సాయికి పేరెందుకు?

ఆశ్రిత వత్సలుడు సాయి.. ఆపద్బాంధవుడు సాయి. ఆనందంతోనైనా, ఆవేదనతోనైనా.. ఎప్పుడైనా.. ఎక్కడైనా ఎవరు ఎలా పిలిచినా పలికే కరుణాసముద్రుడు సాయి. ఇది భక్తుల విశ్వాసం. లోలోన కదిలే అంతరంగ తరంగం. ఆ అనుగ్రహ సంపన్నుడంటే భక్తులకు అంత ఆరాధనాభావం. తనకంటూ ఏమీలేని ఆ స్వామి ఏదైనా ఇవ్వగలిగినంత సమర్థుడని తిరుగులేని ధైర్యం. అందుకు రుజువులు, ఆధారాలు ఆయన చిరునవ్వుల సాక్షిగా భక్తులకు అనేకం.
–––––––––––––
మనం తలచుకున్నది భక్తవత్సలుడు షిర్డీ సాయినాథుడి గురించి. ఆయనంటే అసంఖ్యాక జనుల్లో నెలకొన్న నమ్మిక గురించి.. అయితే అంతవాడు కాకపోయినా.. ఆ లక్షణాల్లో కొన్నయినా పుణికిపుచ్చుకున్న సాయి ఒకడున్నాడు. పిలిస్తే చాలు వచ్చి వాలుతాడు. తనను కోరితే ఎంతైనా చేస్తాడు. కోరకపోయినా చేస్తాడు. శక్తిసామర్థ్యాల గురించి ఆలోచించడు. సాధ్యాసాధ్యాల గురించి విచారించడు. చేసేద్దాం దాందేముంది? అనే అంటాడు. ఆ విశ్వాసం రేకెత్తిస్తాడు. భరోసా కలిగిస్తాడు. ఆ షిర్డీ సాయి లోకమనే రంగస్థలంలో నటిస్తున్న మనల్ని నిరతం కనిబెట్టుకుంటే.. ఈ రంగసాయి రంగస్థలాన్నే తన లోకమనుకుని దాన్ని పరిరక్షించుకుంటాడు.
––––––––––––––––––
శంకరాభరణం చిత్రానికి మాటలు రాసిన జంధ్యాల, పతాక సన్నివేశంలో.. శంకరశాస్త్రి చేత అనిపించిన వాక్కులు గుర్తుండే ఉంటాయి. ‘పాశ్చాత్య సంగీతపు పెనుతుపానుకు రెపరెప లాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని..’ అన్న ఆ పదాలు నాటకమే శ్వాస అయిన జంధ్యాల కలం నుంచి జాలువారేటప్పుడు.. ఆయన హృదయంలో శాస్త్రీయ సంగీత దీనాలాపాలకు బదులు రంగస్థల ఆర్తనాదాలు కదిలి ఉంటాయేమో. ఎందుకంటే.. పాశ్చాత్య సంగీతం కారణంగా శాస్త్రీయ సంగీతం మనుగడకు ముప్పు కలిగిన దానికన్నా.. తానెంతో ఆరాధించిన నాటకరంగం సినిమా తదితర మాధ్యమాల వల్ల విలవిలలాడే దుస్థితి ఆయనను ఎంతో వేధించి ఉంటుంది. ముఖ్యంగా తెలుగునాట నాటకానికి, జానపద కళలకు కలిగినంత చేటు మరే ఇతర సాంస్కృతిక రూపాలకు ఎదురుకాలేదన్నది కాదనలేని వాస్తవం కదా. అంత దురవస్థకు లోనైన రంగస్థల జ్యోతి కొడిగట్టిపోకుండా కాపాడేదెవరని ఆయన ఇంచుక ఆలోచించి ఉంటాడు. ఇదిగో.. ఇలాటి క్లిష్ట తరుణంలో… దీపం రెపరెపలాడే సమయంలో.. ఆ వెలుగులను చేతనైనంత మేరకు కాపాడడానికి ఈ సాయి ఓ చేయి అడ్డుగా పెట్టే ప్రయత్నం చేశాడు.. చేస్తున్నాడు. మరితడు ఆపద్బాంధవుడు కాక ఇంకేమవుతాడు?

ఎక్కడి వాడు!
సాయి ఎక్కడో పుట్టాడు.. ఇంకెక్కడో పెరిగాడు. ఎంచేతో ఈ ఊరికొచ్చాడు. బతుకు పయనంలో ఆత్మీయుడిగా పదిమందికీ పరిచయమయ్యాడు.. అందరికీ తీపినో.. ప్రేమనో పంచాడు. నిలదొక్కుకున్నాడు. ఎందరికో ఆసరాగా నిలబడ్డాడు. ఇవన్నీ జీవితంలో మామూలు విషయాలు.. వీటికి మించి.. కారణజన్ముడంటారే.. అలా.. చిన్ననాటి నుంచి తన ఆరో ప్రాణమైన రంగస్థలాన్ని ప్రాణాధిక్యంగా ప్రేమించాడు. నాటకాలు ఆడడం కాదు.. ఆ వేదిక కోసం కాదనకుండా తనకున్నది సమర్పించాడు. నాటకం నిలిచేలా.. పోరాటంలో గెలిచేలా తాపత్రయపడ్డాడు. తంటాలు పడ్డాడు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటివరకూ.. మధ్యలో కడగండ్లే రానీ.. సుడిగుండాలు ఎదురుకానీ.. నాటకాన్ని నెత్తిన పెట్టుకు ఏటికి ఎదురీదాడు. మజిలీల్లేని నడక సాగించాడు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాడు. అయితే ఏం చేశాడంటారా? సాటి నాటకజన బాహుళ్యాన్ని అడగకండి. నాటకాన్ని అడగండి. సురభిని అడగండి. ఇతర పౌరాణిక, పద్య నాటకాల్ని అడగండి. కళాభారతినో.. టర్నర్‌ సత్రాన్నో.. హవామహల్‌నో అడగండి. దొండపర్తి దాకా వెళ్లి పాతకాలం భోషాణంలాటి నాటక గ్రంథాలయాన్ని అడగండి. ఏ కాళిదాసు నాటకానికో సరిపడేంత ముడివస్తువు మీకు లభిస్తే ఆశ్చర్యపోకండి.

కథే జీవితం.. జీవితమే కథ
సినిమా సంగతి అటుంచి.. నాటకం గురించి మాట్లాడితే మెలోడ్రామా అని స్టే‘జీవులు’ తరచూ అంటూ ఉంటారు. సాయి జీవితంలో అది దండిగా, మెండుగా ఉంది. కష్టం పిలిస్తే పలికేట్టు.. బతుకు నాటకంలో కర్టెన్‌ పక్కనే నిత్యం నిలబడేది. అమలాపురం దగ్గర్లో ఓ పల్లెటూరిలో కళాకారుడైన తండ్రికి.. అందుకేమాత్రం తీసిపోని తల్లికి కళామతల్లి వరప్రసాదంలా పుట్టిన సాయి.. జీవన నాటకమంటే ఏంటో తెలియని వయస్సులోనే కష్టమన్న విలన్ని చేరువ నుంచి చూశాడు. ఊహ తెలియకుండానే తండ్రి కన్నుమూసిన వేళ.. తల్లి చేయి పట్టుకు నడుస్తూనే.. నాన్న ఊహ తెలియకపోయినా.. ఆయన రంగస్థలాభిలాషను శ్వాసిస్తూ ముఖానికి రంగేసుకున్నాడు. ఆరేళ్లకే అగ్గి పిడుగు అల్లూరిలా అబ్బో అనిపించి.. అప్పటికే తన నటనాసక్తి గురించి అమ్మగారికి తెలియజెప్పి.. భవిష్యత్తు నాటకాలతోనే అని మరో మాట ఆడకుండానే ప్రకటించేశాడు. అక్కగారి ఊరైన పాలకొల్లుకు తల్లితోపాటు వెళ్లినా.. అక్కడ బతుకు కిటుకుల్ని కొంత నేర్చుకున్నా.. నాటకాల చుట్టూ జీవితాన్ని తెగ అల్లేసుకుని.. వీలైనప్పుడల్లా కొన్ని డ్రామాలు ఆడేసి.. చివరికి జీనవోపాధి కోసం అమ్మలాటి విశాఖపట్నానికి చేరుకున్నాడు. 1986లో.. అంటే మూడున్నర దశాబ్దాల క్రితం విశాఖకు అంతగా రుచితెలియని మధుర పానీయాన్ని అందించి.. తక్కువ సమయంలోనే సూపర్‌హిట్టయ్యి రేవుపట్నానికి వచ్చిన కొత్త నౌకలా జగదాంబ జంక్షన్‌లోనే లంగరేసుకు స్థిరపడ్డాడు. ఆ పానీయం పేరే తన సొంతపేరు చేసేసుకుని అందరికీ ఆత్మీయుడైపోయాడు.

అసలు కథ ఇప్పుడే ఆరంభం
పేరొచ్చింది.. డబ్బూ ఎంతో కొంత వచ్చింది. ఏం వచ్చినా రాకపోయినా లోపలి ఆరాటం కూర్చోనివ్వదు కదా. సాయికి చిన్నప్పటి తాపత్రయమాయె. నాన్న ఉపదేశించని మహామంత్రమాయె. అదే ప్రేరణ అయింది. రంగస్థలం రారమ్మంది. అప్పటికే విశాఖ అక్కున చేర్చుకుంది. అందుకే ఏ ఊరిలోనూ స్థిరంగా ఉండని వాడికి ఇదే సొంత ఊరైంది. అంతకన్నా ఎక్కువగా ఇక్కడి నాటకరంగమే తనలోకమైంది. ఏదో చేయాలన్న తాపత్రయంతో ఓదగ్గర నిలవడమే కష్టమైంది. పైగా అప్పటి కాలం విశాఖలో రంగస్థలానికి స్వర్ణయుగం వంటిది. ఇంకేం.. సాయికి నాటకం యారాడ కొండ మీద లైట్‌హౌస్‌లా మారింది. ఎక్కడిదో వెలుగు సంద్రంలో నావకు చుక్కాని అయినట్టు.. నాటకం ఈ కుర్రాడిని ఎగరేసుకుంటూ పోయింది. ముందు నటనతో మొదలైన రంగస్థల ప్రస్థానం.. తర్వాత బోలెడు మలుపులు తీసుకుంది. అప్పటికే రేడియో నాటకానుభవం.. మిమిక్రీతో పరిచయం ఓ పునాది వేయడంతో.. అసంఖ్యాక నాటకాల్లో నటన నల్లేరుపై నడకలా సాగింది. అలా విశాఖ నాటకరంగంలో సాయి పాత్ర స్థిరమైపోయింది. తర్వాత మెట్టు దూరదర్శన్‌ అయితే.. ఆనక సినిమా సరదాగా ఆహ్వానించింది.

భుజంపైకి బాధ్యతలు
నాటకాలు ఆడడం సరే.. తానొక్కడే కాదు.. చాలామంది ఉన్నారు. కొదవలేనంతగా నటులు, దర్శకులు ఉంటున్నారు. అది వేదిక మీద సీన్‌. మరి దూరంగా నిలబడి చూస్తే? నాటకాన్ని భారంగా మోస్తున్న ఆ వేదిక కుంగుతున్న విషయం కనిపిస్తూనే ఉంది. ధగద్ధగాయమానంగా వెలగాల్సిన తెర కళావిహీనమైపోతున్న సంగతి కొట్టొచ్చినట్టుగా ఉంది. జనానికి నాటకం దూరమవుతుతోందన్న కలవరం అందర్లో కదులుతూనే ఉంది. ఇందుకు పరిష్కారం లేదా? లేదని లోకం అంటోంది. అబ్బే అసాధ్యమని సినిమా గర్వంగా చెబుతోంది. కానీ.. సర్వం నాటకమే అయిన వాడికి మనసెలా ఒప్పుతుంది? అది అనివార్యమంటే సహించబుద్ధి ఎలా అవుతుంది? అందుకే సాయికి వేరే పాత్ర ధరించాలన్న వ్యామోహం పెరిగింది. అది నటనో మరొకటో కాదని అర్థమవుతూనే ఉంది. డ్రామా ఎందరో పాత్రధారులకు అవకాశం కల్పిస్తే.. ఆ నాటకానికే తాను అవకాశమిస్తే.. దాని భారాన్ని మోసే పాత్ర పోషిస్తే.. ఎలా ఉంటుంది? అమ్మలా ప్రేమించిన రంగస్థలం మూలన పడకూడదంటే.. మంచమెక్కకూడదంటే.. అదే సరైనదని సాయికి తోచింది. అలా తనపేరు మీదనే నాటక సంఘం మొదలైంది. పదకొండేళ్లుగా పనిచేస్తున్న ఈ సమాజం విశాఖలోని ఎన్నో నాటక, సాంస్కృతిక సంఘాలతో చెట్టపట్టాలు వేసుకు నడిచింది. నగరంలో నాటకం క్షేమంగా నిలదొక్కుకునేలా చెట్టునీడై దోహపడింది. సాయి కార్యదక్షత, నిర్వహణ సమర్థత కారణంగా 450కి పైగా పౌరాణిక, సాంఘిక నాటకాలు, నాటికలు ప్రేక్షకుల ముందుకు అంగరంగ వైభవంగా, అట్టహాసంగా రావడానికి వీలు కలిగింది. ఇది పాండవోద్యోగ విజయాల్లాటిది కాదనడమంటే అతిశయోక్తే అవుతుంది.

సురభిళం.. సురుచిరం
మూడు దశాబ్దాలకు పైగా విశాఖతో నటనానుబంధం. రెండు దశాబ్దాలకు పైగా నిర్వాహక సంబంధం. బతుకు పుస్తకంలో ఇవి గొప్ప అధ్యాయాలు. వీటిలో ఉన్నాయెన్నో అద్భుత ఘట్టాలు. ఒక్కసారి వెనుతిరిగి చూసుకుంటే.. ఇవి అపురూప సందర్భాలు. నగరంలో సురభి ప్రదర్శనల సమాహారం వీటిలో వన్నెకెక్కినదిగా నిలిచిపోతుంది. కళాభిమానులకు అదో మధుర స్వప్నంగా మిగిలిపోతుంది. మహత్తరమైన సురభి నాటకమంటే ఏ తెలుగువాడి మది పరవశించిపోకుండా ఉంటుంది? అద్భుతాన్ని కళ్లముందు నిలిపే సురభి ప్రదర్శన కొన్ని రోజుల పాటు జరిగినా చాలనుకుంటే.. వరాల వరసలా, సాయి చొరవ కారణంగా 2006లో నెల పాటు విశాఖలో సురభి సంస్థ సుప్రసిద్ధ పౌరాణికాలను రసవత్తరంగా ప్రదర్శించింది. మాయాబజార్, శ్రీకృష్ణ లీలలు, బాలనాగమ్మ, వీరబ్రహ్మం చరిత్ర వంటి గొప్ప నాటకాలను తిలకించి విశాఖ పులకించిందంటే అది సాయి కృషి వల్లనే సాధ్యపడింది. మళ్లీ 2008లో, 2011లో.. సురభి నాటకాల ప్రదర్శన సాగితే.. పరవశించిపోని హృదయం ఎక్కడ ఉంటుంది? ఇది చాలదన్నట్టు పేరుప్రఖ్యాతులున్న ఎన్నో పద్య, పౌరాణిక నాటకాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విశిష్టత సాయిదే అవుతుంది.

ఇంతే అంటే ఇక చాలదంతే
పరుగులు తీసే మనిషికి పగ్గాలు వేయడానికి ఎన్నో ప్రతిబంధకాలు కాచుక్కూర్చుంటాయి. ఇకచాలనుకునే చాలామందికి ఇవి తప్పించుకునే అవకాశాలవుతాయి. కానీ.. చేయాల్సింది చాలా ఉందనే ఏ కొద్దిమందికో ఇవి కసిని పెంచే కారణాలవుతాయి. ఆరోగ్యం.. ఆర్థికం.. వగైరా ఈతిబాధలు సాయినీ అలాగే అడ్డుకోబోయాయి. ఇంత చేశాక ఇంకేముందిలే అన్న నిర్లిప్తతనూ పెంచే ప్రయత్నం చేశాయి. కానీ అతడు సాయి కదా.. వీటన్నిటినీ పరిహసించి.. ప్రతిఘటించేసరికి పుంజాలు తెంచుకు పారిపోయాయి. ఆ ప్రయత్నంలోనే సాయి.. ఇంకో మెట్టెక్కాడు. నాటకాల ప్రోత్సాహం సరే.. అందుకు సంబంధించిన సాహిత్యం మాటేమిటి? అని తలపోశాడు. ఆ మేధో మధనం పర్యవసానంగానే.. ఎప్పటెప్పటి నాటకాలను ఓచోటకు చేర్చే మరో బృహత్‌ ప్రయత్నానికి నాంది పలికాడు. ఇది జరిగి తొమ్మిదేళ్లయింది. దొండపర్తిలో ఊపిరిపోసుకున్న నాటక గ్రంథాలయం.. ఓ రంగస్థల ప్రేమికుడు అంకితభావంతో చేసిన ప్రయత్నానికి ప్రతీకగా నిలుస్తుంది. వెయ్యికి పైగా నాటక గ్రంథాలతో మొదలైన ఈ లైబ్రరీ ఇప్పుడు దాదాపు పదివేల పుస్తకాలకు నెలవుగా ఉంది. గురజాడ, కందుకూరి, కాళ్లకూరి, చిలకమర్తి నుంచి ఇటీవలి కాలంలో లబ్ద ప్రతిష్టులైన ఎందరో ప్రసిద్ధ రచయితల వరకు.. ఎందరో సృజనశీలురు తమ ఆలోచనల గ్రీన్‌రూంలో రంగులేసి జనం చెంతకు పంపిన నాటకాల రాతప్రతులు, అచ్చు పుస్తకాలు ఎన్నిటికో ఈ గ్రంథాలయం కేంద్రంగా ఉంది. దీనిని మరింతగా అభివృద్ధి చెందించాలన్న సాయి ఆరాటం ఇంతింతై పెరుగుతోంది.

కళకొరకు బతుకు
కళ పరమ ప్రయోజనం ఏదన్న సంగతిని అటుంచితే.. సాయి లాటి ఏ కొద్ది మందికో కళతోనే బతుకు. కళ కోసమే బతుకు. అందుకే విశాఖలో నాటకాన్ని భుజాన మోయడానికే సాయి పరిమితం కాలేదు. కళ ఏదన్నా పదమన్నాడు. సంగీతమో.. నాట్యమో.. ఏ కళారూపమైనా ఉజ్వలంగా వెలగాలని పదిమందితో కలసి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దిగ్గజాలైన మహనీయులకు సత్కారం పేరుతో కృతజ్ఞత తెలిపే ప్రయత్నం నుంచి.. తనకు పరిచయం ఉన్న ధ్వన్యనుకరణలో నైపుణ్యాన్ని పెంచే తరగతుల నిర్వహణ వరకు.. నిర్విరామంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అవరోధాలు ఎదురవుతున్నా పరుగో.. నడకో.. ఏక్‌లా చలో అంటూ సాగిపోతున్నాడు.

ఇంత చెప్పుకున్నాం కానీ.. ఈ సాయి ఎవరో ఏం అనుకోలేదు కదూ!
అవును.. ఇంతకీ ఎవరీ సాయి?
ఒక్కడు మిగిలాడన్నట్టు ఇంత నాటకానికీ సూత్రధారిగా ఉన్నాడే.. ఎవరీ సాయి?
యండమూరి నవలలో హీరో పాత్రకు పేరులేనట్టు.. ఇంత డ్రమెటిక్‌ రియాల్టీ షోలో కథంతా తానై నడిపిస్తున్న సాయి.. పేరు ఇంతేనా? ఏదో ఉద్వేగం వరదలో కొట్టుకుపోతూ.. రాస్తూరాస్తూ నేను ఆయన పేరు మర్చిపోయానా?
కాదు కాదు.. ఆయనకో పేరుంది. అయితే సాయి అన్న పేరు ముందు అది లెక్కలోకి లేకుండా పోయింది. అసలు ఆయనకైనా గుర్తుందా? అన్నట్టు తెరమరుగైంది. జీవిక కోసం విక్రయించిన ఓబ్రాండ్‌‌నేమ్‌ లాటి మధుర పానీయం ఆయన ఇంటిపేరై మిగిలింది. అందుకే ఆయన పేరు నోరూరిస్తుంది. రంగస్థల చరిత్రలో ఆయన పేరు మనస్సును మురిపిస్తుంది.
ఆశపు వీరవెంకట సత్యనారాయణ మూర్తి అంటే,,, ఎవరూ అని విశాఖపట్నం తేరిపార చూస్తుంది.
అదే.. మనవాడు బాదంగీర్‌ సాయి అంటే.. ఇతనేనా అని విశాఖ వదనాన మధుర దరహాసం మెరుస్తుంది.
అతడే మన రంగసాయి అన్నప్పుడువిశాఖపట్నం నాటకరంగం నిండుమనసుతో దీవిస్తుంది. ఇంతా చేసి పేరులో ఏముంది?
సాయి కీర్తి కాదు.. అతడు చేసిన కృషి పరాబ్రహ్మ పరమేశ్వర ప్రార్థన ఉన్నంత వరకు నిలుస్తుంది.


                                                                                             

                                                                                             

  – బి.ఎస్‌.రామచంద్రరావు
    విశాఖపట్నం
  9491789366

(Visited 449 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *