ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల మధ్య సమన్వయం అవసరం
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

విశాఖపట్నం: నూతన ఆవిష్కరణ ద్వారా విద్యార్థుల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించడం చాలా క్లిష్టమైన అంశమని, ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక రంగం సమన్వయంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు, మార్గదర్శనం చేయాలని సూచించారు. మంగళవారం విశాఖపట్నం నుంచి అంతర్జాల మాధ్యమం ద్వారా టి.ఐ.ఈ. గ్లోబల్ సమ్మిట్ -2020 ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. యువతలో ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని, ప్రతిభను ప్రోత్సహించేందుకు, పెంపొందించేందుకు ఇంకుబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని విశ్వవిద్యాలయాలకు సూచించిన ఆయన, ఆయా విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకు నిధులు సమకూర్చాలని కార్పొరేట్ రంగానికి సూచించారు.
ద ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (టి.ఐ.ఈ) సంస్థ సిలికాన్ వ్యాలీ ఆధారిత లాభాపేక్ష లేని సంస్థ. ఇది నెట్‌వర్కింగ్ ద్వారా అంకుర సంస్థలకు (స్టార్టప్స్) సహకారం అందిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ సమ్మేళనం- 2020 ద్వారా భారతదేశంలోకి పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
భారతదేశ జనాభాలో 65 శాతం మంది యువత ఉన్నారని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, ప్రతిభావంతులైన యువత శక్తి సామర్థ్యాన్ని సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగార్థులుగా గాక, ఉద్యోగాల సృష్టికర్తలుగా యువత ఆలోచనల్లో మార్పు రావాలని ఆకాంక్షించిన ఆయన, మహిళల ఔత్సాహిక పారిశ్రామిక సామర్థ్య ప్రోత్సాహం కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మెంటరింగ్ ద్వారా 50వేల మంది ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలను టి.ఐ.ఈ. ప్రోత్సహించడం సంతోషకరమన్నారు.. నానాటికీ పెరుగుతున్న నూతన సవాళ్ళను ఎదుర్కునేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చిన ఆయన, అలాంటి ఆలోచనల ద్వారా ముందుకు వచ్చే ఔత్సాహిక, ఆశాజనక అంకుర సంస్థలకు అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా సుమారు 5కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయన్న ఉపరాష్ట్రపతి, అభివృద్ధి సాధించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు.. తర్వాతి తరాలకు మార్గదర్శనం చేయాల్సిన బాధ్యత ఉందని టి.ఐ.ఈ. వంటి సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మొదలైన సంస్థలకు పిలుపునిచ్చారు. వారి అనుభవాలను, విజ్ఞానాన్ని భవిష్యత్ తరాలతో పంచుకోవాలని, అదే విధంగా విశ్వవిద్యాలయాలు సైతం విద్య పూర్తయ్యే సమయానికే విద్యార్థుల్లో పారిశ్రామిక సామర్థ్యాన్ని పెంపొందించే దిశగా పరిశోధనలు, ఇంటర్న్‌షిప్‌ల వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ప్రతిభావంతుల నుంచి చక్కటి ఔత్సాహిక పారిశ్రామిక ఆలోచనలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి, వారు సిలికాన్‌వ్యాలీ లాంటి చోట్ల మాత్రమే కాకుండా హైదరాబాద్, విశాఖపట్నం వంటి ప్రతిభావంతులున్న ఇతర ప్రదేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక రంగం సానుకూల మార్గంలో ముందుకు సాగేందుకు ప్రైవేటు రంగం, ప్రభుత్వేతర సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వాలతో కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
వ్యాపారాన్ని ఆరంభించడం చాలా క్లిష్టమైన పనిగా అభివర్ణించిన ఉపరాష్ట్రపతి, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనుభవం ఉన్న మార్గదర్శకుల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ టి.ఐ.ఈ. కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు దిశా నిర్దేశం చేసేందుకు 300 మందికి పైగా మెంటర్స్ అందుబాటులో ఉండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
ఇటువంటి ఉన్నత కార్యక్రమాలు ఆలోచనలు, విజ్ఞానాన్ని పరస్పరం పంచుకునేందుకు ఒక మంచి వేదికను అందించడమే గాక, వివిధ ఆలోచనల మధ్య చక్కని వంతెన నిర్మించడంలో సహాయపడతాయన్న ఉపరాష్ట్రపతి, ఇందుకోసం చొరవ తీసుకున్న టి.ఐ.ఈ.ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, టీఐఈ గ్లోబల్ అధ్యక్షుడు మహవీర్ శర్మ, టీఐఈ హైదరాబాద్ విభాగం బాధ్యుడు, కంట్రోల్ ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు పిన్నపురెడ్డి శ్రీధర్ రెడ్డి, భారతదేశంతోపాటు వివిధ దేశాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడి దారులు, వివిధ రంగాల ప్రముఖులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
(Visited 73 times, 1 visits today)