సంక్షేమ, అభివృద్దిని  వేగ‌వంతం చేయాలి

జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్
పార్వ‌తీపురంలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌
సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి స్థ‌ల ప‌రిశీల‌న‌
స‌చివాల‌యం, పిపిసి కేంద్రం, బ్యాంకు శాఖ‌ల త‌నికీ
న‌ర్సిపురం లేఅవుట్‌ను సంద‌ర్శించిన‌ క‌లెక్ట‌ర్

పార్వ‌తీపురం (విజ‌య‌న‌గ‌రం) : ప్ర‌భుత్వ ప‌రంగా జ‌రుగుతున్న ప‌లు అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ త‌నిఖీ చేశారు. స‌బ్ క‌లెక్ట‌ర్ విదేహ ఖ‌రే, ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌తో క‌లిసి పార్వ‌తీపురంలో ఆయ‌న శుక్ర‌వారం సుడిగాలి ప‌ర్య‌ట‌న జ‌రిపారు. ప‌లు కార్యాల‌యాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయాల‌ని, సంక్షేమ ఫ‌లాల‌ను అర్హులంద‌రికీ అందించాల‌ని ఆదేశించారు.
నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి స్థ‌ల ప‌రిశీల‌న‌
పార్వ‌తీపురంలో ప్ర‌తిపాదిత‌ మ‌ల్టీసూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి స్థ‌లాన్ని ముందుగా క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ఈ ఆవ‌ర‌ణ‌లో సుమారు 8 ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన కార్యాల‌యాల‌ను, వాటి స్థితిగ‌తుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. ఆయా శాఖ‌ల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. అనంత‌రం స‌బ్‌క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. వారి అవ‌స‌రాల‌ను తెలుసుకున్నారు. ఆయా శాఖ‌ల రాష్ట్ర ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడారు.

అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌జా ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌న్నారు. గిరిజ‌న ప్రాంతంలో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి రావ‌డం ఎంతో ప్ర‌యోజ‌న‌క‌ర‌మ‌ని, దానికి అన్ని శాఖ‌లూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. ప్ర‌తిపాదిత ఆసుప‌త్రి స్థ‌లంలో ప్ర‌స్తుతం నిరుప‌యోగంగా ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను త‌క్ష‌ణ‌మే స్వాధీనం చేసుకోవాల‌ని అన్నారు. వినియోగంలో ఉన్న ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు ప్ర‌త్యామ్నాయ భ‌వనాల‌ను గుర్తించి ఇవ్వాల‌ని స‌బ్ క‌లెక్ట‌ర్‌ను ఆదేశించారు. వారి అవ‌సరాల‌కు త‌గ్గట్టుగా, వారి అంగీకారం తోనే త‌గిన భ‌వ‌నాల‌ను కేటాయించాల‌ని సూచించారు. డాక్ట‌ర్ల క్వార్ట‌ర్ల‌ను మ‌ర‌మ్మ‌తు చేసి, ప‌శు సంవ‌ర్థ‌క‌శాఖ‌కు అప్ప‌గించాల‌న్నారు. శిధిల భ‌వ‌నాల‌ను ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు తొల‌గించాల‌ని, స్థ‌లాన్ని స్వాధీనం చేసుకొని ఎపిఎంఐడిసికి అప్ప‌గించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.
ఈ కార్య‌క్ర‌మంలో వ్య‌వ‌సాయ‌శాఖ‌ జెడి ఎం.ఆశాదేవి, ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జెడి డాక్ట‌ర్ ఎంవిఏ న‌ర్సింహులు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, ఇరిగేష‌న్ ఇఇ ఆర్‌.అప్ప‌ల‌నాయుడు, ఆసుప‌త్రి సూప‌రింటిండెంట్ వాగ్దేవి, తాశీల్దార్ రామ‌స్వామి ఇంకా పోలీసు, ఆర్అండ్‌బి, ఆర్‌డ‌బ్ల్యూఎస్ త‌దిత‌ర శాఖ‌ల అధికారులు పాల్గొన్నారు.


జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ బీమా అమ‌లు ప‌రిశీల‌న‌
ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త నిస్తున్న జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ఆర్ బీమా కార్య‌క్ర‌మాల అమ‌లును ప‌రిశీలించారు. దీనిలో భాగంగా పార్వ‌తీపురం ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచ్‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ఆయా ప‌థ‌కాల ల‌క్ష్యాల‌పై బ్యాంకు మేనేజ‌ర్ పి.రామ‌కృష్ణ‌ను ప్ర‌శ్నించారు. తోడు ప‌థ‌కానికి సంబంధించిన పార్వ‌తీపురం అర్బ‌న్‌లో కేవ‌లం 38శాతం మాత్ర‌మే గ్రౌండింగ్ అవ్వ‌డం ప‌ట్ల క‌లెక్ట‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ఆ ఒక్క బ్రాంచ్ లోనే 363 యూనిట్ల‌ను స్థాపించాల్సి ఉండ‌గా, ఇప్ప‌టివ‌ర‌కు 177 మాత్ర‌మే మంజూరు చేశార‌ని అన్నారు. రెండు రోజుల్లో శ‌త‌శాతం యూనిట్ల‌కు రుణాన్ని మంజూరు చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. స‌ర్వ‌ర్‌కు సంబంధించిన సాంకేతిక స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధిత ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడి, దానిని ప‌రిష్క‌రించాల‌ని సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రం త‌నిఖీ
ప్రాధ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కారం సంఘం వ‌ద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. అక్క‌డి ధాన్యం కొనుగోలుపై వాక‌బు చేశారు. కేవ‌లం మూడు రోజుల క్రిత‌మే కొనుగోలు కేంద్రం ప్రారంభ‌మైన‌ట్లు తెలుసుకున్నారు. స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. మిల్లుల‌తో కేంద్రం ట్యాగింగ్ జ‌ర‌గ‌లేద‌ని, అందువ‌ల్ల కేంద్రం నుంచి ధాన్యం మిల్లుల‌కు వెళ్ల‌టం లేద‌ని సిబ్బంది క‌లెక్ట‌ర్ దృష్టికి తెచ్చారు. వెంట‌నే జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ జిసి కిశోర్‌కుమార్‌తో క‌లెక్ట‌ర్ ఫోన్‌లో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల‌ను మిల్ల‌ల‌తో ట్యాగింగ్ చేయాల‌ని, రైతు ఇబ్బంది ప‌డ‌కుండా చూడాల‌ని ఆదేశించారు. ఒక‌టిరెండు రోజుల్లో ఈ స‌మ‌స్య పూర్తిగా ప‌రిష్కారం చేస్తామ‌ని జెసి వివ‌రించారు. వ్య‌వ‌సాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, తాశీల్దార్ రామ‌స్వామి, ఏఓ రేఖ త‌దిత‌రులు కూడా ఉన్నారు.

స‌చివాల‌య సంద‌ర్శ‌న‌
న‌ర్సిపురంలోని స‌చివాల‌యాన్ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ సంద‌ర్శించారు. అక్క‌డి వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. సిబ్బందితో మాట్లాడారు. వివిధ సేవ‌ల‌కు సంబంధించి పెండింగ్ లో ఉన్న ద‌ర‌ఖాస్తుల‌పై ఎంపిడిఓ రామ‌కృష్ణ‌ను ప్ర‌శ్నించారు. పౌర స‌ర‌ఫ‌రాలు, రెవెన్యూకు సంబంధించిన అంశాల‌పై ఎక్కువ‌గా ద‌ర‌ఖాస్తులు పెండింగ్ లో ఉంటున్నాయ‌ని అన్నారు. వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను నిర్ణీత గ‌డువులోగానే ప‌రిష్క‌రించాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. జ‌గ‌న‌న్న తోడు, వైఎస్ ఆర్ బీమా ప‌థ‌కాల‌ను శ‌త‌శాతం అమ‌లు చేయాల‌ని ఆదేశించారు. త్వ‌ర‌లో చేయూత ప‌థ‌కం క్రింద ఆవులు, గేదెలు మంజూరు చేస్తామ‌ని, ఆ యూనిట్ల‌ను గ్రౌండింగ్ చేసి, పేద‌లకు ఆర్థికంగా భ‌రోసా క‌ల్పించాల‌ని కలెక్ట‌ర్ కోరారు.

లేఅవుట్ ను ప‌రిశీలించిన క‌లెక్ట‌ర్‌
పేద‌ల కోసం న‌ర్సిపురంలో ప్ర‌భుత్వం రూపొందించిన ఇళ్ల స్థ‌లాల లేఅవుట్ ను క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. సుమారు 2.79 ఎక‌రాల్లో 105 ఇళ్ల స్థ‌లాల‌తో లేఅవుట్‌ను రూపొందించిన‌ట్లు తాశీల్దార్ రామ‌స్వామి క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. లేఅవుట్ ను పూర్తిగా చ‌దును చేసి, పిచ్చిమొక్క‌ల‌ను తొల‌గించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. అలాగే అంత‌ర్గ‌తంగా గ్రావెల్ రోడ్ల‌ను వేయాల‌ని, లేఅవుట్ వ‌ద్ద బోర్డుల‌ను ఏర్పాటు చేయాల‌ని సూచించారు. అన్ని వ‌స‌తుల‌తో లేఅవుట్ల‌ను సంపూర్ణంగా సిద్దం చేయాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ ఆదేశించారు.

(Visited 23 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *