ఎండలు బాబోయ్ ఎండలు…

ఎండ… ఇది సూర్యుడి ఆస్తి.

సూర్యుడు ఉన్నంతవరకూ మనకు ఎండపొడ తప్పదు.

ఉదయం ఎండ ఆరోగ్యానికి మంచిది. ఉదయమే లేవడం శరీరానికి మంచిది. మధ్యాహ్నం ఎండ తల్లకిందులు చేసి ఉసూరుమనిపిస్తుంది. సూర్యాస్తమయ ఎండ సంతోషాన్ని ఇస్తుంది.

ఎండ నించి తప్పించుకోవడానికి నీడ కావాలి. నీడ ఉచితంగా పొందడానికి చెట్టు కావాలి.

ఎండ వేడిని తగ్గించడానికి చెట్లను ఎగదనివ్వాలి. అది కుదరదంటే ఉన్న చెట్లనైనా కాపాడుకోవాలి.

ఎండా, వానా కలిస్తే హరివిల్లు రూపొందుతుంది. అది పలువురు కవుల కవితలకు ముడిసరుకవుతుంది.

ఎండ వేడి నుంచి మనల్ని కాపాడేది రోడ్డు పక్కనున్న చెట్లే. అవే సహజసిద్ధమైన గొడుగులవుతాయి. కనుక చెట్లను పెంచుదాం. కాపాడుకుందాం. అంతేతప్ప ఎండను మాటలంటే అదేమీ ఊరుకోదు.

రథసప్తమి రావడంతోనే మొదలు ఎండ వేడి….ఎండ రోజురోజుకూ ఎక్కువ వుతోంది.

ఓ కాటన్ రోల్ కోసం ఎండలో బయలుదేరాను. గుమ్మంలోకొచ్చి చెప్పులు వేసుకుని రోడ్డున పడ్డాను. ఎండ వేడి బెదిరించింది. అయినా అటూ ఇటూ నాలుగు రోడ్లు నడిచొచ్చాను. కాటన్ రోల్ తో ఇంటికి చేరాను.

టీవీ ఆన్ చేస్తే వచ్చే ప్రోగ్రాములన్నీ ఎండ వేడిని మించి బుర్రను వేడెక్కించాయి.

సెల్ ఫోన్లో వార్తలు చూస్తుంటే పిచ్చెక్కింది.

సరే, కాస్సేపు విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చితే కరెంటు కోత….

నాకు సహకరించడానికి నీకు మనసులేదా అని తిట్టాలనిపించింది కరెంటుకోతనూ…ఉక్కపోతనూ…

ఏం చేయనూ…ఇంకో మూడు నెలలు తప్పదు ఈ ఎండలతో పాట్లు…

బీటలు వారిన భూమినీ, ఎండిన ఎదనూ మళ్ళీ మళ్ళీ ఉడికించడానికి ఈ ఎండలు రావలసిందేనా….

వాడిన పంటనూ, నలిగిన ప్రాణాన్ని మళ్ళీ మళ్ళీ నజ్జుగుజ్జు చేయడానికి రావలసిందేనా ఈ ఎండలు….

ఆడిన రోజులు, పాడిన క్షణాలు అన్నీనూ మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుందా అనుకుంటూ అంతరంగంలో దాక్కున్నాయి.

ఏదీ తెలీనట్లు ఈ ఎండలొకటి….కష్టాలను మాత్రమే మోసుకొచ్చి మనల్ని వాటేసుకోవడం విచిత్రమే….

ఎండ ఇచ్చే వేడి కన్నా మన హృదయంలో గూడు కట్టుకున్న వేల బాధల వేడికి ఏసీలేం పని చేస్తాయి….ఏ చెట్టు నీడ పనికొస్తుంది. వేడితో అందరినీ ఉతికి ఆరేస్తుంది ఎండ. దానికేమీ పక్షపాతం లేదు. మిట్టమధ్యాహ్నం నడిరోడ్డులో చెప్పులు తెగడంతో ఏం చెయ్యాలో తెలీక అయోమయంలో పడిపోయే మనిషిలా ఈ ఎండలు మన ఆహార్యాన్ని చెరిపేసి చెమట కంపుతో ఉడికిస్తుంది. ముఖం కందగడ్డలా ఎరుపెక్కుతుంది.

ఎండా కాలంలో ఉదయం నవ్విస్తుంది. మధ్యాహ్నం పుండవుతుంది. సాయంత్రం ఒకింత తగ్గుతుంది. చేసుకున్న పదార్థాలు శీఘ్రమే చెడిపోతాయి. పానీయాలూ త్వరగా ఖాళీ అయిపోతాయి.

 

ఫ్రిజ్జుకన్నా కుండకే మార్కులన్నీ పడతాయి….

చీమలు, దోమలూ జడలు విప్పుతాయి. పువ్వులూ పిల్లలూ వాడుతారు ఎండలో…

ఎన్ననుకున్నా తప్పదు ఎండ…

ఎవరు తిట్టుకున్నా తిట్టకున్నా

తన పని తాను చేసుకుపోతుంటుంది ఎండ….

                                                                                                       – యామిజాల జగదీశ్

(Visited 33 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *