”, 1928లో ” ది సెప్ట్రెడ్ ఫ్లూట్ ”, 1961 లో 37 పద్యాలతో ” ది ఫెదర్ ఆఫ్ డాన్ ” ” ది గిఫ్ట్ ఆఫ్ ఇండియా ” సంకలనాలు విడుదలయ్యాయి.హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి గోల్డెన్ త్రెషోల్డ్ అని పేరు పెట్టుకున్నారు. సరోజినీ నాయుడి సోదరులు, వీరేంద్రనాథ్ ఛటోపాధ్యాయ, హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ. వీరేంద్రనాథ్ కమ్యూనిజం పట్ల ఆకర్షితుడై రష్యాలో స్థిరపడ్డాడు. హరీంద్రనాథ్ కవి,రచయిత, నటుడుగా పేర్గాంచాడు.
1896 లో ఆమె తొలిసారిగా ఇంగ్లాండు వెళ్ళారు. ఆ సమయంలో ఆర్ధర్ సైమన్స్, ఎడ్మండ్ గూస్ వంటి ప్రముఖుల పరిచయాలు ఆమెకు లభ్యమయ్యాయి. ఆమె స్విట్జర్లాండ్, ఇటలీ దేశాలను కూడా పర్యటించారు. ఆమె ఇంగ్లాండ్‌లో విద్యాభ్యాసం చేసే రోజుల్లో డాక్టర్ ముత్యాల గోవిందరాజులు నాయుడును ప్రేమించి, మనదేశానికి తిరిగి వచ్చినతరువాత 1898 లో తల్లిదండ్రులను ఒప్పించి ందుకూరి వీరేశలింగం పంతులుగారి చేతులమీదుగా కులాంతర వివాహం చేసుకున్నారు. వీరి సంతానము జయసూర్య, పద్మజ, రణధీర, లీలామణి. పద్మజ పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసారు. 1906 లో మహిళాభ్యుదయానికి విద్య తప్పనిసరని సమాజంలో చైతన్యం తీసుకురావడానికి నడుం బిగించారు.
1905లో జరిగిన విభజన ఉద్యమంలో ఆమె తొలిసారిగా జాతీయోద్యమంలో పాల్గొన్నారు. 1916 లో కలకత్తాలో గోపాలకృష్ణగోఖలేతో జరిగిన పరిచయం వలన మహ్మద్ ఆలీ జిన్నా, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, అనిబిసెంట్, రామస్వామి అయ్యర్ల సరసన స్వాతంత్య్ర సమరంలో పాల్గనే అవకాశాన్ని పొందారు.హోం రూల్ ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ నేతలకు జలియన్ వాలా బాగ్ ఘాతుకాలను తెలియచెప్పారు.1919 లో హోం రూల్ ఉద్యమానికి సంబంధించి భారతీయ రాయబారిగా ఇంగ్లాండు వెళ్లారు. తరువాత గాంధీజీ ఆమెను అమెరికా పంపారు. 1924 లో ఆఫ్రికాలోను, 1928 లో అమెరికాలోను విస్తృతంగా పర్యటించారు. 1925 లో కాన్పూర్ లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి, భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. దండి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో గాంధీజీతో పాల్గని ఏర్పేడులో జైలుశిక్ష అనుభవించారు. రెండవ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌లో ఆమె చేసిన ప్రసంగం చారిత్రాత్మకమైనది.బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు ” కైజార్ ఎ హింద్ ” స్వర్ణ పతకాన్ని బహూకరించింది. 1928లో ఆమెను భారత జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి సభ్యురాలిగా తీసుకున్నారు.గాంధీజీతో కలిసి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 21 నెలల జైలుశిక్ష అనుభవించారు. 1947 మార్చిలో ఏషియన్ రిలేషన్స్ కాన్ఫరెన్స్‌లో స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. 1947 ఆగస్టు 15 నుండి 1949 మార్చి 2వ తేదీ వరకు ఆమె ఉత్తరప్రదేశ్‌కు గవర్నర్‌గా గూడా పనిచేసారు. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ, పర్ష ్యన్ భాషల్లో సరోజినీనాయుడు దిట్ట. ఆమెకు బాగా ఇష్టమైన రచయిత పిబి షెల్లీ. 1949 మార్చి 22వ తేదీన అలహాబాద్‌లో సరోజినీ నాయుడు తుది శ్వాస విడిచారు. ఆమె మరణానంతరం ” గోల్డెన్ త్రెషోల్డ్ ” భవనాన్ని హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి ఆమె వారసురాలు పద్మజానాయుడు బహూకరించారు. 1975 నవంబర్ 17వ తేదీన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆ భవనాన్ని జాతికి అంకితమిచ్చారు.