భూముల రీ సర్వే లో నోషనల్ ఖాతాలకు మోక్షం ?
విజయవాడ. :
రాష్ట్రం లోని అన్ని జిల్లాలో నోషనల్ ఖాతల క్రింద వేల ఎకరాల విస్తీర్ణం క్రయ విక్రయాలకు నోచుకోవడం లేదు. వ్యవసాయ భూముల రీ సర్వే సెటిల్మెంట్ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఈ నోషనల్ ఖాతాల సమస్య మరలా తెరపైకి వచ్చింది. ఇంతకీ నోషనల్ ఖాతా లంటె ఏమిటి? ఈ ఖాతాలు క్రింద రికార్డులకు ఎక్కిన వ్యవసాయ భూమికి పట్టా దారు పాసు పుస్తకాలు ఎలా పొందాలి అనే అంశాలు రైతులను వేదిస్తున్నాయి.
గతంలో రాష్ట్ర ప్రభుత్వం రికార్డ్స్ ఆప్ రైట్స్ చట్టం క్రింద పట్టా దారు పాస్ పుస్తకం జారీ చేసినప్పుడు అలాగే అంతకు ముందు భూమి యజమాని ఎవరు అనే విషయంపై సరైన సమాచారం దొరకనప్పుడు రెవెన్యూ అధికారులు ఆ భూములకు నోషనల్ ఖాతాల పేరిట నెంబర్లను ఇచ్చారు. పాస్ పుస్తకాలు కోసం దరఖాస్తు చెయ్యని వారికి భూ యజమానులు వలస పోయిన సందర్బంలోను ఎస్టేట్, ఇనాం,ల్యాండ్ సీలింగ్ తదితర భూములకు స్థానికంగా రికార్డులు సరి లేనప్పుడు వివాదాల్లో ఉన్నప్పుడు కూడా భూములను నోషనల్ ఖాతాలు క్రింద చేర్చారు. రెవెన్యూ రికార్డుల్లో భూమి వివరాలు అలాగే యజమాని పేరు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల నోషనల్ ఖాతా నెంబర్లను ఇచ్చారు. రాష్ట్రం మొత్తం మీద జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎంత భూమి నోషనల్ ఖాతాల క్రింద ఉందని తెలుసుకునేందుకు ప్రభుత్వం 2016 లో ప్రయత్నించింది .ఒక్క కరీంనగర్ జిల్లాలోని 20 వేల ఎకరాల భూమి ఈ ఖాతాల క్రింద ఉన్నట్లు లెక్క తేలింది.
మామూలు ఖాతా నెంబర్లు అనగా అంటే పట్టా దారు పాసు పుస్తకాలపై ఉండే పట్టా నెంబరు ఒకటి నుండి నాలుగు అంకెల లోపున ఉంటాయి. నోషనల్ నెంబర్లు ప్రతి రెవెన్యూ గ్రామానికి లక్ష, లక్ష ఒకటి,లక్ష మూడు.. ఇలా మొదలవుతాయి.
నోషనల్ ఖాతాలను మామూలు ఖాతాలుగా మార్పించిన తరువాతనే వీటిపై అధికారిక లావాదేవీలకు వీలు ఉంటుంది. ఇంకో మాటలో చెప్పాలి అంటే ఇవి స్థిరాస్తి బదిలీకి అనువైన భూములుగా మారుతాయి. నోషనల్ ఖాతా క్రింద ఉన్న భూమి హక్కు దారుడు కావాలి అంటే చట్టబద హక్కు కలిగిన యజమాని అనుభవ దారు ఒక్కరే అయితే వాటికి సులభం గానే పట్టా దారు పాస్ పుస్తకాలు మంజూరు అవుతాయి. భూ యజమాని వేరు,అనుభవ దారుడు వేరు అయినప్పుడు రెవెన్యూ అధికారులు విచారణ జరిపి ఖాతా నెంబర్లు ఇచ్చి పాస్ పుస్తకాలు మంజూరు చేస్తారు. చాలా కాలంగా అనుభవంలో ఉన్న యాజమాన్యపు హక్కులు లేకపోతే వారికి పట్టా దారు పాస్ పుస్తకాలు మంజూరు చెయ్యరు. ఆర్ఒఆర్ చట్టం ఆధారంగానే ఇప్పుడు జరిగే రీ సర్వే సెటిల్మెంట్ లో ఈ సమస్యను పరిస్కరిస్తారు. నోషనల్ ఖాతా క్రింద ఉన్న భూములకు రిజిస్ట్రేషన్ చెయ్య వద్దని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. నోషనల్ ఖాతా లపై విచారణ జరిపి వెబ్ ల్యాండ్ లోకి తేవాలని కోర్టులు మార్గదర్శకాలు ఇచ్చాయి.