వాహన యజమానులు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి : జిల్లా రవాణా అధికారి ఎం వీర్రాజు
అనకాపల్లి :
అనకాపల్లి జిల్లాలో ఉన్న అన్ని రకాల వాహన యజమానులు రోడ్డు భద్రత దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను విధిగా పాటించాలని జిల్లా రవాణా అధికారి ఎం వీర్రాజు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో గల అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు లేని వాహన దారులు ఏపీఆర్టీఏసిటిజన్.ఈప్రగతి.org అనే వెబ్ సైట్ ద్వారా హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను బిగించేందుకు రిజిస్ట్రేషన్ చేసుకుని, స్లాట్ నమోదు చేసుకునే సదుపాయంను వాహనదారులు వినియోగించుకోవాలన్నారు. వాహన యజమానులు తమ వాహనాలకు వెనుక వైపు రిఫ్లెక్టివ్ టేపును తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు.
హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు, రెఫ్లెక్టివ్ టేపులు లేని వాహనాలపై మోటారు వాహన చట్టం ప్రకారము చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణా శాఖ అధికారి ఎం వీర్రాజు వాహనదారులకు హెచ్చరించారు.