ఆకలి దప్పుల నుంచి ప్రపంచ మెప్పుల దాకా

జ్యోతివిజయ్‌ ప్రస్థానం

ఆకలి! తీరితే.. ప్రాణం నిలబడుతుంది.

ఆకలి! మీరితే? ప్రాణం కలబడుతుంది. పరిస్థితుల మీద, పరిసరాల మీద యుద్ధం చేస్తుంది. ఈ పోరాటంలో మనిషి ఓడితే జీవితం ఛిద్రమౌతుంది. గెలిస్తే బతుకు భద్రమౌతుంది. ఇలా జీవన సమరంలో గెలుపు గుర్రం ఎక్కినవాళ్లు కొద్దిమందే ఉంటారు. వారిలో కొణతాల విజయ్‌ కుమార్‌ ఒకరు.

సార్ధక నామధేయుడు

అనేక విజయాలను, ప్రపంచ రికార్డులను సాధించి తండ్రి పెట్టిన పేరును విజయ్‌ సార్ధకం చేసుకున్నారు. ఆ తండ్రే నేడు జీవించి ఉంటే విజయ్‌ను చూసి ‘పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగ’ పుత్రోత్సాహం కలుగునని సుమతీ శతకకారుడు అన్న మాటలను నిజం చేస్తూ ఎంత ఉప్పొంగి పోయేవారో.

నృత్యం నిత్య కృత్యం

డాన్సంటే చాలా మందికి వ్యామోహం. కానీ విజయ్‌కు తీరని దాహం. ఎంత చేస్తున్నా తనివి తీరని తపన. కొత్తదనం కోసం రగిలిపోయే రస పిపాసి. అతని ఉత్సాహం అనంతం. ఆవేశం దిగంతం. డాన్స్‌ ఎవరు చేస్తున్నా ఆ శబ్దం ఎక్కడనుంచి వినిపిస్తున్నా తనకు తెలీకుండానే అందుకు అనుగణంగా లయబద్దంగా తనువు, మనసూ ఊగిపోయేది. ఆ వెర్రిపారవశ్యమే సొంతంగా అనకాపల్లిలో విజయ్‌ డాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ స్థాపించి నలుగురికీ డాన్స్‌ నేర్పేలా చేసింది. గాజువాక,విశాఖపట్నంసిటీ, హైదరాబాద్‌కూ విస్తరింపచేసింది. పోటీలకు జడ్జిగా వెళ్తే పదుగురు చేత ప్రశంసలు కురిపించింది. అలా విజయ్‌ గ్రూప్‌గా ఎదిగి టీవీల్లో ప్రదర్శనలిచ్చాడు. సినిమా హీరోలకు నృత్యరీతులు నేర్పాడు.

“అయినా..ఆతని కాంక్ష తీరలేదు

విజయ్‌ జీవితంలోకి అర్థాంగిగా అడుగుపెట్టిన జ్యోతి పేరుకు తగ్గట్టుగా వెలుగులు నింపింది. ఆమె కూడా నృత్యకారిణి. అంతకు మించి యోగా సాధకురాలు. ఆమెతో కల్సి సితార, జెమిని, ఈటీవి, మా, జీ తెలుగు టీవీల్లో విజయ్‌ పలు ప్రదర్శనలు ఇచ్చారు. పేరు ప్రఖ్యాతులు గడించారు. పర్వతారోహణ చేస్తున్న కొద్దీ శిఖరాన్ని అందుకోవాలన్న కసి పెరిగినట్లు జీవితం అడుగుమెట్ల మీంచి మొదలెట్టిన ప్రయాణం హిమాలయ పర్వతాలను దాటి బ్యాంకాక్‌, తైవాన్‌, వియత్నాం, హాంగ్‌కాంగ్‌ మీదుగా చైనాలో స్థిరపడేలా చేసింది.

యోగా సాధన-బోధన

యోగా అంటే కొందరికి ఆర్జించే ధనం. ఇంకొందరికి స‌ముపార్జించే విజ్ఞానం. మరికొందరికి యోగా ఓ కవచం. విజయ్ జ్యోతికి మాత్రం ప్రాణం. అందుకే యోగా అంటే ఓ వ్యక్తి తన కోసం తాను చేసే నిరంతర ప్రయాణమని భగవద్గీత చెప్పినది దంపతులిద్దరూ అక్షరలక్షలుగా ఎంచారు. అక్షరసత్యంగా భావించారు. అనుదిన అభ్యాసంగా ఆచరించారు. అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్‌కు పెట్టింది పేరైన చైనీయులకు యోగా పాఠాలు బోధిస్తున్నారు. చైనా టీవీలో డాన్స్‌ ప్రోగ్రాం ఇస్తున్నారు. చైనీస్‌ పాప్‌ ఆల్బమ్స్‌లో డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా శిక్షణ అందిస్తున్నారు.

నవతరానికి వరల్డ్‌ రికార్డ్‌లు

 

విజయ్‌ నృత్య రీతులపై ఎంత పట్టు సాధించాడో యోగాలో అంతకు రెట్టింపు ప్రావీణ్యం జ్యోతి సంపాదించింది. ఆమె నైపుణ్యం ముందు కాలం పెట్టిన పరిక్షలు కూడా ఓటమి పాలయ్యాయి. నెలలునిండి కదలిక కష్టమైన దశలోకూడా ఆమె యోగాకు విరామం ఇవ్వలేదు. ఆ స్థితిలో కూడా యోగాసనాలు వేస్తూ, నేర్పిస్తూ అందరినీ అబ్బురపర్చింది. నవమాసాలు మోసి బిడ్డకు సృష్టికర్తగా మాతృత్వపుమాధుర్యాన్ని పొందడానికి ముందు.. నిండు గర్భిణిగా ఉండి ఆసనాలు వేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. శిశువుకు జన్మనివ్వడానికి ఐదు రోజుల ముందు వరకూ అంటే గర్భందాల్చి తొమ్మిది నెలల 15 రోజులనాడు కూడా యోగాసనాలు వేసి ఇంతవరకూ ఎవరూ పొందలేని ఘనతను ఆమె సాధించింది. ‘నోబుల్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్ట్స్‌’లో స్థానం సంపాదించుకొని రికార్డు సృష్టించింది. ఈ మేరకు 2021 జనవరి 29న నోబుల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌‌‌ సంస్థ జ్యోతికి ఎక్స్‌ట్రార్డినరీ సర్టిఫికేట్‌ ప్రదానం చేసి సత్కరించింది.

విజయ్‌ ఖాతాలో ప్రపంచ రికార్డులు

ఒకపక్క డాన్స్‌ను ఓ ప్యాష‌న్‌గా ప్రేమిస్తూనే యోగాలో కూడా విజయ్‌ అద్భుతాలు సాధించాడు. అస్టవక్రాసన, మయూరాసన‌ ఆసనాలను ఇంతవరకూ ఎవరూ వేయలేనంత ఎక్కువసేపు వేసిప్రపంచ రికార్డులు రెండింటిని తన వశం చేసుకున్నాడు. “నోబుల్‌ బుక్ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకొని చరిత్ర సృష్టించాడు. 2021 జనవరి 29న నోబుల్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ విజయ్‌కు ఎక్స్‌ట్రార్డినరీ స‌ర్టిఫికెట్లు బ‌హుక‌రించి సత్కరించింది.

బంగారు బాల్యం కాదు


విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో సూర్యఅప్పారావు, శాంతకుమారి దంపతులకు 1980 ఆగస్టు ఐదున జన్మించిన విజయ్ కుమార్‌ బాల్యం హాయిగా ఆనందంగా గడవలేదు. తండ్రి ఓ సాధారణ రైతు. పైగా కాలంపై ఆధారపడి రాణించే మామిడికాయల వ్యాపారి.విజయ్‌ తాతగారికి 40, 50ఎకరాల తోటలున్నప్పటికీ  ప్రతికూలతలు పెరిగి తండ్రి చేతికొచ్చేసరికి అవి హరించుకుపోయాయి. అపురూప అనుబంధాన్ని 16 ఏళ్లకే పరిమితం చేసి తండ్రి కాలం చేశారు. ఆ తర్వాత తండ్రి, దైవం, గురువు, మార్గదర్శకుడు. అన్నీ తానై నడిపించిన అన్నయ్య కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. అయినా కష్టాలకు వెరవక చిన్నదో పెద్దదో పలు కంపెనీల్లో పని చేసి పిడికెడు కష్టాలు, కడివెడు కన్నీళ్లను దిగ‌మింగుతూ సాయంకాలాలు డ్యాన్స్ పైనే విజ‌య్ దృష్టి పెట్టేవాడు. వృత్తి ఏదైనా ప్రవృత్తి డాన్స్‌గానే కొనసాగాడు.

అవార్డుల పంట
యోగాలో ప్రపంచ రికార్డులు నెలకొల్పిన విజయ్‌ రెండు సార్లు ప్రపంచ రికార్డు, ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో మూడు సార్లు ఆసియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో ఒకసారి అవార్డులను సొంతంచేసుకోవడమే కాకుండా తనతోపాటు వరల్డ్‌ రికార్డు సాధించిన అర్ధాంగి జ్యోతితో కల్సి అడుగులు వేస్తూ అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నాడు. ఇద్దరు బిడ్డలతో జీవితాన్ని ఆకలి ద‌‌ప్పులతో కాదు ప్రపంచ మెప్పులతో ఆనందమయం చేసుకున్నాడు.

(Visited 1,785 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.