షుగర్ ఫ్యాక్టరీని దివాలా సంస్థగా ప్రకటించడం తగదు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలి అఖిల పక్ష నేతలు డిమాండ్
అనకాపల్లి :
అనకాపల్లి మండలం, తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని దివాలా సంస్థగా ప్రకటించడం ప్రభుత్వానికి తగదని వెంటనే విరమించుకోవాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక సిపిఐ కార్యాలయం ఆవరణలో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో షుగర్ ఫ్యాక్టరీ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్షలాది రైతుల భాగస్వామ్యంతో ఏర్పడి సహకార రంగంలో నడిచేది రైతులతో సంప్రదించకుండా ప్రభుత్వం ఎలా దివాలా సంస్థగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రైతుల భార్యల పుస్తులు అమ్మేసి ఫ్యాక్టరీ లో పెట్టుబడి పెడితే రైతుల ప్రమేయం లేకుండా, జనరల్ బాడీ సమావేశం పెట్ట కుండా ఏ ప్రాతిపదికన దివాళ సంస్థగా ప్రకటిస్తారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ పై లక్షలాది రైతు కుటుంబాలు, వేలాది మంది కార్మికులు, చిన్నచిన్న వ్యాపారులు, షుగర్ ఫ్యాక్టరీ ఆధారిత అనుబంధ పరిశ్రమలు, మోటార్ కార్మికులు ఆధారపడి ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. షుగర్ ఫ్యాక్టరీకి చెందిన విలువైన భూములు అలాగే ఇతర ఆస్తులు కబ్జా చేయడానికి అధికార పార్టీకి చెందిన నేతలు ఈ దంతా చేస్తున్నారని అయితే వారి ఆటలు సాగనీయబోమని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని, నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీ ని ఆధునికరించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమములో సిపిఐ నాయకులు వైయన్ భద్రం, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కొణతాల హరినాథ్ బాబు, ప్రజా రాజకీయ వేదిక వ్యవస్థాపకులు కనిశెట్టి సురేష్ బాబు, ముక్కామల చిన్న తదితర అఖిలపక్ష రాజకీయ, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.