300 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చిన రాజుపాలెం ఆదిత్యుడు…


అన‌కాప‌ల్లి :సహజంగా ఎక్కడైనా దేవతా మూర్తులు స్వయంభువుగా వెలిస్తే వెంటనే గుడి నిర్మాణం చేపడతారు. కాని అనకాపల్లి మండలం, రాజుపాలెం గ్రామంలో స్వయంభువుగా వెలసిన ఆదిత్యుడు మాత్రం వెలుగులోకి రావడానికి 300 ఏళ్లు పట్టిందంటే నిజంగా ఆశ్చర్యమే. రాజుపాలెం లో వెలసిన శ్రీ సూర్యనారాయణ మూర్తి గురించి పరిశోధిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగి సుమారు పది సంవత్సరాలు కావస్తోంది. కాని ఆదిత్యుడు స్వయంభువుగా వెలసి 300 ఏళ్లు కావస్తుంది. ఎందుకింత జాప్యం జరిగింది. వివరాల్లోకి వెళితే సుమారు 300 సంవత్సరాల క్రితం పశువుల కాపరులు పశువులను మేపడానికి గ్రామం పక్కనే ఉన్న కొండపైకి వెళ్లారు. అక్కడ ఒక చెట్టుకింద భూమిలోంచి సగం బయటకు వచ్చిన ఆదిత్యుని విగ్రహం కనిపించింది. పశువుల కాపరులు ఆ విగ్రహాన్ని బయటకు తీసి శుద్ధి చేసి ఆ చెట్టుక్రింద ప్రతిష్టించారు. ప్రతిరోజూ వెళ్లి దండం పెట్టుకునేవారు. ధూప దీప నైవేద్యాలు, ప్రసాదాలు ఉండేవి కావు. ఇలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కలలోకి ఆదిత్యుడు వచ్చి కొండపై ఉన్న తనను కిందకు తీసుకువచ్చి పూజలు చేయాలని చెప్పడంతో గ్రామస్తులు మేళతాళాలతో కొండపైకి వెళ్ళి అక్కడి నుంచి ఊరేగింపు గా కిందకి గ్రామంలోకి తీసుకువచ్చారు. వారం రోజుల పాటు పూజలు నిర్వహించారు. అయితే తర్వాత ఏం చేయాలో వారికి తోచలేదు. ఆలయం నిర్మించాలంటే అంత ఆర్ధిక స్తోమత లేదు. మరి ఏం చేయాలి. బాగా ఆలోచించి గ్రామంలో ఉన్న నూతిలో కి ఈ విగ్రహాన్ని దించేసారు. ప్రతిఏటా రధసప్తమి పర్వదినాల్లో బయటకు తీయడం వారం రోజులు పూజలు నిర్వహించడం మళ్లీ నూతిలో కి దించేయడం చేసేవారు. ఈ విధంగా చాలా సంవత్సరాలు గడిచాయి. 50 మంది గల గ్రామం కాస్తా 600 కి చేరుకుంది. ఆర్ధిక పరిస్ధితులు మెరుగయ్యాయి. ఇపుడు మళ్లీ ఆదిత్యుని గురించి ఆలోచనలు గ్రామస్తులు లో మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో మాజీ ఎంపీపీ కొణతాల బాబూరావు దృష్టి కి ఈ విషయం వెళ్లడంతో ఆయన గ్రామస్తులు తో సమావేశం ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆలయం నిర్మాణం కు నడుం కట్టారు. అప్పటి ఎంపీ గంటా శ్రీనివాసరావు ఆలయం నిర్మాణం కు లక్షా ఎనభై వేల రూపాయల నిధులను విడుదల చేశారు. అక్కడ నుంచి ప్రతి రాజకీయ నాయకులు తమ వంతు సహకారాన్ని అందించారు. స్వచ్ఛందంగా దాతలు కూడా ముందుకు రావడంతో గ్రామాన్ని ఆనుకుని ఉన్న కొండపై ఆలయ నిర్మాణం మొదలై శరవేగంతో పూర్తి అయింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రావడం మొదలు పెట్టారు. విశాఖ జిల్లా లో ఏకైక ఆదిత్యుని ఆలయం కావడంతో అనతికాలంలోనే మంచి ప్రసిద్ధి చెందింది. ఒక్క రధ సప్తమి నాడు సుమారుగా లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారంటే ఏ మేరకు ఆలయాన్ని అభివృద్ధి చేసారో తెలుస్తుంది. జిల్లాలో ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్న ఏకైక దేవాలయం ఇదొక్కటేనని చెప్పవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు నాయకులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లిస్తారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు తో ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తోంది.

(Visited 384 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *