వీ డ్రీమ్స్ లీగల్ ప్రజలకు ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యం లో మాత్రమే ఉంటుంది. పారదర్శకత, జవాబుదారీతనం ప్రజాస్వామ్య వ్యవస్థ మూల స్తంభాలు. సమాచారం తెలుసుకునే హక్కు ఆధునిక ప్రజాస్వామ్యం ప్రసాదించిన వరాల్లో ముఖ్యమైనది. సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగే వారు ఎందుకు ఎలా ఎప్పుడు ఎవరు అంటూ సమాచారాన్ని కోరితే అలాంటి వాటికి సమాధానం ఇవ్వడం కుదరదని, డాక్యుమెంట్ల రూపంలో తమ వద్దనున్న సమాచారానికి నకళ్ళ మాత్రమే ఇవ్వగలమని ప్రధాన సమాచార అధికారులు సమాచారం కోరేవారికి జవాబు ఇస్తుంటారు. ఈ అంశంపై అనేకసార్లు సమాచార కమిషనర్లు స్పష్టత ఇచ్చినప్పటికీ రాష్ట్ర, కేంద్ర ప్రధాన సమాచార అధికారులు ప్రశ్నలకు జవాబు ఇవ్వమంటూ తప్పించుకుంటున్నారు.
ఇంతకీ ప్రశ్నల రూపంలో సమాచారం కోరితే ఆ సమాచారం ఇవ్వనక్కరలేదా??
ప్రధాన సమాచార కమిషనర్ గా అత్యంత సమర్థ వంతంగా పనిచేసి ఖ్యాతినొందిన శైలేష్ గాంధీ ఈ అంశంపై ఏమని స్పష్టతనిచ్చారో పరిశీలిద్దాం.
దరఖాస్తుదారుడు కోరిన సమాచారం కార్యాలయంలో లభ్యంగా ఉన్నప్పుడు ఎవరు ఎందుకు ఎప్పుడు ఎలా అని వచ్చే ప్రశ్నలకు సైతం సమాధానం ఇవ్వాలని శైలేష్ గాంధీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 8 (1) ను సాకు గా చూపి ఇలాంటి సమాచారాన్ని అధికారులు తిరస్కరించ రాదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
ప్రధానమంత్రి పుట్టిన తేదీ ఏది అని ప్రధానమంత్రి కార్యాలయం ప్రధాన సమాచార అధికారికి సమాచార హక్కు చట్టం కింద ఒక దరఖాస్తు అందితే ప్రశ్న రూపంలో ఉంది కనుక సమాచారం ఇవ్వనక్కర్లేదని
అనలేరు. ఎందుకంటే, ప్రధానమంత్రి పుట్టిన తేదీ ప్రధానమంత్రి కార్యాలయం లో ఉంటుంది. దరఖాస్తుదారుడు ప్రధానమంత్రి పుట్టిన తేదీ సర్టిఫికెట్ నకలు కావాలని అడిగితే సమాచార హక్కు చట్టం ప్రకారం ఇవ్వవలసిందే కదా. అదేవిధంగా ఒక అధికారి తన కార్యాలయంలో లేదా తన ఆధీనంలో ఉన్న సమాచారాన్ని ప్రశ్నల రూపంలో అడిగినా నకలు కావాలని అడిగినా సమాచారం ఇవ్వాల్సిందే నని శై లేస్ గాంధీ స్పష్టతనిచ్చారు.
