( వీ డ్రీమ్స్ గ్రౌండ్ రిపోర్ట్)
జగన్మోహన్ రెడ్డి ‘చిత్రాల’తో అచ్చేసిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రద్దు చేయడంతో పాటు, వ్యవసాయ భూముల రీ సర్వే పూర్తయినగ్రామాల్లో తాజా వివరాలతో కొత్త పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేయనున్నది. జగన్ హయాంలో జరిగిన రీ సర్వేలో అనేక అక్రమాలు చోటు చేసుకోగా చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన రీ సర్వే తప్పులు తడకగా తయారైంది. ఈ తప్పులన్నీటికి కారణం అడంగలు తదితర రెవెన్యూ రికార్డులను సరి చేయకపోవడమే. సర్వే టీములు గ్రౌండ్ ట్రూథింగ్ ,వ్యాలిడేషన్ చేయకనే చాలా చోట్ల రీ సర్వే
జరిపారు. పొలాల చుట్టుపక్కల ఉన్న బంజర్లను పెద్ద రైతుల ఖాతాల్లో జమ చేసి వారి దగ్గర నుంచి లంచాలు గుంజారన్న ఆరోపణలు ఉన్నాయి. బీద బిక్కి నోరు ,వాయి లేని రైతుల విస్తీర్ణాలను తగ్గించి చూపారు. కొందరు రైతులకు 9(2 ) నోటీసులు ఇవ్వనేలేదు. ఇదేమని అడిగితే నోషనల్ ఖాతాల భూములకు , ఎంజాయ్ మెంట్ లో లేని వారికి 9(2) నోటీసులు ఇవ్వరని చెబుతున్నారు. ఇలా చెప్పడం నిబంధనలకు విరుద్ధం. ఏపీ రీ సర్వే ప్రాజెక్ట్, వెబ్ లాండ్ లో పేర్లు కల భూ యజమానులకు 9(2) లు ఇవ్వాలని స్పష్టంగా పేర్కొంది. రీ సర్వే టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదిస్తే 9(2) నోటీసు లు తప్పనిసరిగా ఇవ్వాలనే వివరించారు.9(2) నోటీసులు భూమి కొలతలను రైతులు సరిచూసుకోడానికి ఉద్దేశించినవి.
ఈ నోటీసులు టైటిల్ సమస్యలకు సంబంధించినవి కావు.
చాలామంది రైతులకు భూముల సర్వే గురించి సమాచారం లేదు. ప్రామాణిక సర్వే పద్ధతి ప్రకారం రైతులు ఏ కారణం చేతనైనా సర్వే కు హాజరు కాలేకపోతే వీడియోకాల్ ద్వారా సర్వే నిర్వహించాలి. అప్పిళ్లు విచారణకు మొబైల్ సర్వే టీంలు వస్తాయన్న హామీ కూడా ఆచరణకు నోచుకోలేదు.
ఇక జగన్ హయాంలో జరిగినఅక్రమాల సంగతి చెప్పనక్కరలేదు అప్పుడు జరిగిన రీ సర్వే రైతులకు ఇప్పుడు పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు ఆ అక్రమాలు తప్పులతోనే పాస్ పుస్తకాలు జారీ కానున్నాయి.
రీ సర్వే రెవెన్యూ సదస్సులో కుప్పలు తెప్పలుగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించకుండానే పరిష్కారం అయిపోయాయి అన్న రిపోర్టులను రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. రీ సర్వే తప్పులను సరిచేయమని రైతులు తాసిల్దార్లకు దరఖాస్తు చేస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు.
తప్పుల తడక,
అక్రమాల పుట్ట
వ్యవసాయభూముల రికార్డుల తప్పులను సవరించి
రైతుల కష్టాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం
ఒక జాతీయ ప్రాజెక్టు ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే రీ సర్వే ప్రాజెక్టు లను ప్రారంభించారు. అయితే జరుగుతున్న దేమిటి? సర్వే ను ఆసరాగా తీసుకుని సిబ్బంది అక్రమాల కు పాల్పడుతోంది.రికార్డుల ప్రక్షాళన చేయకనే సర్వే చేస్తున్నారు. తప్పులను సరిచేయమని రైతులు రెవెన్యూ సదస్సుల లో మొరపెట్టుకున్నా వినకుండా సరిచేశామని తహశీల్దార్లు తప్పుడు రిపోర్టులు పంపారు.
ఈ పిర్యాదులపై ఎక్కడా విచారణ జరప లేదు.
రికార్డుల గల్లంతు
అనకాపల్లి జిల్లాలో చాలా మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాల్లో ఎంతో కీలకమైనల్యాండ్ సీలింగ్ రికార్డులు ఎస్ ఎఫ్ ఎ తదితర రికార్డులు లేనేలేవు అయినా రీసర్వె నిర్వహించారు. కొంతమంది భూములను 22ఏలో పెట్టి వారిని అగచాట్లకుగురి చేస్తున్నారు. సీలింగ్ లబ్ధిదారుల భూములను అక్రమంగా కొన్న వారి పేరిట రీ సర్వే లో బదలాయించారు. రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ లు చేసేసారు. కొందరి రైతుల విస్తీర్ణాలను మార్చివేశారు. కొందరి భూములను వారి పేరిట కాక వేరే వారి పేరిట చూపారు. పొరపాటున కొన్ని, కావాలని మరికొన్ని రీ సర్వేలో నమోదు చేశారు. ఆధారాలు అన్నిటిని విడ్రీమ్స్ సేకరించింది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం డ్రోన్లు రోవర్లతో చేపట్టిన రీ సర్వే లో భూములు హెచ్చుతగ్గులు ఎట్టి పరిస్థితులను వచ్చేందుకు వీలు లేదు .కానీ ఎకరాకు ఐదు నుంచి పది సెంట్లు హెచ్చుతగ్గులు జరుగుతాయి అంటూ సర్వే సిబ్బంది రైతులను మభ్య పెట్టారు.
గడువు తగ్గించడం
సరికాదు
రీ సర్వేకి ఇచ్చిన గడువు సమయాన్ని 60 రోజులకు కుదించి వేశారు. దీంతో రీ సర్వే గుణాత్మకంగా ఎలా ఉంటుందని రెవెన్యూ అధికారులే ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి లోపాలతో కొత్త పాస్ పుస్తకాలను జారీ చేస్తే వాటిని సవరించుకోవడానికి రైతులు ఎన్ని అగచాట్ల పడవలసి వస్తుందో దానివల్ల ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో చెప్ప నలవి కాదు. ట్యాంపరింగ్ కు వీలు లేని విధంగా పాస్ పుస్తకాలను ప్రింట్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అలాంటి పాస్ పుస్తకాల తప్పులు సవరించాలంటే మరింత ఖర్చవుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఆదరాబాదరాగా పాస్ పుస్తకాలను ముద్రించి రైతుల
మీదకి వదలడం ఎంతవరకు సబబు అన్నదే ప్రశ్న.
రెవెన్యూ గుప్పిట 22(A) భూములు
22 ఏ లో అక్రమంగా పెట్టిన ప్రైవేటు జిరాయితీ భూములను 22 నుంచి తొలగించాలని ఆగస్టు నెలలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వెంటనే అమలు చేసి రైతులకు న్యాయం చేయాలి. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాటిని పాస్ పుస్తకాల్లో నమోదు చేయాల్సి ఉంది. లేకుంటే రెవెన్యూ అధికారులు లక్షలాది రూపాయలు రైతుల నుంచి గుంజేందుకు ప్రయత్నిస్తారన్నది బహిరంగ రహస్యమే. ఉద్యోగులు
రైతుల నుంచి గుంజే లంచాలు రైతులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుస్తున్నాయి . అయినా అధికారులు తమ “రెవిన్యూ” ను వదులుకోవడం లేదు!!
రెవెన్యూ అధికారుల పనితీరు గురించి సాక్షాత్తురెవిన్యూ మంత్రి రెవెన్యూ అధికారుల సమావేశంలోచెప్పిన ఉదంతం ఇక్కడ ప్రస్తావించాలి. ఒక మహిళ తన భూములను 22 ఏ లో అక్రమంగా పెట్టారని ,దాని నుంచి మినహాయించాలని నాలుగేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది.ఆమె సమస్యను తనకు చెప్పగా. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చామని ,సమస్య అరగంటలోనే పరిష్కారంఅయింది అని చెప్పారు ఇంతకాలం నిబంధనలను సాకుగా చూపి
ఆ మహిళను ఎందుకు తిప్పవలసి వచ్చిందని రెవెన్యూ మంత్రి ప్రశ్నించారు.
రెవెన్యూ అధికారులు చేస్తున్న తప్పులను జిల్లా కలెక్టర్లు ఎందుకు వెనకేసుకొస్తున్నారు అన్నది ప్రజల ప్రశ్న. ముఖ్య మంత్రి చంద్రబాబుకు వ్యవస్థ ను చక్కదిద్ది రైతుల అవస్థలను తొలగించే శక్తి ఉంది. ఆయన తన శక్తిని ఉపయోగించాలి మరి.

త్వరలో పంపిణి చెయ్యనున్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు