విశాఖ ఉక్కు మనదే…
ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకం
అసెంబ్లీ తీర్మానం కూడా ప్రవేశపెడతాం
కార్మిక సంఘాల బేటీలో సీఎం జగన్మోహన్రెడ్డి
విశాఖపట్నంః విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానిచ్చేదిలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. ఎస్.జగన్ మోహన్‌రెడ్డి కార్మికసంఘాల ప్రతినిధులకు హామీ ఇచ్చారు. బుధవారం విశాఖ పర్యటన సందర్భంగా విమానాశ్రయంలో సీఎంతో ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు భేటీ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఎన్ఎండీసీని విశాఖ ఉక్కుతో అనుసంధానించాలని, దాని వల్ల సొంత గనుల సమస్య తీరుతుందన్నారు. అనుసంధానానికి కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. దాదాపు గంటకు పైగా సమావేశం జరిగింది.కార్మికసంఘాల నేతలు అడిగిన ప్రశ్నలకు సవధానంగా సీఎం సమాధానాలు ఇచ్చారు. ఓ దశలో మీ వెంటే నేను అన్నట్లు మాట్లాడారు. ఉక్కును కాపాడుకోనేందుకు సర్వ శక్తులా ఒడ్డాడుదామన్నారు. ఉక్కుపై తాను రాసిన లేఖకు కేంద్రం నుండి త్వరలో సమాధానం వస్తుందని ఆ తరువాత ఏమి చేయాలో మీ అందరితో ఆలోచన చేసి తుది నిర్ణయం తీసుకుందామన్నారు. ఉక్కును కేంద్రం ప్రైవేటీకరణ చేయకుండా అన్ని ప్రయత్నాలు చేద్దామని తెలిపారు. సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణదాస్, కన్నబాబు, ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు. కార్మికనేతలు సీహెచ్. నర్సింగరావు, జే.వి. సత్యనారాయణమూర్తి, అయోధ్యరామ్, ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా విశాఖలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే.