కళలకు నిలయం

సంగీత సరస్వతికి స్వరార్చన అహరహం జరిగే దేవాలయం మహారాజా సంగీత నృత్య కళాశాల
(ఫిబ్రవరి 5న మహారాజా సంగీత నృత్య కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా)

కళలకు నిలయం.. కాంతుల వలయం
సంస్కృతీ పరిమళాలు వెదజల్లే కోవెల
సాహితీ సాంస్కృతిక రాజధాని
మన విజయనగరంలో
గత వైభవాన్ని స్మరించుకుంటూ
తన వారసత్వాన్ని కాపాడుకుంటూ
అందెల సవ్వడితో సమ్మోహితులను గావిస్తూ
స్వరాలతో శ్రవణానందం కలిగస్తూ
మృదు మధుర మృదంగ నాదంతో
మనసును మైమరపించే వీణావాదనతో
సంగీత సరస్వతికి స్వరార్చన అహరహం జరిగే దేవాలయం
మన మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల

 

 

ఆవిర్భావం :
1919 ఫిబ్రవరి 5వ తేదీన విజయరామ గాన పాఠశాల ఆవిర్భవించింది.
సంగీత కళాశాల ఏర్పడక ముందు ఈ భవనంలో ఏముండేది?
టౌన్‌ హాల్‌

స్థాపకులు :
విజయరామ గాన పాఠశాలను నాల్గవ విజయరామరాజు గారు స్థాపించారు.
స్థాపనకు ఉద్దేశ్యము :
విజయ రామరాజు కు ప్రీతి పాత్రులైన చాగంటి జోగారావుగారి కుమారుడు గంగ రాజు అంధుడైనందున అతనికి సంగీతం నేర్పించాలనే ప్రధానోద్దేశ్యంతో సంగీత కళాశాలను స్ధాపించారు. సృష్టికర్త ఆపాదించిన దృష్టిదోషాన్ని సవాలు చేసి సంగీతద్వారాలను మణిహారాలతో అలంకరింపచేసిన మహనీయులు ఎంతోమంది జీవితాల్లో సంగీత కళాశాల వెలుగులను ప్రసరింపచేసింది.
నాల్గవ విజయరామరాజు :
విద్యాప్రదాతగా, మనసున్న మారాజుగా పేర్గాంచిన నాల్గవ విజయరామరాజు 1904లో విజయనగర సంస్ధానానికి పట్టాభిషిక్తులయ్యారు. 1899లో ఆయన అయోధ్యకు చెందిన ఠాగూర్‌ సులాజ్‌ భక్ష్‌ కుమార్తె లలితకుమారిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కలిగిన ప్రథమ సంతానమే అలక్‌ నారాయణ్‌ గజపతి. విజయరామ గాన పాఠశాల, సంస్క ృత కళాశాల, కోరుకొండలోని సైనిక పాఠశాలలకు నిర్మాత ఆయనే. విజయరామ గజపతికి ఆంతరంగిక కార్యదర్శిగా చాగంటి జోగారావు వ్యవహరించేవారు. ఆయన కుమారుడు చాగంటి గంగబాబు అంధుడైనందున ఆయన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ఆయన వంటి ఎంతో మందికి ఉపాధి కల్పించాలనే ప్రధాన సంకల్పంతో విజయరామ గాన పాఠశాలను నాల్గవ విజయరామరాజు గారు స్థాపించారు. ఈ విషయంపై విజయరామరాజు తన ఆస్ధాన వైద్యులైన రామయ్యతో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 1922 సెప్టెంబర్‌ 11వ తేదీన ఆయన కన్నుమూసారు.
విజయరామ గాన పాఠశాల స్థాపన సమయంలో :
ఆదిభట్ల నారాయణదాసు అధ్యక్షులుగాను, ద్వారం వెంకట స్వామినాయుడు వయోలిన్‌ ఆచార్యులుగా
ఉన్నారు.

తొలినాళ్లలో :
తొలినాళ్లలో ఆదిభట్ల నారాయణదాసు అధ్యక్షులుగాను, ద్వారం వెంకట స్వామినాయుడు వయోలిన్‌ ఆచార్యులుగాను, కట్టా సూర్య నారాయణ మరియు వాసా వెంకట రావు వీణా చార్యులుగాను, పేరి రామ్మూర్తి గాత్ర అధ్యాపకులుగాను, మునిస్వామి పిళ్ళై నాదస్వర అధ్యాపకులుగాను, గోవిందరాజ్‌పిళ్ళై నాట్యా చార్యులుగాను, లింగం లక్ష్మాజీ మృదంగం అధ్యాపకులుగాను ఉండేవారు.

వీణా విద్వాంసులు :
వాసాకృష్ణ మూర్తి, వాసా సాంబశివరావు, ఓ.ఎస్‌. చంద్రశేఖరన్‌, ఖండవిలి జనార్ధనాచార్యులు, సుదర్శనం అప్పలా చార్యులు, మంచాళ జగన్నాధరావు, అయ్యగారి సోమేశ్వరరావు, పప్పు సోమేశ్వరరావు, చేంబోలు వెంకటశాస్త్రి, వి.ఎస్‌. అనంతరావు, రామవరపు సుబ్బారావు, మండా సూర్యనారాయణ తదితరు లు వీణా విద్వాంసులుగా విశేషమైన సేవలను అందించారు.

గాత్రంతో రంజింపచేసిన మహనీయులు :
ఘంటసాల వెంకటేశ్వర రావు, బంకుపల్లి సింహాచల శాస్త్రి, ఈదర నాగరాజు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చిన సత్యనారాయణ, సరస్వతుల వెంకటరావు, పట్రాయుని సంగీతరావు తమ గాత్రంతో సంగీత కళాశాలను రంజింపచేసారు.

వాయులీన వాయిద్యానికి వన్నెతెచ్చిన మహనీయులు :
ద్వారం నరసింగ రావు, చాగంటి గంగరాజు, మారెళ్ళ కేశవరావు, సత్య మూర్తి, లోవరాజు, ద్వారం నర సింగరావు, ద్వారం భావ నారాయణ, సత్యనారాయణ మూర్తి, మంగతాయారు, దుర్గా ప్రసాదరావు, రమణకుమారి, మనోరమ, సత్య నారాయణరావు, వరదమ్మ, ద్వారం త్యాగరాజు వయోలిన్‌ విద్వాంసులుగా వినుతికెక్కారు. ఇవటూరి రాజేశ్వరరావులు వాయులీన వాయిద్యానికి వన్నె తెచ్చారు.

మృదంగంలో :
ముళ్ళపూడి లక్ష్మణరావు, శ్రీపాద సన్యాసిరావు, కె. వీరభద్రరావు, ముళ్ళపూడి శ్రీరామమూర్తి, ఎస్‌.వి.రమణ మృదంగ విద్వాంసులగా పేరు సంపాదించారు. డాక్టర్‌ కోలకం వెంకటరాజు మృదంగం ప్రొఫెసర్‌గా సేవలందించారు.

నాదస్వరంలో :
నాదస్వరంలో పైడిస్వామి పేర్గాంచారు.

సంగీత సమ్రాట్టులు :సాలూరి రాజేశ్వరరావు, సాలూరు హనుమంతరావు, అశ్వత్థామ

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి :
ఈ కళాశాల 1953లో రాష్ట్రప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటినుండి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలగా పేరు మారింది. తరువాత స్యూల్‌ ఎడ్యుకేషన్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ పరిధిలో కొంతకాలం పనిచేసింది. 1980లో భాషా సాంస్క ృతిక శాఖ పరిధిలోకి వెళ్లింది.ప్రిన్సిపల్స్‌గా సేవలందించిన వారు :

అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు (1919-36)
ద్వారం వెంకటస్వామి నాయుడు (1936-53)
ద్వారం నరసింగరావు (1953-60)
ద్వారం భావనారాయణరావు(1962-73)
నేదునూరి కృష్ణమూర్తి (1977-79)
శ్రీరంగం గోపాలరత్నం(1979-80)
ద్వారం దుర్గా ప్రసాదరావు (1982-2000)
పి వి ఎస్‌ శేషయ్యశాస్త్రి (2000-06)
బురిడి అనూరాధా పరశురామ్‌ (2007 నుండి)

ప్రస్తుతం కళాశాల పరిస్థితి :
ఇక్కడ అభ్యసించే విద్యార్ధులకు శ్రీ వరాహ నరసింహస్వామి దేవస్థానం భోజన సౌకర్యాన్ని కల్గిస్తుంది. కూచిపూడి, హరికథ, ఫ్లూట్‌ కోర్సులను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ కళాశాలలో చేరాలంటే కనీస వయస్సు 10 సంవత్సరాలుగా నిర్ణయించారు. గాత్రము, వీణ, వయోలిన్‌, నాదస్వరం, మృదంగం, భరతనాట్యం, డోలు అనే కోర్సులు ఉన్నాయి. నాలుగేళ్ళ వ్యవధి గల సర్టిఫికేట్‌ కోర్సు, రెండేళ్ల వ్యవధితో డిప్లమో కోర్సులున్నాయి. తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెగ్యులర్‌ కోర్సులు, సర్టిఫికేట్‌, డిప్లమో కోర్సులు నిర్వహిస్తున్నారు.
విజయరామ గాన పాఠశాల ప్రారంభించబడిన తొలిరోజుల్లో చేరేందుకు ఎటువంటి విద్యార్హతను నిర్ణయించలేదు. విద్యతో సమాజాన్ని చైతన్యం గావించడమే ప్రధాన ఉద్దేశ్యంతో దీనిని స్థాపించారు. 1933లో ఒక చౌల్ట్రీని స్థాపించి ఉచిత భోజన, వసతి సదుపాయాన్ని కల్పించారు. సంగీత సరస్వతి కొలువైయున్న ఈ దేవాలయం నిత్యం కాంతులీనుతూ ప్రకాశించాలని కోరుకుందాం.

(Visited 142 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.