ది లీడ‌ర్ జ‌గ‌న్‌

పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలులో ముందడుగు వేస్తున్న జగన్‌
(21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ జన్మదినం)


పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలులోను, నవరత్నాల అమలులోను ముఖ్యమంత్రి జగన్‌ ముందంజలో ఉన్నారు. వైఎస్‌ జగన్‌ 1972 డిసెంబర్‌ 21వ తేదీన కడప జిల్లా పులివెందులలో జన్మించారు. తల్లి విజయలక్ష్మి, తండ్రి వై ఎస్‌ రాజశేఖరరెడ్డి. ఆయన ప్రాధమిక విద్యాభ్యాసం పులివెందుల లోను, తరువాత హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లోను సాగింది. ఆయన వై ఎస్‌ భారతిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు హర్షారెడ్డి, వర్షారెడ్డి అనే ఇద్దరు కుమార్తెలు గలరు. జగన్‌ 2004లో కడప నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ పార్టీ తరపున ప్రచారంచేస్తూ తొలిసారి రాజకీయ యవనికపై మెరిసారు. 2009 మే నెలలో కడప నియోజకవర్గం నుండి జగన్‌ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జగన్‌కు 5,42,611 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి పాలెం శ్రీకాంతరెడ్డికి 3,63,765 ఓట్లు వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీచేసిన డాక్టర్‌ ఖలీల్‌ భాషా 63,309 ఓట్లతో మూడవ స్థానానికి పరిమితమయ్యారు. ఈ ఎన్నికల్లో జగన్‌ 1,78,846 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు.2009 సెప్టెంబర్‌ 2వ తేదీన రాజశేఖరరెడ్డి దివికేగారు. 2010 ఏప్రిల్‌ 9వ తేదీన ఏలూరు నుండి జగన్‌ ఓదార్పుయాత్రను ప్రారంభించారు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వని కారణంగా 2010 నవంబర్‌ 29వ తేదీన కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసారు. 2011 మార్చి 11వ తేదీన తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వై ఎస్‌ ఆర్‌ పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. మార్చి 12వ తేదీన ఇడుపుల పాయలో పార్టీ జండాను ఆవిష్కరించారు. 2011 మేనెలలో కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వై ఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుండి పోటీచేసిన జగన్‌కు 7,92,252 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి డి ఎల్‌ రవీంద్రరెడ్డికి 1,46,579 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి ఎం వి మైసూరారెడ్డి 1,29,565 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు. ఈ ఎన్నికల్లో జగన్‌ 5,45,672 ఓట్ల మెజార్టీ సాధించారు.2012 జూన్‌ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్ధానాల్లో ఎన్నికలు జరగగా అందులో 15 చోట్ల విజయాన్ని సాధించారు. నెల్లూరు లోక్‌సభకు జరిగిన ఎన్నికలోను విజయపతాకం ఎగురవేసారు. 2017 నవంబర్‌ 6వ తేదీన ఇడుపుల పాయనుండి ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు.2019 జనవరి 9వ తేదీన ఇచ్ఛాపురం నియోజకవర్గంలో పాదయాత్రను ముగించారు. 2014 ఎన్నికల్లో వై ఎస్‌ ఆర్‌ పార్టీకి 67 సీట్లు దక్కాయి.వై ఎస్‌ ఆర్‌ పార్టీని స్థాపించిన తరువాత 2011 మే నెలలో కడప లోక్‌సభ ఎన్నికల్లో జగన్‌, పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గం నుండి విజయలక్ష్మి విజయబావుటా ఎగురవేసారు. 2012 మార్చిలో జరిగిన ఉప ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుండి వై ఎస్‌ ఆర్‌ పార్టీ అభ్యర్ధి ఎన్‌.ప్రసన్నకుమార్‌ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డిని ఓడించారు. 2012 జూలైలో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఏ అభ్యర్ధిగా పోటీచేసిన ప్రణబ్‌ ముఖర్జీకి వైఎస్‌ ఆర్‌ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు, ఎంపీగా ఉన్న జగన్‌ ఓటువేసారు.2017 జూలైలో గుంటూరులో నిర్వహించిన ప్లీనరీలో వై ఎస్‌ ఆర్‌ పార్టీ ప్లీనరీలో నవరత్నాలు అనే కీలక ప్రకటన చేసారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుండి వై ఎస్‌ ఆర్‌ పార్టీ నుండి పోటీచేసిన జగన్‌కు 1,24,576 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్ధి తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి ఎస్‌ వి సతీష్‌కుమార్‌ రెడ్డికి 49,333 ఓట్లు వచ్చాయి.

ఈ ఎన్నికల్లో జగన్‌ 75,243 ఓట్ల మెజార్టీ సాధించారు.2016 మార్చి 10వ తేదీన వై ఎస్‌ ఆర్‌ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఒకేరోజు వై ఎస్‌ ఆర్‌ పార్టీనుండి నలుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. 2019 నాటికి 24 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిపోయారు. 2015 డిసెంబర్‌లో బాక్సయిట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖజిల్లా చింతపల్లిలో జగన్‌ ఒక సభను నిర్వహించారు. 2015 మార్చిలోను, జూన్‌ లోను ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలుచేయాలని ఢిల్లీలో ప్రధానమంత్రిని, కేంద్రమంత్రులను జగన్‌ కలిసారు. ఇదే విషయంపై 2015 ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలో ఒకరోజు ధర్నాచేసారు. అక్టోబర్‌ నెలలో గుంటూరులో నిరాహారదీక్ష చేసారు.రాష్ట్ర బంద్‌ నిర్వహించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజక వర్గం నుండి వై ఎస్‌ ఆర్‌ పార్టీ అభ్యర్ధిగా పోటీచేసిన జగన్‌కు 1,32,356 ఓట్లు రాగా, తన సమీప ప్రత్యర్ధి తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి శింగ వెంకట సతీష్‌కుమార్‌ రెడ్డికి 42,246 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో జగన్‌కు 90,110 ఓట్ల మెజార్టీ లభించింది. జగన్‌ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.ఇప్పటి వరకు గతంలో ఆంధ్రరాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రికీ రానంత మెజార్టీ జగన్‌కు దక్కింది. 1955లో ఒంగోలు నియోజకవర్గం నుండి పోటీచేసిన టంగుటూరి ప్రకాశం పంతులుకు 6,030 ఓట్లు మెజార్టీ లభించింది. 1962లో డోన్‌ నియోజకవర్గం నుండి పోటీచేసిన నీలం సంజీవరెడ్డికి 31,376 ఓట్లమెజార్టీ లభించింది. 1967లో నరసారావుపేట నియోజకవర్గం నుండి పోటీచేసిన కాసు బ్రహ్మానందరెడ్డికి 13,699 ఓట్ల మెజార్టీ దక్కింది. 1994లో డోన్‌ నియోజకవర్గంనుండి పోటీచేసిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి 38,095 ఓట్ల మెజార్టీ లభించింది. 2014లో పులివెందుల నియోజకవర్గం నుండి పోటీచేసిన వై ఎస్‌ రాజశేఖరరెడ్డికి 75,243 ఓట్ల మెజార్టీ దక్కింది.1999లో కుప్పం నుండి పోటీచేసిన చంద్రబాబునాయుడుకు 65,678 ఓట్ల మెజార్టీ లభించింది.

నందమూరి తారకరామారావు 1983లో గుడివాడ, తిరుపతి నియోజకవర్గాల నుండి 1985లో గుడివాడ, హిందూపూర్‌, నల్గొండ నియోజకవర్గాల నుండి 1989లో హిందూపూర్‌, కల్వకుర్తిల నుండి, 1994లో హిందూపూర్‌ టెక్కలి నుండి పోటీచేసారు. ఎన్టీ ఆర్‌ అత్యధికంగా 1994లో హిందూపూర్‌ నియోజక వర్గం నుండి 60,050 ఓట్ల మెజార్టీతో గెలవగా అత్యల్పంగా 1985లో గుడివాడ నియోజక వర్గం నుండి 7,597 ఓట్ల మెజార్టీ సాధించారు. చంద్రబాబు నాయుడు తన కెరీర్‌లో అత్యధికంగా 1999లో కుప్పం నియోజక వర్గం నుండి 65,678 ఓట్లు మెజార్టీ సాధించగా, అత్యల్పంగా 1978లో చంద్రగిరి నియోజక వర్గం నుండి 2,494 ఓట్ల స్వల్ప మెజార్టీని సాధించారు. 2019 ఎన్నికల్లో వై ఎస్‌ జగన్‌ పులివెందుల నియోజకవర్గం నుండి 90,110 ఓట్ల మెజార్టీ సాధించి రికార్డు సృష్ఠించారు.

జగన్‌ నాయకత్వంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో వై ఎస్‌ ఆర్‌ పార్టీ 27 లక్షల ఓట్లు అధికంగా సాధించింది.తెలుగుదేశం పార్టీ కంటే 10.76 శాతం ఓట్లు ఎక్కువగా దక్కించుకుంది. గత ఎన్నికలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ 14.91 లక్షల ఓట్లు కోల్పోయింది. ఈ ఎన్నికల్లో వై ఎస్‌ ఆర్‌ పార్టీకి 1,55,94,313 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 1,22,34,481 ఓట్లు వచ్చాయి. మొత్తం ఓట్లలో వై ఎస్‌ ఆర్‌ పార్టీకి 49.96 శాతం ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీకి 39.2 శాతం ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో అత్యంత భారీ మెజార్టీ ముఖ్యమంత్రి జగన్‌కు (90110) లభించింది.జగన్‌ ప్రభంజనంలో రాజుల కోటలు కూలిపోయాయి. రాజకీయ కుటుంబాలు విలవిలలాడాయి. ఈ ఎన్నికల్లో 175 శాసనసభ స్ధానాలకు గాను 151 సీట్లు, 25 పార్లమెంటు స్థానాలకు గాను 23 సీట్లు వై ఎస్‌ ఆర్‌ పార్టీ గెలుచుకుంది. ఇంక జనసేన పార్టీ విషయానికి వస్తే కేవలం ఒక స్థానంలోనే గెలిచింది. 136 స్థానాలలో పోటీచేస్తే 120 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. పోస్టల్‌ బ్యాలెట్ల విషయానికి వస్తే ఎన్నికల సంఘం 3.05 లక్షల పోస్టల్‌ బ్యాలెట్లు జారీ చేస్తే వై ఎస్‌ ఆర్‌ పార్టీకి 1,34,708 వచ్చాయి.తెలుగుదేశం పార్టీకి 80,458 పోస్టల్‌ బ్యాలెట్లు పోల్‌ అయ్యాయి. రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను నాలుగు జిల్లాలలో వై ఎస్‌ ఆర్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసింది. కడప, కర్నూలు, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.మన రాష్ట్రంలో 3 వేల నుండి 11 వేల వరకు మహిళా ఓటర్లు పురుష ఓటర్ల కంటే అధికంగా గల నియోజక వర్గాలు 32 ఉండగా, అందులో 25 నియోజకవర్గాల్లో వై ఎస్‌ ఆర్‌ పార్టీ విజయకేతనం ఎగురవేసింది.సోషల్‌ మీడియాలో జగన్‌ హవా సాగింది. రావాలి జగన్‌-కావాలి జగన్‌ అనే వీడియోను యూట్యూబ్‌లో 2.23 కోట్ల మంది ఎన్నికల సమయంలో వీక్షించారు. చిరునవ్వుతో ప్రశాంతంగా కనబడే జగన్‌ ప్రజాసంక్షేమాన్ని కోరే ముఖ్యమంత్రిగా ప్రజల మన్ననలు పొందాలని ఆశిద్దాం.

(Visited 49 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published.