ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌

వీ డ్రీమ్స్ అనకాపల్లి

రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్‌ సరఫరా చేయా­లని ప్రభుత్వం నిర్ణయించింది. సకాలంలో నిధులు విడుదలవక సర్కారీ బడులు, కళాశాల­లు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందు­లు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.

ప్రత్యేక పోర్టల్‌తో అనుసంధానం

సర్కారీ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రత్యేక ఆన్‌లైన్‌ వెబ్‌ పోర్టల్‌ను రూపొందించనున్నా­యి. విద్యాసంస్థలు ఏ శాఖ పరిధిలోకి వస్తే ఆ శాఖ విభాగాధిపతి (హెచ్‌ఓడీ)కి ఆ పోర్టల్‌ను లాగిన్‌ చేసే సదుపాయం కల్పిస్తాయి. తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల వివరాలను వెబ్‌ పోర్టల్‌లో చేర్చడం/తొలగించడం/సవరణలు(యాడ్‌/డిలీట్‌/ఎడిట్‌) చేయడానికి అవకాశం ఉంటుంది. అవసరాన్నిబట్టి ఆయా విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలని లేదా నిలిపివేయాలని కోరే వెసులుబాటును హెచ్‌ఓడీలు పొందనున్నారు.

ఇన్‌చార్జీలకు ‘ఉచిత’బిల్లులు

విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్‌ సరఫరా చేసినా ప్రతినెలా క్రమం తప్పకుండా మీటర్‌ రీడింగ్‌ తీసి ఇన్‌చార్జి అధికారికి బిల్లులు జారీ చేస్తారు. ఇన్‌చార్జి అధికారులకు బిల్లులు జారీ చేస్తే ఉచిత విద్యుత్‌ దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకు వారు చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్ని యూనిట్ల విద్యుత్‌ వాడారు? ఎంత బిల్లు వచ్చిందనే వివరాలు అందులో ఉండనున్నాయి. అయితే ఆ బిల్లులను సదరు పాఠశాల/కళాశాల/విద్యాసంస్థ చెల్లించాల్సిన అవసరముండదు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు సంబంధించిన బిల్లులను సంబంధిత విభాగాధిపతులు తమ శాఖ బడ్జెట్‌ నిధుల నుంచి ప్రతి నెలా డిస్కంలకు చెల్లించనున్నాయి.

విభాగాధిపతుల పర్యవేక్షణ…

విభాగాధిపతులు తమ శాఖ పరిధిలోని విద్యాసంస్థల విద్యుత్‌ వినియోగం, బిల్లుల మొత్తం, గత కాలానికి సంబంధించిన వినియోగం, జారీ అయిన బిల్లులు, జరిపిన చెల్లింపులు, చెల్లించాల్సిన బకాయిల వంటి సమాచారంతో కూడిన నివేదికలను వెబ్‌ పోర్టల్‌లో చూసుకోవడానికి వీలుండనుంది. విద్యాసంస్థ, మండలం, జిల్లావారీగా సైతం ఈ నివేదికలు ఆన్‌లైన్‌లో జనరేట్‌ కానున్నాయి. సంబంధిత విభాగాధిపతులు బడ్జెట్‌ కేటాయింపుల నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికి వీలుగా పోర్టల్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖతో సైతం అనుసంధానించనున్నారు.

Author: vdreams

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *