వీ డ్రీమ్స్ పార్వతీపురం:
పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులుగా వంగల దాలినాయుడు నియామకమయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాని కార్యదర్శి కేసు వేణుగోపాల్ శనివారం నియామక జాబితాను విడుదల చేశారు. రాష్ట్రంలోని జిల్లాలో ముఖ్య పట్టణాలను కలిపి 41 మంది అధ్యక్షులు పేర్లను ఏఐసీసీ ప్రకటించింది. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన ఏఐసీసీ పర్యవేక్షకులు అనేక సమీక్షలు పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు ముఖ్యవక్తులతో చర్చలు జరిపి సమగ్ర నివేదికను సమర్పించారని, ఆ నివేదికల ఆధారంగా కొత్త అధ్యక్షులను నియమించడం జరిగిందని ప్రకటనలో పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా డీసీసీ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన వంగల దాలినాయుడు కాంగ్రెస్ పార్టీలో జిల్లా ఓబీసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తానన్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ప్రతి పల్లెలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను పరిష్కారమయ్యేలా పోరాటం చేస్తానన్నారు. జిల్లాలో పలు సమస్యలు వేధిస్తున్నాయని వాటి పరిష్కారానికి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని, బాధ్యతను నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులను కలిసి, కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. డిసిసి జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన వంగల దాలినాయుడని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు పలువురు పెద్దలు అభినందించారు.

