STEEL PLANT పోనివ్వం “STEAL PLANT” కానివ్వం

 

ప్రజలంటే ఉప్పెన. ప్రజలంటే ఉద్యమం. ఉచ్ఛ‌స్థ‌తి దీని పరిక్రమం. ఉధృతి దీని పరాక్రమం. ఇందుకు నిదర్శనం విశాఖ ఉక్కు కర్మాగారం!

సమున్నతంగా,సగర్వంగా తెలుగువాడి కంటిరూపంగా, తెలుగింటి మింటిదీపంగా వెలసింది, వెలిగింది.

తెలుగు ప్రజలు STEEL PLANTను గుండెల్లో దాచుకున్నారు

పాలకులు మాత్రం STEAL PLANT గా దోచుకున్నారు.

ఔను..ప్రజలది ఉక్కు సంకల్పం. ఉక్కు పిడికిళ్లు. ప్రభుత్వానిది ఉక్కుపాదాలు. అందువల్ల స్టీల్‌ప్లాంట్‌ ప్రాభవం కనుమరు గౌతుందా? దాని వైభవం తెరమరుగౌతుందా! ప్రతి తెలుగువాడి గుండెల్లో ఇవే ప్రకంపనలు. దురదృష్టం ఏమిటంటే ఇవి విశాఖకే పరిమితం కావడం.

“కుట్ర అనదగ్గదేదైనా జరిగితే రాజ్యాంగం రాసినకాడే జరిగుండాల” అన్నారో పెద్దాయన. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కూ ఇది వర్తిస్తుందేమో. ప్లాంట్‌కు ఇనప గనులు కేటాయించకుండా తొక్కిపెట్టిన నాడే ప్రైవేటీకరణ దురాలోచన పాలకులకు వచ్చుండొచ్చు. దీన్నిఅడ్డుకోడానికి ప్రజలు, కార్మికులు, నాయకులు మళ్లీ పోరుబాట పట్టారు. వీరిలో కొందరు మినహా మిగిలిన నేతల ప్రకటనల్లో, పర్యటనల్లో ద్వంద్వ విధానాలే కనిపిస్తున్నాయి. మెజార్టీ శాతం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నదిదే.

ప్రజల ఆవేశానికి, కార్మికుల ఆందోళనకు నాయకుల నికార్సయిన క్రియాశీలత తోడయితే ఉద్యమం జ్వలిస్తుంది. పోరాటం ఫలిస్తుంది. లేదంటే విఫలమౌతుంది. వికలమౌతుంది. ఆ ప్రమాదం స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమానికి పొంచి ఉందేమోనన్న భయం అందరి హృదయాలను మెలితిప్పుతోంది.

ప్రైవేటీకరణ అంశం సెంట్రల్‌ ఇన్విస్టిమెంట్‌ అండ్‌ అసెట్ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి ట్విటర్‌లో పెట్టిన రోజే ప్రజల గుండెలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.  అమ్మ‌కాల ప్రక్రియ‌కు వీలుగా కేబినెట్‌ క‌మిటీని అప్పుడే కేంద్రం వేసేసింది.. ఉక్కు కర్మాగారాన్ని 100శాతం ప్రైవేటీక‌రించ‌డానికి కేబినెట్ కమిటీ జనవరిలోనే నిర్ణయం తీసేసుకుందని వెల్లడించి ‘తాంబూలాలు ఇచ్చేశాం..ఇక తన్నుకు చావండి’ అన్నరీతిలో కేంద్రం వ్యవహరించింది.

ప్రకటన వెలువడిన రోజే ప్లాంట్‌ ప్రధాన పరిపాలన భవనం కూడలిలో అభిలపక్ష కార్మిక సంఘాలు మెరుపు ధర్నాకు దిగాయి. పౌర సమస్యలమీద అవిశ్రాంతంగా పోరాడే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ ప్లాంట్‌ను అమ్ముకోవల్సిన అగత్యం లేదు… దానికి సొంత గనులు కేటాయిస్తే భవిష్యత్‌ ఉజ్వలంగా ఉంటుందన్నారు.

కేంద్రం నిర్వాకంతో తీవ్రంగా కలత చెందిన ఏపీ మాజీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్‌ కేంద్రం ఇన్ని దుశ్చర్యలకు పాల్పడుతున్నా రాష్ట్ర నాయకులకేమయింది? చేవ చచ్చిందా.. ఆత్మాభిమానం కొడిగట్టిందా” అని ఆవేదన చెందారు. ఆ రోజుకీ ఈ నాటికీ పరిస్థితిలో మార్పేమీ కనపడలేదు. భూకంపం వస్తే వేల కిలోమీటర్ల మేర ప్రకంపనలతో భూమి దద్దరిల్లినట్లు ఉద్యమ సెగ ఇంకా ఏపీకి పాకలేదు.రాష్ట్ర మంతా ఉద్యమ స్ఫూర్తితో రగిలి పోవాలి. ఎందుకంటే స్టీల్‌ ప్లాంట్‌ కేవలం విశాఖకే పరిమితమైనదిగా చూడరాదు.

ముఖ్యమంత్రి జగన్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించమని కోరుతూ ప్రధానికి ఓ లేఖ రాశారు. ఆ తర్వాత ఆయన విశాఖలో కార్మిక నాయకులతో మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రానిదని, దానిపై
రాష్ట్రానికి హక్కులు లేవని, తన ఒక్కడి వల్ల ఏమీ కాదని చేతులెత్తేశారు. ఓ నిర్ణయాత్మక శక్తిలా కాకుండా ప్రాథేయపూర్వక స్వరంతో జగన్‌ మాట్లాడి అటు ప్రజల్లో ఇటు కార్మికుల్లో ఎలాంటి భరోసాను కలిగించ లేకపోయారు.

ప్రతిపక్షనేత హోదాలో చంద్రబాబు నాయుడు కూడా ప్రధానికి ఓ లేఖ రాశారు. ఆ తర్వాత విశాఖలో ఉక్కు ఉద్యమ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంపై ఒత్తిడి తేవడానికి జగన్‌పార్టీ ఎంపీల ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన మరు నిముషంలో తాము రాజీనామా చేస్తామని చెప్పి తన సహజరీతిలో ముందుకు పోయారు. ప్రతిపక్షనేత హోదాలో ఉన్నవాళ్లు రాజీనామా చేయడానికి మీన మేషాలు లెక్కిస్తున్నపుడు అధికారపక్షం వాళ్లు ఎలా చేస్తారన్న లాజిక్‌ను ఆయన మిస్సయ్యారన్న విమర్శలను చంద్రబాబు మూటకట్టుకున్నారు. ఈ విషయంలో ఎమ్మెల్యే గంటా చూపినపాటి చొరవ మిగతావారు చూపలేకపోయారన్న విమర్శలూ వెల్లువెత్తాయి.ఇక బీజేపీ రాష్ట్ర నాయ‌కులు ప్రధానిని కలుస్తాం, గట్టిగా నివేదిస్తాం అన్న ప్రకటనలకే పరిమితమై అంతకు మించి ఏమీ చేయలేమన్న నిస్సహాయతను ధ్వని మాత్రంగా వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు నవరత్న హోదా ఉందని, అలాంటప్పుడు ఎలా ప్రైవేటీకరణ చేస్తారని ప్రధాని మోదీని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కేంద్రం నిర్ణయంలోని హేతుబద్ధతను ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశంలోనే తీరం చెంత నెలకొల్పిన మొదటి ప్లాంటని, బీజేపీ లోపభూయిష్ట విధానాల వలనే దానికి నష్టాలు వచ్చాయని, ప్రైవేటీకరణ యత్నాలు విరమించుకోవాలని సీపీఎం పాలిట్‌ బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత గనులు ఇవ్వలేకపోతే గనులు పుష్కలంగా ఉన్న మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన స్టీల్‌ అధార్టీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)లో విలీనం చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ డిమాండ్‌ చేశారు. ఇలా ఎవరికి వారుగా, పార్టీల ప్రయోజనాలవారీగా స్పందిస్తున్నారు. కానీ నాటి తెన్నేటిలా ఉద్యమాన్ని ఎవరూ నడిపించడం లేదు. జనం ప్రభంజనమై కదిలి రావడం లేదు. కెరటాలై ముందుకు చొచ్చుకు రావట్లేదు. ఈ నేపథ్యంలో అందరి చూపు స్థానిక నేతల చిత్తశుద్ధిపైన, స్థానిక ప్రజల మనో బలం మీద పడింది.

గనులు కోసం పట్టుపడుతున్నాం

అనకాపల్లి ఎంపి సత్యవతి

ప్రధానంగా స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనుల కేటాయింపు, ప్లాంట్ రుణాలు ఈక్విటిగా సర్దుబాటు… వీటి మీదనే తమ పార్టీ నాయకుడు దృష్టిపెట్టడం జరిగిందని, వాటిని రాబట్టడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని అనకాపల్లి వైఎస్‌ఆర్‌సిపి ఎంపి సత్యవతి సృష్టం చేశారు.

ముందు రాష్ట్రంలోని గనులపై దృష్టి
దాడి రత్నాకర్‌, అనకాపల్లి వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీనియోజకవర్గ పరిశీలకుడు

స్టీల్‌ప్లాంట్‌కు నష్టాలనేవి తాత్కాలికమని, అవి కూడా సొంత గనులు లేక వచ్చినవని దాడి రత్నాకర్‌ అన్నారు. కేంద్రం ఇంతవరకూ గనులు కేటాయించలేదు కనుక ముందు మన రాష్ట్రంలోని గనులుస్టీల్‌ప్లాంట్‌కు అందుబాటులోకి వచ్చేలా చూసి తర్వాత కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నది తమ నాయకుడి ఆలోచనా విధానమని, అమేరకు తాము ప్రయత్నాలు చేస్తున్నామ‌ని అన్నారు.

 

బీజేపీది దుర్మార్గమైన చర్య
జె.వి. సత్యనారాయణ మూర్తి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి

స్టీల్‌ ప్లాంట్‌ విలువ రెండు లక్షల కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంద‌ని  సీపీఐ రాష్ట్ర నేత సత్యనారాయణ మూర్తి చెప్పారు. అంతటి విలువైనదాన్ని కేవలం రూ.1185 కోట్లకు అమ్మేయాలని బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా పూనుకుంటుందని ఆయన అన్నారు. దీన్ని అడ్డుకుంటామని మూర్తి గట్టిగా చెప్పారు. “ప్లాంట్‌కు సొంత గనులు, విస్తరణ కోసం చేసిన ఖర్చును ఈక్విటీగా మార్పు.. ఈ రెండూ కేంద్రం తక్షణమే నెరవేర్చాలి. అలా చేస్తే ఆ మర్నాటి నుంచే స్టీల్‌ ప్లాంట్‌లో వరుస లాభాలు వస్తాయో లేదో చూడండి” అన్నారాయన.

మోదీ విధానాల రివర్స్‌కు విశాఖ నాంది కావాలి
నర్సింగరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు

ప్రైవేటీకరణ తమ పాలసీ అని అనేక ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మేయాలని బీజేపీ దురహంకారంగా ప్రయత్నిస్తోందని నర్సింగరావు అన్నారు. రైల్వే, ఎలక్ట్రిసిటీ, బాంక్‌లు, ఎల్‌ఐసి, స్టీల్‌ప్లాంట్‌ను కార్పొరేట్లకు అమ్మేయాలని మొండిగా వెళ్తోందని ఆయన విమర్శించారు. ఆ విధానం తప్పు అని మోదీ విధానాలు రివర్స్‌లో వెళ్లేలా విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమమే నాంది అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “ప్రజా పోరాటమే ప్రైవేటీకరణను అడ్దుకోగలదని, అందుకు ప్రజలంతా ఏకతాటిపై పోరాడాలని” ఆయన పిలుపు ఇచ్చారు.

పూర్వీకుల త్యాగాలు వృథా కానివ్వం
అయోధ్య, స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ నాయకుడు, ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్‌

విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రం పెట్టిన రూపాయలతో పుట్టలేదని, 32మంది ప్రాణత్యాగాలతో, 64గ్రామ ప్రజల భూదానంతో అవతరించిందని  స్టీల్‌ ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌నాయకుడు,ఉక్కు పోరాట కమిటీ కన్వీనర్‌ అయిన అయోధ్య అన్నారు. వీరందరిత్యాగాలు వృథా కానివ్వమని ఎంతకైనా పోరాడి ప్లాంట్‌ను దక్కించుకుంటామని ఆయన అన్నారు. ప్లాంట్‌కు ఒకరూ ఇద్దరు కాదు 32వేలమంది కాపలాదార్లు ఉన్నారని, ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతామని ఆయన ఉద్దాటించారు.

 

ఇది జాతి సంప‌ద‌
మంత్రిరాజ‌శేఖ‌ర్‌, నేష‌న‌ల్ ఐఎన్‌టీయూసీ సెక్ర‌ట‌రీ, స్టీల్ ఐఎన్‌టీయూసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ


గ‌నులు లేక‌పోవ‌డం వ‌ల్ల విస్త‌ర‌ణ రుణ‌భారం మీద ప‌డ‌డం వ‌ల్ల ప్లాంట్‌కు న‌ష్టాలు వ‌చ్చాయని, కేంద్రం క‌నుక ఈ రెండింటిపైన త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటే స్టీల్‌ప్లాంట్ భ‌విష్య‌త్తు ఉజ్వ‌లంగా ఉంటుంద‌న‌డంలో సందేహ‌మే లేద‌ని మంత్రి రాజ‌శేఖ‌ర్ అన్నారు. భ‌విష్య‌త్తులో కూడా ప్లాంట్‌కు ఇబ్బంది రాకుండా సెయిల్‌లో విలీనం చేయాల‌ని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామ‌ని, ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణ‌కు పోరాటంలో ఇంట‌క్ ఎప్పుడూ ముందుంటుంద‌ని, ఇక‌ముందు కూడా అదే పోరాట పంథాలో కొన‌సాగుతుంద‌ని ఆయ‌న అన్నారు.

అసలు అమ్మాల్సిన పనెందుకు?
వి మహలక్ష్మినాయుడు, ఇంటక్‌ అనకాపల్లి కన్వీనర్‌

 

స్టీల్‌ ప్లాంట్‌కు నష్టాలొస్తున్నాయన్నది కేంద్రం చేస్తున్నదుష్ప్రచారం అని, సొంత గనులు ఇచ్చి చూస్తే లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో తెలుస్తుందని ఇంటక్‌ అనకాపల్లి కన్వీనర్ వి మహలక్ష్మినాయుడు అన్నారు. నష్టాలొస్తే కేంద్రం ఇచ్చినదానికి ఎనిమిది రెట్లు తిరిగి ఎలా చెల్లించగలిగామని ఆయన ప్రశ్నించారు. ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమం ఎవరడ్డొచ్చినా ఆగదని, కాపాడుకొని తీరుతామని ఆయన అన్నారు.

నేడు రాష్ట్రవ్యాప్త రాస్తా రోకోలు
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోడానికి నేడు రాష్ట్రవ్యాప్త రాస్తారోకోలకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపు ఇచ్చింది. అన్ని పార్టీలు తమతో కలసిరావాలని వేదిక కోరింది.

ప్రజాపోరాటానిదే అంతిమ విజయం
రాష్ట్రం అన్నివిధాల నిరాదరణకు గురౌతోంది. ప్రత్యేక హోదా లేదు. రైల్వే జోను రాలేదు. విభజన హామీలకు దిక్కులేదు. ఇలా రాష్ట్రంపై చెప్పలేని కక్ష అంతులేని వివక్ష ఇవి చాలవన్నట్లు మూలిగే
నక్కపై తాటిపండులా ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌పై ప్రకటన. కేంద్రంతో ఢీ కొని విజయం సాధించిన ఉద్యమం దాదాపుగా లేదు. కేసినోసెంటర్లలో యజమానులే ఎప్పుడూ లాభాలు గడిస్తూ ఉంటారు. వాళ్లదగ్గర నిధుల కొరత ఉండదు కనుక. ఆట వాళ్ల వైపు తిరిగే వరకూ ఆడుతునే ఉంటారు. అధికారంలో ఉన్నవాళ్లతో తలపడే ప్రజల పరిస్థితీ ఇలానే ఉంటుంది. ప్రభుత్వాలు ఎన్ని రోజులైనా పోరాడుతాయి. ప్రజలు ఎన్ని రోజులు పోరాడ‌గ‌ల‌ర‌ని డీలా ప‌డ‌క్క‌ర్లేదు.ప్ర‌భుత్వాలు పోరాడ‌డానికి ఐదేళ్లే ఉంటాయి..కానీ ప్ర‌జ‌లు నిరంత‌రం పోరాడ‌గ‌ల‌రు. ప్ర‌భుత్వాలు వ‌స్తుంటాయి.పోతుంటాయి. స్థిరంగా ఉండేది ప్ర‌జ‌లు…ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని నిర్వేదానికో నిరాశకో గురికావల్సిన పనిలేదు. పట్టుకునే ఆ ఆకులు  ఔష‌ధ‌గుణాలుండ‌వ‌చ్చు. కాలిన గాయాలు మాన్పుతాయి. ప్రజాపోరాటం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ బెషధ గుణ సంపన్నమే. అంతిమ విజయం ప్రజాపోరాటానిదే. అందుకే STEEL PLANT పోనివ్వం “STEAL PLANT” కానివ్వం. అన్న నినాదం ప్ర‌జ‌ల నాద‌మై మోగాలి. ప్ర‌మ‌థ‌నాద‌మై దిక్కులు పిక్క‌టిల్లాలి. ఆ దెబ్బ‌కు స్టీల్ ప్లాంట్ కుట్ర‌దారులు ఉచ్చ ‘పోస్కో’వాలి.

మ‌రి ఆల‌స్య‌మెందుకు..క‌దిలిరండి..క‌లిసిరండి స్టీల్‌ప్లాంట్ ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా…

(Visited 275 times, 1 visits today)

2 thoughts on “STEEL PLANT పోనివ్వం “STEAL PLANT” కానివ్వం

 • March 1, 2021 at 7:12 am
  Permalink

  “STEEL PLANT పోనివ్వం ‘STEAL PLANT’ కానివ్వం” అనే నినాదం ప్ర‌జ‌ల నాద‌మై మోగుతుంది. ప్ర‌మ‌దనాద‌మై దిక్కులు పిక్క‌టిల్లుతాయి.
  మీ కల సాకారమౌతుంది సార్.
  మీకు అనంత కోటి వందనాలు.

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *