వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి

(22న గిడుగు రామమూర్తి వర్థంతి)

దేశానికి స్వాతంత్య్రం ఎటువంటిదో ప్రజలకు భాషా స్వాతంత్య్రంకూడా అటువంటిదేనని చెప్పి దానికోసం పోరాడి గెలిచిన భాషా సాహిత్య యుగపురుషుడు గిడుగు.వ్యావహారిక భాషోద్యమ పితామహుడు, ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు,

గిడుగు పూర్వీకుల గురించి ప్రస్తావిస్తే రామమూర్తి తాతగారు సుబ్బయ్య, ఆయన తాతగారు జోగిరాజు, ఆయన తాతగారు నూకరాజు.18వ శతాబ్దం తొలినాళ్లలో గిడుగు రామ్మూర్తి పూర్వీకులు అమలాపురం దగ్గర ఇందుపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. గిడుగు వేంకట రామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీన శ్రీకాకుళంకు ఉత్తరాన ఇరవై మైళ్ల దూరంలో గల శ్రీముఖలింగం వద్ద పర్వతాలపేటలో జన్మించారు. తల్లి వెంకమ్మ, తండ్రి వీర్రాజు. తండ్రి పర్వతాలపేటలో రెవెన్యూ అధికారిగా పనిచేసారు. గిడుగు అక్షరాభ్యాసం పర్వతాలపేటలో జరిగింది. గోనెపాడు ఎలిమెంటరీ స్కూలు ఉపాధ్యాయుడు వారణాసి గున్నయ్యశాస్త్రి వద్ద ఆయన తెలుగు అక్షరాలు, అంకెలు కొద్ది రోజులు నేర్చుకున్నాడు. తరువాత బొంతలకోడూరు బైరాగి పట్నాయక్‌ వద్ద రెండు సంవత్సరాల కాలంలో రెండు శతకాలు, ఆంధ్రనామ సంగ్రహము, పెద్దబాలశిక్షలో కొన్ని విషయాలు నేర్చుకున్నారు. 8 ఏళ్ల వయస్సులో ఆయనకు ఉపనయనం జరిగింది.కాళ్లకూరి విశ్వనాథం వద్ద ఇంగ్లీషు అక్షరాలు నేర్చుకున్నారు.1875లో తండ్రికి చోడవరం బదిలీ అయ్యింది. తండ్రి అక్కడే విషజ్వరంతో చనిపోయారు.1975 నుండి 1880 వరకు గిడుగు విజయనగరం మహారాజా ఇంగ్లీషు మీడియం పాఠశాలలో చదువుకున్నారు. ఆ రోజుల్లో లోయర్‌ ఫోర్త్‌ తరగతిలో గురజాడ అప్పారావు ఆయనకు సహాధ్యాయిగా పరిచయం అయ్యారు. ఇక్కడే 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వెంటనే విశాఖపట్నంలోని కలెక్టర్‌ కార్యాలయంలో ఆరుమాసాలపాటు గుమాస్తా పనికోసం ప్రొబేషన్‌గా వాలంటరీ చేసారు. నెలకు కేవలం 15 రూపాయలు ఇచ్చేవారు. అదే ఏడాది భీమునిపట్నంకు చెందిన కందికొండ రామదాసు రెండవ కుమార్తె అన్నపూర్ణమ్మను వివాహం చేసుకున్నారు. 1880లో పర్లాకిమిడి రాజావారి మిడిల్‌ స్కూల్‌లో చరిత్ర బోధించే ఉపాధ్యాయునిగా లభించింది. అప్పట్లో ఆయన జీతం కేవలం 30 రూపాయలు. 1882లో ఎఫ్‌ ఏ పరీక్షలను ప్రథమశ్రేణిలో పూర్తిచేసారు.ఎఫ్‌ ఏ పాసయిన తరువాత ఆయన జీతం 65 రూపాయలకు పెరిగింది. 1884లో భార్య మెట్టినింట అడుగుపెట్టారు. ఆ దంపతులకు సీతాపతి, వీర్రాజు, రామదాసు, సూర్యనారాయణ అనే నలుగురు కుమారులున్నారు. 1888లో గిడుగుకు మాతృవియోగం కలిగింది. 1892లో పర్లాకిమిడి రీడింగ్‌రూమ్‌కు కార్యదర్శిగా వ్యవహరించారు.1893లో శ్రీముఖలింగంలో గల మధూకేశ్వర ఆలయం, భీమేశ్వరాలయం, సోమేశ్వర ఆలయంలలో గల శాసనాలను అధ్యయనం చేసి ప్రామాణిక వ్యాసాలను రాసారు. 1895లో ఆర్ట్స్‌లో బ్యాచులర్‌ డిగ్రీ సాధించారు. తరువాత పర్లాకిమిడి రాజావారి కళాశాలలో లెక్చరర్‌గా మారారు. ఆయన జీతం 100 రూపాయలకు పెరిగింది. 1904లో ఆయనకు సబ్‌రిజిస్ట్రార్‌గా ఉద్యోగం వచ్చినా తల్లికి ఇష్టంలేనందున చేరలేదు.1907లో రాజమండ్రిలో ఉపాధ్యాయశిక్షణ పొందుతున్న రోజుల్లో ఆయన అంతర్జాతీయ ధ్వని లిపిని నేర్చుకున్నారు.

1908లో ఉపాధ్యాయ పరిషత్‌ సమావేశంలో భాషాతత్త్వ పరిశీలన గురించి ప్రసంగించారు. ఆ ప్రసంగంలో ఆర్యభాషా కుటుంబానికి చెందిన లాటిన్‌, గ్రీకు, జర్మన్‌, ఆంగ్లము, సంస్కృతములకు సంబంధించిన వ్యాకరణములను, ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన తమిళ, తెలుగు భాషలకు గల వ్యాకరణాలన్నింటినీ తాను పరిశీంచిన విషయాన్ని ప్రస్తావించారు. 1911లో ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ గావించారు. అదే ఏడాది ప్రభుత్వం సర్టిఫికేట్‌ ఆఫ్‌ మెరిట్‌ను ప్రదానం చేసింది.1912లో డేనిల్‌ జోన్స్‌ మద్రాసులో పర్యటించినప్పుడు ఆయనను కలిసి భాషా భేదాలను గురించి చర్చించారు. అదే ఏడాది సవర డైలాగ్స్‌ అనే పుస్తకాన్ని ప్రచురించారు. సవర భాషకోసం ఆయన చేసిన కృషిని గుర్తించి బ్రిటిష్‌ప్రభుత్వం 1913లో రావు సాహెబ్‌ అనే బిరుదును ఇచ్చింది. అదే ఏడాది సవర సాంగ్స్‌ అనే పుస్తకాన్ని ప్రచురించారు. 1914లో సవర రీడర్స్‌ అనే రచనతో పాటు సవర-తెలుగు నిఘంటువు రూపొందించారు. 1919లో ఆయన తెలుగు అనే మాసపత్రికను నడిపారు. ఆపత్రిక ద్వారా శాస్త్రీయ వ్యాసాలు, ఉపన్యాసపాఠాలుతో పోరాటం సాగించాడు. కానీ ఆ పత్రిక ఒక్క ఏడాది మాత్రమే నడిచింది. అదే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కందుకూరి వీరేశలింగం అధ్యక్షునిగా, గిడుగు రామమూర్తి కార్యదర్శిగా వర్తమానాంధ్రభాషా ప్రవర్తక సమాజంను రాజమండ్రిలో స్థాపించారు. 1922లో చిన్నపిల్లల కోసం నీతి కథలను రాసారు.

1931లో ఆయనరాసిన సో-రా మాన్యుయల్‌ అంతర్జాతీయ ధ్వనిలిపిలో రాయబడిన మొట్టమొదటి వర్ణనాత్మక వ్యాకరణం. (ఇంగ్లీషులో సవరభాషకు వ్యాకరణం). అదే ఏడాది మదరాసు ప్రభుత్వం ఆ పుస్తకాన్ని ప్రచురించింది. 1933లో గిడుగు సప్తతి మహోత్సవంను రాజమండ్రిలో ఆయన శిష్యులు గావించారు. 1933లో ఆంధ్రపండిత భిషక్కుల భాషాభేషజము అనే రచన గావించారు. అదే ఏడాది ఇంగ్లీషు-సవర నిఘంటువును డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ అధ్యక్షతన జరిగిన సభలో గిడుగు తన మిత్రుడైన విక్రమదేవవర్మకు అంకితమిచ్చారు. 1933లో వ్యావహారిక భాషలో గిడుగు రాసిన వ్యాసాలన్నింటినీ సంకలనం చేసి వ్యాసావళి అనే పేరుతో ప్రచురించారు. 1935లో 5వ జార్జి చక్రవర్తి రజతోత్సవ పతకాన్ని గిడుగుకు ప్రభుత్వం ప్రదానం చేసింది. వ్యావహారిక భాషలో గిడుగు రాసిన వ్యాసాలన్నింటినీ 1955లో రెండవసారి, 1992లో మూడవమారు ప్రచురించారు. ఆయన గద్యచింతామణి, వ్యాసకవి శరణ్యము, వ్యాస సంగ్రహము అనే రచనలు చేసారు.1934లో ప్రభుత్వం ఆయనకు కైజర్‌-ఇ-హింద్‌ అనే బిరుదును స్వర్ణపతకాన్ని ప్రదానం చేసింది. 1936లో సవర-ఇంగ్లీషు నిఘంటువును రూపొందించారు. అదే ఏడాది మదరాసు ప్రభుత్వం ఆ పుస్తకాన్ని ప్రచురించింది. 1936 ఏప్రిల్‌ 1వ తేదీన ఒరిస్సా రాష్ట్రం ఏర్పడినప్పుడు పర్లాకిమిడి రాజా తన తాలూకా ప్రాంతాన్ని ఒరిస్సాలో చేర్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా గిడుగు పోరాటం చేసి తరువాత అక్కడ ఉండడం ఇష్టం లేక రాజమండ్రికి తన మకాం మార్చారు.

గిడుగు, గురజాడ, శ్రీనివాస అయ్యంగార్‌, యేట్స్‌ అనే నలుగురి ఆలోచనలే తెలుగుభాషోద్యమానికి స్వీకారం చుట్టాయి. 1938లో ఆంధ్రవిశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో గౌరవించింది. 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో వివిధ పత్రికా సంపాదకులను ఉద్దేశించి గిడుగు చారిత్రాత్మక ప్రసంగంచేసారు. 1940 జనవరి 22వ తేదీన గిడుగు కన్నుమూసారు. 1964లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ గిడుగు వ్యాసాలను ప్రచురించింది. 1976లో జివి రామమూర్తి ” గిడుగు రామమూర్తి జీవితచరిత్ర”ను రాసారు. సాతపల్లి చంద్రశేఖర్‌ గిడుగు వేంకట రామమూర్తి –

భాషాసాహిత్యసేవ అనే పుస్తకాన్ని రాసారు. 1988లో అక్కిరాజు రమాపతి గిడుగురామమూర్తి జీవిత ఉద్యమం అనే రచన చేసారు. గిడుగు కుమారుడు సీతాపతి రామమూర్తి పంతులుగారి చిత్రవిచిత్రఘట్టాలు అనే వ్యాసాన్ని రాసారు. 2004-05లో పార్వతీపురంలో సవరభాష మాధ్యమంగా పాఠశాల ఏర్పడింది. బుర్రా శేషగిరిరావు, చిలుకూరి నారాయణరావు, తాపీ ధర్మారావు వంటి అనేక మంది ప్రతిభావంతులు గిడుగు శిష్యులే. గిడుగు జన్మదినాన్ని తెలుగు భాషాదినోత్సవంగా జరుపుకోవడం ముదావహం.

(Visited 4 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *