పొగ మంచు కారణంగా ఆలస్యంగా 200 విమానాలు

వీ డ్రీమ్స్ దిల్లీ

ఉత్తర భారతంపై చలి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో మంచు దట్టంగా కురుస్తోంది. దిల్లీతో పాటు పలు రాష్ట్రాలపై పొగమంచు కమ్మేసింది..

దీంతో విమాన, రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. దిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport)లో విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో విమానాశ్రయంలో సేవలకు తాత్కాలికంగా నిలిపివేశారు. ఫలితంగా దాదాపు 200లకు పైగా విమానాలు (Flights Delayed) ఆలస్యంగా నడుస్తుండగా.. మరో 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

”పొగమంచు (Fog) కారణంగా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. విమాన సమయాల కోసం ప్రయాణికులు ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్‌లైన్లను సంప్రదించాలి” అని ఎయిర్‌పోర్టు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అటు ఇండిగో, ఎయిర్‌ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి.

అటు కోల్‌కతా, చండీగఢ్‌, అమృత్‌సర్‌, జైపుర్‌ సహా ఉత్తర భారతం (North India)లోని పలు విమానాశ్రయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కోల్‌కతా ఎయిర్‌పోర్టులో 25 విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. మరోవైపు, రైల్వే సేవలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి. మంచు కారణంగా దిల్లీకి వెళ్లే దాదాపు 50కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తు్న్నాయి. దిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, కర్నాల్, గాజియాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కన్పించలేని పరిస్థితి ఉంది. దీంతో వాహనాల రాకపోకలపై ప్రభావం పడి పలు చోట్ల ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.

దిల్లీలో శనివారం తెల్లవారుజామున 10.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జనవరి 8వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. మధ్యలో తేలికపాటి వర్షాలు కూడా పడొచ్చని తెలిపింది..

Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *