ఇండియాలో ఎన్నిసార్లు రాష్ట్ర‌ప‌తిపాల‌న విధించారో తెలుసా?

పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించాలని లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళసై సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో భారతదేశంలో వివిధ సందర్భాలలో రాష్ట్రపతి పాలన అమలు జరిగిన విషయాలపై ప్రత్యేక వ్యాసం.

మన దేశంలో ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన సంభవిస్తుంది. రాష్ట్ర అసెంబ్లీ తరపున ముఖ్యమంత్రిని నాయకునిగా ఎన్నుకునే పరిస్థితులు లేనప్పుడు, ప్రభుత్వం సంకీర్ణంగా ఏర్పాటైతే ఆ సంకీర్ణ ప్రభుత్వానికి విఘాతం కలిగినప్పుడు, శాంతి భద్రతలకు విఘాతం కలిగినప్పుడు, అనివార్య పరిస్థితులలో ఎన్నికలు వాయిదా పడినప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశాలు ఉన్నాయి.
స్వాతంత్య్రం వచ్చాక ఎప్పుడెప్పుడు రాష్ట్రపతి పాలన వచ్చింది?
1951 జూన్‌ 20వ తేదీన తొలిసారిగా పంజాబ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పంజాబ్‌ అసెంబ్లీని 9 నెలల 28 రోజుల పాటు అచేతన దశలో ఉంచినట్లు తెలుస్తోంది. 1951 జూన్‌ 20వ తేదీనుండి 1952 ఏప్రిల్‌ 17వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1953లో పాటియాలా మరియు తూర్పు పంజాబ్‌ రాష్ట్రయూనియన్‌గా ఉన్న సమయంలో అక్కడ రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది. అక్కడ అకాలీదళ్‌ ప్రభుత్వానికి నాయకుడిగా జ్ఞాన్‌సింగ్‌ రేర్‌వాలా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. 1953 మార్చి 5వ తేదీనుండి 1954 మార్చి 8వ తేదీ వరకు రాష్ట్రపతి పాలనలో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ జరగకముందు 1954లో రాష్ట్రపతిపాలన వచ్చింది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంగా ఉండేది. 1954 నవంబర్‌ 15 నుండి 1955 మార్చి 29వ తేదీ వరకు అమలులో ఉంది. మెజార్టీ లేకపోయినందు వలన అటువంటి పరిస్థితి తలెత్తింది.
1956లో కేరళ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ విభేదాల వలన ముక్కలైన నేపథ్యంలో మెజార్టీని కోల్పోయింది. అప్పుడు 1956 మార్చి 23వ తేదీ నుండి 1957 ఏప్రిల్‌ 5వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది.
1959లో కేరళ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిన సందర్భంగా 1959 జూలై 31వ తేదీ నుండి 1960 ఫిబ్రవరి 22వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది.

1961 ఫిబ్రవరి నెలలో ఒరిస్సాలో రాష్ట్రపతి పాలన తొలిసారి విధించారు. కాంగ్రెస్‌ గణతంత్రపరిషత్‌ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న హరేకృష్ణ మహతబ్‌ రాజీనామా చేసినందున మరే ఇతర పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పూర్తిస్థాయి మెజార్టీ లేనందున రాష్ట్రపతిపాలన వచ్చింది. 1961 ఫిబ్రవరి 25వ తేదీనుండి జూన్‌ 16వ తేదీ వరకు అమలులో ఉంది.
1962లో పశ్చిమబెంగాలు రాష్ట్రంలో ఒక వారంరోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించబడింది. 1962 జూలై 1వ తేదీ నుండి 8వ తేదీ వదరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1964లో కేరళ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది. ఎన్నికల ఫలితాలు వెలువడినా ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ లభించక పోయిన సందర్భంగా అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. 1964 సెప్టెంబర్‌ 10వ తేదీ నుండి 1967 మార్చి 6వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది.
పంజాబ్‌లో రెండోసారి రాష్ట్రపతి పాలనను 1966 జూలై నెలలో విధించారు. పంజాబ్‌ రాష్ట్రాన్ని పంజాబ్‌ మరియు హర్యానా అనే రెండు రాష్ట్రాలుగా విభజించే నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి. 1966 జూలై 5వ తేదీనుండి 1966 నవంబర్‌ 1వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన ఉంది.
1966లో గోవాలో రాష్ట్రపతి పాలనను విధించారు. గోవాను మహారాష్ట్రలో విలీనం చేయాలని ఒక ఒపీనియన్‌ పోల్‌ వచ్చిన సందర్భంలో రాష్ట్రపతి పాలన వచ్చింది. 1966 డిసెంబర్‌ 2వ తేదీనుండి 1967 ఏప్రిల్‌ 5వ తేదీ వరకు అమలులో ఉంది.
1967లో మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన ఏర్పాటు చేసారు. మణిపూర్‌ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికలు తొలిసారి జరిగినప్పుడు ఇలాటి పరిస్థితి తలెత్తింది. 1967 జనవరి 12వ తేదీనుండి మార్చి 19వ తేదీ వరకు రాష్ట్రపతి పాలనలో మణిపూర్‌ కొనసాగింది.
1967 మార్చిలో తొలిసారిగా రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన వచ్చింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చి ప్రభుత్వాన్ని నెలకొల్పే పరిస్థితులు లేనందున 1967 మార్చి 13వ తేదీనుండి ఏప్రిల్‌ 26వ తేదీ వరకు అమలులో ఉంది.
1967 అక్టోబర్‌లో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన వరుసగా రెండోసారి అమలు లోకి వచ్చింది. అక్కడ అధికార పార్టీ గాని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ గానీ పూర్తి మెజార్టీని సాధించలేక పోయినందున, రాజీనామాల పర్వం కొనసాగినందున అసెంబ్లీ సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది. 1967 అక్టోబర్‌ 25వ తేదీనుండి 1968 ఫిబ్రవరి 18వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగించబడింది.

1967లో హర్యానాలో రాష్ట్రపతిపాలన విధించబడింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం తన మద్దతును నిరూపించుకోలేక పోయి రాష్ట్రంలో అనిశ్చిత స్థితినెలకొంది. అందువలన 1967 నవంబర్‌ 2వ తేదీనుండి 1968 మే 22వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించారు.
మెజార్టీ కోల్పోయినందువలన తదుపరి బీహార్‌లో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసారు. 1968 జూన్‌ 29వ తేదీ నుండి 1969 ఫిబ్రవరి 26వ తేదీ వరకు అమలులో ఉంది.
1968 ఆగస్టులో రాష్ట్రపతిపాలనను పంజాబ్‌లో ఏర్పాటు చేసారు. సంకీర్ణంలో అప్పటి వరకు కొనసాగిన ప్రభుత్వం మద్దతును కోల్పోయి చిక్కుల్లో పడినందున 1968 ఆగస్టు 23వ తేదీనుండి 1969 ఫిబ్రవరి 17వ తేదీ వరకు రాష్ట్రపతి పాలనలో ఉంది.
1968లో పుదుచ్చేరిలో తొలిసారి రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వం పతనమైనందున 1968 సెప్టెంబర్‌ 18వ తేదీనుండి 1969 మార్చి 17వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన కొనసాగించబడింది.
రాజకీయ మరియు ఇతర కారణాల వలన అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినందువలన బీహార్‌లో మరో మారు రాష్ట్రపతి పాలన ఏర్పాటైంది.1969 జూన్‌4వ తేదీనుండి 1970 ఫిబ్రవరి 16వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1969 అక్టోబర్‌లో మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వంకు పట్టు సడలినందున శాంతిభద్రతలను తీవ్ర విఘాతం ఏర్పడింది. 1969 అక్టోబర్‌ 17వ తేదీ నుండి 1972 మార్చి 22వ తేదీ వరకు మణిపూర్‌ రాష్ట్రం ప్రెసిడెంట్‌ రూల్‌ పరిధిలోకి వెళ్లిపోయింది.
కేరళలో 1970లో రాష్ట్రపతి పాలన అమలు చేసారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం సరైన సమయంలో శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోలేకపోయి మైనార్టీలో పడిపోయింది. 1970 ఆగస్టు 1వ తేదీనుండి అక్టోబర్‌ 4వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన సాగింది.
1971 జనవరిలో ఒరిస్సాలో రెండోసారి రాష్ట్రపతి పాలన వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నందున అధికారంలో ఉన్న పార్టీ మైనార్టీలో పడిపోయి 1971 జనవరి 11వ తేదీనుండి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు రాష్ట్రపతి పాలనలో ఉంది.

1971లో కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినందువలన రాష్ట్రపతి పాలన ఏర్పాటైంది.1971 మార్చి తేదీనుండి 1972 మార్చి 20వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1971లో గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రపతి పాలన అమలు చేసారు. పార్టీలో చీలికలు ఏర్పడి అనిశ్చిత స్థితి నెలకొన్నందున 1971 మే 12వ తేదీ నుండి 1972 మార్చి 12వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
పంజాబ్‌లో మరోమారు రాష్ట్రపతి పాలన 1971 జూన్‌ 14వ తేదీన వచ్చింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన నాసిరకం ఫలితాల వలన హైకమాండ్‌ ఆదేశాల మేరకు అప్పటి ముఖ్యమంత్రి రాజీనామా చేసి ఎన్నికలుకు వెళ్లారు. 1971 జూన్‌ 14 నుండి 1972 మార్చి 17వ తేదీ వరకు ప్రెసిడెంట్‌ రూల్‌ ఉంది.
రాజకీయ అనిశ్చితి వలన అధికారపక్షం పూర్తిస్ధాయి మెజార్జీ లేకపోయినందున బీహార్‌లో సంక్షోభం ఏర్పడినందున రాష్ట్రపతిపాలన అనివార్యమైంది. 1972 జనవరి 9వ తేదీనుండి మార్చి 19వ తేదీవరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది.
జై ఆంధ్రా ఉద్యమ సందర్భంగా లా అండ్‌ ఆర్డర్‌ దెబ్బతిన్న సందర్భంగా 1973లో ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన వచ్చింది. అప్పట్లో పి.వి.నరసింహా రావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది సంభవించింది. 1973 జనవరి 11వ తేదీనుండి 1973 డిసెంబర్‌ 10వ తేదీవరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1973 మార్చిలో ఒరిస్సాలో రాష్ట్రపతి పాలన మూడవసారి వచ్చిన పరిస్థితులు నెలకొన్నాయి. అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తన ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్నందున 1973 మార్చి 3వ తేదీనుండి 1974 మార్చి 6వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన వచ్చింది.
1973 మార్చిలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించబడింది. అధికార ప్రతిపక్ష పార్టీలలో ఎవరికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడా మెజార్టీ లేని సందర్భంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. 1973 మార్చి 28వ తేదీనుండి 1974 మార్చి 3వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించబడింది.
1974 జనవరిలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన రెండవ సారి విధించబడింది. డి.ఎం.కె ప్రభుత్వం నుండి ఇద్దరు మంత్రులు బయటకు వెళ్లి పోయి ఎ.డి.ఎం.కె.లో చేరినందున రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పులు వచ్చి రాష్ట్రపతిపాలన అమలు చేసేదిశగా వెళ్లింది. 1974 జనవరి 3వ తేదీనుండి మార్చి 6వ తేదీ వరకు ఆ పరిస్థితులు కొనసాగాయి.

1974లో గుజరాత్‌లో చమన్‌భాయ్‌ పటేల్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రపతి పాలన అమలు చేసారు. నవనిర్మాణ్‌ ఉద్యమం సందర్భంగా అవినీతి ఆరోపణల మధ్య ఎం.ఎల్‌.ఏలు రాజీనామాలు పెద్ద ఎత్తున జరిగాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ మద్దతును కోల్పోయి అనిశ్చిత స్థితి నెలకొన్నందున 1974 ఫిబ్రవరి 9వ తేదీనుండి 1975 జూన్‌ 18వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1974 మార్చినెలలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన మూడవసారి విధించే దిశగా పరిస్థితులు తలెత్తాయి. అప్పటి వరకు సంకీర్ణంగా నడిచిన ఎ.డి.ఎం.కె.ప్రభుత్వం మెజార్టీని కోల్పోయినందున 1974 మార్చి 28 నుండి 1977 జూలై 2వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన ఉంది.
1975 మార్చినెలలో నాగాలాండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంది. అధికారంలో ఉన్న పార్టీ తన లోపాల వలన సరయిన సమయంలో తన బలాన్ని నిరూపించుకోలేక పోయింది. 1975 మార్చి 20 నుండి 1977 నవంబర్‌ 25వ తేదీవరకు అమలులో ఉంది.
1976లో గుజరాత్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించారు. అధికారంలో ఉన్న పార్టీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడంలో విఫలమైన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన 1976 మార్చి 12వ తేదీనుండి డిసెంబర్‌ 24వ తేదీ వరకు అమలులో ఉంది.
1976 డిసెంబర్‌లో ఒరిస్సాలో రాష్ట్రపతి పాలన వచ్చింది. ముఖ్యమంత్రిగా వున్న నందినీ సేతుపతి ప్రభుత్వాన్ని సరయిన సమయంలో మెజార్టీ చూపించుకోలేక పోయినందున 1976 డిసెంబర్‌ 16వ తేదీనుండి డిసెంబర్‌ 29వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది.
1977మార్చి నెలలో జమ్ము-కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తరపున షేక్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అప్పటి వరకు మద్దతు కొనసాగించిన కాంగ్రెస్‌ పార్టీ తన మద్దతును
ఉపసంహరించుకుంది. అధికార పార్టీ మెజార్జీని కోల్పోయినందున 1977 మార్చి 26వ తేదీనుండి జూలై 9వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించబడింది.
1977 ఏప్రిల్‌ నెలలో మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించబడింది. బలాబలాలు నిరూపించుకోవలసిన సమయం వచ్చినప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోలేక చతికిలబడింది. ఆ సందర్భంగా 1977 ఏప్రిల్‌ 29వ తేదీనుండి జూన్‌ 25వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించారు.

1977 ఏప్రిల్‌ 29వ తేదీన మధ్యప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌లో కూడా రాష్ట్రపతి పాలన వచ్చింది. అధికారంలో ప్రధాన పార్టీ విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసతీర్మానాన్ని హరిదేవ్‌ జోషి అనుకూలంగా మలచుకున్నందున అక్కడ ఏప్రిల్‌ 29వ తేదీనుండి జూన్‌ 22వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించారు.
1977 ఏప్రిల్‌ 30వ తేదీన ఒరిస్సాలో మరోమారు రాష్ట్రపతి పాలన వచ్చింది. అసెంబ్లీలో అధికార పక్షం బలాన్ని కోల్పోయి అవిశ్వాస తీర్మానం నెగ్గినందున 1977 ఏప్రిల్‌ 30వ తేదీనుండి 1977 జూన్‌ 26వ తేదీ వరకు రాష్ట్రపతి పాలనలో కొనసాగించబడింది.
అధికారంలో ఉన్న ప్రభుత్వం సరైన మద్దతును కోల్పోయినందువలన బీహార్‌ రాష్ట్రంలో 1977లో మరో మారు రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. 1977 ఏప్రిల్‌ 30వ తేదీనుండి 1977 జూన్‌ 24వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1977 ఏప్రిల్‌ 30వ హర్యానాలో రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది. రాష్ట్రంలో పరిపాలిస్తున్న అధికార ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ప్రతిపక్షం నెగ్గిన నేపథ్యంలో అనిశ్చిత స్థితులు నెలకొన్నాయి. 1977 ఏప్రిల్‌ 30వ తేదీనుండి 1977 జూన్‌ 21వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించారు.

1977 ఏప్రిల్‌ 30వ తేదీకి ప్రత్యేక చరిత్ర ఉంది. అదే రోజున ఒరిస్సా, బీహార్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌లలో రాష్ట్రపతి పాలన విధించబడింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన మద్దతును నిరూపించుకోలేక పోయింది. అందువలన అక్కడ 1977 ఏప్రిల్‌ 30వ తేదీనుండి జూన్‌ 22వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1977 ఏప్రిల్‌ నెలలో పంజాబ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన వచ్చింది. అసెంబ్లీలో అధికార పక్షం మైనార్టీలో పడిపోయి జ్ఞానీ జైల్‌సింగ్‌కు అనుకూలంగా ఉన్నందున అధికార పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేసింది. 1977 ఏప్రిల్‌ 30 నుండి జూన్‌ 20వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన ఉంది.
1977 మే నెలలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేసారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. అప్పుడు 1977 మే నెల16వ తేదీనుండి జూన్‌ 28వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది.
1977లో మిజోరాంలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. అక్కడి ముఖ్యమంత్రి ఛుంగా రాజీనామా నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన వచ్చింది. 1977 మే 11వ తేదీనుండి 1978 జూన్‌ 1వ తేదీ వరకు అమలులో ఉంది.

1977లో కర్నాటకలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అవసరమైనప్పుడు తన మెజార్టీని నిరూపించుకోలేక ఇబ్బందులపాలైంది. 1977 డిసెంబర్‌ 31వ తేదీనుండి 1978 ఫిబ్రవరి 28వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.
1978 ఆగస్టులో తొలిసారిగా సిక్కింలో రాష్ట్రపతి పాలన వచ్చింది. కె.ఎల్‌.డోర్జీ నాయకత్వంలో నడుస్తున్న జనతా ప్రభుత్వంలో విభేదాల వలన అనిశ్చిత స్థితి నెలకొంది. 1978 ఆగస్టు 18వ తేదీనుండి 1979 అక్టోబర్‌ 18వ తేదీ వరకు ప్రెసిడెంట్‌ రూల్‌లో ఉంది.
1978లో మిజోరాంలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితులు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీకి అక్కడ ముఖ్యమంత్రికి నిర్ణయాల విషయాల్లో వచ్చిన భేదాల వలన రాష్ట్రపతి పాలన వచ్చింది. 1978 నవంబర్‌ 10వ తేదీనుండి 1979 మే 8వ తేదీ వరకు కొనసాగింది.
1978 నవరబర్‌లో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన వచ్చింది. రాష్ట్రంలో అనిశ్చిత స్థితి నెలకొన్నందున 1978 నవంబర్‌ 12 నుండి 1980 జనవరి 16వ తేదీ వరకు ప్రెసిడెంట్‌ రూల్‌ ఉంది.
1979లో గోవాలో రాష్ట్రపతి పాలన విధించారు. అధికారంలో ఉన్న మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ ముక్కలైనందున అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేకపోయింది. 1979 ఏప్రిల్‌ 27వ తేదీనుండి 1980 జనవరి 16వ తేదీ వరకు గోవాలో రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
కేంద్రంలో జనతాపార్టీ అధికారంలో ఉన్న సమయంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. 1979 నవంబర్‌ 3వ తేదీ నుండి 1980 జనవరి 18వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజార్టీ కోల్పోయినందువలన సంభవించింది.
1979 నవంబర్‌లో మణిపూర్‌లో ఇంకొకసారి రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారంలో ఉన్న జనతాపార్టీ ప్రభుత్వం రద్దు అయింది. 1979 నవంబర్‌ 14వ తేదీనుండి 1980 జనవరి 13వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1979లో కేరళలో రాష్ట్రపతి పాలన విధించారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీ తన బలాన్ని కోల్పోయినందులకు గాను 1979 డిసెంబర్‌ 1వ తేదీనుండి 1980 జనవరి 25వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన విధించబడింది.

అస్సాంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన నేపథ్యంలో 1979 డిసెంబర్‌ 12 నుండి 1980 డిసెంబర్‌ 5వ తేదీ వరకు రాష్ట్రపతిపాలన వచ్చింది.
1980 ఫిబ్రవరిలో రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. భైరాన్‌సింగ్‌ షెకావత్‌ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినందున ప్రభుత్వం రద్దయింది. 1980 ఫిబ్రవరి 16వ తేదీనుండి జూన్‌ 6వ తేదీ వరకు ప్రెసిడెంట్‌ రూల్‌ వచ్చింది.
ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో అధికారపక్షం మెజార్జీని నిరూపించుకోలేక పోయిన నేపథ్యంలో 1980లో బీహార్‌లో మరోమారు రాష్ట్రపతిపాలన విధించబడింది. 1980 ఫిబ్రవరి 17వ తేదీనుండి జూన్‌ 8వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1980 ఫిబ్రవరి 17వ తేదీన ఒరిస్సాలో రాష్ట్రపతి పాలన వచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి నీలామణి రౌత్రి అవిశ్వాస తీర్మానం నెగ్గినందున అక్కడ 1980 ఫిబ్రవరి 17వ తేదీనుండి 1980 జూన్‌ 9వ తేదీ వరకు ప్రెసిడెంట్‌ రూల్‌ ఉంది.
1980 ఫిబ్రవరి 17వ తేదీకి ప్రత్యేకత ఉంది. అరోజున పంజాబ్‌, ఒరిస్సా, బీహార్‌, గుజరాత్‌, మహారాష్ట్రలలో కూడా రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. గుజరాత్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్దతును కోల్పోయి సరయిన మెజార్జీ లేనందున 1980 ఫిబ్రవరి 17వ తేదీనుండి 1980 జూన్‌ 8వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది.
1980 ఫిబ్రవరి 17వ తేదీన పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన అవశ్వాస తీర్మానంలో ప్రకాష్‌సింగ్‌ బాదల్‌ విజయం సాధించినందున ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 1980 ఫిబ్రవరి 17వ తేదీనుండి జూన్‌ 6వ తేదీ వరకు ప్రెసిడెంట్‌ రూల్‌ కొనసాగింది.
1980 ఫిబ్రవరి 17వ తేదీన మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఏర్పాటు చేసారు. అధికార పక్షంకు వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న శరద్‌పవార్‌ వేసిన అవిశ్వాస తీర్మానం నెగ్గినందున ప్రభుత్వం కూలిపోయింది. 1980 జూన్‌ 8వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన విధించబడింది.
1980 ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లో రెండవ సారి రాష్ట్రపతి పాలన విధిం చారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజార్టీలో పడిపోయి అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షంలో ఉన్న సుందర్‌లాల్‌ పట్వా విజయం సాధించినందున 1980 ఫిబ్రవరి 18వ తేదీనుండి జూన్‌ 8వ తేదీ వరకు రాష్ట్రపతి పాలనలో కొనసాగింది.

1981 ఫిబ్రవరినెలలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. అధికారంలో ఉన్న పార్టీ మెజార్టీని కోల్పోయింది. ప్రతిపక్షంలో ఉన్న పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినా కొన్ని అనివార్య కారణాల వలన ప్రతిపక్షం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు లేవని గవర్నర్‌ నిర్ణయించారు. 1981 ఫిబ్రవరి 28వ తేదీనుండి జూన్‌ 18వ తేదీ వరకు రాష్ట్రపతి పాలనలో ఆ రాష్ట్రం ఉంది.
చట్టవిరుద్ధంగా విదేశీయులు కొందరు అస్సాంలో స్థిరపడుతున్న నేపథ్యంలో మరో మారు రాష్ట్రపతి పాలన సంభవించింది. 1981 జూన్‌ 30వ తేదీనుండి 1982 జనవరి 13వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో
ఉంది.హింసలు చెలరేగి శాంతిభద్రతలకు విఘాతం కలిగినందుకు అస్సాంలో మరోమారు రాష్ట్రపతి పాలన వచ్చింది.
1982 మార్చి 19వ తేదీనుండి 1983 ఫిబ్రవరి 27వ తేదీ వరకు అమలులో ఉంది.
1983 జూన్‌లో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. అప్పటి వరకు కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వంకు కాంగ్రెస్‌ పార్టీ తాను ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకున్నందున విపత్కర పరిస్థితులు వచ్చి 1983 జూన్‌ 24వ తేదీనుండి 1985 మార్చి 16వ తేదీ వరకు ప్రెసిడెంట్‌ రూల్‌ అమలు చేసారు.
1983 అక్టోబర్‌ నెలలో పంజాబ్‌లో రాష్ట్రపతి అమలుచేయబడింది. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడి శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగినందున 1983 అక్టోబర్‌ 10వ తేదీనుండి 1985 సెప్టెంబర్‌ 29వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన సాగింది.
సిక్కిం రాష్ట్రంలో 1984లో రెండవసారి రాష్ట్రపతి పాలన వచ్చింది. సిక్కిం జనతాపరిషత్‌ ప్రభుత్వంకు నాయకత్వం వహిస్తున్న నార్‌బహదూర్‌ బండారీ చిక్కుల్లో పడి మెజార్టీ కోల్పోయారు. 1984 మే 25వ తేదీనుండి 1985 మార్చి 8వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1986లో జమ్ము-కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం మద్దతును నిరూపించుకోవలసిన పరిస్థితులు సంభవించినప్పుడు మెజార్జీని నిరూపించుకోలేక పోయింది. 1986 మార్చి 6వ తేదీనుండి నవంబర్‌ 7వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన కొనసాగింది.
1987 జూన్‌లో పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన వచ్చింది. రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడి శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగినందున 1987 జూన్‌ 11వ తేదీనుండి 1992 ఫిబ్రవరి 25వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన సాగింది.

1988 ఆగస్టునెలలో నాగాలాండ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి అధికార పార్టీ అంటే కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి హొకిషాసిమా ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. 1988 ఆగస్టు 7వ తేదీనుండి 1989 జనవరి 25వ తేదీ వరకు రాష్ట్రపతిపాలనలో ఉంది.
1988 సెప్టెంబర్‌ నెలలో మిజోరాంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. అధికారంలో ఉన్న పార్టీ సరయిన సమయంలో బలాన్ని నిరూపించుకోలేక మైనార్టీలో పడిపోయింది. 1988 సెప్టెంబర్‌ 7వ తేదీనుండి 1989 జనవరి 24వ తేదీ వరకు మిజోరాంలో రాష్ట్రపతి పాలన ఉంది.
1989లో కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఎస్‌.ఆర్‌.బొమ్మై తన ప్రభుత్వాన్ని రద్దు చేసారు. 1989 ఏప్రిల్‌ 21 నుండి నవంబర్‌ 30వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన వచ్చింది.
1990లో జమ్ము-కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. అందువలన 1990 జనవరి 19వ తేదీనుండి అక్టోబర్‌ 9వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1990లో గోవాలో రాష్ట్రపతి పాలన విధించారు. హైకోర్టు ఉత్తర్వుల వలన ముఖ్యమంత్రి అధికారం కోల్పోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడక పోయినందున అనిశ్చిత స్థితి నెలకొంది. 1990 డిసెంబర్‌ 14వ తేదీ నుండి 1991 జనవరి 25వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1990 అక్టోబర్‌లో కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న వీరేంద్ర పాటిల్‌ ప్రభుత్వం రద్దయింది. ప్రధానిగా ఉన్న రాజీవ్‌గాంధీ తీసుకున్న నిర్ణయం వలన అక్కడ ముఖ్యమంత్రి రాజీనామా చేయగా రాష్ట్రపతి పాలన 1990 అక్టోబర్‌ 10 నుండి వారం రోజుల పాటు అనగా 17వ తేదీ వరకు అమలులో ఉంది.
ఉల్ఫా మిలిటెంట్ల సమస్యల వలన అస్సాంలో ఇంకోసారి కూడా రాష్ట్రపతి పాలన వచ్చింది. 1990 నవంబరు 28వ తేదీనుండి 1991 జూన్‌ 30వ తేదీవరకు అమలులో ఉంది.

1991 మార్చిలో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించబడింది. సరయిన సమయంలో మెజార్టీని నిరూపించుకోలేక అధికార పక్షం చతికిల బడిపోయింది. 1991 మార్చి 4వ తేదీనుండి జూలై 3వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన కొనసాగించబడింది.

1991లో హర్యానాలో రాష్ట్రపతి పాలన విధించబడింది. అధికారంలో ఉన్న పార్టీలో రెబల్‌ అభ్యర్ధుల తిరుగుబాటు వలన ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. అనిశ్చిత స్థితి ఏర్పడే సందర్భంలో రాష్ట్రపతి పాలనను 1991ఏప్రిల్‌ 6వతేదీ నుండి జూన్‌ 23వ తేదీవరకు రాష్ట్రపతి పాలన విధించారు.
1991 అక్టోబర్‌లో మేఘాలయలో రాష్ట్రపతి పాలన సాగింది. ఇండిపెండెంట్లుగా వ్యవహరిస్తున్న 5గురు ఎమ్మెల్యేను అప్పటి స్పీకర్‌ పి.ఆర్‌.కిండయ్య సస్పెండ్‌ చేసిన సందర్భంలో కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అమలు చేసారు. 1991 అక్టోబర్‌ 11వ తేదీనుండి 1992 ఫిబ్రవరి 5వ తేదీ వరకు రాష్ట్రపతి పాలనలో ఉంది.
1992 జనవరి నెలలో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేసారు. రాష్ట్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు తలెత్తి మద్దతును ఉప సంహరణ కొనసాగినందున 1992 జనవరి 7వ తేదీనుండి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలు చేసారు.
1992 ఏప్రిల్‌లో నాగాలాండ్‌లో రాష్ట్రపతిపాలన అమలులోకి వచ్చింది. అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగి రాష్ట్రంలో అనిశ్చిత స్థితిగతులు నెలకొన్నందున 1992 ఏప్రిల్‌ 2వ తేదీనుండి 1993 ఫిబ్రవరి 22వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతిపాలన సాగింది.
1992లో హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన నేపథ్యంలో జరిగిన అల్లర్లుకు గాను రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. 1992 డిసెంబర్‌ 15వ తేదీనుండి 1993 డిసెంబర్‌ 3వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలు చేసారు.
1992 డిసెంబర్‌ 15వ తేదీకి ప్రత్యేకత ఉంది. అదే రోజున హిమాచల్‌ ప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో కూడా రాష్ట్రపతి పాలన విధించారు. ఉత్తరప్రదేశ్‌లో రామజన్మభూమి సంఘటన జరిగిన సందర్భంగా ఇక్కడ కూడా అల్లర్లు చెలరేగి శాంతిభద్రతలకు విఘాతం కలిగినందులకు గాను 1992 డిసెంబర్‌ 15వ తేదీనుండి 1993 డిసెంబర్‌ 7వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన సాగింది.
1992 డిసెంబర్‌ 15వ తేదీన రాజస్థాన్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో భైరాన్‌సింగ్‌ షెకావత్‌ పెట్టిన అవిశ్వాసతీర్మానం నెగ్గినందున రాష్ట్రంలో అధికారపక్షం చిక్కుల్లో పడింది. 1992 డిసెంబర్‌ 15 నుండి 1993 డిసెంబర్‌ 4వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.

1993లో మణిపూర్‌లో విధ్వంసాలు తలెత్తాయి. నాగా-కుకీ గొడవల నేపధ్యంలో సుమారు 1000 మందికి పైగా చనిపోయి శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. 1993 డిసెంబర్‌ 31వ తేదీనుండి 1994 డిసెంబర్‌ 13వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన అమలు చేసారు.
1995లో మరి కొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తాయనే సమయంలో ఒక వారం రోజుల పాటు రాష్ట్రపతి పాలన విధించారు. ఓట్‌ ఆన్‌ అక్కౌంట్‌ బడ్జెట్‌ సమర్పించే సమయంలో ఏర్పడుతన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ సంఘటన జరిగింది.
1996లో గుజరాత్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడిన సందర్భంగా అధికారం పక్షం విశ్వాసాన్ని కోల్పోయి అనిశ్చిత స్థితులు రాష్ట్రంలో ఏర్పడినందున 1996 సెప్టెంబర్‌ 19వ తేదీ నుండి అక్టోబర్‌ 23వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
1999లో గోవాలో రాష్ట్రపతి పాలన విధించబడింది. అధికార ప్రభుత్వం సరయిన మెజార్టీ లేకుండా పోయినందున రాష్ట్రంలో అనిశ్చిత స్థితి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. 1999 ఫిబ్రవరి 9వ తేదీనుండి జూన్‌ 9వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అక్కడ అమలులో ఉంది.

1999లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిన నేపథ్యంలో బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. నారాయణపూర్‌ అనే ప్రాంతంలో 11మంది దళితుల మరణం సంభవించింది. అటువంటి పరిస్థితుల్లో అప్పట్లో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీ రాష్ట్రపతి పాలన విధించింది. అయితే రాజ్యసభలో ఆ సంకీర్ణ ప్రభుత్వానికి సరయిన మద్దతు లేని కారణంగా కేవలం 26 రోజుల్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేసారు. మొత్తంగా అప్పుడు 1999 ఫిబ్రవరి 12వ తేదీనుండి మార్చి 9వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.

2001లో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం సరయిన సమయంలో తన పార్టీ బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోలేక చతికిలబడింది. 2001 జూన్‌ 2వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలు చేసారు.
2002 అక్టోబర్‌లో జమ్ము – కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. ఎన్నికలు జరిగినా ఫలితాలు సరిగ్గా రానందున ఏ పార్టీ అధికారాన్ని సరిగ్గా చేజిక్కించుకోలేని పరిస్థితుల్లో 2002 అక్టోబర్‌ 18 నుండి నవంబర్‌ 2వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలు చేసారు.

2005 మార్చిలో గోవాలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి ప్రతాప్‌ సింగ్‌ రాణే వివాదాస్పద విశ్వాస తీర్మానం వలన కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. 2005 మార్చి 4వతేదీ నుండి జూన్‌ 7వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
ఎన్నికల ఫలితాలు సరయినవిగా లేకుండా అనిశ్చిత స్థితి నెలకొన్నందున 2005లో బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. 2005 మార్చి 7వ తేదీనుండి నవంబర్‌ 24వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
2007లో కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. అధికార పక్షం తన మెజార్టీని నిరూపించు కోలేక పోయినందున ప్రభుత్వం కుప్పకూలింది. 2007 అక్టోబర్‌ 9వ తేదీనుండి నవంబర్‌ 11వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన అమలు చేయబడింది.
2007లో కర్నాటకలో రాష్ట్రపతి పాలన విధించారు. అధికార పక్షం అవిశ్వాస తీర్మానంలో వీగిపోయి మైనార్జీలో పడినందువలన ప్రభుత్వం కుప్పకూలింది. 2007 నవంబర్‌ 20వ తేదీనుండి 2008 మే 27వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన అమలు కాబడింది.
2008 జనవరిలో నాగాలాండ్‌లో రాష్ట్రపతిపాలన వచ్చింది.అప్పటి ముఖ్యమంత్రి నిఫియోరియో తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోలేక పోయినందున ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. 2008 జనవరి 3వ తేదీనుండి మార్చి 12వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన ఉంది.
2008 జూలై 11వ తేదీన జమ్ము-కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అమలు చేసారు. అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన ప్రధాన విషయంలో ముఖ్యమంత్రిగా ఉన్న గులాంనబీఆజాద్‌ తీసుకున్న నిర్ణయం వికటించింది. పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ తన మద్దతును ఉపసంహరించుకుంది. అధికారంలో ఉన్న ఆజాద్‌ ప్రభుత్వం మద్దతును కోల్పోయింది. అప్పుడు 2008 జూలై 11 నుండి 2009 జనవరి 5వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.
2009లో జార్ఖండ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోలేక పోయింది. 2009 జనవరి 19వ తేదీనుండి డిసెంబర్‌ 9వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
2009 మార్చి నెలలో మేఘాలయలో రాష్ట్రపతి పాలన పెట్టారు. అప్పటి ముఖ్యమంత్రి డొంకూపార్‌ రాయ్‌ పెట్టిన విశ్వాసతీర్మానం వివాదాస్పదమైన నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతిపాలన వచ్చింది. 2009 మార్చి 18 నుండి మే 12 వరకు అమలులో ఉంది.

2010లో జార్ఖండ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తన మెజార్టీని నిరూపించుకోలేక పోయింది. 2010 జూన్‌ 1వ తేదీనుండి సెప్టెంబర్‌ 11వ తేదీ వరకు అక్కడ రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
2013లో జార్ఖండ్‌ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. ఆ సమయంలో భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి వరకు మద్దతునిచ్చిన జార్ఖండ్‌ముక్తి మోర్చా పార్టీ తన మద్దతును ఉపసంహరించుకోగా ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ముఖ్యమంత్రిగా వ్యవహరించిన అర్జున్‌ ముండా రాజీనామా చేసారు. 2013 జనవరి 18వ తేదీనుండి జూలై 12వ తేదీ వరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
2014లో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమలు చేసారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పాటై సరయిన సమయంలో మద్దతును నిరూపించుకోలేక పోయినందున సంకీర్ణం విఫలమై రాష్ట్రపతి పాలన అమలు చేసారు. 2014 ఫిబ్రవరి 14 నుండి అమలులో ఉంది. 2015 ఫిబ్రవరి 11వ తేదీ వరకు మొత్తంగా 362 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఫిబ్రవరి 28న రాష్ట్రపతి పాలన వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్‌ నుండి తెలంగాణా రాష్ట్రాన్ని విడదీసి ఏర్పాటుచేసే సందర్భంలో ఆర్టికల్‌ 356 అమలులోకి వచ్చింది. 2014 జూన్‌ 8వ తేదీ వరకు అంటే మొత్తంగా 100 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
2014 సెప్టెంబర్‌ 28న మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ సి పి పార్టీలు విడిపోయినందువలన రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. 2014 అక్టోబర్‌ 31వ తేదీ వరకు అంటే మొత్తంగా 33 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
2015 జనవరి 9వ తేదీన జమ్ము కాశ్మీర్‌లో రాజకీయ కారణాల వలన రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. 2015 మార్చి 1వ తేదీ వరకు మొత్తంగా 51రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
2016 జనవరి 8వ తేదీన జమ్ముకాశ్మీర్‌లో ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయ్యద్‌ మరణించినందువలన రాష్ట్రపతి పాలన వచ్చింది. 2016 ఏప్రిల్‌ 4వ తేదీ వరకు అనగా మొత్తంగా 87 రోజుల పాటు రాష్ట్రపతి పాలన అమలులో ఉంది.
2018 జూన్‌ 19వ తేదీన జమ్ము కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినందువలన రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. 2019 అక్టోబర్‌ 30వ తేదీ వరకు మరలా 2019 అక్టోబర్‌ 31 నుండి ప్రస్తుతం కూడా అక్కడ రాష్ట్రపతి పాలన ఉంది.

2019 నవంబర్‌ 12న భారతీయ జనతాపార్టీ, శివసేన పార్టీల మధ్య అభిప్రాయ భేదాల వలన మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చింది. 2019 నవంబర్‌ 23వ తేదీ వరకు మొత్తంగా 11 రోజుల పాటు రాష్ట్రపతి పాలన ఉంది.

 

(Visited 94 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *