నాణ్యమైన నాణేనికి  అటూ..ఇటూ..!

నాణేనికి రెండు వైపులుంటాయి.బొమ్మ-బొరుసు.నాణేనికే కాదు మనిషికీ రెండు వైపులుంటాయి.బయటి మనిషి. లోపలి మనిషి.అందరం ఒక వైపే చూస్తాం.అది సరిపోదు. రెండో వైపు ఏముందో చూస్తేనే  మనిషైనా నాణెమైనా పూర్తిగా అర్ధమయ్యేది.ఆటగాడి చూపు గెలుపుపై ఉంటుంది.కళాకారుడి చూపు కళపై ఉంటుంది.రచయిత చూపు  చుట్టూరా ఉన్న సమాజంపైనా.. మట్టికొట్టుకుపోయి కష్టాలు మూటకట్టుకుని దుర్భర జీవితాలు గడిపే నిరుపేదలపైనా ఉంటుంది.రాజకీయ నేత చూపు వ్యూహాలపై ఉంటుంది.రచయితే రాజకీయ నేత అయితే ఆ చూపు మళ్లీ సమాజంపైనే నిలబడుతుంది.రచయిత-రాజకీయ నాయకుడు ఒకరే అయిన సందర్భాలు చాలా చాలా తక్కువ.మన దేశాన్ని పాలించిన ప్రధానుల్లో  జవహర్ లాల్ నెహ్రూ- అటల్ బిహారీ వాజ్ పేయ్- పి.వి.నరసింహారావులు మంచి రచయితలు..సాహితీ వేత్తలు కూడా.ఇటువంటి అరుదైన  క్లబ్ లో మన తెలుగు రాష్ట్రాల నుండి మెరిసిన మరో కలం దాడి వీరభద్రరావు.

అనకాపల్లి అనగానే దాడి పేరు గుర్తుకు వస్తుంది.వీరభద్రరావు అనగానే అనకాపల్లి జ్ఞప్తికి వస్తుంది.అనకాపల్లికి పర్యాయ పదంగా మారిపోయి.. మూడున్నర దశాబ్ధాల పాటు అనకాపల్లి రాజకీయాలను శాసిస్తూ  రాజకీయంగా ఎన్నో పదవులను సమర్ధవంతంగా నిర్వర్తించిన  దాడి వీరభద్రరావు  VDREAMS ప్రతినిథికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ  సారాంశాన్ని మా వీక్షకులకు అందిస్తున్నాం.

 

అక్షరంపైనే తొలిప్రేమ

చదువుకునే రోజుల్లోనే సాహిత్యంపై  ప్రేమలో పడిపోయారు దాడి.అనుక్షణం అక్షరంతో ఆడుకోవడానికే  ప్రాధాన్యతనిచ్చేవారు.అలా కాలేజీలో చదువుకుంటూనే  “మంత్రిగారి మేనకోడలికి ఫిట్స్ ” -మమేఫి పేరిట ఓ నాటిక రాశారు వీరభద్రరావు.అందులో ప్రతీ అక్షరం వెటకారంతో నిండినదే. అప్పట్లో అది ఆకాశవాణిలో ప్రసారమై సంచలనం సృష్టించింది.ఆయన సాహితీ వనంలో విరబూసిన విలువైన సృజన పలుకే బంగారు మాయె.నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి  సమక్షంలో ఈ నాటకాన్ని  ప్రదర్శించారు.వీరభద్రరావు రచనా శైలికి ముగ్ధుడైన నీలం సంజీవరెడ్డి చాలా అద్భుతంగా ఉందండీ అని మెచ్చుకుని విశిష్ట పురస్కారాన్ని అందించి యువ వీరభద్రరావును సత్కరించారు. ఓ తెలుగు రచయితకు హస్తినలో జరిగిన అరుదైన అద్భుతమైన  సన్మానం అది.రచన తర్వాత రచన ఏ  రచయితకైనా కిక్కు ఇస్తుంది.మమేఫి, పలుకే బంగారు మాయె విజయాలతో వీరభద్రరావు కలం  మరింత హుషారుగా కదం తొక్కింది.అనగనగా ఒక రాజు,  ఓ అమ్మాయి కథ, గురజాడ డైరీలో కన్యాశుల్కం, ఇదీ పోతన భాగవతం  రచనలు వీరభద్రరావులోని సృజనాశక్తికి అద్దంపట్టాయి.అనగనగా ఒక రాజు నాటికను చూసిన ప్రముఖ రంగస్థల నట సోదరులు జే.వి.సోమయాజులు, జే.వి.రమణ మూర్తి  తెగ ముచ్చటపడ్డారు.దాడి కలం పదును గొప్పదని మెచ్చుకున్నారు.

 

బాలచందర్ మెచ్చిన తెలుగు రచయిత

1978 ప్రాంతంలో  దాడి వీరభద్రరావు రచించిన “రాజసూయ యాగం”  నాటకాన్ని  మద్రాస్  నాటక పరిషత్ లో ప్రదర్శించారు.ఆ నాటకాన్ని  సుప్రసిద్ధ తమిళ దర్శకుడు   కె. బాలచందర్, ప్రముఖ గాయకుడు సౌందర్య రాజన్ లు కలిసి చూశారట.నాటకం ఆద్యంతం ప్రేక్షకులు పగలబడి నవ్వుతూ  చప్పట్లు కొడుతూ ఆస్వాదించడాన్ని గమనించిన బాలచందర్   ఆ డైలాగులను తమిళంలోకి అనువదించి చెప్పమని ప్రముఖ క్యారెక్టర్  ఆర్టిస్ట్  వంకాయల సత్యనారాయణను అడిగారట. నాటకం మొత్తం చూసిన బాలచందర్  నాటక రచయిత వీరభద్రరావును స్వయంగా అభినందించాలని ప్రయత్నిస్తే.. ఆయన అక్కడ లేరని  చెప్పారట. పలుకే బంగారు మాయె నాటకంలో కీలక పాత్ర పోషించిన నటుడు రామారావుకు అస్వస్థత చేయడంతో వీరభద్రరావు ఆయన్ను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారని తెలుసుకున్న బాలచందర్  కళాకారుడికి అంత సాదరంగా చూసుకోవాలంటే ఎంతో సంస్కారం ఉండాలని ప్రశంసించారు. రాజసూయ యాగం నాటకం గురించి మాట్లాడ్డానికి మరో సారి వీరభద్రరావును కలిసిన బాల చందర్  తన జీవితంలో ఎన్నో నాటకాలు.. నాటికలు చూశానని కానీ ఇంత ప్రయోగాత్మకంగా నాటకాన్ని మలిచిన తీరు అత్యద్భుతమని కితాబు నిచ్చారు. అంతే కాదు రాజసూయ యాగాన్ని    సినిమాగా తీయడానికి దాని కాపీ రైట్స్ తనకు ఇవ్వాలంటూ అప్పట్లోనే 25 వేల రూపాయలకు చెక్ రాసి దాడికి ఇచ్చారు. సినిమాకి అనుగుణంగా ఆ నాటకాన్ని మలిచి ఇవ్వాల్సిన దాడి వీరభద్రరావు  తెలుగుదేశం పార్టీ స్థాపనతో ఎన్టీయార్ పిలుపు మేరకు రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అలా  వెండితెరకెక్కాల్సిన రాజసూయ యాగం అలా నాటకానికే పరిమితమైపోయింది.కె. బాలచందర్ కు తెలుగు సాహితీ లోకానికి సంబంధించి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం.ఆ తర్వాత బాలచందర్ ను మెప్పించిన తెలుగు రచన వీరభద్రరావు రచించిన రాజసూయ యాగం కావడం తెలుగువారు గర్వించ దగ్గ విజయం.

అమృతం కురిసిన రాత్రుళ్లు

అక్షరంతో రొమాన్స్ జరిపిన  క్షణాలు

అక్షరానికి దగ్గరి చుట్టమైన వారికి  హద్దేముంది.ఆకాశమూ హద్దు కాదు. అంతరిక్షమూ హద్దు కాదు.స్వతహాగా మంచి రచయిత అయిన దాడి వీరభద్రరావు  ప్రముఖ సాహితీ వేత్తలతో సహవాసం చేశారు.విశాఖ సాగర తీరాన.. వెన్నెల కురిసే ఎన్నో రాత్రుళ్లు.. తెలుగు కథకి కొండంత అండ అయిన రాచకొండ విశ్వనాథ శాస్త్రి తోనూ అలనాటి పాపులర్ ఎడిటర్, రచయిత పురాణం సుబ్రహ్మణ్య శర్మతోనూ  అమృతం కురిసే సాహితీ చర్చల్లోనూ.. చమత్కారాలు నిండే కబుర్లతోనూ కాలక్షేపం చేసేవారు. ఆ చర్చల్లో  విశాల విశ్వాన్ని తమ గుప్పిట పెట్టుకున్న  జాతీయ అంతర్జాతీయ కవులు, రచయితల రచనలపై  గంటల తరబడి కబుర్లు.ఆ కబర్లను పక్కన కూర్చుని వినడమే ఓ ఎడ్యుకేషన్ అని మామూలు యువకులు ఆనందించే రోజులవి.సాహిత్యంలో  పీకల దాకా కూరుకుపోయి.. అక్షరాలను పీకలదాకా కుక్కేసుకున్న ఓ రచయిత   కలాన్ని పక్కన పెట్టి  రాజకీయ రథానికి సారధ్యం వహిస్తారని ఎవరూ అనుకోలేదు. ఎవరో ఎందుకు వీరభద్రరావే అనుకుని ఉండకపోవచ్చు.

మనుషులను చదివి మనసులు గెలిచి..!

చదువుకోవడం అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది బట్టీయం పట్టడం కాదు.చదవడం అంటే చుట్టూరా ఉన్న సమాజాన్ని చదవడం.సమాజంలో అట్టడుగున ఉన్న బీదా బిక్కీ జనాల జీవితాలు అర్ధం చేసుకోవడం.అర్ధం చేసుకున్న జీవితాలను మెరుగుపర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసేలా ఆలోచన చేయడం.ఇలాంటి చదువే చదివారు దాడి వీరభద్రరావు.చదివే కొద్దీ మనసులో అశాంతి. ఎక్కువ మంది పేదలకు మేలు చేయాలంటే వ్యక్తులుగా  సాధ్యం కాదు.చేతిలో అధికారం ఉంటేనే  సమాజానికి ఎక్కువ మేలు చేయవచ్చు.ఈ సత్యాన్ని చాలా యుక్త వయసులోనే అర్ధం చేసుకున్నారు దాడి వీరభద్రరావు.చదివిన చదువును పది మందికీ నేర్పడానికి అధ్యాపకుడిగా కొంతకాలం  గడిపారు దాడి.ఆ సమయంలోనే  తెలుగు వెలుగు ,ఆంధ్రుల  అభిమాన నటుడు నందమూరి తారకరామారావు తెలుగుదేశం పేరిట పార్టీ పెట్టారు. మూడున్నర దశాబ్ధాల కాంగ్రెస్ పాలనకు  చరమగీతం పాడాలన్న కసి ప్రతీ తెలుగువాడిలోనూ ఉన్న తరుణమది.ఆ తరుణమే దాడి చూపును రాజకీయాల వైపు లాగింది.చురుకైన చూపు.. స్పష్టమైన మాట.. శషభిషలు లేని నిర్ణయాలు తీసుకునే దాడి వీరభద్రరావు గురించి తెలుసుకున్న ఎన్టీయార్  తన పార్టీలోకి ఆహ్వానించారు. అలా రాజకీయ ఆరంగేట్రం చేశారు.పార్టీని స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి గిన్నీస్ రికార్డు సృష్టించారు ఎన్టీయార్.అయితే 1984లో కాంగ్రెస్ హై కమాండ్ ఆశీస్సులతో ఎన్టీయార్ కేబినెట్ లో ఆర్ధిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఎన్టీయార్  దేశంలో లేని సమయం చూసుకుని వెన్నుపోటు పొడిచారు.ఎన్టీయార్ కు జరిగిన అన్యాయానికి ఆంధ్ర రాష్ట్రం అట్టుడికింది.  ప్రజాస్వామిక ఉద్యమం ఊపందుకుంది.  అనకాపల్లి  ప్రాంతంలో ఆ ఉద్యమానికి దాడి వీరభద్రరావు నాయకత్వం వహించారు. నెల రోజులు తిరిగే సరికి ఎన్టీయార్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ వెంటనే పార్టీలో వెన్నుపోటు దారులు ఉండడానికి వీల్లేదని అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లారు.ఆ సమయంలో అనకాపల్లి స్థానానికి దాడి వీరభద్రరావును ఎంచుకున్నారు ఎన్టీయార్.ఆ ఎన్నికల్లో దాడి వీరభద్రరావు ఘన విజయం సాధించారు.  అనకాపల్లి ఎమ్మెల్యే అయ్యారు.అక్కడి నుంచి 20 ఏళ్ల పాటు అనకాపల్లికి  ఏకఛత్రాధిపత్యం వహించారు.

మాట చూస్తే  మావిడల్లం.. మనసు చూస్తే పటిక బెల్లం

ఎదుటివారిలో ఏం నచ్చకపోయినా నిర్మొహమాటంగా చెప్పేస్తారు దాడి.ఆ వైఖరిని మొదటి సారి చూసిన వారు ఈయనేంటి ఇంత కఠినం అనుకుంటారు.కానీ ఎవరైనా కష్టాల్లో ఉంటే మాత్రం మొదటి సాయం తానే చేస్తారు దాడి.అది తెలిసిన వాళ్లు  దాడి మనసు పటిక బెల్లమే అనుకుంటారు.20ఏళ్ల పాటు  నిరాటంకంగా ఎమ్మెల్యేగా కొనసాగారు.అందులో అయిదేళ్లు మినహా మిగతా 15 ఏళ్లూ అధికారంలోనే ఉన్నారు.అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాసమస్యల విషయంలో రాజీలేని పోరాటాలే చేశారు.టిడిపి అధికారంలో ఉన్నప్పుడూ ప్రజలు సమస్యలు  ఏకరవు పెడితే అధికారులను పిలిచి క్లాసులు తీసుకునే వారు. అక్కడి కక్కడ సమస్య పరిష్కరించేవారు. ఏ పని చేసినా ఓ ప్రణాళిక రూపొందించుకోవడం.. దానిని పకడ్బందీగా అమలు చేయడం  వీరభద్రరావు స్పెషాలిటీ.ఆయనలోని అనితర సాధ్యమైన ఈ వైఖరే ఎన్టీయార్ కు నచ్చింది. అదే దాడిని ఎన్టీయార్ కేబినెట్ లో చేర్చింది. దానికి ఆద్యుడు  దాడి వీరభద్రరావే..!కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగిన వెంటనే ఓ సీనియర్ మంత్రి మీడియా ముందుకు వచ్చి కేబినెట్ నిర్ణయాలను వివరించడం ఇప్పుడు మనకి  రొటీన్ గా అనిపించవచ్చు.కానీ ఈ పద్ధతికి ఆద్యుడు దాడి వీరభద్రరావేనని బహుశా ఇప్పటి రాజకీయ నేతలకు కానీ.. పార్టీలకు కానీ  తెలిసి ఉండకపోవచ్చు.కానీ అదే నిజం. 1994 లో ఈ పద్ధతికి శ్రీకారం చుట్టింది దాడి వీరభద్రరావే.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే…

1994లో  అఖండ విజయంతో గెలిచింది టిడిపి.ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఎంత రహస్యంగా ఉంచాలనుకున్నా మీడియాకు లీకైపోయేవి.అది ఎన్టీయార్ కు నచ్చేది కాదు. ఓ సారి దాడిని పిలిచి ఏయే మంత్రులు ఏయే మీడియాకి  కేబినెట్ నిర్ణయాల గురించి లీకులు ఇస్తున్నారో నిఘా పెట్టండన్నారట ఎన్టీయార్. కేబినెట్ నిర్ణయాలు గోప్యంగా ఉండాల్సిందే అని ఎన్టీయార్ అన్నారట. దాడి స్థానంలో ఇంకెవరున్నా  “యస్ బాస్ ” అని ఎన్టీయార్ చెప్పినట్లే చేసేవారు.కానీ దాడి మాత్రం అలా చేయలేదు. రబ్బరు స్టాంపులానో.. రోబోలానో ఉండడం దాడి మనస్తత్వానికే విరుద్ధం.అందుకే దాడి  చిరునవ్వుతోనే ” కేబినెట్ నిర్ణయాలు రహస్యంగా ఎందుకుండాలి సార్? మనం ఎలానూ ఆ నిర్ణయాలను రేపో మాపో అమలు చేసి తీరతాం.అప్పుడు అందరికీ అవి ఎలాగూ తెలుస్తాయి. ఈలోగా ఎవరికి తోచినట్లు వారు ఊహాగానాలు చేసుకుని రాద్ధాంతాలు చేసే కంటే  మనమే కేబినెట్ నిర్ణయాలను మీడియాకు  ఓ ప్రెస్ నోట్ రూపంలో  బ్రీఫ్ చేస్తేనే మంచిది కదా” అని దాడి సూచించారు.ఆ ఆలోచన ఎన్టీయార్  కూ నచ్చింది. ” మీరు చెప్పిందీ నిజమే కదా. అయితే సరే ఇకపై మీరు చెప్పినట్లే  కేబినెట్ మీటింగ్ అయిపోయిన తర్వాత మంత్రి చేత కేబినెట్ నిర్ణయాలను  మీడియాకు చెప్పించండి” అని ఎన్టీయార్  అన్నారట.

పూరి పాక పీకి ..పక్కా ఇల్లు కట్టారు

రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే దాడి వీరభద్రరావు తన నియోజక వర్గంలో వివిధ గ్రామాలనూ  సందర్శించడం.. అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం వాటిని అధికారులకు చెప్పి పరిష్కరించడం ఓ అలవాటుగా పెట్టుకున్నారు.అలా ఆయన గ్రామాల్లో తిరిగేటపుడు ఎక్కువ చోట్ల  పూరిపాకలే దర్శనమిచ్చాయి.తమ్మయ్య పేట  అనే గ్రామంలో అయితే ఒకే ఒక్క పెంకుటిల్లు ఉండేదట. మిగతావన్నీ పూరి పాకలే. ఆ ఒక్క పెంకుటిల్లూ అప్పారావు అనే ఆసామిది. ఆయన్ను పెంకుటిల్లు అప్పారావు అనేవారట. ఈ దృశ్యాలు చూసిన దాడి వీరభద్రరావు మనసు నొచ్చుకున్నారు.పూరి పాకలు  ఆయన  గుండెల్లో గుచ్చుకున్నట్లు ఉండేవి. పూరిపాకలు లేని అనకాపల్లిని ఆవిష్కరించాలని  అప్పుడే ఆయన అనుకున్నారు.అది లగాయితు  ప్రభుత్వం నిర్మించే పక్కా గృహాల్లో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను తన నియోజక వర్గానికి కేటాయించేలా ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తూ  నిరుపేదలను పక్కా ఇంటివాళ్లను చేస్తూ వచ్చారు. ఇల్లు పీకి పందిరేసి అన్న సామెతను  పూరి పాక పీకి పక్కా ఇల్లు కట్టి అని మార్చారు దాడి వీరభద్రరావు.

మా ఫైర్ స్టేషన్ తీసేయండి ప్లీజ్.!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఓ సారి రాష్ట్ర హోంమంత్రి దేవేందర్ గౌడ్  విశాఖ జిల్లా పర్యటనకు వచ్చారు.ఆయన పాల్గొన్న కార్యక్రమాలకు జిల్లా ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు.ఆ సందర్భంగా దేవేందర్ గౌడ్ సహచర ఎమ్మెల్యేలను ఉద్దేశించి మీమీ నియోజక వర్గాలకు సంబంధించి ఏమైనా డిమాండ్స్ ఉంటే డన్నారు.ఎమ్మెల్యేలంతా మాకు ఫలానా చోట ఫైర్ స్టేషన్   శాంక్షన్ చేయించండి.. మాకు ఫలానా చోట పోలీస్ స్టేషన్ పెట్టించండి అని రక రకాల డిమాండ్స్ ఏకరవు పెట్టారు. అందరి డిమాండ్లకే అక్కడి కక్కడే ఓకే అన్న  దేవేందర్ గౌడ్ ఏ డిమాండూ చేయకుండా మౌనంగా ఉన్న దాడిని ఉద్దేశించి..” ఏంటి మాస్టారు? మీరేం డిమాండ్  చేయరా? “అని  అడిగారు. దానికి దాడి తనకే సాధ్యమైనంత కూల్ గా ”  దయచేసి మా నియోజక వర్గంలో ఉన్న ఫైర్ స్టేషన్ తీసేయండి”అన్నారు.  షాక్ తిన్న దేవేందర్ గౌడ్ అందరూ లేని ఫైర్ స్టేషన్ కావాలంటే మీరేంటి సార్ ఉన్న స్టేషన్ తీసేయమంటారు? అని ఆశ్చర్యంగా ఆరాతీశారు.దానికి దాడి స్పందిస్తూ ” ఔను నేనడిగేది నిజం. మాకు ఫైర్ స్టేషన్ వద్దు.  పైర్ స్టేషన్ అవసరం లేని వాతావరణం ఇవ్వండి మాకు” అన్నారు.దేవేందర్ గౌడ్ అర్ధం కానట్లు చూడ్డంతో ”  పూరి పాకల స్థానంలో వీలైనన్ని పక్కా ఇళ్లు కేటాయించండి మాకు అప్పుడు ఫైర్ స్టేషన్ తో పని ఉండదు” అనేసరికి దేవేందర్ గౌడ్ నిర్ఘాంతపోయారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో పూరిపాకలను మాయం చేసి పక్కాఇళ్లను  కట్టించి ఇవ్వగలగడమే తనకు ఎక్కువ సంతృప్తిని ఇచ్చిందంటారు దాడి.

ఎన్టీయార్  పక్కన ఉంటే .. అదే ఇంద్ర పదవి

1995లో ఎన్టీయార్ రాజకీయ జీవితంలో రెండో వెన్నుపోటు.ద్రోహానికి పాల్పడింది ఎవరో కాదు. పిలిచి పిల్లనిచ్చి.. రాజకీయ భిక్ష పెట్టి.. పదవులిచ్చి చల్లగా చూసిన ఎన్టీయార్ కు చిన్నల్లుడు చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పొడిచారు.వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమనుకున్న ఎమ్మెల్యేలంతా చంద్రబాబు శిబిరంలో చేరిపోయారు.30 మంది మాత్రం ఎన్టీయార్ తోనే ఉండిపోయి విలువలకు ప్రతీకలుగా నిలిచారు.అందులో దాడి వీరభద్రరావు కూడా ఒకరు.  అయితే ఎంతో సమర్ధుడైన దాడిని విడిచిపెట్టుకోకూడదనుకున్న చంద్రబాబు నాయుడు  దాడిని కూడా తమ శిబిరంలోకి వచ్చేయమని రాయబారాలు పంపారు. కీలక మంత్రి పదవిని ఇస్తామని ఆఫర్లూ ఇచ్చారు. ఆ ప్రతిపాదనతో వచ్చిన దూతలతో దాడి మాట్లాడుతూ ” నాకు పదవుల కన్నా అన్నగారితో కలిసి ఉండడమే ఇష్టం.  నా దృష్టిలో పదవులు గొప్పవి కావు. ఎన్టీయార్ తో కలిసి నడవడమే నా కు ఇంద్ర పదవి కన్నా గొప్పది” అని చెప్పి పంపించారు. ఎన్టీయర్ తుదిశ్వాస విడిచే వరకు ఎన్టీయార్ తోనే ఉన్నారు దాడి.

ఆ ముగ్గురూ అదుర్స్

భారత దేశ రాజకీయ చరిత్రలోనే  ముగ్గురు నేతలను ఎన్నటికీ మరవలేనంటారు దాడి వీరభద్రరావు.దివంగత ప్రధాని ఇందిరాగాంధీ అంటే దాడి వీరభద్రరావుకు చాలా అభిమానం.ఎంతటి క్లిష్ట సమయంలోనైనా  సాహసంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ఇందిరా గాంధీకి ఉన్న గట్స్ ఏ భారత  ప్రధానికీ లేనే లేవంటారు దాడి.అదే సమయంలో సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఇందిరా గాంధీ కరుణామూర్తిగానే కనిపిస్తారంటారు.ఇక తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్,   తెలుగు వల్లభుడు నందమూరి తారకరామారావులు నిరుపేదల పాలిట దేవుళ్లే అంటారు దాడి.ఈ ముగ్గురు నేతలనూ భరత జాతి  ఎప్పటికీ మరవదని.. దాడి వ్యాఖ్యానిస్తారు.

ఎమ్మెల్యే.. ఎంపీలకూ  విద్యార్హతలు ఉండాల్సిందే

ప్రభుత్వ కార్యాలయంలో చిన్న అటెండర్ పోస్టుకి కూడా ఏదో ఒక విద్యార్హత ఉండి తీరాలి.ఓ చిన్న గుమస్తా ఉద్యోగం రావాలంటే కనీసం డిగ్రీ ఉండాలి.కానీ దేశాన్ని పాలించే మంత్రులు..  కీలక నిర్ణయాలు తీసుకునే   ఎంపీలు.. ఎమ్మెల్యేలకు ఎలాంటి విద్యార్హతలూ లేకపోయినా  ఎలాంటి అడ్డంకులూ లేవు.ఇదేం ఘోరం? అంటారు దాడి వీరభద్రరావు.ఎమ్మెల్యే కావాలంటే ఫలానా కనీస విద్యార్హత ఉండాలనో..ఎంపీ కావాలంటే  పీజీ కోర్సు పూర్తి చేసి ఉండాలనో నిబంధనలు పెట్టాల్సిందే అంటారాయన.అలాగే మంత్రి పదవులు కట్టబెట్టేవారికి.. ఆయా మంత్రిత్వ శాఖల అవసరాలను బట్టి సంబంధిత విద్యార్హతలు ఉండేలా చట్టాలు తీసుకురావాలని దాడి సూచిస్తున్నారు. అపుడే రాజకీయాల్లో విలువలు మెరుగు పడ్డానికి  ప్రజాసమస్యలపై  అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోడానికీ వీలుంటుందని దాడి అంటున్నారు.

 ఎన్టీయార్ పై పుస్తకం

ఎన్టీయార్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులు అతి కొద్ది మందే.వారిలో ఒకరైన దాడి వీరభద్రరావు ఎన్టీయార్ ను చాలా దగ్గర్నుంచీ గమనిస్తూ వచ్చారు.ఎన్టీయార్ నిర్ణయాలు తీసుకునే తీరు.. ఆయన ఆలోచనా విధానం.. ఆయనలో కనిపించే భావోద్వేగాలు అన్నీ కూడా దాడికి క్షుణ్నంగా తెలుసు.ఇప్పటికీ  ప్రజాసమస్యలపై ప్రభుత్వాల్లోని పెద్దలకు లేఖలు రాస్తూ ఉంటారు దాడి.ప్రధాని నరేంద్ర మోదీ,  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు కేంద్ర మంత్రులు  దాడి వీరభద్రరావు లేఖలకు ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంటారు. మీరు చెప్పిన ప్రజాసమస్యలను   పరిష్కరించాం అంటూ వివరాలతో సమాధానాలు చెబుతారు. ఇంత బిజీలో ఉంటూనే  దాడి వీరభద్రరావు లోని రచయిత మరో  పుస్తకాన్ని రచించారు.అదే ఎన్టీయార్ జీవితంలోని అరుదైన సన్నివేశాలు.. సంఘటనలతో కూడి  అద్భుత  రచన. త్వరలోనే ముద్రణకు వెళ్లనున్న ఈ పుస్తకం ఎన్టీయార్ అభిమానులకు.. చరిత్రను ఇష్టపడే వారికీ  మంచి విందుభోజనంలాంటిదే అంటున్నారు దాడి.

పల్లకి మోయకండి.. అతిగా వంగకండి

మీడియా అనేది ఏ రాజకీయ పార్టీకీ కొమ్ముకాయకూడదంటారు దాడి.ఫలానా మీడియా సంస్థ అనగానే అది ఫలానా పార్టీకి సంబంధించినదని సగటు మనిషికి కూడా తెలిసిపోయేంతగా పత్రికా లోకం  అధ్వాన్నంగా దిగజారిపోవడం వ్యవస్థకు మంచిది కాదని ఆయన హితవు పలికారు. నిజాలను నిర్భయంగా ఉన్నది ఉన్నట్లుగా   క్రీడా  మైదానంలో ఓ అంపైర్ లా మీడియా తటస్థంగా వ్యవహరించాలని..  వీ డ్రీమ్స్  ప్రారంభోత్సవ సభలో దాడి వీరభద్రరావు పిలుపు నిచ్చారు.  ప్రభుత్వంలోని పెద్దలకో.. రాజకీయ పార్టీల నేతలకో  వంగి వంగి సలాములు చేస్తూ మీడియా పరువు దిగజార్చవద్దని దాడి చెబుతున్నారు.

(Visited 1,554 times, 1 visits today)

2 thoughts on “నాణ్యమైన నాణేనికి  అటూ..ఇటూ..!

Leave a Reply

Your email address will not be published.