విశాఖ ఉక్కు ఆంధ్రుల‌సెంట్‌మెంట్‌

ఉద్య‌మాన్ని టీడీపీ ముందుకుతీసుకువెళుతోంది..
ఉక్కు పోరులో ‌చిత్త‌శుద్ధి మాదే
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు

విశాఖ‌ప‌ట్నం : విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు..స్టీల్‌ప్లాంట్‌తోనే విశాఖ‌కు వెలుగ‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్నారు. ఆమరణ దీక్షతో ఉక్కు ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ ఊపిరి పోశారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును మంగళవారం విశాఖ డెయిరీ ఆసుపత్రిలో చంద్రబాబు పరామర్శించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. విశాఖలో ఆనాటి పోరాటంతో స్వయంగా ఇందిరాగాంధీనే దిగివచ్చారని.. అన్నిటికంటే విశాఖే మంచిదని ఆ రోజే కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. 32 మంది ప్రాణ త్యాగం ఫలితమే విశాఖ ఉక్కు అని.. స్టీల్‌ ప్లాంట్‌ లేకపోతే ఇవాళ విశాఖ లేదన్నారు. ఉక్కు పరిశ్రమను సాధించే క్రమంలో చేసిన ప్రాణత్యాగాలకు సీఎం జగన్‌ విలువ లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ అంటే నాకు ప్రాణమని చంద్రబాబు అన్నారు.


పోర్ట్‌ బేస్‌లో ఎక్కడా స్టీల్‌ ప్లాంట్‌ లేదని.. ఒక్క విశాఖలోనే ఉందన్నారు. ఆనాడు రైతులిచ్చిన భూమి విలువ ఇవాళ రూ.వేల కోట్లు ఉంటుందని చెప్పారు. ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభమైన వైకాపా పాలన ఇవాళ అదే తీరుతో కొనసాగుతోందని విమర్శించారు. అంతటితో ఆగకుండా కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టడం మొదలుపెట్టారని ఆరోపించారు. ‘‘విశాఖ ప్రజల అభిప్రాయాలు తీసుకున్నాకే అమరావతిని రాజధానిగా ప్రకటించాం. విశాఖ అంటే నాకు ప్రాణం. నేను మెచ్చే నగరం ఎప్పుడూ విశాఖనే. ఇక్కడి ప్రజలు మంచివారు. నీతి, నిజాయతీతో ప్రజలుండే ప్రాంతం.. శాంతిని కోరుకునే ప్రాంతం విశాఖపట్నం. కాలక్రమేనా దేశంలోని అన్ని ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఇవాళ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ఒకటి. రాష్ట్రానికి విశాఖ ఎప్పటికీ ఆర్థిక రాజధానిగానే ఉంటుంది’’ అని అన్నారు.

(Visited 30 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.