కోవిడ్ తో మృతి చెందిన జర్నలిస్ట్ లకు సాయం


(జి. సాయి ప్రసాద్-హైదరాబాద్)

కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల తక్షణ ఆర్థిక సహాయంఅందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ
చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పక్షాన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలను తక్షణ ఆర్థిక సహాయం కింద అందజేయనున్నామని తెలిపారు.కొత్తగా 200 మంది కరోనా సోకిన జర్నలిస్టులకు కూడా తక్షణ సాయం అందజేస్తామని చెప్పారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజె హెచ్-143), ఇతర జర్నలిస్టు సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ తెలిపారు.

కాగా రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో కేవలం గత 10 రోజుల సమయంలోనే 15 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడి మరణించారని తెలిపారు. ఇటీవల కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు రెండు లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి కార్యాలయానికి మే, 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబాలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారితో కరోనా మరణ ధృవీకరణ పత్రము, అక్రిడిటేషన్ కార్డు, కరోనా పాజిటివ్ రిపోర్టులతోపాటు ఆయా జిల్లాల డి.పి.ఆర్.ఓ.లు ధృవీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు.ఆయా జర్నలిస్టు సంఘాలు మరణించిన కుటుంబాల తరుఫున ధృవీకరణ పత్రాలు సమర్పించడానికి కృషి చేయాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు.

నింపిన దరఖాస్తులను కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్స్, మాసాబ్ ట్యాంక్, తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్ చిరునామా కు పంపించాలని అల్లం నారాయణ సూచించారు. ఇతర వివరాలకు టెలిఫోన్ నెం.040-23298672/74 నెంబర్లను సంప్రదించాలన్నారు.

(Visited 117 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *